రాజధాని ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అనే నినాదం టిడిపి లేవనెత్తింది. అన్నీ రాజధాని అమరావతిలో పెట్టడాన్ని ఆ విధంగా సమర్థించుకుంది. ఒక రాజధానిని మూడు ముక్కలు చేసి, అభివృద్ధిని మూడు ప్రాంతాలకూ పంచుతున్నాం అనే నినాదంతో వైసిపి ముందుకు వెళుతోంది. న్యాయరాజధాని పేరుతో హైకోర్టు వచ్చినంత మాత్రానే తమకు అభివృద్ధి ఫలం అందిపోతుందని రాయలసీమ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని వైజాగ్‌కు వచ్చేస్తోంది కాబట్టి ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ఎడాపెడా అభివృద్ధి అయిపోతాయని అక్కడివారు ఆనందించేస్తున్నారు. పాలకుల ప్రచార ఉధృతిలో పడి అలా ఆలోచిస్తున్నారేమో కానీ కాస్త నిదానంగా ఆలోచిస్తే రెండిటికి లింకు లేదని వాళ్లకే బోధపడుతుంది. దేశానికి దిల్లీ రాజధాని. కానీ ఆర్థిక రాజధాని ముంబయి. ముంబయి అంత బాగా దిల్లీ అభివృద్ధి చెందిందా? కృష్ణా జిల్లాకు ముఖ్యపట్టణం మచిలీపట్నం. విజయవాడలో జరిగినంత అభివృద్ధి అక్కడ జరిగిందా?
ఏదైనా ప్రదేశం అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా నాలుగు రకాలుగా జరుగుతుంది. పరిశ్రమల పరంగా, వాణిజ్యపరంగా, సంస్థల పరంగా, పర్యాటన పరంగా. పెద్ద పరిశ్రమ వస్తే వాటికి అనుబంధ యూనిట్లు అనేకం వెలుస్తాయి. ప్రధానమైన దానిలో పనిచేసే సంఘటిత కార్మికులు, అనుబంధమైన వాటిలో పనిచేసే అసంఘటిత కార్మికులు అందరూ కలిసి పెద్ద వర్క్‌ఫోర్స్ తయారవుతుంది. వారికి సేవలందించే వృత్తి పనివారు, దుకాణదారులు అనేక మందికి ఉపాధి దొరుకుతుంది. అయితే పరిశ్రమలు ఏర్పడడానికి తగిన వనరులు ఉండాలి. మత్స్యపరిశ్రమ రావాలంటే సముద్రం ఉండాలి. మైకా పరిశ్రమ రావాలంటే గనులుండాలి. వనరులు ఉండడమే కాదు, వాటితో పని చేయడానికి నైపుణ్యం ఉన్న కార్మికులుండాలి. వాళ్లు రీజనబుల్ కూలీకి దొరకాలి. విద్యుత్, నీరు వగైరా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి. స్థానిక రాజకీయనాయకులు, గూండాలు చొరబడి మామూళ్లు వసూలు చేయకూడదు. శాంతిభద్రతలు బాగుండాలి.
వాణిజ్యపరంగా ఎదగాలంటే రాష్ట్రంలోని, అవసరం బట్టి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యం బాగుండాలి. ఆ ఊళ్లోని వ్యాపారస్తులకు పరపతి ఉండాలి. సరుకు నాణ్యమైనది దొరకాలి. వేరే ప్రాంతాల నుంచి యిక్కడకు వచ్చి అమ్ముకునేందుకు, కొనేందుకు భాషాపరంగా కూడా వీలుండాలి. గోడౌన్ల లభ్యత, ప్రభుత్వాధికారుల సహకారం, సరుకులు ఎక్కించడానికి, దింపడానికి చవకైన కార్మికులు.. యిలాటివన్నీ ఉండాలి. అంతేకాదు సామాజికపరమైన, రాజకీయపరమైన ఆందోళనలు తరచుగా జరగకూడదు. తూర్పుగోదావరి జిల్లా ముఖ్యపట్టణం కాకినాడ. కానీ వాణిజ్యపరంగా రాజమండ్రికి ప్రాముఖ్యత ఉంది. దక్షిణాదిన వ్యాపారానికి చెన్నయ్ గుండెకాయ లాటిది. అక్కడ ఉత్పత్తి జరగకపోయినా లావాదేవీలు విపరీతంగా జరుగుతాయి.
