దేవుడు మనుష్యులను చేసి ఉండకపోతే మనిషే దేవుణ్ని చేసి వుంటాడని ఓ సామెత. మనిషికి ఆ అవసరం దేనికి? అతనికి తెలుసు – తనకు పరిమితులున్నాయని, చాలా విషయాలు తన అధీనంలో లేవనీ, అందువలన తన కంటె ఉన్నతమైన, స్థల, కాల అవధులు లేని, ఆద్యంతాలు లేని, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు ఒకడున్నాడని, అతను తనకు సాయపడతాడని నమ్మడంలో చాలా సుఖం ఉందనీ! భీకరవర్షం, వరద, భూకంపం, ఉరుము, మెరుపు యిలాటివి వచ్చినపుడు భయపడి దేవుణ్ని ప్రార్థించే కాలం నుంచి, అవి ఎందుకు వస్తున్నాయో తెలుసుకునేదాకా మానవుడు అభివృద్ధి చెందాడు.
అయినా ప్రకృతి ఉత్పాతాలను ఆపలేక కాపాడమని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాడు. ఉత్పాతాలు ఎప్పుడో వస్తాయి. చింతలనేవి ఎప్పుడూ వస్తూనే వుంటాయి. వాటిల్లోంచి బయటపడడానికి దేవుణ్ని ఆశ్రయించడం అనాదిగా వస్తున్నది. దానివలన ఫలితం ఉంటుందా? దేవుడు దిగివచ్చి మనిషి కోరికలన్నీ తీర్చేసి, వర్రీలన్నీ తుడిచేస్తాడా? అబ్బే, కృతయుగంలో కూడా అలా చేసిన దాఖలాలు లేవు. మన పార్టీ అధిష్టానాలలాగ సరైన సమయంలో, సరైన నిర్ణయం తీసుకుంటాం అంటూ తాత్సారం చేస్తాడు. మరి అలాటప్పుడు దేవుణ్ని తలచుకోవడం దేనికి? టైము దండగ కాకపోతే!
మానవుడికి స్వతస్సిద్ధంగా కొన్ని శక్తియుక్తులున్నాయి. ప్రయత్నం మీద అతను వాటిని అనేక రెట్లు పెంచుకున్నాడు. కానీ ఆ క్రమంలో చాలాసార్లు నిస్పృహకు గురవుతాడు. అప్పుడు అతనిలో ఆశ రగలాలి. తాను మంచివాణ్నని, సర్వసాక్షి ఐన దేవుడికి ఆ విషయం తెలుసని, తనకు తప్పక సాయపడతాడని అతను నమ్మాలి. అప్పుడే అతను మళ్లీ పుంజుకుని, తన మానవయత్నంతోనే అనుకున్నది సాధిస్తాడు. మళ్లీ విఫలమైనా కాలం కలిసిరాలేదని ఓదార్చుకుని యింకోసారి ప్రయత్నిస్తాడు. ఒక్కోప్పుడు ప్రయత్నానికి సరి తూగే ఫలితం రాదు. అప్పుడు తనకు యింతే ప్రాప్తమని సరిపెట్టుకుని, ముందుకు సాగుతాడు.
గమనిస్తే యివేమీ దేవుడు దిగి వచ్చి చెప్పలేదు. ఇతనే అన్నీ అనుకుంటాడు. అనుకోవడానికి ఆధారమేమిటి? అతను విన్న పురాణగాథలు, పెద్దలు చెప్పిన నీతి కథలు, దేవుణ్ని నమ్మడం వలన తమకు అనేక నిదర్శనాలు జరిగాయని ఆప్తులు, గురువులు చెప్పిన ప్రవచనాలు. అంటే దేవుడి కంటె దైవచింతనే అతనికి ఎక్కువ సాయపడుతోందన్నమాట. ఈ దైవచింతన మంచిదా, చెడ్డదా అంటే ఒక్కోళ్లకు ఒక్కో అభిప్రాయం. దీని వలన గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారమంటూ వదిలేస్తారని, నల్లమందు భాయీల్లా తయారవుతారని అంటారు కొందరు. దీనస్థితిలో యిది గొప్ప ఔషధంగా, సామాజిక నీతినియమాలు తప్పకుండా కాపాడే కంచెగా పనికి వస్తుందని కొందరంటారు.
