ఇప్పటిదాకా జరిగిన కథను ‘ఇటాలియన్ మిడతంభొట్లు’లో చూడవచ్చు. బ్రస్సెల్స్‌లో జోసెఫ్ దంపతులు తమ దుకాణం తెరిచారు. అమృతజలం అమ్మారు, కొన్ని రోగాలు కుదిర్చారు, డబ్బు బాగానే సంపాదించారు. అక్కణ్నుంచి జర్మనీ, ఆపై రష్యా వెళ్లారు. వెళ్లిన ప్రతీచోటా కనకవర్షం కురిసింది. ఇంగ్లండులోని చేదు అనుభవాలను మర్చిపోయారు. 1780లో తూర్పు ఫ్రాన్సులోని స్ట్రాస్‌బర్గ్‌కు వచ్చారు. వస్తూనే పెద్ద హోటల్లో దిగి, అక్కడే ఊళ్లో పెద్దలందరికీ విందు నిచ్చారు. వీళ్లు ఊరికి వచ్చేముందే వీరి ఖ్యాతి గురించి పేపర్లలో రావడంతో అందరూ హాజరయ్యారు. ‘కౌంట్’, ‘కౌంటెస్’ (వాళ్లు తగిలించుకున్నవే) తమను తాము వైద్యులుగా పరిచయం చేసుకున్నారు. శరీరంతో బాటు, మనసుకు కూడా వైద్యం చేస్తామన్నారు. మందూమాకూతో బాటు, కౌన్సిలింగు, పేదలకు విరాళాలూ యిచ్చి అందరి ఆదరాన్నీ చూరగొన్నారు.
అప్పటికి లోరెన్జా వయసు 25 వుంటుంది. కానీ ఆమె ‘నాకు 28 ఏళ్ల కొడుకున్నాడు. వాడు హాలండ్‌లో కెప్టెన్‌గా వున్నాడు.’ అని చెప్పుకునేది. ‘50వ పడిలో పడినా యీమె శరీరం యింత నిగనిగ లాడుతోందంటే, ముఖం కళకళలాడుతోందంటే యీమె దగ్గర రహస్యమేదో వుంది. తన చేత సౌందర్యచికిత్స చేయించుకుంటే మనం అందగత్తెలుగా మారవచ్చు’ అనుకున్న ముసలి అనాకారులు (వాళ్లకు కొదవ లేదు) ఆమె వెంటపడ్డారు. ఆమె వాళ్ల మొహాలకు ఏవేవో పూసి, శరీరాలను తైలాలతో మర్దనా చేయించి పంపించేది. వాళ్లతో బాటు వాళ్ల కూతుళ్లు కూడా వచ్చి, మా యవ్వనం జారిపోకుండా చూడు అని చికిత్స చేయించుకునేవారు. మైళ్ల దూరం నుంచి క్లయింట్లు వచ్చేవారు. ఇక లోరెన్జా అందాన్ని, గ్లామర్‌ను, సంభాషణాచాతుర్యాన్ని చూసి అన్ని వయసుల మగవాళ్లూ వెంటపడేవారు. కానీ ఆమె వాళ్లను తగినంత దూరంలోనే వుంచి చిత్తమొచ్చినట్లు ఆడిస్తూ వుండేది తప్ప భర్తను ఎన్నడూ వంచించలేదు.
