పంజాబ్‌లో శిఖ్కుల ప్రయోజనాల కోసం 99 ఏళ్ల క్రితం వెలసిన రాజకీయ పార్టీ శిరోమణి అకాలీ దళ్. మతాన్ని, గురుద్వారాను ఆలంబన చేసుకుని రాజకీయాలు నడుపుతూ వచ్చింది. పంజాబ్‌లో శిఖ్కులు అత్యధిక సంఖ్యలో ఉన్నా ఆ పార్టీ చాలాకాలం రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయింది. 1967లో మాస్టర్ సంత్ ఫతే సింగ్ అనే ఆయన పార్టీ అధినేత మాస్టర్ తారా సింగ్‌తో విభేదించి విడిగా ఓ పార్టీ పెట్టుకుని, జనసంఘ్ (బిజెపి పూర్వావతారం), సిపిఐతో సహకారంతో ప్రభుత్వం ఏర్పరచాడు కానీ అది 9 నెలల కంటె మనలేకపోయింది. 1969లో ఒరిజినల్ అకాలీ దళ్ పదవిలోకి వచ్చింది కానీ మాటిమాటికీ అధికారం పోగొట్టుకుంటూ వచ్చింది. ఎక్కువమంది శిఖ్కులు కాంగ్రెసునే నమ్మారు. మహారాష్ట్రలో మొన్నటివరకు శివసేనకు జూనియర్ భాగస్వామిగా ఎలా ఉందో, గత 20 ఏళ్లగా బిజెపి పంజాబ్‌లో అకాలీ దళ్‌కు జూనియర్‌గానే ఉంటూ వచ్చింది. ఇప్పటిదాకా పంజాబ్‌కు బిజెపి ముఖ్యమంత్రి లేడు. బిజెపి-అకాలీ సంకీర్ణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అకాలీ దళ్ తరఫు వాళ్లే. ఇప్పుడు మహారాష్ట్రలో శివసేనకు, బిజెపికి చెడినట్లే, పంజాబ్‌లో కూడా అకాలీ దళ్-బిజెపి మధ్య ఎడం వస్తున్నట్లు కనబడుతోంది.
దీనికి కారణం అకాలీ దళ్‌లో యిటీవల తలెత్తిన చీలిక. చాలా దశాబ్దాలుగా దళ్ నాయకత్వం బాదల్ కుటుంబం చేతిలో యిరుక్కుపోయింది. ప్రకాశ్ సింగ్ బాదల్ తక్కిన అకాలీలందరినీ పక్కకు నెట్టేస్తూ అకాలీ దళ్‌కు మారుపేరుగా మారిపోయాడు. 1970లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పణ్నుంచి పార్టీని తన గుప్పిట్లో నుంచి పోనీయలేదు. కొన్ని గ్యాప్‌లతో సుమారు 19 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఏలాడు. తర్వాత పార్టీని కొడుకు సుఖ్‌బీర్ చేతికి అప్పగించాడు. అతను ఎంపీ, అతని భార్య కూడా ఎంపీగా ఎన్నికై ప్రస్తుతం కేంద్రంలో మంత్రిగా చేస్తున్నారు. ప్రకాశ్ బాదల్‌కు 92 ఏళ్లు. ఈ మధ్య పెద్దగా బయటకు రాలేదు. 2007-2017 మధ్య బాదల్ పదేళ్ల పాలనలో అవినీతి ఆరోపణలు చాలా వచ్చాయి. ఉపముఖ్యమంత్రిగా పెట్టుకున్న కొడుకుతో సహా కుటుంబసభ్యులకే అధికారాన్ని కట్టబెట్టాడు. దాంతో 2017 అసెంబ్లీ ఎన్నికలలో అకాలీ-బిజెపి సంయుక్త ప్రభుత్వం కాంగ్రెసు చేతిలో ఓడిపోయింది.
