ముందుగా పాఠకులు గమనించవలసినది – ఇది రాఘవేంద్రరావుగారి సినిమాలపై విశ్లేషణ కాదు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని సెంటర్లోనే వుండాలనే ఆ రాష్ట్రప్రభుత్వం చేస్తున్న వాదన గురించి! ఇటీవల టీవీ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావుగారిని రమ్యకృష్ణ అడిగారు – ‘‘నా బొడ్డు మీద నిమ్మకాయలతో మొదలుపెట్టి పుచ్చకాయలదాకా పడేసి పాటలు తీశారు. బొడ్డు మీద ఎందుకీ వ్యామోహం?’’ అని. ఆయన ‘‘సృష్టిలో అందమైనవి మూడే – ఆడది, పూలు, పళ్లు. ఆ మూడిటినీ ఒక చోటే చూపించాలని..’’ అని సమాధానం ఇచ్చారు. మూడు ఒకేసారి చూపించాలనుకుంటే పూలపాన్పుపై శయనించిన పూబోడిని చూపవచ్చు, పళ్లతోటలో విహరించే పడతిని చూపవచ్చు. కానీ సెంటర్ చూసి పొడిచినట్లు బొడ్డు మీదేక పళ్లు, పూలూ విసరడం ఏమిటి? బహుశా రాఘవేంద్రరావుగారికి నారి అంటే – ఇతర అవయవాలెన్ని వున్నా నాభి తప్ప మరేదీ ఆనదేమో! ఆయన చేత పార్టీ ప్రచారచిత్రాలు అనేకం తీయించుకోవడం చేత టిడిపిపై కూడా ఆ ప్రభావం పడి వుంటుంది. ఆ ప్రభుత్వ ప్రతినిథులు శివరామకృష్ణన్ కమిటీతో మాట్లాడుతూ రాజధాని రాష్ట్రానికి మధ్యలోనే వుండాలి కాబట్టి విజయవాడ-గుంటూరు మధ్యనే వుండాలని సూచన చేశారు.
కమిటీలు అజాగళస్తనాలా?
రాజధాని ఎక్కడ అనేదానిపై చర్చ జరుగుతూనే వుంది. దానిపై కేంద్రం ఒక కమిటీ వేసి నిపుణులను రాష్ట్రమంతా తిప్పుతోంది. ఏం కమిటీ వేయడం వాళ్లకొక్కళ్లేక వచ్చా అనుకుని రాష్ట్రప్రభుత్వమూ ఓ కమిటీ వేసింది. దానిలో హేమాహేమీలను నియమించామంది. ఆ కమిటీ రిపోర్టూ రాలేదు, ఈ కమిటీ రిపోర్టూ రాలేదు. కానీ ఇప్పటికే టిడిపి సర్కారు ఒక నిర్ణయానికి వచ్చేసింది – రాజధాని అన్ని ప్రాంతాలకూ సమానదూరంలో వుండాలి కాబట్టి విజయవాడ-గుంటూరుకే మా ఓటు అని. ప్రభుత్వం ఇంత బాహాటంగా చెప్పేసిన తర్వాత ఇక కమిటీలెందుకు? అవి రిపోర్టులివ్వడం దేనికి? రుణమాఫీ గురించి కోటయ్యగారి కమిటీ రిపోర్టు ఏమిటో బహిర్గతం కాలేదు. లక్ష దాకా మాఫీ చేయవచ్చు అన్నారట, మీరు చెప్పినది మేం వినడమేమిటి? లక్షన్నర చేస్తాం అంది క్యాబినెట్. అనేక విషయాలు పరిగణనలోకి తీసుకుని ఒక నిపుణుడు ఏదైనా సూచిస్తే దానిని పరిగణించాలి, దానిలో మార్పులు చేస్తే ఇదీ కారణం అని చెప్పాలి. ఆయన పాటికి ఆయన లక్ష అని, వీళ్లపాటికి వీళ్లు లక్షన్నర అంటే.. ఇక ఆ మాత్రం దానికి ఆ రిపోర్టు కోసం 40 రోజులు ఆగడం దేనికి?
