ఎమ్బీయస్: కేసబ్లాంకా సినిమా నేపథ్యం

రెండవ ప్రపంచ యుద్ధం గురించి సీరీస్ రాయాలని నాకు ఎప్పణ్నుంచో కోరిక. ఎలా మొదలుపెట్టాలో తెలియక ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చాను. యూట్యూబ్‌లో తెలుగులో చాలా చక్కగా వివరించినవారు కొందరున్నారు. కానీ అవన్నీ పోటీపరీక్షల…

రెండవ ప్రపంచ యుద్ధం గురించి సీరీస్ రాయాలని నాకు ఎప్పణ్నుంచో కోరిక. ఎలా మొదలుపెట్టాలో తెలియక ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చాను. యూట్యూబ్‌లో తెలుగులో చాలా చక్కగా వివరించినవారు కొందరున్నారు. కానీ అవన్నీ పోటీపరీక్షల విద్యార్థుల నుద్దేశించి చెప్పినట్లుగా తోస్తోంది. పాఠాలుగా కాకుండా కథలుగా చెపితే మన పాఠకులకు నచ్చుతుందని నా ఊహ. ఎందుకంటే మనకు తెలియని దేశాల పేర్లు, నాయకుల పేర్లు, తేదీలు, తారీఖులు ఒక్కసారిగా వచ్చి పడిపోతూ వుంటే గాబరా పడిపోతాం.

పైగా యుద్ధం అంటే ఎవరు గెలిచారు, ఎంతమంది చనిపోయారు, ఏయే ప్రాంతాలు ఆక్రమించారు అనేదాని కంటె ఆ సమయంలో సామాన్యుల జీవితంలో ఒడిదుడుకులు, సైనికుల ధైర్యప్రతాపాలు, పౌరుల భావోద్వేగాలు ఎలా వున్నాయి అనేది చాలా ఆసక్తికరంగా వుంటుంది. మరుక్షణం వుంటామో లేదో తెలియని పరిస్థితుల్లో శాంతిసమయంలో వుండే సామాజికమైన కట్టుబాట్లు, నైతిక సూత్రాలు అన్వయించవు. యుద్ధాన్ని నేపథ్యంలో వుంచి యీ సాహస గాథలను, హ్యూమన్ ఎమోషన్స్‌ను, మెలోడ్రామాను హైలైట్ చేస్తే పాఠకుల మనసులో నాటుకుని, వారంతట వారే మరిన్ని వివరాలు తెలుసుకుంటారని అనిపించింది.

మన తెలుగువాళ్లకు తెలిసిన ఏకైకా కళారూపమే కాదు, జ్ఞానవాహిక – సినిమా! వాల్మీకి రామాయణంలో లక్ష్మణరేఖ గీయడమనేది లేదు అంటే మీకు సరిగ్గా తెలిసి వుండదు, ఫలానా సినిమాలో చూపించారు కదా అని వాదనకు దిగుతారు. అందువలన యుద్ధనేపథ్యంలో తీసిన కొన్ని సినిమాల ద్వారానే రెండవ ప్రపంచయుద్ధాన్ని కొద్దికొద్దిగా పరిచయం చేద్దామని అనుకుంటున్నాను. ఈ ప్రయోగం నచ్చకపోతే చెప్పేయండి, మానేద్దాం. మొదటగా నేను ఎంచుకున్నది – క్లాసిక్‌గా పేరుబడిన ‘‘కేసబ్లాంకా’’ అనే 1942 సినిమా. ఇది యిప్పటికీ వర్తిస్తుంది అనిపించడానికి కారణం, శరణార్థుల సమస్య. యుద్ధం జరిగే ప్రాంతాల నుంచి ప్రశాంతప్రాంతాలకు పారిపోయేవారు యూరోప్‌లో రాజకీయ సమస్యగా మారడం యిప్పటికీ చూస్తున్నాం. 1960, 70లలో మొరాకో, అల్జీరియా, ట్యునీసియా వంటి ఆఫ్రికన్ దేశాల నుంచి శరణార్థులు యూరోప్‌కు రావడం మనకు తెలుసు.