పార్టీపై బాదల్ కుటుంబం పట్టున్నంత కాలం పార్టీకి మోక్షం లేదని అనుకున్న రంజిత్ సింగ్ బ్రహ్మపురా, రతన్ సింగ్ అజ్నాలా, సేవా సింగ్ సెఖ్‌వాన్ లు 2018 ఉత్తరార్థంలో తిరుగుబాటు చేశారు. దాంతో బాదల్ వాళ్లను పార్టీలోంచి తీసేశాడు. వాళ్లు శిరోమణి అకాలీ దళ్ (తక్సాలీ) పేర వేరే పార్టీ పెట్టుకున్నారు. వీళ్లకు వాయువ్య పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, అమృతసర్, తరన్ తారన్ జిల్లాలలో పట్టుంది. అకాలీ దళ్ యిలా బలహీనపడడం బిజెపి గమనిస్తోంది. మహారాష్ట్రలో శివసేన ప్రాబల్యాన్ని తగ్గించగలిగినట్లే, యిక్కడా అదే పని చేయవచ్చా అని చూస్తోంది. ఎందుకంటే 2019 పార్లమెంటు ఎన్నికలలో అకాలీ దళ్ 10 స్థానాల్లో పోటీ చేయగా రెండే రెండు గెలిచింది. అవీ సుఖ్‌బీర్ బాదల్, అతని భార్య స్థానాలు. బిజెపి 3 స్థానాల్లో పోటీ చేసి 2టిలో గెలిచింది. 13 స్థానాల్లోనూ పోటీ చేసిన కాంగ్రెసుకు 8, ఆప్‌కు 1 వచ్చాయి. అకాలీకి పూర్వబలం లేదని నిర్ధారణ అయింది.
ఇదిలా వుండగా అకాలీ తరఫున రాజ్యసభ ఎంపీగా, ఆ పార్టీ రాజ్యసభ నాయకుడిగా వున్న సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా పార్టీపై అలిగి 2019 అక్టోబరులో తన పదవికి రాజీనామా చేశాడు. అతను దశాబ్దాలుగా ఆ పార్టీకి సెక్రటరీ జనరల్‌గా ఉన్నాడు. కొన్నాళ్ల తర్వాత అతని కొడుకు పరమీందర్ సింగ్ పంజాబ్ ఎసెంబ్లీలో పార్టీ యూనిట్ చీఫ్ పదవి ఒదులుకున్నాడు. అదే సమయానికి హరియాణాలో ఎన్నికలు వచ్చాయి. పంజాబీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అకాలీ దళ్‌కు పలుకుబడి వుంది కాబట్టి బిజెపితో పొత్తు లేకుండానే 2014లో 1 సీట గెలుచుకుంది. ఈసారి పొత్తు పెట్టుకుందామని బిజెపికి ప్రతిపాదించింది. ధిండ్సా నిష్క్రమణ తర్వాత అకాలీ దళ్ బలహీనపడిందని అంచనా వేసిన బిజెపి ఆ ప్రతిపాదనను నిరాకరించింది. ‘‘హరియాణా 2019 పార్లమెంటు ఎన్నికల సమయంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు పెట్టుకుంటామని, వాగ్దానం చేసి మా సాయం తీసుకున్నారు. ఇప్పుడిలా అంటున్నారు. సరే మేం ఒంటరిగా పోటీ చేస్తాం’’ అంటూ అకాలీ దళ్ ప్రకటించి పోటీ చేసింది. ఉన్న ఒక్క సీటూ పోయింది. బాదల్ కుటుంబం పరువు తగ్గింది.
ఇప్పుడు ధిండ్సా అకాలీ దళ్ (తక్సాలీ)తో చేతులు కలుపుతున్నాడు. వాళ్లు తనతో చేతులు కలుపుతారని, వాళ్ల మద్దతుతో బాదల్ అకాలీ దళ్‌ను పక్కన పెట్టవచ్చని బిజెపి భావిస్తోంది. ధిండ్సాకు బిజెపి ప్రభుత్వం 2019 జనవరిలో పద్మభూషణ్ యిచ్చి వుంది. అందువలన అతను తన ఉపన్యాసాల్లో బాదల్‌ను తిడుతున్నాడు తప్ప బిజెపిని ఏమీ అనటం లేదు. జనవరి 17న జలంధర్‌లో జరిగిన సమావేశంలో బిజెపి పంజాబ్ యూనిట్ తన కొత్త అధ్యక్షుడిగా అశ్వనీ శర్మను ఎన్నుకుంది. ఆ సమావేశంలో చాలామంది నాయకులు ‘ఈ అకాలీ దళ్‌తో పొత్తు తుంచుకుంటే నష్టమేమిటి?’ అంటూ ఉపన్యసించారు. ‘ఈ మధ్యే శివసేనతో తెగింది. ఇదీ యిప్పుడే తెగిపోతే బిజెపి తన భాగస్వాములతో సరిగ్గా వ్యవహరించటం లేదన్న చెడ్డపేరు వస్తుంది.’ అని కొందరు వారించారు. ఇవన్నీ చూసేసరికి బాదల్‌కు ఒళ్లు మండింది.