ఈ దశలో వాళ్లకు రోహన్ అనే ప్రిన్స్ పరిచయమయ్యాడు. అతను ఆ వూళ్లో బిషప్. రోమన్ కాథలిక్ చర్చిలో పోప్‌ను ఎన్నుకునే పూజార్ల సంఘం (కార్డినల్ అంటారు వాళ్లని)లో సభ్యుడు. ఉన్నత వంశీకుడు, రాజకీయవేత్త కూడా. అతను జోసెఫ్ గొప్ప తత్త్వవేత్త అని నమ్మి, నీబోటి వాడు రాజధానిలో వుండదగిన వ్యక్తి అంటూ పారిస్‌కు అతన్ని వెంటబెట్టుకుని తీసుకెళ్లాడు. కానీ 13 రోజుల బస తర్వాత జోసెఫ్‌కు లండన్ అనుభవం గుర్తుకు వచ్చి దేశరాజధానికి ఎంత దూరం వుంటే అంత మంచిది అనుకుని స్ట్రాస్‌బర్గ్‌కు తిరిగి వచ్చేశాడు. కానీ కొద్ది రోజుల్లోనే స్ట్రాస్‌బర్గ్‌లో వాళ్ల బండారం బయటపడసాగింది. క్లయింట్లకు ఆశించిన అందచందాలేవీ అబ్బలేదు. కుదిర్చామని చెప్పుకున్న రోగాలు తిరిగి వచ్చేశాయి. జోస్యాలు తప్పసాగాయి. దాంతో ఆ వూరి ప్రజలంతా వాళ్లను నానా రకాలుగా తిట్టసాగారు. 1400 ఏళ్లున్న సైతాను శిష్యుడు, మానవరూపంలో వున్న రాక్షసుడు, క్షుద్రయోగి, మంత్రగాడు, మోసగాడు.. యిలా అనేకరకాలైన బిరుదులిచ్చారు. మరి కొందరు వీళ్లు విదేశీ గూఢచారులన్నారు. ఈ గోల భరించలేక యిక్కణ్నుంచి జండా ఎత్తేస్తే మంచిదనుకున్నారు జోసెఫ్ దంపతులు.
మొదటగా ఇటలీలోని నేపుల్స్ వెళ్లారు. కానీ అది తన స్వగ్రామమైన పాలెర్మోకి దగ్గరగా వుండడంతో తన వూరివాళ్లెవరైనా గుర్తు పడతారేమోనని భయపడి మళ్లీ ఫ్రాన్స్‌కి వచ్చారు. పారిస్‌కు దూరంగా వుందామనుకున్నారు కాబట్టి బోడో అనే వూరిలో కాపురం పెట్టారు. అక్కడ జోసెఫ్ తను ఒక కొత్త వైద్యవిధానాన్ని కనిపెట్టానని, దానితో సకల రోగాలను నయం చేయగలననీ చెప్పుకున్నాడు. ధనిక రోగుల నుంచి సంపాదించిన డబ్బును పేదల సంక్షేమానికి యిస్తున్నానంటూ, వారికి మందులు, కొద్దిపాటి డబ్బూ పంచసాగాడు. అతని నకిలీమందుల కంటె యీ ధనసహాయం ఎక్కువ ప్రభావాన్ని చూపి పలుకుబడి విపరీతంగా పెరిగి, వాళ్లింటికి తండోపతండాలుగా జనం రాసాగారు. వాళ్లకు రక్షణ కల్పించడానికి నగర పాలకులు వాళ్లకు అహోరాత్రాలు కాపలాదారులను ఏర్పాటు చేశారు.
ఇదంతా నగరంలోని ధనికులను ఆకర్షించింది. లోరెన్జో నిర్వహించే బ్యూటీ సెలూన్లకు ఆడా, మగా ఎగబడ్డారు. వాళ్ల అమృతజలం పీపాలతో అమ్ముడు పోసాగింది. వీళ్లు తరచుగా పార్టీలిస్తూ కులీనులుగా చెలామణీ కాసాగారు. తన భర్త సమాధుల నుంచి ఆత్మలను మేల్కొల్పగలడని, భవిష్యత్తును వీక్షించగలడని లోరెన్జో పలుకుబడి వున్నవారిని యింప్రెస్ చేసింది. కొద్ది నెలలు సాగేసరికి స్ట్రాస్‌బర్గ్ అనుభవమే పునరావృతం అయింది. ఆ మందులు నకిలీవని, ఆ జోస్యాలు వట్టివని అందరూ అనుకోసాగారు. క్షుద్రమాంత్రికుడన్న పేరూ వచ్చేసింది. మొదట్లో తక్కువమంది మాట్లాడుకుంటున్నపుడు జోసెఫ్ పట్టించుకోలేదు కానీ పోనుపోను అందరూ అనసాగడంతో అతని పార్టీలకు జనం రావడం మానేశారు. వీధిలో కనబడినా మొహం తిప్పుకుంటున్నారు. ఇలాటి చిన్న వూళ్లలో ఎక్కువకాలం నాటకాలాడడం కష్టం కాబట్టి, కాస్త రిస్కు తీసుకునైనా రాజధానికి వెళ్లడం ఉత్తమమని అనుకున్నాడు. అక్కడ జనాభా ఎక్కువ. ఒకరు కాకపోతే మరొకరైనా బుట్టలో పడతారు.