సంస్థల పరంగా చెప్పాలంటే పేరున్న వైద్యాలయాలు, విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, రిసెర్చి సంస్థలు, తర్ఫీదిచ్చే సంస్థలు,.. యిలాటివన్నీ వస్తాయి. విద్యార్థులు, అధ్యాపకులు ఉండేటందుకు వసతి, భోజన సౌకర్యాలు, దేశంలోని యితర ప్రాంతాల నుంచి వచ్చేందుకు వీలైన ప్రయాణసౌకర్యాలు యివన్నీ ఉండాలి. జాతీయ సంస్థలు ఉన్నపుడు అక్కడకు వివిధ రాష్ట్రాల వారు తప్పక వస్తారు. అందువలన కాస్మోపోలిటన్ వాతావరణం ఉండడం అత్యావశ్యకం. రక్షణకు సంబంధించిన సంస్థలు కొన్నిటికి స్ట్రాటజిక్ ఎడ్వాంటేజి ఉండాలి. డిఫెన్స్ లాబ్స్ హైదరాబాదులో పెట్టడానికి, షార్ శ్రీహరికోటలో పెట్టడానికి భౌగోళిక కారణాలుంటాయి. కేంద్రంతో సఖ్యంగా ఉంటే కొన్ని జాతీయ సంస్థలు వస్తాయి. లేకపోతే పక్క రాష్ట్రాలకు పోతాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినపుడు సహజంగా చుట్టుపట్ల ప్రాంతాలన్నిటిలో యాక్టివిటీ పెరుగుతుంది.
ఇక టూరిజం – ఇది నాలుగు రకాలుగా ఉంటుంది. ఒకటి పుణ్యక్షేత్రాలకు టూరిస్టులు వస్తారు, రెండోది చారిత్రాత్మక ప్రదేశాలు చూడడానికి వస్తారు, మూడోది ప్రకృతి అందాలున్న చోటికి చూడడానికి వస్తారు, నాలుగోది విలాసంగా గడిపే అవకాశం ఉన్నవాటికి వస్తారు. వీటన్నిటికీ పబ్లిసిటీ ముఖ్యం. దేవుళ్ల గురించి యితర రాష్ట్రాలలో ప్రచారం చేయిస్తే కొత్త భక్తులు వస్తారు. వారికి ప్రయాణ, భోజన, వసతి సౌకర్యాలు సమకూర్చగలిగితే, ఆ యా గుళ్లను శుభ్రంగా, పద్ధతి ప్రకారం ఉంచగలిగితే భక్తులు పెరుగుతారు. ఇక చారిత్రాత్మక ప్రాంతాలను గుర్తించి, పరిరక్షించి, వాటి గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తే తప్ప ఎవరూ రారు. ప్రకృతి అందాలున్నా, పరిసరాలను శుభ్రంగా ఉంచకపోతే, అక్కడ హోటళ్లు బాగా ఉండకపోతే రారు. విలాసాలకై వచ్చే టూరిస్టులు మన దగ్గర తక్కువే. కాస్త డబ్బుంటే ఏ సింగపూరో, థాయ్లాండో పోతారు.