నాటకాలు వేసేవాళ్లకు తెలుస్తుంది – రచయిత రాసిన నాటకాన్ని అక్షరాలా వేయడం అంటే ఆర్టిస్టులకు కష్టం. స్త్రీ పాత్ర వేసేవాళ్లు దొరకలేదని పురుష పాత్రలుగా మార్చేస్తారు. ఒక ఆర్టిస్టులు డైలాగులు సరిగ్గా చెప్పలేక పోతున్నాడని, అతని డైలాగులు కత్తిరిస్తారు. ప్రదర్శన జరుగుతూండగా ఓ ఆర్టిస్టు ఊరెళ్లిపోవాల్సిన అవసరం పడితే అతని పాత్ర చచ్చిపోయినట్లు చూపిస్తారు. ఇలా రచయిత రాసినదొకటి, ఆర్టిస్టులు వేసేది మరొకటి అవుతూ వుంటుంది. ఈ తరహాపై వ్యంగ్యంగా కామెంట్ చేసేవారట నాటకాల ద్వారా సినిమాల్లోకి వచ్చిన నటుడు చలం! ఆయన భమిడిపాటి రాధాకృష్ణగారితో మాట్లాడుతూ ‘‘ఏదైనా మంచి నాటకం వుంటే చూడండి, మార్చి.. ఆడేద్దాం’’ అని. మార్చి ఆడేసేదానికి మంచి నాటకం వెతకడమెందుకు, దాన్ని చెడగొట్టడానికా? అలాగ ఇప్పుడు కమిటీ వేయడం దేనికి? దాని రిపోర్టు మార్చిపారేయడానికా? రాజధాని సెంటర్లో ఉండాలన్న వాదన అనవసరం అని పలువురు పలువిధాల పలు వేదికలపై చెప్పారు. పొరుగున వున్న తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర.. దేనికీ రాజధాని మధ్యలో లేదు. అమెరికాలో ఏ రాష్ట్రంలోనూ రాజధాని సెంటర్లో లేదని లోకసత్తా జెపిగారు ఓ సారి సోదాహరణంగా చెప్పారు. (ఇప్పుడు టిడిపివాళ్లు ఆయన్ను అడగడం మానేసినట్టున్నారు). దేశరాజధాని కూడా దేశం మధ్యలో లేదు. మధ్యలో దౌలతాబాద్‌లో పెట్టాలని ఓ సుల్తాన్‌గారు ప్రయత్నిస్తే ఆయన్ని పిచ్చి తుగ్లక్ అన్నారు. అయినా ఇప్పుడు టిడిపి అదే వాదన వినిపిస్తోంది.
రాజధాని సరే, అన్నీ అక్కడేనా?
వికేంద్రీకరణ చేస్తాం అంటూనే అన్నీ విజయవాడ-గుంటూరు జిల్లాలలోనే పెడుతున్నారు. గతంలో రాసినట్లు ఆ ప్రాంతం మీడియాకు కేంద్రస్థానంగా, డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌గా, విద్యకంద్రంగా ఎలాగూ వుంది, ఇంకా పెరగబోతోంది. రాయలసీమకు రావలసిన ఎయిమ్స్‌ను గుంటూరుకు తరలించారు. గుంటూరులో ఆసుపత్రులకు కొదవ వుందా? వైద్యసౌకర్యాలు తక్కువగా వున్న చోట ఆసుపత్రులు పెట్టాలి. రాయలసీమలో పెడితే మద్రాసు, బెంగుళూరుల నుండి కూడా పేషంట్లు వచ్చి మెడికల్ టూరిజం పెరుగుతుంది. గుంటూరులోనే అన్నీ పెడతాం, అక్కడ నుండి అన్ని ప్రాంతాలకూ రోడ్లు వేస్తాం అని చెప్తున్నారు. రోడ్లు ఎక్కణ్నుంచి ఎక్కడికైనా వేయవచ్చు. రాయలసీమలో పెడితే గుంటూరు రోడ్డు అటు వెళ్లదా? ‘రాజధాని గురించి ఎన్ని చర్చలు జరిగినా, టిడిపి వినేట్టు లేదు. విజయవాడ-గుంటూరు మధ్యలోనే పెట్టబోతోంది’ అనే నమ్మకం ఆంధ్రప్రజలందరిలో కలిగింది. ‘హైదరాబాదు పోగొట్టుకున్నందుకు కసితో వున్న కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు హైదరాబాదునే తమ వద్దకు రప్పించుకోవాలనే పట్టుదలతో వున్నారు. హైదరాబాదును తలదన్నే నగరాన్ని తమ వద్ద నిర్మించుకుని తమ తడాఖా చాటాలనుకుంటున్నారు’ అని అందరూ నమ్ముతున్నారు. ఈ కోరిక ఇతర జిల్లాల వారికీ వుండవచ్చు కానీ వారి కోరిక నెరవేరే సాధనం లేదు. ఎందుకంటే టిడిపికి మద్దతు పలికే వర్గాలు ఆ రెండు జిల్లాలలో బలంగా వున్నాయి. అందువలన వారి మాట చెల్లుబాటు అవుతోంది. టిడిపి కాక వైకాపా గెలిచి వుంటే ఏ కడపలోనే రాజధాని పెట్టాలని ఆ జిల్లా వాసులు పట్టుబట్టేవారేమో!