మన పూర్వతరం వాళ్లు చింతలను ఎలా అధిగమించారా అని ఆలోచిస్తే దేవుడిపై వాళ్లకున్న అపారమైన విశ్వాసంతోనే అనిపిస్తుంది. అప్పట్లో ఐదారుగురు పిల్లలుండేవాళ్లు. ఓ యిద్దరికి చదువు అబ్బేది కాదు, బాల్యంలో వివాహం చేసిన కూతుళ్లలో ఒకరికి వైధవ్యం కలిగేది, పల్లెల్లో శుభ్రత లేక, అవగాహన లేక అనేక అనారోగ్యాలు కలిగేవి, ప్రసూతి మరణాలు, ఆస్తి తగాదాలు, మనోవర్తి దావాలు ఎక్కువ ఉండేవి, అతివృష్టి వల్లో, అనావృష్టి వల్లో పంటలు పాడయ్యేవి, బాంకులు అప్పిచ్చే పద్ధతి కాని, పంటలకు ఇన్సూరు చేయడాలు కాని ఉండేవి కావు.
వీటన్నిటి మధ్య మనుష్యులు బతికేస్తూనే ఉండేవారు. పిల్లలను కనేస్తూ ఉండేవారు. పండగలూ, పబ్బాలూ జరిపేస్తూ ఉండేవారు. ఎలా? అంటే దేవుడున్నాడు, అన్నీ చూసుకుంటాడు అనే దిలాసాతో వుండేవారు. 'మీ పిల్లాడు బడికి వెళ్లనంటున్నాడు, నాలుగు ముక్కలు అంటకపోతే ఎలా?' అంటే 'పొలం పనులు చూసుకునో, కూలోనాలో చేసో బతికేస్తాడు లెండి, నారు పోసినవాడు నీరు పోయడా?' అనేవారు. ఇప్పుడు యూనిట్ పరీక్షలో పిల్లాడి ర్యాంకు తగ్గితే చాలు, తండ్రికి బిపి పెరిగిపోతోంది.
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న పిల్లవాడి గొంతు శనివారం ఉదయం అదోలా ధ్వనిస్తే, 'శుక్రవారం వీడికి పింక్ స్లిప్ యిచ్చేసివుంటారు' అనుకుని సుగర్ షూటప్ అయి మంచమెక్కుతోంది తల్లి. ఉద్యోగం ఊడితే ఏమైంది, వెనక్కి వచ్చేసి మరోటి చూసుకోలేని చవటలా పెంచామా వాణ్ని? తలుపు మూసేసిన దేవుడు కిటికీయైనా తెరవడా? అనుకోవడం లేదు. అంతా నా చేతిలోనే ఉంది. నేను యింకో పదిలక్షలు ఎక్కువ డొనేషన్ కట్టి మరో కాలేజీలో సీటు కొనిచ్చి వుంటే యివాళ మా వాడి ఉద్యోగం పోయి వుండేది కాదు అని ఆత్మనిందలో మునిగిపోతున్నారు. మన కర్మ యిలా ఏడిచే రాత ఉంటే ఆ కాలేజీలో చదివినా యిలాగే అయ్యేదేమో అనుకుని ఊరుకోవడం లేదు.