ఇక రాజధానిలో యివేమీ ఉండనక్కరలేదు. సెక్రటేరియట్, మంత్రిగణం, వాళ్ల క్వార్టర్లు ఉంటే చాలు. సెక్రటేరియట్లో పైరవీ చేసే వాళ్లు మకాం వేయడానికి హోటళ్లు, సాయంత్రం స్టాఫ్‌ను తాగించడానికి బార్లు ఉంటే చాలు. జ్యుడీషియల్ రాజధాని పేరుతో హైకోర్టు ఉన్న చోటా అంతే. కక్షిదారులు దిగేందుకు హోటళ్లు, న్యాయవాదులు ఉండేటందుకు యిళ్లు ఉంటే చాలు. లెజిస్లేటివ్ రాజధానిలో అయితే ఎమ్మెల్యేలు వచ్చినపుడు దిగేందుకు క్వార్టర్లు, వాళ్లని కలిసేందుకు వచ్చే జనం దిగేందుకు హోటళ్లు, ప్రభుత్వ స్టాఫ్ ఉండేందుకు వసతి సౌకర్యాలు ఉంటే చాలు. వీటివలన ప్రజల రాకపోకలు విపరీతంగా ఏమీ పెరిగిపోవు.
హైదరాబాదు సంగతే తీసుకుంటే – దానిలో అన్నీ కొంత కొంత ఉన్నాయి. చారిత్రాత్మక నగరం కాబట్టి టూరిజం పరంగా, కేంద్ర సంస్థలున్నాయి కాబట్టి సంస్థల పరంగా, పరిశ్రమలున్నాయి కాబట్టి పారిశ్రామికంగా, అందరికీ అందుబాటులో వుంది కాబట్టి వాణిజ్యపరంగా ఎదిగింది. రాజధాని కావడం చేత మాత్రమే కాదు. ఎందుకంటే హైదరాబాదు నైజాం రాష్ట్రానికి ఎప్పణ్నుంచో రాజధాని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1956 నుంచి రాజధాని. అయినా విశేషంగా అభివృద్ధి చెందింది, గత 30, 35 ఏళ్లగానే! అప్పటిదాకా ఆంధ్రప్రాంత ప్రజలు మద్రాసు, బెంగుళూరులలో పెట్టుబడులు పెట్టేవారు, వ్యాపారాలకు అక్కడికే వెళ్లేవారు, టూరిజానికి అటే వెళ్లేవారు. హైదరాబాదు వస్తే భాషాసమస్య ఉంటుందని భయం. చాలా ఏళ్లపాటు శాంతిభద్రతలు సమస్యగా ఉండేవి.
ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడి వాతావరణం ముఖ్యం. భౌతికపరమైన వాతావరణం ఆహ్లాదంగా ఉంటే అందరికీ బాగుంటుంది. దిల్లీలో అలాటి వాతావరణం ఉన్నా, పర్యావరణ సమస్యల వలన బాబోయ్ అనిపించేస్తోంది. వీటన్నిటితో బాటు రాజకీయ, సామాజిక వాతావరణం కూడా బాగుండాలి. అక్కడ ఎలాటి రకమైన వివక్షత ఉండకూడదు. బయటివారిని ఆదరించే గుణం స్థానికులకు ఉండాలి. అందరూ కలిసిమెలసి ఉండగల, భిన్న సంస్కృతులు వర్ధిల్లగల కాస్మోపాలిటన్ కల్చర్ ఉండాలి. తెలంగాణలో సుహృద్భావమైన వాతావరణం ఉండడం చేతనే, దేశంలోని అన్ని ప్రాంతాల వారూ దశాబ్దాలుగా యిక్కడకి వచ్చి స్థిరపడగలిగారు. 1969 ఉద్యమం ఒక కుదుపు కుదిపింది. అది సర్దుకోవడానికి టైము పట్టింది. తర్వాత కెసియార్ నడిపిన ఉద్యమం కొన్నేళ్లపాటు అభివృద్ధిని అడ్డుకుంది. రాష్ట్రవిభజన తర్వాత అది సర్దుకుంది.