సెంటర్లో వుంది కదాని శరీరంలో కడుపుకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి కాళ్లూ చేతులను పట్టించుకోకపోతే కదలిక వుండదు, కడుపుకి తిండి వెళ్లదు, మోసేవాళ్లుండరు. ఈ – గవర్నెన్స్ ద్వారా పాలిస్తున్న ఈ రోజుల్లో రాజధాని అన్ని ప్రాంతాలకూ సమదూరంలో వుండాలి అనడమెందుకు? ఇంకో నాలుగైదేళ్ల పాటు రాజధాని హైదరాబాదులోనే వుండేట్టు వుంది. హైదరాబాదు అందరికీ సమదూరంలో వుందా? సాధారణ ప్రజలకు రాజధానితో పనేముంటుంది? ‘గ్రామీణుడు మండల కేంద్రానికి వెళితే చాలు పనులన్నీ ఏకగవాక్షం ద్వారా చేసేస్తాం, మంత్రులు, అధికారులు ప్రజలతో మమేకమై ప్రజల ముంగిటకు పాలన తెచ్చేస్తాం’ అని ఓ పక్క అంటూనే మళ్లీ సామాన్యుడు మా దగ్గరకు రావాలంటే దూరం కదా? అని వాదించడం సిల్లీగా వుంది. అంతగా అవసరం వుంటే అతనే వస్తాడు, రోడ్లు వేస్తానంటున్నారుగా! అటు నుంచి ఇటు రావాలన్నా, ఇటు నుంటి అటు పోవాలన్నా అదే రోడ్డు! ఓకే, రాజధాని సెంటర్లో వుండాలనుకుని విజిఎంటిలో పెడతామంటారు. సరే, అక్కడితో ఆపండి. మళ్లీ అన్నీ అక్కడే పెట్టడం దేనికి? రాజధాని కావాలా? యూనివర్శిటీలు, హాస్పటల్స్, పరిశ్రమలు వగైరా కావాలా? అని అక్కడి ప్రజలను అడగండి. రాజధాని వున్నచోట మీడియా ఎలాగూ విస్తరిస్తుంది. దానితో సరిపెట్టండి. తక్కినవి ఇతర జిల్లాలకు పంచేయండి. ఇప్పటిదాకా అన్నీ ఒకేచోట పెట్టేయడం వలననే తెలుగువాళ్లు విడిపోవలసి వచ్చిందని గుర్తు పెట్టుకోండి. మళ్లీ అదే పొరబాటు చేస్తే తక్కిన ప్రాంతాల్లో ప్రాంతీయ ఉద్యమాలు తలెత్తుతాయి. ఎన్నికల్లో బిక్కచచ్చి వున్న కాంగ్రెసు ఐదేళ్ల తర్వాతైనా కొన్ని సీట్లు తెచ్చుకోవాలనే తపనతో ఆ ఉద్యమాలకు మద్దతు ఇస్తుంది. అధికారపక్షాన్ని ఇరకాటంలో పెట్టడానికి వైకాపా కూడా వారితో చేతులు కలుపుతుంది.