కానీ దానికి వ్యతిరేక దిశలో యూరోప్ నుంచి ఆఫ్రికన్ దేశాలకు శరణార్థులు వెళ్లిన దశ కూడా వుంది. రెండవ ప్రపంచయుద్ధ కాలంలో యూరోపియన్లు నాజీల బారి నుంచి తప్పించుకుని 1942 డిసెంబరు వరకు తటస్థంగా వున్న అమెరికాకు పారిపోవడానికి ఆఫ్రికా మార్గమే ఎంచుకున్నారు. ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో దేశంలోని కేసబ్లాంకా అనే వూరి నుంచి పోర్చుగల్‌కు (అదీ తటస్థదేశమే), అక్కణ్నుంచి అమెరికాకు వెళ్లడానికి ప్రయత్నించేవారు. 1941 డిసెంబరులో అలా వెళ్లడానికి చూసిన దంపతులకు, ఆ వూరిలో వున్న ఒక క్లబ్ యజమాని మధ్య జరిగిన త్రికోణ ప్రేమకథ – కేసబ్లాంకా సినిమా! అప్పటిదాకా జరిగిన యుద్ధచరిత్ర చెప్తున్నాను. ఈ సొదేమీ చదవకుండా సినిమాను చూసేసి మంచి మెలోడ్రామా అని మెచ్చుకోవచ్చు. అసలు వాళ్లు ఎందుకు రావలసి వచ్చింది, ఆ వూరికే ఎందుకు వచ్చారు, అక్కడ వాళ్లకున్న అడ్డంకులు ఏమిటి?… అవి తెలుసుకుంటే సినిమాలోని గంభీరవాతావరణం, పరిస్థితుల జటిలత బాగా బోధపడుతుంది. యూట్యూబ్‌లో దొరికే వెర్షన్‌లో ఇంగ్లీషు సబ్‌టైటిల్స్ లేవు కాబట్టి, కథ చెప్పినప్పుడు కాస్త విపులంగా చెప్తాను.

1933లో హిట్లర్ జర్మన్‌కు ఛాన్సెలర్ అయ్యాడు. మొదటి ప్రపంచయుద్ధం (1914-18)లో జర్మనీ పరాజిత అయింది. దానితో పాటు దానికి అండగా నిలిచిన ఆస్ట్రియా-హంగరీ, బల్గేరియా, టర్కీ యిత్యాది దేశాలు ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికా, రష్యా, ఇటలీ, రొమేనియా, జపాన్‌ల కూటమి చేతిలో ఓడిపోయాయి. యుద్ధానంతరం వర్సేల్స్‌లో జరిగిన ఒప్పందంలో ఈ యుద్ధానికి నీ అత్యాశే కారణం (మీ లాగే దోచుకోవడానికి మాకూ వలసదేశాలు కావాలంటూ జర్మన్ చక్రవర్తి రెండో విలియం పేచీ పెట్టి యుద్ధానికి దిగాడు) అంటూ విజేతలైన అగ్రరాజ్యాలు దానిపై విపరీతమైన ఆంక్షలు పెట్టి జర్మన్లను అవమానపరిచారు. ఆ అవమానభారంతో కృంగుతున్న జర్మన్లను ఏకం చేసి హిట్లర్ ప్రతీకారం తీర్చుకుందామంటూ సంధి షరతులను ఉల్లంఘించి, 1935 నుంచి సైన్యాన్ని పెంచుకున్నాడు.

బోల్షివిక్ విప్లవం (1917-23) తర్వాత రష్యా కమ్యూనిస్టు దేశం కావడంతో ఆ తరహా విప్లవాలు మన దేశాలలో కూడా వచ్చి మన రాజరికానికి ముప్పు వస్తుందేమోనన్న భయం సామ్రాజ్యదేశాలన్నిటికీ కలిగింది. దాన్ని ఆసరా చేసుకుని రష్యాతో సరిహద్దు తగాదాలున్న జపాన్‌తో, యిటుపక్క మొదటి ప్రపంచంలో కొద్దికాలం తటస్థంగా వుండి, ఆ తర్వాత మిత్రపక్షాలతో చేతులు కలిపి, తమతో పోరాటం చేసిన ఇటలీతో సంధి కుదుర్చుకున్నాడు హిట్లర్. ఆ ఏర్పాట్ల తర్వాత ‘మనది ఆర్యన్ జాతి. ప్రపంచాన్ని శాసించే హక్కు మనకే వుంది. విస్తరించాలంటే కాస్త జాగా కావాలి’ అంటూ 1938లో ఆస్ట్రియాను ఆక్రమించాడు. నిజానికి అక్కడ ప్రతిఘటన చాలా తక్కువగా వుంది. ఎందుకంటే నాజీయిజానికి జర్మనీలో కంటె ఆస్ట్రియాలోనే ఎక్కువ ఆదరణ వుంది. యూదులను, యితరులను హింసించిన కాన్సన్ట్రేషన్ కాంపులు జర్మనీలో కంటె ఆస్ట్రియాలోనే ఎక్కువున్నాయి. 2018లో ఈస్ట్ యూరోప్ యాత్రకు వెళ్లినపుడు ఆస్ట్రియాలోని మౌతాసెన్ (Mauthausen) క్యాంపు చూశాను. కడుపులో దేవేసింది.