బాబు అమరావతిని అద్భుతనగరం చేస్తానన్నపుడు అది విపరీతంగా అభివృద్ధి అయిపోతుందని చెప్పుకొచ్చారు. ఎలా? అక్కడ పరిశ్రమలు రావాలంటే ప్రభుత్వం భూమిని కేటాయిస్తే సరిపోదు. పైన చెప్పిన వనరులు, నిపుణులు ఉండాలి. వ్యాపారాలు రావాలంటే పక్కనే ఉన్న విజయవాడను వదిలి ఎందుకు వస్తారు? సంస్థలు పెట్టవచ్చు. విద్య, వైద్యాలయాలు యిప్పటికే అక్కడ చాలా ఉండి, శాచ్యురేషన్కి వచ్చేశాయి. కొన్నిటికి భౌగోళిక పరిమితులున్నాయి. ముఖ్యంగా కాస్మోపోలిటన్ కల్చర్ అక్కడ ప్రస్తుతానికి లేదు. మీరు వస్తే దానంతట అదే వస్తుంది అని నమ్మించాలి. ఇక టూరిజానికి వస్తే అక్కడ జరిగిన చరిత్ర పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు, పైగా దానికి ఆనవాళ్లు మిగలలేదు, ఉన్న గుడులూ మరీ పెద్దవి కావు. ప్రకృతి అందాల కోసం రావాలంటే, సముద్రమూ లేదు, పర్వతాలూ లేవు, కృష్ణానదిని చూడాలంటే పర్యావరణాన్ని తగలేసిన తర్వాత మిగిలిందేముంది?
అందువలన బాబు విలాసవంతమైన ప్రాంతంగా మలచి టూరిజం వృద్ధి చేస్తానన్నారు. సింగపూరు తరహాలో పెద్దపెద్ద భవంతులు, క్లబ్బులు, హోటళ్లు కడతామని అన్నారు. నా చిన్నపుడు మద్రాసులో ఎల్ఐసి బిల్డింగు చూసి అబ్బో అనుకున్నాను. తర్వాత బొంబాయిలో ఎక్స్‌ప్రెస్ బిల్డింగు ఎక్కి మురిసిపోయాను. మా పిల్లలు వాటికేసి చూడనైనా చూడరు. ఎక్కడపడితే అక్కడ ఎత్తయిన భవంతులు వచ్చేశాయి. టూరిస్టు స్పాట్స్‌లో కూడా చరిత్ర బాగా ఉన్న యూరోప్, ప్రకృతి బాగా ఉన్న న్యూ జిలాండ్ వంటి వాటికి వెళ్లడానికి యిష్టపడతారు తప్ప బిల్డింగుల కోసం. హోటళ్ల కోసం వెళ్లరు. అలా వెళ్లాలంటే అక్కడ షాపింగుమాల్స్లో చవకగా వస్తువులు దొరికే అనుకూల పరిస్థితి ఉండాలి, దగ్గర్లో పరిశుభ్రంగా మేన్‌టేన్ చేసే బీచ్‌లు ఉండాలి. పాతకాలంలోనే మహరాజులు బ్రహ్మాండమైన ప్యాలస్‌లు కట్టారంటే చూడబోతాం. అంతకంటె పెద్ద భవంతులు యిప్పుడు కట్టారంటే వింతేముంది అనుకుని చూడడానికి వెళ్లం. ఇవేమీ గమనించకుండా కొన్ని దశాబ్దాలలో అమరావతిలో కోటి జనాభా ఉంటారు, లక్షలమంది టూరిస్టులుగా వస్తారు అని గ్రాఫిక్స్‌లో చూపిస్తే ఏం లాభం?
బాబుకి మళ్లీ అధికారం దక్కివున్నా ఆయన అమరావతిలో ఏమీ చేయగలిగేవాడు కాదు, ఆయన నుంచి భూములు చవగ్గా కేటాయింపచేసుకున్న సంస్థలు, వ్యక్తులు అక్కడ ఏమీ కట్టేవారు కారు. ఇది కళ్ల ఎదురుగా కనబడుతున్న వాస్తవం. కానీ హైకోర్టు తరలి వెళ్లిపోతున్నంత మాత్రాన, సెక్రటేరియట్ కదలి వెళ్లిపోతున్నంత మాత్రాన యావత్తు 'అభివృద్ధి' ఆగిపోతోందన్న ప్రచారం దుర్మార్గం. బాబు మాటలు నమ్మి అక్కడ పెట్టుబడులు పెట్టినవారు బాబుని బహిరంగంగా తిట్టలేక, యిలాటి ప్రచారంతో స్థానికులను రెచ్చగొడుతున్నారంతే. మేం భూమి కొన్నాం కాబట్టి లక్షల కోట్లు ఖర్చు పెట్టి యిక్కడ హోటళ్లు, క్లబ్బులు, ఆడిటోరియాలు, ఫార్ములా1లు పెట్టు అని ఎవరూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయజాలరు.