స్ట్రాస్‌బర్గ్‌లో పరిచయమైన మిత్రుడు కార్డినల్ రోహన్ సాయంతో జోసెఫ్ పారిస్‌లో ఉన్నత వర్గాల్లోకి ప్రవేశం సంపాదించాడు. తను ఒక కొత్త ఫిలాసఫీని స్థాపించానని చెప్పుకున్నాడు. ఆత్మలతో సంభాషించగలనని, రసవిద్య తెలుసని, దేవుని సహాయంతో క్షుద్రవిద్యాప్రయోగాలను నివారించగలనని చెప్పుకున్నాడు. దీనితో పారిస్ కులీన వర్గాలన్నీ వీరి వెంట పడ్డాయి. ఓ మిలటరీ అధికారి వచ్చి ‘యుద్ధతంత్రం గురించి సీజర్ ఆత్మతో చర్చించాలి.’ అంటే సరేననేవాడు. ఓ లాయరు వచ్చి ‘న్యాయపరమైన అంశాల గురించి సిసిరోతో మాటామంతీ చేయాలి.’ అంటే ఓకే అనేవాడు. ‘‘సోగ్గాడే…’’ సినిమాలో బ్రహ్మానందం కారెక్టరును ఆనాడే నిజజీవితంలో చూపించిన బురిడీ బాబా జోసెఫ్. ‘ఈ ఆత్మలు ఆషామాషీ ఫీజులకు నిద్ర లేవవు. దండిగా ఖర్చవుతుంది.’ అంటూ భారీగా వసూలు చేసేవాడు. ఇక లోరెన్జా అయితే తన భర్త తలచుకున్నంత మాత్రానే అదృశ్యం కాగలడని, మనోవేగంతో ప్రపంచమంతా చుట్టి రాగలడని తన క్లయింట్లలో ప్రచారం చేసి ఆడవాళ్లందరినీ నమ్మించేది. వాళ్లు తమ భర్తలను యితని దగ్గరకు తరిమేవారు.
జీవితం యిలా హాయిగా గడిచిపోతున్న రోజుల్లోనే విధి వక్రించి వీళ్లు మేరీ ఆంటోనెట్ నెక్లెసు కేసులో యిరుక్కున్నారు. చరిత్ర కెక్కిన ఆ కేసు వలననే జోసెఫ్ కథ ప్రపంచానికి విపులంగా తెలిసింది. అలెగ్జాండర్ డ్యూమా వంటి ప్రఖ్యాత ఫ్రెంచ్ నవలాకారుడు (‘‘త్రీ మస్కటీర్స్’’, ‘‘కౌంట్ ఆఫ్ మాంట్‌క్రిస్టో’’ వగైరా నవలలు) యితని జీవితంపై ‘‘ద మెమ్‌వాజ్ ఆఫ్ ఫిజిషియన్’’ నవల రాసేందుకు ప్రేరేపించింది. ఆ కేసులో వీళ్లు యిరుక్కోవడానికి కారణం వీళ్లను పారిస్ తీసుకుని వచ్చిన కార్డినల్ రోహన్ మోహావేశం. మేరీ ఆంటోనెట్ ఆఖరి ఫ్రెంచి చక్రవర్తి 16వ లూయీ భార్య. అత్యంత భోగవంతమైన జీవితాన్ని గడిపి ప్రజల చేత అసహ్యించుకోబడింది. 1789లో వచ్చిన ఫ్రెంచ్ విప్లవంలో యీమెను గృహనిర్బంధంలోకి తీసుకుని, నాలుగేళ్ల తర్వాత గిలెటిన్‌తో తల తెగనరికారు. అంతకు 9 నెలలకు ముందే ఆమె భర్త తల నరికారు. ఈ మేరీ అందగత్తె, విలాసవతి. రోహన్ యీమె అంటే పడి చచ్చేవాడు. కానీ యీమె అతన్ని పట్టించుకోకపోగా చీదరించుకునేది. రోహన్ విలవిల లాడేవాడు.