కులాల కుమ్ములాటలు తగ్గాలి
రాజధాని రావడం వలన కృష్ణా, గుంటూరు జిల్లాలలోని నాయకులు లాభపడతారు కానీ సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందని గట్టిగా చెప్పలేం. అక్కడ మహానగరం ఏర్పడితే కాలుష్యం పెరిగిపోతుంది. విజయవాడలో ఇప్పటికే పౌరసమస్యలున్నాయి. విజయవాడ-గుంటూరు హైవే మహా రద్దీగా వుంటోంది. అన్నీ అక్కడే పెడితే ఇక మరీ ఇరుకు అయిపోతుంది. బైపాస్‌లు వేస్తాం, ఔటర్ రింగురోడ్లు వేస్తాం అని కబుర్లు చెప్పవచ్చు. అవన్నీ కనీసం ఐదేళ్లు పడతాయి. పైగా వీటన్నిటికీ స్థల సేకరణ చాలా కష్టం. అందరూ లిటిగెంట్లే. ‘మా ఇల్లు తీసుకోకండి, కావాలంటే పక్కింటి వాడిది కొట్టేయండి’ అంటూ కోర్టుకి వెళ్లగలరు. శాంక్షన్ అయిన కొన్ని పథకాలు ఇలాంటి కారణాలతోనే ముందుకు సాగలేదు. మనం ఏం రాసినా, టిడిపి వాళ్లు అక్కడ రాజధాని పెట్టే తీరతారని దాదాపుగా అందరూ ఫిక్సయిపోయారు.
రాజధానిగా ఆ ప్రాంతం వర్ధిల్లాలంటే కొందరు పూనుకుని అక్కడి సామాజిక వాతావరణాన్ని మార్చవలసిన అవసరం వుందని నా వ్యక్తిగత అభిప్రాయం. తక్కిన చోట్ల కూడా కులాల గొడవలు కొద్దో గొప్పో వున్నాయి కానీ కృష్ణా జిల్లాలో కులం పేర కుమ్ములాటలు విపరీతం. ఇందిరా గాంధీ పోయినప్పుడు ఢిల్లీలో శిఖ్కులను చంపారంటే ఆమె హత్యకు కారకులు శిఖ్కులు కాబట్టి అని దానికి కారణం చెప్పవచ్చు. గాంధీ హత్య జరిగినప్పుడు మహారాష్ట్ర బ్రాహ్మణులపై కూడా దాడులు జరిగాయి – గాడ్సే ఆ కులం వాడు కాబట్టి. కానీ రాజీవ్ హత్య టైములో విజయవాడలో కమ్మ కులస్తులపై దాడులేమిటి? ఏమైనా లింకు వుందా? హంతకులు ఎల్‌టిటిఇ వారు కాబట్టి అయితే గియితే తమిళులపై దాడులు జరగాలి. మధ్యలో కమ్మలు ఎక్కణ్నుంచి వచ్చారు? 194 శిఖ్కుల పట్ల జరిగిన అత్యాచారాలపై ఇప్పటికీ చర్చ జరుగుతోంది. మరి యీ గొడవ పట్ల ఎవరైనా విషాదం వ్యక్తం చేశారా? బాధితులకు సరైన నష్టపరిహారం దక్కిందా? నాకు తెలియదు. అలాగే వంగవీటి రంగా హత్య విషయంలో..! ఏదైనా ప్రాంతంలో కాపులు బహుళంగా వున్నారంటే చాలు, అక్కడ రంగా విగ్రహం వెలుస్తుంది. ఏం కాపుల్లో మేధావులు లేరా? కళాకారులు లేరా? ప్రసిద్ధులు లేరా? రంగా విగ్రహమే ఎందుకు – ఇతరులను హెచ్చరించడానికి కాకపోతే ! కులరాజకీయాలు ప్రబలం కాని క్రితం కమ్యూనిస్టుల్లో రెండు వర్గాల వారు (సిపిఐ, సిపిఎం) విజయవాడలో చచ్చేట్లా కొట్టుకునేవారు. విజయవాడ రాజకీయాల్లో హింస అనేది పెనవేసుకుని పోయిందని, అది కొంతైనా కట్టడి చేసినందుకే వ్యాస్ వంటి పోలీసు అధికారులకు అంతపేరు వచ్చిందని పరిశీలకులందరికీ తెలుసు.