మన ప్రస్తుత భారత సమాజానికి దేవుడి మీద నమ్మకం చెదిరిపోయిందని నేను అనటం లేదు. పశ్చిమ దేశాల్లో దేవుడి మీద నమ్మకం బాగా తగ్గిపోయిన మాట వాస్తవం. చర్చిలకు వెళ్లడం మానేశారు. దాని సైడ్ ఎఫెక్టో కాదో చెప్పలేం కానీ, సైకియాట్రిస్టుల వద్దకు వెళ్లడం పెరిగింది. మనుషులు టెన్షన్లకు, డిప్రెషన్లకు ఎక్కువగా గురవుతున్నారు. మన దగ్గర మాత్రం గతంలో కంటె చాదస్తాలు, మూఢనమ్మకాలు పెరిగాయి. వాటితో బాటు అహంకారమూ పెరిగింది. మనుష్యులను మేనేజ్ చేసినట్లే దేవుణ్నీ మేనేజ్ చేయగలమనే భావన పెరిగింది.
మొక్కులు పెట్టేసి, ముడుపులు కట్టేసి, పేర్ల స్పెల్లింగులు మార్చి, అంకెలు అటూయిటూ చేసి, రాళ్లూరప్పలు తొడిగి, డబ్బిచ్చేసి జపాలూతపాలూ చేయించేసి దేవుణ్ని మొహమాట పెట్టేసి పనులు చేయించుకోవాలని చూడడం విపరీతంగా పెరిగింది. గతంలో మొక్కులు, ముడుపులు లేవా అంటే ఉన్నాయి. అవి కట్టి, చివరకు ఏది జరిగితే మన తలరాత యింతే అని సర్దుకోవడం ఉండేది. ఇప్పుడు అలా వుండటం లేదు. పని జరగకపోయినా, 'ఇంతకింతైతే అంతకెంత?' అని లెక్కవేసి అనుకున్నంత జరగకపోతే దేవుణ్ని మార్చేస్తున్నారు.
వెంకన్న గూడ్స్ డెలివర్ చేయడం లేదా, చలో శబరిమల, ఆయనా లాభం లేదా? ఈ రోజుల్లో సాయిబాబా చురుగ్గా వున్నాట్ట. నార్త్ ఇండియన్స్‌కు వైష్ణోదేవి మీద నమ్మకం ఎక్కువట, నేపాల్‌లో పురాతన ఆలయం ఉందట… ఇలా ఆశ, ఆ పై నిరాశ పెరుగుతున్న కొద్దీ కొత్త దేవుళ్ల కోసం, బాబాల కోసం పరుగులు పెరుగుతున్నాయి. వీళ్లెవరికీ దేవుడు నిజంగా ఏమీ యివ్వటం లేదా? ఈ సందర్భంలో నాకు ముళ్లపూడి రమణగారి కొటేషన్ గుర్తుకు వస్తుంది. 'దేవుడు అమ్మలాటి వాడు. పాలెప్పుడివ్వాలో, పరమాన్నమెపుడు యివ్వాలో తెలిసినవాడు' అని. పాలు మాత్రమే హరాయించుకునే స్థితిలో ఉన్నవాడు పరమాన్నం అడిగినా దేవుడు యివ్వడట. ఈ రకంగా ఆలోచిస్తే దక్కిన పాలు చూసి నిరాశపాలు కాకుండా, ఓహో మనకింకా పరమాన్నం టైము రాలేదన్నమాట అనుకుని తృప్తిపడి ఊరుకుంటాం. భిన్నంగా ఆలోచిస్తే దగా చేశాడని దేవుణ్ని తిట్టుకుంటాం.