ఇదంతా మేరీకి యిష్టసఖి (ఛాంబర్ ఉమన్ అంటారు, వీళ్లూ ధనిక కుటుంబాలకు చెందినవారే) ఐన లా మాట్ అనే ఆమె గమనించింది. మీ యిద్దరికీ మధ్య సఖ్యత కుదురుస్తానుగా అని రోహన్‌కు హామీ యిచ్చింది. నా కోరిక తీర్చడానికి నువ్వేం చెప్పినా చేస్తాను అన్నాడు రోహన్. ఓ రోజు మేరీ, బోమర్ అనే రత్నాల వ్యాపారితో తన అంతఃపురంలో మాట్లాడుతూండగా లా మాట్ అక్కడుండడం సంభవించింది. బోమర్ 16 లక్షల ఫ్రాంకులు విలువ చేసే రత్నాల నెక్లెస్‌ను అమ్మచూపాడు. ‘చాలా బాగుంది కానీ నా దగ్గర అంత డబ్బు లేదు’ అంది మేరీ. దీన్ని అవకాశంగా తీసుకుని, రోహన్‌ను ఏమార్చి ఆ నెక్లెసు తను సంపాదిద్దామని ప్లాను వేసింది లా మాట్. రోహన్ వద్దకు వెళ్లి ‘రాణికి దానిపై మోజుంది. కొనలేకపోయానని దిగులుంది. నువ్వే అది కొనేసి, తనకు బహుమతిగా యిచ్చావనుకో, మురిసి ముక్కలై నీ పక్కలోకి వస్తుంది.’ అని ఆశ చూపింది.
రోహన్ దగ్గర డబ్బుకి కొదవ లేదు. వివేకానికి మాత్రమే కొరత వుంది. లా మాట్ చెప్పగానే ‘అదేదో నేనే కొని ఆవిడకి బహుమతిగా యిస్తాను.’ అన్నాడు. ‘వద్దు, వద్దు అలా అయితే ఆమె అహం దెబ్బ తింటుంది. నేనంత దరిద్రురాలినా అని కోపం తెచ్చుకుంటుంది. నేనో ఐడియా చెప్తాను. నువ్వు బోమర్ దగ్గర కెళ్లి ‘దాన్ని రాణిగారికి అమ్మెయి. ప్రస్తుతానికి డబ్బివ్వరు. కొన్నాళ్ల తర్వాత డబ్బిచ్చేట్టుగా ప్రామిసరీ నోటు రాసిస్తారు. చెల్లించే తేదీ, వడ్డీ రేటు వగైరాలు వేసి నోటు తయారు చేసి నాకియ్యి, నేను రాణిగారి చేత సంతకం చేయించి నీకిస్తా. ఆ నెక్లెసు నాకివ్వు’ అని చెప్పు.’ అని చెప్పింది. రోహన్ అలాగే చేశాడు. లా మాట్ రాణి చేత సంతకం చేయించి పట్టుకుని వచ్చింది. రోహన్ దాన్ని బోమర్ కిచ్చి నెక్లెసు తీసుకుని లా మాట్‌కు యిచ్చాడు.
మర్నాడు లా మాట్ ‘రాణి గారు చాలా సంతోషించారు. నిన్ను వర్శాయి రాజసౌధపు ఉద్యానవనంలో మునిమాపు వేళ కలుస్తానన్నారు. తన చేతులతో నీకో పువ్వు బహూకరిస్తానన్నారు.’ అని చెప్పింది. అప్పట్లో పారిస్‌లో ఒలివా అనే అమ్మాయి అచ్చు రాణీగారిలా వుందని చెప్పుకునేవారు. లా మాట్ డబ్బు ఆశ చూపించి, ఆమెను పిలుచుకుని వచ్చి రాణీగారిలా కూర్చోబెట్టి, రోహన్‌కు పువ్వు యిప్పించివేసింది. తన కామాతురతలో రోహన్ జరిగిన మోసమేమిటో కనుక్కోలేకపోయాడు. విప్లవం వచ్చిన తర్వాత మేరీపై ఆగ్రహంగా వున్న ప్రజలు ‘ఇదంతా రాణీయే చేయించింది. బోమర్‌ను మోసగించడానికి ప్లాను వేసి, నేరం బయటకు రాగానే లా మాట్‌పై, ఒలివాపై నెట్టేసింది. ఆ రోజు తోటలో రోహన్‌కు పువ్వు యిచ్చినది అసలైన రాణే’ అనసాగారు. నిజానిజాలు ఎవరికీ తెలియవు.