ఈ కులజాడ్యం పాతతరానికి పరిమితం కాలేదని యువతరానికి కూడా పాకిందని కూడా అంటారు. ఒక సినిమా హీరో ఒక కూల్‌డ్రింకుకు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేస్తే, అతని కులాన్ని వ్యతిరేకించే మరో కులపు విద్యార్థులు కాలేజీ క్యాంటీన్లలో ఆ బ్రాండ్ కూల్‌డ్రింకును నిషేధించిన వైనాలు అక్కడి ప్రజలకు తెలుసు. ప్రతి మనిషిని, ప్రతి సంఘటనను కులం కళ్లతోనే చూస్తారని ప్రతీతి. అక్కడి సామాజిక కార్యకర్తలు ఐక్యసంఘటనగా ఏర్పడి కొన్ని చర్యలు చేపట్టి ఆ పేరు తుడిచివేసుకోకపోతే రాజధానిగా ఎదగడం కష్టం.
అందర్నీ ఆహ్వానిస్తారా?
ఇంకొక అంశం కూడా ఇక్కడ ప్రస్తావించాలి. కృష్ణా, గుంటూరు జిల్లాల వారు తమ మార్కు చొరవతో, సాహసంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడ నెగ్గుకు రావడం, స్థానికులకు కన్ను కుట్టేటంతగా ఎదగడం గమనిస్తాం. కానీ ఇతర ప్రాంతాల నుంచి ఆ జిల్లాలకు వచ్చి వియాలు సాధించిన వారున్నారా – అనేది గణాంకాలు చూస్తే తప్ప చెప్పలేం. ఆటోమొబైల్ రంగంలో చిన్న స్థాయిలో పంజాబీలు వుండడం కనబడుతోంది. ఇతర రంగాలలో స్థానికులే వున్నట్టున్నారు. వీళ్లను చూసి బెదిరి ఇతరులు రారా? వాళ్లు రావడానికి వీల్లేనంతగా వీళ్లే విస్తరించారా? అన్నది అర్థం కాదు. మార్వాడీలు, గుజరాతీలు ఇంచుమించు ఒకలాంటి వ్యాపారాలే చేస్తూ దేశమంతా వ్యాపించి వున్నారు. కానీ గుజరాత్లో మార్వాడీలు, రాజస్థాన్‌లో గుజరాతీలు వ్యాపారస్తులుగా కనబడరని మా స్నేహితుడు ఓసారి వ్యాఖ్యానించాడు.
ఎందుకంటే ‘కారీయింగ్ కోల్స్ టు న్యూకాజిల్’ (బొగు గనులున్న వూరికి వెళ్లి బొగ్గు అమ్మబోవడం)లా, ఎడారికి వెళ్లి ఇసుక అమ్మబోవడంలా వుంటుందట. స్థానికుల కంటే మనం మెరుగ్గా వ్యాపారం చేయగలమని అనుకున్నపుడే ఎవరైనా వెళతారు. కృష్ణా, గుంటూరు జిల్లావాసుల దగ్గరకు వెళ్లి ఫలానా వ్యాపారం చేద్దామనుకుంటున్నాను అనగానే ‘ఓహో, కాన్సెప్టు బాగుందే’ అనుకుని వాళ్లు మీకంటే ముందే అక్కడ పెట్టేస్తే..!? ఇవన్నీ ఊహలే, అక్కడ నివసించేవారు మాత్రమే యథార్థాలు చెప్పగలరు. రాజధానిగా ఎదగాలంటే అందర్నీ ఆహ్వానించే వాతావరణం, ఎదగనిచ్చే గుణం వుండాలి. ముంబయి చూడండి – పార్శీలు, సింధీలు, గుజరాతీలు.. ఎవరైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు. చిన్న చిన్న ఉద్యోగాలలో, చిన్న వ్యాపారాలలో దక్షిణాది వారు, ఉత్తరాదివారు పుష్కలంగా కనబడతారు. శివసేన వంటి శక్తులు మధ్యమధ్యలో అరాచకం సృష్టించినా మొత్తం మీద వాతావరణం – ఎవరైనా వచ్చి కష్టపడి పైకి రావచ్చు అనేట్లా వుంటుంది.