కానీ అమరావతి నుంచి సెక్రటేరియట్ మార్చడానికి తగిన కారణం జగన్ చెప్పటం లేదు. 'వైజాగ్‌కు ఐటీ సెంటర్‌గా తయారయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి ఎలాగూ అభివృద్ధి చెందుతుంది. కావాలంటే వైజాగ్‌నే లెజిస్లేటివ్ కాపిటల్‌గా చేసి, అమరావతిని ఎగ్జిక్యూటివ్ రాజధాని చేయవచ్చు కదా!' అనే వాదన చాలా బలమైనది. దానికి ప్రభుత్వం యివ్వగలిగే సమాధానాలు – 'అక్కడ ప్రభుత్వభూముల్లో పెడతాం కాబట్టి భూమి ఉచితం, అక్కడి నేల గట్టిగా ఉంటుంది కాబట్టి, నిర్మాణవ్యయం తక్కువ, అక్కడైతే పర్యావరణ సమస్యలు అడ్డురావు కాబట్టి ప్రపంచ బ్యాంకు నుంచి ఋణాలు తెచ్చుకోవడం సులభం…' వంటివి!
నిజానికి దొనకొండ అన్ని విధాలా అనువైనది, అన్ని ప్రాంతాల వారికీ అందుబాటులో ఉన్నది అని అనేకమంది నిపుణులు రాశారు. కానీ దొనకొండకు మారిస్తే విమర్శల పాలవుతానని జగన్ భయపడ్డాడేమో తెలియదు. దొనకొండకు నీటి సౌకర్యం ఏర్పాటు చేయడానికి టైము పడుతుంది కాబట్టి, వైజాగ్‌ను కాపిటల్ చేసి, దొనకొండ ప్రభుత్వ భూముల్లో అక్కడకు రాదగిన పరిశ్రమలకు చౌకగా భూమి కేటాయించి, యిన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే అది అభివృద్ధి నగరంగా ఎదగవచ్చు. దానికి రాష్ట్రం అన్ని మూలల నుంచి జనం రావచ్చు. జనాలకు సెక్రటేరియట్‌తో పనిబడదు కానీ, అభివృద్ధి చెందిన నగరంతో పని పడుతుంది.
ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందన్న సాకు చూపి జగన్ అమరావతి నుంచి రాజధానిని మార్చేస్తున్నారు అని కొందరు వాదిస్తున్నారు. దానికి రాజధాని మార్చనక్కరలేదు, అద్భుతనగరం కట్టడం మానేస్తే చాలు. ఆ స్థలాలకు వాళ్లూహించిన మార్కెట్ వేల్యూ రాదు. అసలు యిన్సైడ్ ట్రేడింగ్ నేరం కింద వాళ్లకు శిక్ష పడుతుందో లేదో చెప్పలేం. కార్పోరేట్ రంగంలో అయితే ఆ నేరానికి కొన్ని సెక్షన్లు ఉన్నాయి కానీ, యీ రంగంలో వాటికి సంబంధించిన సెక్షన్లు ఉన్నాయా? అందుచేత ఆ మాట ఉపయోగించినా, ఉపయోగించకపోయినా ముందస్తు సమాచారంతో అక్కడ భూములు కొన్నారన్నది వాస్తవమని తేలిపోయింది. రాష్ట్రవిభజన తర్వాత ఆంధ్రకు సిఎం కావడానికి బాబుకి ఎక్కువ ఛాన్సులున్నాయని, ఆయన సిఎం అయితే విజయవాడ-గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే రాజధాని పెడతాడని ఊహించడం సహజం.
