ఎమ్బీయస్: బైడెన్ ఫంక్షన్ చూడవేడుక

కాప్షన్ చూసి నేను బైడెన్ అభిమానిని అనుకోకండి. ఇవాళ రాత్రి (వాళ్లకు పొద్దున్న) జరగబోయే తతంగం నాకు మరోలా వేడుక కలిగిస్తోంది. అందర్నీ అనుమానించే అమెరికా వాళ్లు యీ రోజు సొంతవాళ్లనే అనుమానిస్తున్నారు కదాని…

కాప్షన్ చూసి నేను బైడెన్ అభిమానిని అనుకోకండి. ఇవాళ రాత్రి (వాళ్లకు పొద్దున్న) జరగబోయే తతంగం నాకు మరోలా వేడుక కలిగిస్తోంది. అందర్నీ అనుమానించే అమెరికా వాళ్లు యీ రోజు సొంతవాళ్లనే అనుమానిస్తున్నారు కదాని తలచుకుంటేనే నవ్వొస్తోంది. ముస్లిములు, నల్లవాళ్లు, ఆసియన్లు.. వారూ వీరని కాదు, అందర్నీ అనుమాన దృక్కులతో చూసే వాళ్లకు యీ రోజు తళతళలాడే తెల్లతోలు వాళ్లని చూసినా భయమేస్తోంది. 

భారతదేశం నుంచి కేంద్రమంత్రులు వెళ్లినా బట్టలిప్పించి తనిఖీ చేసిన సంశయాత్ములు వీరు. ఈ రోజు తమ పోలీసులను తామే నమ్మలేని పరిస్థితికి వచ్చారు. కాపిటల్ హిల్‌పై దాడి సంఘటనలో సెక్యూరిటీ గార్డులను పిలుచుకోవాలసి వచ్చింది. ఇప్పుడు వాళ్లల్లో కూడా తస్మదీయులున్నారని తోచి, కొందర్ని తప్పించివేశారట.

సాధారణంగా లక్ష మందితో జరిగిన ఫంక్షన్‌ను బిక్కుబిక్కుమంటూ వెయ్యిమందితో చేస్తే కళ తప్పినట్లే కదా! గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేసినట్లే కదా! కరోనా కారణంగా.. అని కలిపినా అది కారణం కాదని అందరికీ తెలుసు. రోజుకి వెయ్యిమంది పోయే రోజుల్లో కూడా కేరేజాట్ అంటూ బీచుల్లో తిరిగిన రకాలవి. ఎన్నికల ప్రచారంలో డెమోక్రాటిక్ నాయకులు మూతికి కాస్సేపు గుడ్డలు కట్టుకున్నారు తప్ప తక్కినవాళ్లు, ట్రంప్ అభిమానులు అలాటి బాదరబందీ లేకుండా గుంపులుగుంపులుగా తిరిగారు. 

దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిపిన అమెరికన్లకు యిప్పుడు హఠాత్తుగా కరోనా గుర్తుకు వచ్చిందంటే ఎవరు నమ్ముతారు? కావాలంటే మాస్కులు కట్టుకురండి, శానిటైజర్‌తో చేతులు తుడుచుకోండి, సామాజిక దూరం పాటించండి అని సూచనలిచ్చి లక్ష మందినీ రానిచ్చేవారు. అసలు కారణం, మరో దాడి జరుగుతుందేమోనన్న భయం! ‘జనవరి 6న సెనేటర్లే దొరికారు. ఇవాళైతే అధ్యక్ష, ఉపాధ్యక్షులు కుటుంబసభ్యులతో సహా దొరుకుతారు పదరా’ అంటూ మూకలు విరుచుకుపడతారనే దడదడ.

ఇదే మరో దేశంలో అయితే అమెరికన్లు యిలాటి వాతావరణాన్ని ఖండించి, యుఎన్‌ఓ సభలో తీర్మానం పెట్టించి, ఆ ప్రభుత్వాన్ని గుర్తించకూడదని ఒత్తిడి తెచ్చేవారు. దాడి జరిగిన తర్వాత కూడా ఇలాటిది ఏదో బనానా రిపబ్లిక్‌లో జరగవచ్చు కానీ మా గడ్డ మీద జరగడమేమిటి? అన్నాడు అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్. బనానా రిపబ్లిక్ అనే మాటను ఓ హెన్రీ ఓ పుస్తకంలో తొలిసారిగా వాడాడు. 