ప్రామిసరీ నోటు గడువు రాగానే బోమర్ డబ్బు యిమ్మని అడిగాడు. ఈలోగా లా మాట్ తనను ఏమార్చిందని గ్రహించిన రోహన్ నోటుపై నా సంతకం లేదు నాకేం సంబంధం? అన్నాడు. ఆనాటి పువ్వు సంఘటన తర్వాత రాణి తనను దగ్గరకు రానీయలేదని అతను కోపంగా వున్నాడు. లా మాట్ రోహన్‌తో నిన్ను చూసే కదా బోమర్ నగ యిచ్చాడు, లేకపోతే రాణి స్వయంగా తన ఎదుట సంతకం చేయకపోయినా యిచ్చేవాడా? అందుకని నువ్వు డబ్బిచ్చేసి, పరువు కాపాడుకో అంది. నగ తీసుకున్నాక నా మొహమైనా చూడని రాణి కోసం 16 లక్షల ఫ్రాంకులు ఎందుకు ఖర్చు పెట్టాలి? సంతకం పెట్టిన రాణినే చెల్లించమను అన్నాడు రోహన్ కోపంగా. బోమర్ చెక్ చేయిస్తే నోటుపై సంతకం ఫోర్జరీ అని తేలింది. రాణి నా ఎదురుగా సంతకం పెట్టలేదు, నాతో వ్యవహరించినవారు లా మాట్, రోహన్. వాళ్లే ఫోర్జరీ చేసి వుంటారు అని నేరం ఆరోపించి వాళ్లని బాస్టీల్ జైల్లో తోయించాడు బోమర్.
పోలీసులు లా మాట్ కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశోధించారు. ఆమె దగ్గర నెక్లెస్ దొరకలేదు. ఇంగ్లండు పారిపోయిన ఆమె భర్త ఆ నెక్లెస్ పట్టుకుపోయి, అక్కడ ముక్కలుముక్కలు చేసి అమ్మేసి వుంటాడని అప్పట్లో జనాలు అనుకున్నారు. కానీ లా మాట్ మాత్రం జోసెఫ్‌ను యిరికించేసింది. ఖర్మ కాలి వాళ్లు ఆమెకు స్నేహితులు. ‘దీనికంతా కారణం ఆ జోసెఫ్. వాడు సైతాను పూజారి. ఆత్మలతో మాట్లాడతాడు. పరమ నీచుడు. నిజానికి రోహన్‌ను నాశనం చేయాలని వాడి ప్లాను. క్షుద్రశక్తులతో నా మనసును లోబరుచుకుని నా చేత యీ అకృత్యం చేయించాడు. ఆ నెక్లెసు తెచ్చి యిస్తే మాయామంత్రంతో దాన్ని పదింతలు చేసి యిస్తానని నమ్మించి నా దగ్గర్నుంచి తీసేసుకున్నాడు. వాడి వశీకరణ మాయలో పడి నేనీ నేరం చేశాను.’ అని చెప్పింది. పోలీసులు వెంటనే జోసెఫ్‌ను పట్టుకుని, విచారణ జరిపి, గతమంతా తవ్వి అతన్నీ బాస్టీల్ జైలులో పడేశారు. ఆర్నెల్ల తర్వాత కేసు విచారణ ప్రారంభమైంది. జోసెఫ్‌ను ప్రథమ ముద్దాయిగా నిలబెట్టారు. కోర్టులో అతను తన వచోనైపుణ్యమంతా ప్రదర్శించాడు. ‘నేను మానవాళికి ఎంతో సేవ చేస్తే నన్నిలా దోషిగా నిలబెడతారా?’ అంటూ వాపోయాడు. ఆ తర్వాత ఆర్నెల్లుగా నా భార్య మొహం చూడనీయలేదంటూ విలపించాడు.