దేవుడు అనే మాట కొందరికి రుచించదు, విధి అంటారు, కాలం అంటారు, ప్రకృతి అంటారు. ఏ పేరుతోనైనా అనండి, దానికి ఒక నియమం ఉంది. ఏదో లెక్కప్రకారం, తన సొంత స్క్రీన్‌ప్లే ప్రకారం అది తన పని తను చేసుకుని పోతూంటుంది. సృష్టిలో ఉన్న కోట్లాది జీవరాశులకు ఆహారం అందించే ఏర్పాట్లు మాత్రమే కాదు, విశ్వంలో ఉన్న అనంతానంత తారలను, గ్రహాలను గతులు తప్పకుండా చూడడం కూడా చూసుకు రావాలి. ఇంత పెద్ద మెకానిజం నీకోసం, నువ్వు ఆశ చూపే తాయిలాల కోసం అది తన గతి మార్చుకోదు. 'మీకు 8 వ యింట్లో ఫలానా గ్రహం చేరి మిమ్మల్ని సతాయించేస్తోందండీ' అంటే 'ఈ టన్నెల్ యింకా ఎంతకాలం సాగుతుందో అని భయపడుతున్నాను.
ఇంకో ఏడాదిన్నరలో వెళ్లి పోతుందంటారా? పోన్లెండి, అది ఉన్నంతకాలం కాస్త అణగి వుంటా, కొత్త వెంచర్లు మొదలుపెట్టను' అనం. 'ఆ గ్రహానికి శాంతి చేయించాలంటే లక్షసార్లు జపం చేయించాలా? కోటి సార్లు చేయించాలా? చేయడానికి బ్రాహ్మడు మంత్రానికి ఎన్ని పైసల చొప్పున తీసుకుంటాడు?' అని అడుగుతాం. మనం మంత్రానికి పది పైసలిచ్చి ఆ గ్రహానికి పక్కింట్లోకి తోయించేయగలిగితే, అది ఎనిమిదో యిల్లు అయిన మరొకడు మంత్రానికి యిరవై పైసలిచ్చి మళ్లీ వెనక్కి తోయించేగలుగుతాడు. కానీ మన ఆలోచన అలా సాగదు. పేరు మార్చేద్దాం, కారు నెంబరు మార్చేద్దాం, వాస్తు మార్చేద్దాం, పోనీ యిల్లు మార్చేద్దాం, బిజినెస్‌లో పార్ట్నర్ని మార్చేద్దాం, ఎలాగైనా అనుకున్నది సాధించి తీరాలి అనుకుంటాం.
మనం గుర్తెరగాల్సింది ఏమిటంటే మనం భూమిమీదకు వచ్చేందుకు ముందు దేవుడితో కాంట్రాక్టు ఏమీ పెట్టుకుని రాలేదు. నెలకు లక్ష జీతం యిస్తేనే భూమ్మీద పుడతా, లేకపోతే జాన్తానై అని మనం దేవుడితో బేరమాడలేదు. ఒకవేళ గర్భంలో ఉండగా దేవుడు మనకేదైనా మాట యిచ్చినా అది మనకు గుర్తు లేకుండా చేశాడు. మన దగ్గర ఒప్పందం తాలూకు ఏ ఆధారమూ లేదు. అందువలన మనకు యింత రావాల్సి వుంది, కానీ యింతే యిచ్చాడు అని ఫీలవడానికేమీ లేదు. అసలు యింత రావాలి అనే లెక్క ఎలా వేస్తున్నావు? వాడెవడితోనో పోల్చుకుని చూసుకుంటున్నావు. వాడికి అంత యిచ్చాడు కదా, వాడి కంటె ఉత్తముణ్ని మరి నాకివ్వడానికి ఎందుకు కడుపునొప్పి? అని దేవుడి మీద అలుగుతున్నావు.
దేవుడు వాడి కిచ్చిందే నువ్వు చూస్తున్నావు. ఇవ్వనిదేమిటో చూడటం లేదు. వాణ్నడిగితే చెప్తాడు – నాకింకా ఎంతో రావాల్సి ఉంది, దేవుడు యిచ్చాడు కాడు అని. దేవుడిలో ఉన్న తమాషా గుణమే అది. అంబానీకి కోట్లు యిస్తాడు, కానీ తృప్తి నివ్వడు. ఇంకేం లాభం? అంతకంటె లక్షలు ప్లస్ తృప్తి దక్కిన మనం బెటరు కాదూ. జీవితంలోని అనేక ఫ్యాక్టర్లలో డబ్బు ఒకటి మాత్రమే. అనేక విషయాల్లో మనం యితరుల కంటె మెరుగ్గా వున్నామని గుర్తించం. విజయ్ మాల్యా కోట్లు కొట్టేశాడు. లండన్‌లో హాయిగా భోగిస్తున్నాడు అనుకుంటాం. కానీ ఎంతమంది శాపనార్థాలు పడుతున్నాడు? మనకా కర్మ లేదు కదా!