అందువలన విజయవాడ, గుంటూరు నగరాలలో, లేదా పరిసర పట్టణాలలో భూములు కొనుక్కుని పెట్టుకున్నారంటే మనం ఆశ్చర్యపడనక్కరలేదు. నూజివీడులో ప్రభుత్వ భూములున్నాయి కాబట్టి ఆ పక్క ఊళ్లలో కొన్నా అర్థం చేసుకోవచ్చు. కానీ ఎక్కడో ఉద్దండరాయపాలెం వంటి వూళ్లల్లో కొన్నారంటే దాని అర్థం – కచ్చితంగా వాళ్లకు ముందస్తు సమాచారం అందిందనే! అది కూడా దూరాన ఉన్న అనంతపురం వాళ్లు, హైదరాబాదు వాళ్లు, అమెరికా పౌరులు కొన్నారంటే ఏమనుకోవాలి? వైసిపి వాళ్లు యీ మాటంటే 'రుజువులు చూపించండి' అంటూ టిడిపి వాళ్లు ఛాలెంజ్ చేశారు. మొన్న అసెంబ్లీలో 4 వేల ఎకరాల గురించి జాబితా – సర్వే నెంబర్లతో సహా – చదివితే 'అసెంబ్లీలో చదువుతారా?' అంటూ కోప్పడుతున్నారు, అదేదో ఘోరకార్యం అయినట్లు! ఇప్పుడు 'చేతనైతే కేసులు పెట్టండి' అని ఛాలెంజ్ చేస్తున్నారు. ఆ ముచ్చట తీరుతుందో లేదో, తగిన సెక్షన్లు వున్నాయో లేదో నాకు తెలియదు కానీ టిడిపి వారు గోల్మాల్ చేశారనే అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఆ కారణం చూపి కావాలంటే టిడిపి వారు పరువునష్టం దావా వేయవచ్చు.
చివరగా – రాజధాని తరలిపోవడం వలన కృష్ణా, గుంటూరు ప్రజలకు నష్టం వాటిల్లుతుందా? రాజధాని ప్రకటన తర్వాత, బాబు భ్రమరావతి గ్రాఫిక్స్ వలన ఏదో అద్భుతం జరగబోతోంది, దాన్ని ఎన్‌క్యాష్ చేసుకోవాలి అనుకున్న వారి వలన అక్కడ స్థలాలు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇళ్ల అద్దెలు పెరిగిపోయాయి, షాపుల అద్దెలు బంజారా హిల్స్ రేట్లతో పోటీ పడ్డాయి, క్షౌరం చేసేవాడు కూడా రేట్లు పెంచేశాడు. జీవనవ్యయం పెరిగి సామాన్యుడు యిబ్బంది పడ్డాడు. ఎందుకంటే వ్యయం పెరిగింది కానీ ఆదాయం పెరగలేదు పాపం. సింగపూరు వాళ్లు వచ్చి రేట్లు పెంచేదాకా చుట్టుపట్ల నిర్మాణాలను అనుమతించకూడదన్న బాబు విధానం వలన నిర్మాణకార్యక్రమాలు జరగలేదు. హైదరాబాదు నుంచి పరిశ్రమలు తరలి రాలేదు. కాసింతమంది ఉద్యోగులు తప్ప యితర జనం తరలి రాలేదు. అందువలన ఎకనమిక్ యాక్టివిటీ పుంజుకోలేదు. బాబు కట్టలేడన్న సంగతి రుజువు కాగానే గత 2,3 సంవత్సరాలుగా భూమి ధర తగ్గుతూ వచ్చింది. ఇప్పుడీ ప్రకటనతో భూమి రేట్లు భూమికి దిగి వచ్చి సామాన్యుడికి యింటి స్థలం కొనుక్కునే వెసులుబాటు వస్తుంది. అంతవరకు మేలు!
ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2019)
[email protected]