ఆ తర్వాత ‘నా గతం గురించి ఏవేవో పుకార్లు పుట్టిస్తున్నారు. సత్యమేమిటో ఆవిష్కరించడానికి యివాళ నా పుట్టుపూర్వోత్తరాలు నేనే చెప్తాను.’ అంటూ పెద్ద కథ చెప్పాడు. దాని ప్రకారం అతనికి తనెక్కడ పుట్టాడో, తన తలిదండ్రులెవరో తెలియదు. ఊహ తెలిసేసరికి అరేబియాలోని మదీనాలో ఓ పెద్ద రాజసౌధంలో అచారత్ అనే పేరుతో పెరుగుతున్నాడు. ‘మూణ్నెళ్ల వయసులో నిన్ను నీ తలిదండ్రులు యిక్కడ వదిలేసి వెళ్లారు. వాళ్ల క్రైస్తవులు. అంతకంటె ఏమీ అడక్కు.’ అని పెంపుడు తండ్రి చెప్పాడు. 12 ఏళ్ల వయసులో తూర్పు దేశాల భాషలు నేర్చుకోవడానికి యితను మక్కా వెళ్లాడు. ఆ నగర పాలకుడు యితన్ని సొంత బిడ్డలా మూడేళ్లు చూసుకున్నాడు. బహుశా అతనే యితని కన్నతండ్రి కావచ్చు. ఎందుకంటే ఆ తర్వాత ఏ దేశం వెళ్లినా డబ్బుకి లోటుండేది కాదు. రాజధానిలో దిగి ఊళ్లో పెద్ద బ్యాంకర్ దగ్గరకు వెళ్లి ‘అచారత్’ అని తన పేరు చెప్తే చాలు, ఎంత కావాలంటే అంత తీసుకో అని డబ్బిచ్చేసేవారు. ఇప్పుడీ నగల్లాటివి వంద కొనగలడతను. అందుకనే పేద ప్రజలను వైద్యం ద్వారా, మతబోధనల ద్వారా ఉద్ధరిస్తూ వచ్చాడు.
‘జోస్యం మాట కొస్తే రోహన్‌కు ఎప్పుడో చెప్పాను, లా మాట్ కపటి, ఆమెతో సంపర్కం పెట్టుకుంటే నష్టపోతావ్ అని. అది నిజమైంది. నేను మంత్రగాణ్నీ కాను. ఏమీ కాను. నాకు యిలా మోసం చేసి సంపాదించవలసిన అవసరం ఏమాత్రం లేదు.’ అని తన వాగ్ధాటితో కోర్టును మెప్పించాడు. అతని జన్మరహస్యం ఏమైనా, యీ నగ కేసులో అతని ప్రమేయం ఉన్నట్లు తోచలేదు వారికి. రోహన్ కూడా మోసగాడు కాదు, మోసానికి గురైనవాడు అని గ్రహించారు. వాళ్లిద్దరినీ వదిలేశారు. కానీ జోసెఫ్‌ను వెంటనే పారిస్ విడిచి పొమ్మన్నారు. లా మాట్ భర్త ఇంగ్లండు పారిపోయాడు కాబట్టి ఆమెయే నగ కాజేసిందనే నిర్ణయానికి వచ్చి, బహిరంగంగా కొరడాచే కొట్టించి, వీపు మీద దొంగ అని కాలిన యినుముతో ముద్ర కొట్టించి శిక్షించారు.