హోండురాస్ వంటి చిన్నదేశపు ఆర్థిక, రాజకీయ వ్యవస్థను అక్కడి పెట్టుబడిదారులు గుప్పిట్లో పెట్టుకుని, అక్కడ పండే అరటిపళ్లో, ఖనిజాలో అమెరికా వంటి పెద్ద దేశంలోని కార్పోరేట్లకు అమ్ముతూ డబ్బు చేసుకునే పరిస్థితిని అలా వర్ణించాడు. ఆ చిన్నదేశంలో కార్మికులకు తిండి వుండదు. అతి తక్కువ జీతాలకు పని చేస్తూ వుంటారు. విదేశీ శక్తుల సాయంతో దేశసంపదను కొల్లగొడుతున్న ధనికవర్గాలపై తిరగబడలేని నిస్సహాయ స్థితిలో వుంటారు. అక్కడ ప్రజాస్వామ్యం, న్యాయం అనేవే కనబడవు. అలాటి దేశమే తమది కూడా అని బుష్ ఒప్పుకున్నట్లయింది.

సిఎన్‌ఎన్ యాంకర్లలో ఒకరు అమెరికా సిరియాలా తయారైంది అని అంటే మరొకరు 1985లో బొగోటా నగరంలో కొలంబియన్ సుప్రీం కోర్టుపై జరిగిన దాడి గుర్తుకు వస్తోంది అన్నారు. కొలంబియాలో దాడి చేసి 12 మంది జడ్జిలను చంపేసినది వ్యవస్థపై నమ్మకం లేని కమ్యూనిస్టులు. వారికి ఆర్థికసాయం చేసినది, తమపై వున్న కేసు రికార్డులను నాశనం చేయ్యాలనుకున్న డ్రగ్ మాఫియా నాయకుడు ఎస్కోబార్! కానీ కాపిటల్ హిల్‌పై దాడి చేసినది యివాళ్టి దాకా అధికారంలో వున్న, వ్యవస్థను కాపాడవలసిన అధికారపక్షం. దేశాధ్యక్షుడే ఆ దాడి చేయించాడు. తాము ఉదాహరణలుగా చూపిన వాటికంటె తమ వద్ద జరిగినది అధ్వాన్నంగా వుందని అమెరికా నాయకులు ఒప్పుకోవాలి.

ఏదో అవేళ ఆవేశంలో కొన్ని అల్లరి మూకలు చేశాయి. మళ్లీ అలాటిది జరగదు అనే ధీమా సైతం అమెరికన్ నాయకులలో లేదని యీనాటి భద్రతా ఏర్పాట్లు చూస్తేనే తెలుస్తోంది. ఎందుకంటే ఆ సంఘటన కారణంగా ట్రంప్‌ను 222 మంది డెమోక్రాట్లు అభిశంసిస్తే కేవలం 10 మంది రిపబ్లికన్ సెనేటర్లు మాత్రమే వారితో ఏకీభవించారు. 197 మంది రిపబ్లికన్ సెనేటర్లకు ట్రంప్‌లో తప్పేమీ కనబడలేదు. 

వ్యక్తిగతంగా వాళ్లలో కొంతమందికి యిది నచ్చి వుండదని అనుకున్నా, రిపబ్లికన్ ద్వితీయ శ్రేణి నాయకులలో, కార్యకర్తల్లో, ఓటర్లలో ట్రంప్‌కు అన్యాయం జరిగిందని, దాన్ని ఎదుర్కోవడానికి జరిగిన దాడి సమంజసమనే భావం గట్టిగా వుందని గ్రహించి తీర్మానికి వ్యతిరేకంగా ఓటేసివుంటారు. ఇదే కారణమనుకుంటే జనాభాలో కనీసం 40 శాతం మంది జనవరి 6 దుశ్చర్యకు వత్తాసు పలుకుతున్నారనే అర్థం చేసుకోవలసి వుంటుంది. నాజీజం తరహాలో ట్రంపిజమ్ తలెత్తుతోందని గుర్తించవలసిన సమయం ఆసన్నమైంది.