డబ్బున్నవాళ్ల అనేకమంది జీవితాల్లోకి తొంగి చూస్తే వైవాహిక బంధం సరిగ్గా ఉండదు. పిల్లలు అప్రతిష్ఠ తెచ్చిపెడుతూంటారు, ప్రమాదాల్లో చచ్చిపోతూ ఉంటారు, ఆరోగ్యం అధ్వాన్నంగా ఉంటుంది. దేవుడు అన్నీ ఒక్కరికే ఇవ్వడు. తన దగ్గరున్న స్టాకులోంచి మంచి, చెడు కాస్తకాస్త చొప్పున అందరికీ పంచుతాడు. స్టాకయిపోతే తర్వాత యిద్దాంలే అని వాయిదా వేస్తాడు. సోనియా గాంధీకి చూడండి, విదేశంలో మామూలు కుటుంబంలో పుట్టి ఇండియా వంటి విశాల దేశాన్ని రిమోట్‌తో పాలించే అదృష్టం కలిగించాడు.
కానీ – భర్తను తొందరగా తీసుకుపోయాడు, అనారోగ్యాన్ని, వాద్రా వంటి ఆత్రపడే అల్లుణ్ని, రాహుల్ వంటి పలాయనవాది కొడుకుని యిచ్చాడు. కాంపెన్సేట్ అయిపోలేదా? రాహుల్‌కు అన్ని అవకాశాలూ యిచ్చాడు, కానీ రాజకీయాల్లో ఆసక్తినీ, సమర్థతనూ యివ్వలేదు. విదేశాలకు పారిపోయి, అక్కడ అమ్మాయిని చేసుకుని స్థిరపడదామనుకుంటే ఠాఠ్ వీల్లేదు, అది నీ కెరియర్‌కు దెబ్బ అనే తల్లి నిచ్చాడు. ఆవిడకు ఆయుర్దాయమూ యిచ్చాడు. ఇలా పీతకు పీత కష్టాలు పెట్టాడు దేవుడు. సమగ్రంగా చూసినప్పుడే అవతలి వాళ్లకేం దక్కిందో, మనకేం దక్కిందో తెలుస్తుంది.
మనకు దక్కినది మనం కోరుకున్నదే అయితే సంతోషం. కానీ అలా జరగదు. జీవితవాస్తవాలను కాచివడపోసిన భుజంగరాయ శర్మగారు ''రంగులరాట్నం'' గీతంలో చెప్తారు – 'కోరిక ఒకటి జనించు, తీరక ఎడద దహించు, కోరనిదేదో వచ్చు, శాంతిసుఖాలను యిచ్చు, ఏది శాపమో, ఏది వరమ్మో తెలిసీ తెలియక అలమటించుటే.. యింతేరా యీ జీవితం, తిరిగే రంగులరాట్నం' అని. అనేకమంది జీవితాలు చూశాను. ఎప్పుడు, ఏ వైపు నుంచి, ఎవరి ద్వారా మేలు కలుగుతుందో, కీడు కలుగుతుందో చెప్పలేం. సినిమాలో మూడో రీలులో రైలు కంపార్టుమెంటులో కలిసి, కాస్సేపు మెరిసిన కారెక్టరు క్లయిమాక్సులో డాక్టరుగా ప్రత్యక్షమై హీరోని కాపాడినట్లు, నిజజీవితంలో ఎప్పుడో ఎవరికో మేలు చేస్తే అతను ఓ కీలకమైన సందర్భంలో తారసిల్లి ప్రత్యుపకారం చేస్తాడు.