హిట్లర్ 1939 మేలో చెకోస్లెవేకియాపై దాడి చేసి ఆక్రమించుకున్నాడు. ఈ దాడులు జరగగానే అప్పటి సామ్రాజ్యవాద దేశాలైన ఇంగ్లండ్, ఫ్రాన్స్ మేల్కొని హిట్లర్‌ను నిలవరించాల్సింది. కానీ వాళ్లు ఆ పని చేయలేదు. హిట్లర్ రష్యామీదకు వెళ్లి వాళ్ల దుంపతెంపుతాడు, మన చేతికి మట్టి అంటుకోకుండా శత్రువులిద్దరూ కొట్టుకు ఛస్తారు అనుకున్నారు. ఇది గమనించిన రష్యా పాలకుడు స్టాలిన్ 1939 ఆగస్టులో హిట్లర్‌తో నిర్యుద్ధ సంధి చేసుకున్నాడు. సెప్టెంబరు 1న పోలండ్‌పై హిట్లర్ దాడి చేసినపుడు, తనూ తూర్పు వైపు నుంచి వచ్చి కొంత ఆక్రమించాడు. జర్మనీ దాడి చేస్తే మేం సైనికరక్షణ కల్పిస్తామంటూ పోలండ్‌తో గతంలో సంధి చేసుకున్న ఇంగ్లండ్, ఫ్రాన్స్ యిక యుద్ధంలో దిగక తప్పలేదు. రెండు రోజుల్లో ఆ పని చేయడంతో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది.

1940 తొలి నెలల్లోనే పోలండ్ జర్మనీకి, రష్యాకు వశమైంది. రష్యా ఎస్టోనియా, లాట్వియా, లిథూనియా వంటి బాల్టిక్ దేశాలపై, ఫిన్లండ్‌లపై దాడి చేసి ఆక్రమించుకుంది. ఈ లోపున జర్మనీ ఇంగ్లండ్ నౌకాదళాన్ని దెబ్బ కొట్టసాగింది. 1940 ఏప్రిల్ కల్లా నార్వే, డెన్మార్క్‌లను ఆక్రమించింది. స్వీడన్ తటస్థంగా వుండిపోయింది. మే నెలలో బెల్జియం, నెదర్‌లాండ్స్ పతనమయ్యాయి. ఈ సమయంలోనే డన్‌కిర్క్ సంఘటన జరిగింది. ఆ సినిమా గురించి చెప్పుకునేటప్పుడు విపులంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడే ఇటలీని పాలిస్తున్న ముసోలినీ హిట్లర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 1940 జూన్ కల్లా జర్మనీ ఫ్రాన్స్‌ను లోబరుచుకుంది. ఇప్పటిదాకా జరిగినది కాస్త గుర్తు పెట్టుకుంటే ప్రతీసారీ చెప్పుకోనక్కరలేదు.

సినిమా కథలోకి వస్తే – అనేకమంది యూరోపియన్ శరణార్థులు అమెరికా పారిపోవడానికై విచీ ఫ్రెంచ్ ప్రభుత్వం అధీనంలో వున్న మొరాకో దేశంలోని కేసబ్లాంకా ఊరుకి వచ్చేవారు. అక్కణ్నుంచి దొంగ అనుమతి పత్రాలు సంపాదించి, పోర్చుగల్‌కు ఆపై అమెరికాకు వెళ్లేందుకు అవకాశంకై అక్కడే కాచుకునేవారు. కొందరు ఏజంట్లు, అవినీతిపరులైన పోలీసు అధికారులు డబ్బు, బంగారం తీసుకుని ఆ పత్రాలు అమ్మేవారు. రెనో అనే లంచగొండి ఫ్రెంచి అధికారి వీటితో బాటు శయ్యాసౌఖ్యం కూడా కోరేవాడు. కేసబ్లాంకాలో ‘రిక్ ’ అనే పేర నైట్‌క్లబ్ నడిపే 37 ఏళ్ల రిక్ అనే అమెరికనే మన హీరో. ఆ నైట్‌క్లబ్‌లోనే సినిమా అంతా జరుగుతుంది.