ట్రంప్ నినాదమేమిటి? అమెరికా యీజ్ గ్రేట్. గత పాలకులు సన్నాసి విధానాలతో అమెరికాను బలహీనం చేసేశారు. మనం మళ్లీ గ్రేట్ చేద్దాం అని విపరీత జాతీయవాదాన్ని బాగా నూరిపోశాడు. గతంలో బ్రిటన్లకు, ఫ్రెంచ్‌వాళ్లకు యిలాటి కండకావరమే వుండేది. వాళ్లు సామ్రాజ్యవాదంతో ప్రపంచంలోని అనేక దేశాలను వలసదేశాలుగా మార్చుకుని కొల్లగొట్టారు. ఇంగ్లండు వాళ్లతో పోట్లాడి స్వాతంత్ర్యం తెచ్చుకున్న అమెరికన్లు వాళ్లని తలదన్నారు. గతంలో వాళ్లు కండబలం, కుయుక్తులు ఉపయోగిస్తే యిప్పుడు వీళ్లు వాటితో బాటు ధనబలం కూడా ఉపయోగిస్తున్నారు. తమకు దాసోహమనని వాళ్లపై హింసను ప్రయోగిస్తున్నారు, అప్రదిష్టపాలు చేస్తున్నారు. ఈ నయా సామ్రాజ్యవాదానికి ప్రజాస్వామ్యమనే ముసుగు తొడగడమొకటి!

అమెరికాలోని సాధారణ పౌరుడు యివన్నీ చేశాడని అనటం లేదు. పాలకుల గురించే చెప్తున్నాను. ఇవన్నీ చేస్తూ అమెరికా ఈజ్ గ్రేట్ అని ఆ పౌరులకు నూరిపోశారు. దాంతో వాళ్లూ విర్రవీగుతూ, వీళ్లకు ఓట్లు వేస్తూ వచ్చారు. వియత్నాం యుద్ధం సమయంలో పౌరులు, మేధావులు పాలకులపై తిరగబడ్డారు. ఎందుకు? యుద్ధంలో ఓడిపోతున్నందుకు! తమ పిల్లలు ఆ యుద్ధంలో మిడతల్లా మాడిపోతున్నందుకు. అదే కనక యుద్ధంలో గెలుస్తూ వుండివుంటే కిమ్మనేవారు కారు. ఇటీవలి రెండు, మూడు దశాబ్దాలలో అమెరికా మధ్యప్రాచ్యంలో ఎన్నెన్ని అనవసర యుద్ధాలు చేసింది? పౌరులు ప్రదర్శనలు చేశారా? మనకు పెట్రోలు చౌకగా కావాలంటే యిలాటివి చేయాల్సిందే అనుకున్నారు. ఆ మౌనం చివరకు వాళ్ల కొంపకే ఎసరు పెట్టింది.

ఈ రోజు రష్యా అంటే హడిలి ఛస్తున్నారు. ట్రంప్ ఎన్నిక వెనుక రష్యన్ హ్యేకర్లున్నారనే బలమైన అనుమానాలున్నాయి. ఇప్పుడు జనవరి 6 దాడిలో స్పీకరు నాన్సీ పెలోసీ చేతిలోంచి లాప్‌టాప్ ఎత్తుకుపోయిన ప్రదర్శకురాలు దాన్ని రష్యన్లకు చేరవేసిందనే వార్త షికారు చేస్తోంది. ట్రంప్ బలంగా వున్నంతకాలం డెమోక్రాటిక్ పార్టీ వాళ్లు అతన్ని రష్యాకు ముడిపెడుతూ పబ్బం గడుపుకుంటూనే వుంటారు. మనకు గతంలో ప్రతిపక్షాలను సిఐఏకు ముడిపెట్టే ధోరణి వుండేది. ఇప్పుడు వాళ్లకు కెజిబి దొరికింది. మన చుట్టూ అందరూ శత్రువులే అనుకునే పరిస్థితికి మూలకారణం మనదేశమే గొప్ప, అందరూ మనల్ని చూసి కుళ్లుకుని ఛస్తున్నారు అనే విపరీత జాతీయవాదం. దానికి బదులు మనమూ గొప్పవాళ్లమే అనుకుని వూరుకుంటే చాలు.