దిల్లీలో పంజాబీలు అధిక సంఖ్యలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో అకాలీ దళ్ వాళ్లు ఎప్పుడూ బిజెపితో పొత్తుతో, 3టిల్లో బిజెపి గుర్తుపై పోటీ చేస్తూ ఉంటారు. 2013లో 4టిలో 3 నెగ్గారు. 2015లో ఏదీ నెగ్గలేదు. 2017లో రాజౌరీలో ఉపయెన్నిక జరిగినపుడు మంజీదర్ సిర్సా అనే అకాలీ నాయకుడు బిజెపి టిక్కెట్టుపై పోటీ చేసి నెగ్గాడు. తాజా పరిణామాలతో అలిగిన బాదల్ దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలో బిజెపికి సహకరించ కూడదనుకున్నాడు. పార్లమెంటులో సిఏఏ బిల్లును సమర్థించినా ఈ ఎన్నికకు వచ్చేసరికి నామినేషన్లకు ముందు రోజు మడతపేచీ పెట్టి బిజెపికి, తమకు పొత్తు లేదంటూ ‘‘మేం సిఏఏను సమర్థించం, ఎన్నార్సీ, ఎన్‌పిఆర్ మార్పుకు సహకరించం. బిజెపి మా విధానాన్ని మార్చుకోమని ఒత్తిడి చేస్తోంది. కానీ మేం ఒప్పుకోం. మేము పోటీ చెయ్యం, ఎవరికీ మద్దతివ్వం.’’ అంటూ సిర్సా చేత బహిరంగంగా ప్రకటింప చేశాడు.
అసలే ఆప్‌తో పోటీ క్లిష్టంగా ఉంది. ఈ అకాలీ దళ్‌తో తగవు పెట్టుకుంటే శిఖ్కు ఓట్లు పోతాయేమోనని బిజెపికి భయం వేసింది. అందువన నడ్డా పార్టీ అధ్యక్షుడు కాగానే సుఖ్‌బీర్ బాదల్‌ను పిలిచి మంచీచెడ్డా మాట్లాడుకున్నారు. బిజెపి అకాలీ దళ్ చీలిక వర్గంతో భవిష్యత్తులో పొత్తు పెట్టుకోనని హామీ యిచ్చిందో ఏమో కానీ సమావేశం అవగానే జనవరి 28న సుఖ్‌బీర్ ప్రెస్‌మీట్‌లో ‘‘మా రెండు పార్టీలది రాజకీయ బంధం కాదు, భావోద్వేగాలకు సంబంధించినది. పంజాబ్ కోసం, దేశం కోసం మేం యిద్దరం కలిసి పనిచేస్తాం. మా మధ్య యీమధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు సర్దుకుంది.’’ అని ప్రకటించాడు. బిజెపి తమ పక్షానే ఉందన్న ధీమాతో పంజాబ్ తిరిగి వచ్చి ఫిబ్రవరి 2న ధిండ్సాను, కుమారుణ్ని పార్టీలోంచి తొలగిస్తూ ప్రకటన చేశాడు. వాళ్లు పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించాడు. రాష్ట్రమంతా కాంగ్రెసుకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తూ పార్టీ క్యాడర్‌ను తమతో ఉంచుకోవాలని ప్రయత్నాలు ఆరంభించాడు. వారి ప్రత్యర్థులు పోటీ ర్యాలీను ఏర్పాటు చేయడంలో మునిగారు.
దిల్లీ ఎన్నికలు ఫిబ్రవరి 8న ముగిసాయి. 11న ఫలితాలు వస్తాయి. ఎగ్జిట్ పోల్స్ చూస్తూంటే బిజెపికి 20 లోపే వచ్చేట్టున్నాయి. వాటిల్లో అకాలీ నాలుగు స్థానాలు ఉంటే అకాలీ దళ్‌తో స్నేహం కొనసాగుతుంది. లేకపోతే అకాలీ పని అయిపోయిందని తోచి వాళ్ల ప్రత్యర్థి వర్గంతో చేతులు కలిపే ఆలోచన చేయవచ్చు. (ఫోటో- నడ్డా, సుఖ్ బీర్ బాదల్)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2020)
[email protected]