చిన్నప్పటినుంచి కలిసిమెలసి తిరిగిన స్నేహితుడు నమ్మకద్రోహం చేస్తాడు. ఎంత శ్రమించినా ఒక్కో పని ఎప్పటికీ పూర్తవదు. ఇంకో పని చటుక్కున, అతి చులాగ్గా అయిపోతుంది. ఒక చోట తవ్వుతాం, మట్టి తప్ప ఏమీ తగలదు. మరో చోట తనంతట తానే జల పడుతుంది. దీనికి లాజిక్ ఎంతకీ అర్థం కాదు. అందుకే దైవలీల అన్నారు. అదృష్టం అని ఎందుకన్నారు? కారణం కనబడదు (అ-దృష్టం) కనబడదు కాబట్టి. మనకు రావలసిన ఉద్యోగం యింకోడికి పోయింది అని మనం బాధపడతాం.
వాడికి నీ అంతటి అర్హత లేకపోయినా నీ కంటె వాడి అవసరం పెద్దదని దేవుడు వాడికి యిప్పించాడనుకుంటే బాధ తగ్గుతుంది. అవసరం లేకపోయినా, వాడికిచ్చేస్తున్నాడని ఫీలయినపుడు సర్దిపెట్టుకోవడం ఎలాగో మన హిందువులకు తెలిసినంతగా తక్కినవాళ్లకు తెలియదు. వాడు కితం జన్మలో పుణ్యం చేసుకున్నాడ్రా, మన కర్మ యిలా కాలింది అనేసుకుంటాం. ఇటీవల పశ్చిమదేశాల్లో కూడా యీ కర్మ కాన్సెప్టు వ్యాపిస్తోంది. వాళ్లూ యీ మాట తరచుగా వాడుతున్నారు. అవును మరి, సర్దిచెప్పుకోకపోతే బండి ముందుకు నడవదు.
అంటే మన చేతకానితనానికి దైవలీల అని పేరు పెట్టి చేతులు ముడుచుకుని కూర్చోమంటారా? అని అడగవద్దు. మన పని మనం చిత్తశుద్ధితో శ్రమపడి చేసుకుపోవాల్సిందే. దానిలో తభావతు లేదు. అయితే దీనికి ఫలితం యిలాగే వుంటుంది అని కచ్చితంగా అనుకోవడానికి లేదు. ఎందుకంటే లోకంలోని అనేకానేక ఫ్యాక్టర్లు దీనితో ముడిపడి వుంటాయి అని హెచ్చరిస్తున్నానంతే. మీరు బ్రహ్మాండంగా చదువుకుని పరీక్షకు ప్రిపేరయ్యారు. కానీ ఎక్కడో పేపరు లీకయిందని పరీక్ష కాన్సిల్ చేశారు. దీనికేమంటారు? ఇలాటి సందర్భాల్లో ఆత్రేయ పాట 'అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచివనీ అనుకోవడమే మనిషి పని' అని పాడుకుని ఊరుకోవడం మంచిది.
ఇలా కాన్సిల్ కావడం మంచిదైంది. చదువుకోవడానికి యింకా ఎక్కువ టైము దొరికింది అనుకుంటే లాభపడతాం. ఏది జరిగినా దానిలో మంచి వెతుక్కోవడం చాలా మంచి లక్షణం. జిమ్మీ కార్టర్ ఒక ఇద్దిష్ సామెతను తన కుర్చీ పైన రాసి పెట్టుకునే వాడట. 'దేవుడు నాకు బరువు నిచ్చాడు, అది మోయడానికి భుజాల్నీ యిచ్చాడు' అని దాని అర్థం. దారికి అడ్డంగా నదిని సృష్టించినవాడు దాన్ని దాటడానికై నావ చేసే తెలివితేటలు కూడా యిచ్చాడు కదా. రోగం, దానితో పాటు దర్ద్ యిచ్చిన దేవుడు దవాను కనిపెట్టే విద్య కూడా యిచ్చాడు కదా.