జోసెఫ్ దంపతులు లండన్ వచ్చి చేరారు. అక్కడ లార్డ్ జార్జి గోర్డన్ అనే రాజకీయ ప్రముఖుడితో జోసెఫ్ నగ ఉదంతమంతా చెప్పాడు. ఇదంతా మేరీ రాణి స్వయంగా చేయించిందనే నా అనుమానం అంటూ అతను ఓ బహిరంగ ప్రకటన చేశాడు. ఫ్రెంచి రాయబారి దానికి అభ్యంతరం తెలపడంతో, యిరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బ తినకుండా వుండడానికి ఇంగ్లండు ప్రభుత్వం గోర్డన్‌కు జరిమానా విధించి, చాలాకాలం పాటు జైల్లో పెట్టింది. దానితో భయపడిన జోసెఫ్ దంపతులు ఇంగ్లండు వదిలి ఇటలీ చేరారు. అయితే వీళ్లు వెళ్లిన ప్రాంతం పోప్ అధీనంలో వుండడంతో సైతాను సేవకుడిగా పేరుబడిన జోసెఫ్‌కు చిక్కులు వచ్చాయి. 1789లో మంత్రగాళ్లనే ఆరోపణపై దంపతులిద్దర్నీ అరెస్టు చేశారు. ఉరిశిక్ష వేసి, తర్వాత దాన్ని యావజ్జీవంగా మార్చారు. ‘నేను క్రైస్తవ సన్యాసినిగా మారతాను’ అని చెప్పి లోరెన్జా శిక్ష తప్పించుకుంది. కానీ జోసెఫ్‌కు ఆ ఛాన్స్ దక్కలేదు. జైల్లోనే అనారోగ్యంతో, మానసిక చింతతో 1790లో తన 47వ ఏట మరణించాడు.
ఏ సినిమా కథకు సాటి రానంత ట్విస్టులతో, ఎగుడుదిగుళ్లతో సాగిన అతని జీవితగాథ యిలా విషాదంగా ముగిసింది. ప్రఖ్యాత ఫ్రెంచ్ నవలా రచయిత అలెగ్జాండర్ డ్యూమాను ఆకర్షించింది. ఈ కథాంశంతో అతను ‘‘జోసెఫ్ బల్సామో’’ అనే నవల రాశాడు. దానికి ‘‘మెమ్‌వాజ్ (మెమరీస్) ఆఫ్ ఏ ఫిజిషియన్’’, ‘‘ఎలిగ్జిర్ ఆఫ్ లైఫ్’’ అనే పేర్లు కూడా వున్నాయి. వెయ్యి పేజీలున్న యీ నవల నేను చదవలేదు. అందువలన జీవితగాథలో మార్పులేవైనా చేశాడేమో తెలియదు. వ్యాసం మొదట్లో ఉటంకించిన ‘పాప్యులర్ డెలూజన్స్’ పుస్తకంలోంచే యిదంతా రాశాను.
రెండు శతాబ్దాల కిందటి చరిత్రే అయినా యిప్పటికీ యిలాటి బురిడీ బాబాలు వర్ధిల్లుతున్నారంటే దానికి కారణం మన అత్యాశ, మూర్ఖత్వం. ఓ పక్క సైన్సు వృద్ధి చెందుతోంది, జ్ఞానపు సరిహద్దులు విస్తరిస్తున్నాయి. మరో పక్క మూఢనమ్మకాలూ పెచ్చు మీరుతున్నాయి. అడ్డదారిలో లక్ష్మీకటాక్షం కోసం అర్రులు చాచి, యిలాటి వాళ్లను నమ్ముతున్నారు. ఈ క్రమంలో డబ్బు పోగొట్టుకోవడమే కాదు, చాటుగా పురాతన ఆలయాలు కూలుస్తున్నారు, అడవుల్లో సంచరిస్తున్నారు, నరబలులకు సైతం ఒడి గడుతున్నారు. ఈ కథలో జోసెఫే చూడండి, తన జీవితం 47 ఏళ్లకే విషాదంగా ముగుస్తుందని ఏ ఆత్మా వచ్చి అతనికి చెప్పలేదు కదా! అతీత శక్తులన్నవి ఒట్టి భ్రమే అని దీని బట్టి తేలుతోంది కదా! ఇప్పుడు కూడా మోసం బయటపడి ఎవరైనా బాబాను జైల్లో పెడితే వాళ్లు కనికట్టు చేసి, అదృశ్యం కావటం లేదుగా, చచ్చినట్లు కోర్టుకి వచ్చి కడుపు నొప్పి, గుండెపోటు, బెయిలు కావాలి అని వేడుకొంటున్నారు కదా! వీళ్లు యింకోళ్ల రోగాలేం నయం చేయగలరు? మనలాటి పరిమితులే వున్న యీ మానవమాత్రుల వెంట పడడం శుద్ధ వేస్టు. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2021)