అసలు యిలాటి జాతీయ వాదాన్ని ప్రేరేపించవలసిన అవసరం ఎందుకు పడింది? నిరాశానిస్పృహలతో వున్న పేదలకు, నిరుద్యోగులకు ఎవరినో శత్రువులను చూపించి, ‘నీ శక్తి నీవు తెలుసుకో, వాళ్లను తరిమికొట్టు’ అని రెచ్చగొట్టి, ఓట్లు దండుకోవడానికి! పేదరికం, నిరుద్యోగం ఎందుకు వచ్చిందో ఆ పరిస్థితులను చక్కదిద్దకుండా, యిలాటి షార్ట్‌కట్‌లతో దేశప్రజలను చెడగొట్టడితే హిట్లర్ మార్గం పట్టినట్లే! అమెరికా యితర దేశాల వ్యవహారాల్లో కలగజేసుకుంటూ, వాటిపై విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతూ వచ్చింది. ట్రంప్ వాటికి వ్యతిరేకంగా మాట్లాడి, ఆ డబ్బంతా స్థానికంగా ఉపాధికల్పనకు ఖర్చు పెడతానన్నపుడు సంతోషించాను, అమెరికన్ల బతుకులు బాగుపడతాయి కదాని. చివరకు నాటో నుంచి వైదొలగలేదు కానీ, పర్యావరణానికి సంబంధించిన పారిస్ ఒప్పందాన్నుంచి తప్పుకున్నాడు మహానుభావుడు.

దేశం బాగుపడాలంటే పరిశ్రమలు రావాలి, ఉత్పాదన పెరగాలి. పరిశ్రమలు నిలదొక్కుకోవాలంటే వాటికి రక్షణ కల్పించాలి. మన దేశంలో ఇందిరా గాంధీ హయాంలో కొన్ని పరిశ్రమలు కొన్ని సెక్టార్లకే అనే నిబంధనలు వుండేవి. కార్పోరేట్లు అగ్గిపెట్టెలు, సబ్బుబిళ్లలు చేస్తామంటే ‘వాటిని స్మాల్‌స్కేల్ యిండస్ట్రీస్‌కు వదిలేయండి. భారీయంత్రాలు చేయడం వాళ్ల వలన కాదు, అవి మీరు చేయండి’ అనేది ప్రభుత్వం. విదేశీ కంపెనీలు వచ్చి మా సరుకులు అమ్ముతాం అంటే ‘ఇక్కడ మేం తయారు చేయలేని అత్యాధునికమైన టెక్నాలజీతో కూడినవైతేనే అమ్మండి. లేకపోతే కుదరదు.’ అనేది. 

అందువలన చిన్న, పెద్ద, భారీ, విదేశీ అన్ని రకాల పరిశ్రమలు మనుగడ సాగించేవి. రాజీవ్ గాంధీ, ఆ తర్వాతి ప్రధానులందరూ గేట్లు ఎత్తివేయడంతో అన్నీ విదేశాల నుంచి వచ్చిపడిపోతున్నాయి. బనియన్లు, చెడ్డీలు, బూట్లు, కూల్‌డ్రింకులు యివన్నీ మనం చేసుకోలేమా? బ్యాటరీలైట్లు, దీపావళి సామాను చైనా నుంచి మనం కొనుక్కోవాలా? వాళ్లు భారీ సంఖ్యలో చేస్తారు చౌకగా అమ్మగలుగుతారు కాబట్టి మనవాళ్లను కొననిద్దాం అంటే యిక్కడి తయారీదారు ఏమవుతాడు? ఋణం తీసుకున్న బ్యాంకుకి బాకీపడతాడు. ఆ భారం అంతిమంగా డిపాజిటర్ మీదే పడుతుంది.