ఏతావాతా చెప్పేదేమిటంటే మనం చింతలకు బెదిరిపోవడం అనవసరం. దైవం కనిపెట్టి ఉన్నాడు, అంతా మంచే జరుగుతుంది అని ఆశ పెటుకుని ఎప్పటిలాగా మన చావు మనం ఛస్తూ, మన పాట్లు మనం పడుతూ పోవడం మంచిది. మన దురదృష్టాన్నో, మరోదాన్నో తిట్టుకుంటూ చీకట్లో కూర్చోవడం బుద్ధితక్కువ. ఇవ్వాల్సిన ఘడియ వచ్చినపుడు దేవుడు కాదు, వాళ్ల జనకుడు కూడా పై కప్పు పగలకొట్టి (ఛత్ ఫాడ్కే) మన కొంపలో పడేసి పోతాడు. ఆ ఘడియ త్వరగా తెప్పించు అని దేవుణ్ని మనం బలవంతపెట్ట నవసరం లేదు, మైకులు పెట్టి ప్రార్థనలు చేసి యిరుగుపొరుగులను విసిగించనక్కరలేదు, వచ్చీరాని భాషలో, అపస్వరాలతో స్తోత్రాలు చదవనక్కరలేదు. నీకు నాలుగు చేతులున్నాయిస్మీ అని విష్ణుమూర్తికి చెప్పాలా? ఆయనకు తెలీదూ? మరి ఆయన్ని మెప్పించడం ఎలా? ఆయన మనకై చేస్తున్నదానికి ప్రత్యుపకారం, కనీసం ధన్యవాదం తెలపడం ఎలా? ఎలా అంటే నాకు తోచేది – ఆయన సంతానాన్ని అభిమానించడం, ఆదుకోవడం.
మా పిల్లలికి మీరు సాయపడితే నేను ఆనందించనూ? మీకు ఏమైనా కావలిస్తే చేసి పెట్టనూ? దేవుడి సంతానాన్ని ఆదరించడం అంటే లవకుశుల కోసమో, ప్రద్యుమ్నుడి కోసమో వెతకమని నా ఉద్దేశం కాదు. సృష్టిలో కనబడుతున్న సమస్త జీవజాలమూ దేవుడు సృష్టించినదే. ప్రతి మనిషిలో, ప్రతి పులుగులో ఆయన హస్తకౌశలం, వేలిముద్ర, వాత్సల్యం తొణికిస లాడుతుంది. సాటి మనుషులనే కాదు, పశుపక్ష్యాదులను గౌరవించు, ప్రేమించు, వారి బాగు కోరు. అప్పుడు దేవుడు తన సంతానం అంటే మనుషుల ద్వారానే మనకు సాయపడతాడు. మీరు మురిసిపోయి 'దైవం మానుషరూపేణా' అనుకుంటే ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు. దేవుడు గీసుకున్న అద్భుతమైన చిత్రపటం ప్రకృతి. కొండలు, లోయలు, నదులు, తరువులు వీటిని నాశనం చేస్తే ఆయనకు తిక్కరేగుతుంది. బొమ్మ విరక్కొట్టేస్తే పిల్లాడు ఊరుకుంటాడా? మీద పడి రక్కుతాడు. దేవుడు తుపానులు పంపుతాడు, భూకంపాలు సృష్టిస్తాడు.
ఇవన్నీ దేవుడు నాకు కలలోకి వచ్చి చెప్పలేదు. అనేక జీవితాలను పరిశీలించిన మీదట గ్రహించిన విషయమిది. మీ పరిశీలనలు వేరేలా ఉంటే ఉండవచ్చు.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]