1970 ప్రాంతాల్లో శివసేన వారు ‘మద్రాసీ భాగో’ నినాదంతో స్మగుల్డ్ గూడ్స్ అమ్మే మలయాళీ హాకర్స్‌ని పట్టుకుని తంతూండేవారు. అలా దెబ్బలు తినే మలయాళీని ఓ సారి అడిగాను – ఇక్కడెందుకీ అవస్థ? హాయిగా మీ రాష్ట్రం పోరాదా? అని. ‘ఏడాదిలో అయిదారు రోజులు తన్నినా తక్కిన 360 రోజులు యిక్కడి వాళ్లు అన్నం పెడతారు. కేరళలో అదీ వుండదు. వెళ్లి పాన్ షాపు పెట్టుకుందామనుకున్నా, ఆ వీధిలో అప్పటికే షాపు పెట్టుకున్నవాడు పెట్టనివ్వడు. బలవంతంగా పెడితే ఏ కాలో, చెయ్యో తీసేస్తాడు అన్నాడు. త్రిశూరుకు చెందిన ఓ స్నేహితుడు చెప్పాడు – 1970 ప్రాంతాలలో ఆ ఊళ్లో టాక్సీలు మాత్రమే వుండేవిట. తక్కువ ఖర్చుతో తిరగాలంటే ఆటోలు కావాలి. కానీ టాక్సీ వాళ్లు ఒప్పుకునేవారు కారు. పౌరుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఎవరికైనా ఆటో లైసెన్సులు ఇస్తే టాక్సీ యూనియన్‌వాళ్లు వచ్చి వాళ్లను చావబాది బెదరగొట్టేవారు. ఇక ఎవరూ వచ్చేవారు కారు. ఇది పనిగాదని కొన్నేళ్లకు ప్రభుత్వం ఓ స్కీము పెట్టి ఒకేసారి ఒక ఏభై మంది దుక్కల్లాటి ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఆటోలు శాంక్షన్ చేసి తిప్పుకోమంది. ఎవరైనా ఆటోవాడి మీద టాక్సీవాడి చేయిపడగానే ఈ ఏభై మంది కట్టకట్టుకుని యావన్మంది టాక్సీవాళ్లను చావగొట్టి చెవులు మూసేవారు. ఇక ఏం చేయలేక టాక్సీవాళ్లు చప్పబడ్డారు. ఆ విధంగా త్రిశూరుకు ఆటోలు వచ్చాయి.
కావలసినది – కాస్మోపోలిటన్ కల్చర్
కేరళలో ఇలాంటి వాతావరణం వుంది కాబట్టే అక్కడ పరిశ్రమలు పెట్టడానికి జనం దడుస్తారు. ఆ రాష్ట్ర సరిహద్దుల్లో తమిళనాడులో, కర్ణాటకలో పెడతారు. కేరళ పనివారు ఎంతో నైపుణ్యం కలవారు, కానీ అక్కడ తగినంత పారిశ్రామిక అభివృద్ధి జరగకపోవడానికి కారణం స్థానిక ప్రజల స్వభావం. కర్ణాటకలో అందర్నీ ఆహ్వానించే లక్షణం కనబడుతుంది. అందుకే బెంగుళూరు అనేక రకాలుగా పెరిగింది. హైదరాబాదులో కూడా అంతే. స్థానిక ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా అందర్నీ ఆహ్వానిస్తూనే వచ్చారు. ఇటీవలి కాలంలో రాజకీయాలతో విభేదాలు తెచ్చారు కానీ లేకపోతే సామాజికంగా ఎన్నడూ కలహాలు లేవు. హైదరాబాదు తర్వాత వైజాగ్‌లో అలాంటి వాతావరణం కనబడుతుంది. ఎక్కడెక్కడి వాళ్లు అక్కడకి వచ్చి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేసినా స్థానికత సమస్య లేకుండా నెగ్గించారు. డిఫెన్సు సంస్థల కారణంగా వివిధ రాష్ట్రాల వారు అక్కడ స్థిరపడి కాస్మోపోలిటన్ కల్చర్ తెచ్చారు. విజయవాడ-గుంటూరు ప్రాంతాలలో ముంబయి, బెంగుళూరు, హైదరాబాదు వంటి కాస్మోపోలిటన్ వాతావరణం నెలకొల్పితే అక్కడి రాజధాని వర్ధిల్లుతుంది. కేరళ వంటి సంకుచిత వాతావరణం నెలకొంటే క్రుంగుతుంది. అన్నీ మాకే కావాలి, మేమే బాగుపడాలి అనే ధోరణి అక్కడి నాయకులు ఇప్పటికే ప్రదర్శిస్తున్నారు. ప్రజల్లో ఆ భావం చొరబడకుండా ఉండాలని ఆశిద్దాం.
ఎమ్బీయస్ ప్రసాద్