ఈ ప్రొటెక్షనిజం (రక్షణవాదం) తప్పు, మార్కెట్‌ను ఫ్రీగా వదిలేయాలి అని కొందరు (వారి సంఖ్య యిప్పుడు బాగా పెరిగింది) వాదిస్తారు. దీని ఫలితాలు యిప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నపుడైనా పునరాలోచించుకోవాలి. మనం రోజూ చైనాను తిడుతూనే వుంటాం. కానీ చైనా ముడిసరుకుతో తయారైన మందు మింగందే రోజు గడవదు. అమెరికాది మన కంటె ఘోరమైన పరిస్థితి. తెల్లారి లేస్తే చైనాపై రంకెలు, మార్కెట్లో ర్యాకుల నిండా చైనా సరుకులు. దిగుమతుల మీదే ఆధారపడుతూ, ఉత్పాదకరంగాన్ని పడుక్కోబెట్టేస్తే ఉద్యోగాలు ఎక్కణ్నుంచి వస్తాయి? అది గ్రహించకుండా చైనావాడు కనబడితే కొట్టు అని ప్రజల్ని రెచ్చగొడితే ఉద్యోగం వస్తుందా?

చైనా నుంచి చౌక సామాన్లు తెచ్చుకున్నట్లే వైట్ కాలర్ ఉద్యోగాల విషయంలో కూడా కార్పోరేట్లు విదేశాల నుంచి చౌక కార్మికులను తెచ్చుకుంటున్నాయి. తమ లాభాల కోసం ఔట్‌సోర్సింగ్ పనులపై, కాంట్రాక్టు ఉద్యోగులపై ఆధారపడుతున్నాయి. ప్రభుత్వం ‘ఇది కుదరదు’ అని చెప్పాల్సిందే. ‘నీ సంస్థల్లో స్థానికులు యింతమంది వుండి తీరాల్సిందే. వాళ్లకు తగినంత టాలెంటు లేదంటే, తర్ఫీదు ఇయ్యి. హైస్కూలు స్థాయిలో వాళ్ల టేలంటు గుర్తించి కాలేజీ చదువులు ఫైనాన్స్ చేయి.’ అని నిబంధన పెట్టాల్సిందే. కానీ కార్పోరేట్లు పార్టీలకు నిధులిచ్చి, అలాటి రూల్సు రాకుండా చేస్తున్నాయి. ట్రంప్ విదేశీయుల ఉద్యోగాలకు కళ్లెం వేయడం మొదలుపెట్టాడు. అది కడదాకా కొనసాగితే బాగుండేది, కానీ యితరత్రా అనేక పిచ్చిపనులు చేసి అధికారం పోగొట్టుకున్నాడు.

బైడెన్ మళ్లీ పాత విధానాలకే మళ్లేట్లున్నాడు. దానివలన ఉద్యోగాలు రావు. ఉన్నవి పోయాయంటే ట్రంపీయులు, నాజీలుగా మారి సమాజాన్ని అల్లకల్లోలం చేయగలరు. మైనారిటీలు తిరగబడితే అదో దారి. కానీ శ్వేతజాతి మెజారిటీలే హింసకు పాల్పడితే అరికట్టడం కష్టం. ఎగదోయడానికి ట్రంప్ ఎటూ ఉన్నాడు.. అమెరికన్ సమాజం యిప్పటికే రెండుగా విడిపోయింది. బైడెన్ కార్పోరేట్ కంపెనీలకు ముకుతాడు వేయాల్సిందే. గ్లోబలైజేషన్‌కు స్వస్తి చెప్పి, దిగుమతులు ఆపించి, మాన్యుఫేక్చరింగ్‌పై దృష్టి పెట్టి, స్థానికులకు ఉద్యోగాలు వచ్చేట్లు చేసి, సమాజానికి మరమ్మత్తు చేస్తే తప్ప యివాళ్టి ఫంక్షనే కాదు, భవిష్యత్తులో మరే ఫంక్షను చేయాలన్నా గుండె చిక్కబట్టుకుని చేయాల్సిందే.

ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2021)
[email protected]