ఇక్కడ కొన్ని చారిత్రక విషయాలు చెప్పాలి. ఈ కేసబ్లాంకా ఉత్తర ఆఫ్రికాలో మొరాకోలో వుంది కదా. మధ్యలో ఫ్రాన్స్ ఎక్కణ్నుంచి వచ్చిందనే సందేహం రావచ్చు. ప్రపంచంలో ఎక్కడ సంపద వున్నా యూరోపియన్ దేశాలు డేగల్లా వాలి, వలస దేశాలుగా మార్చేసిన వైనం మనకు తెలుసు. ఎక్కడో దూరాన వున్న ఇండియాకే పోర్చుగీసు వారు, డచ్చివారు, ఫ్రెంచి వారు, ఇంగ్లీషు వారు వచ్చిపడ్డారు. మరి దగ్గర్లో వున్న దేశాలను వదులుతారా? (మాప్ చూడండి). ఉత్తర ఆఫ్రికాలో యూరోప్‌కు అతి దగ్గరగా వున్న దేశాలు అల్జీరియా, మొరాకో. అల్జీరియాను ఫ్రాన్స్ 1830లో ఆక్రమించి వలసదేశంగా చేసుకుంది. ఆ అల్జీరియాకు పక్కనే మొరాకో వుంది. దానికి కాస్త పైన వున్న స్పెయిన్ 1912లో మొరాకోలో కొంతభాగాన్ని ఆక్రమించగా, ఫ్రాన్స్ తక్కిన భాగాన్ని ఆక్రమించింది. మొరాకో రాజవంశానికి రక్షణ కల్పిస్తున్నామనే పేర సైన్యాన్ని అక్కడే పెట్టి, తమ అధీనంలో వుంచుకున్నారు. మొరాకో కూడా స్వాతంత్ర్యం కోసం పోరాడి 1955లో సాధించుకుంది. కథాకాలం 1941 కాబట్టి, అప్పటికి యింకా ఫ్రెంచి ప్రభుత్వమే వుంది.  

ఇక్కడే ఫ్రాన్స్ గురించి కొంత చెప్పాలి. అప్పుడే సినిమాలో కనబడే ఫ్రెంచ్, జర్మన్ అధికారుల మధ్య వ్యత్యాసం బోధపడుతుంది. జర్మనీ బెల్జియంను ఆక్రమించాక అటువైపు నుంచి ఫ్రాన్స్‌పై దాడి చేసింది. మొదటి ప్రపంచ యుద్ధసమయంలో ఎంతో బలంగా వున్న ఫ్రాన్స్ తర్వాతి కాలంలో రాజకీయ సంక్షోభానికి గురై బలహీనపడింది. అధికారంలో వున్న మూడో రిపబ్లిక్‌లో ప్రధానిగా వున్న పాల్ రేనాడ్ రాజీనామా చేయడంతో మార్షల్ ఫిలిప్ పెటైన్ ప్రధాని అయ్యాడు. జర్మనీని ఎదిరించలేక తాత్కాలిక యుద్ధవిరమణ (ఆర్మిస్టిస్) చేసుకున్నాడు. సైనికాధికారిగా, అత్యంత ప్రజాదరణ వున్న నాయకుడిగా వున్న షాల్ ద గాల్ (మనవాళ్లు ఛార్లెస్ డీగోల్ అని రాస్తారు) దీన్ని వ్యతిరేకించి ఇంగ్లండు చేరి, అక్కణ్నుంచి జర్మనీపై వ్యతిరేక ప్రచారం చేశాడు.

జులై 10న జర్మన్లు మూడో రిపబ్లిక్‌ను రద్దు చేసి, ఫ్రాన్స్‌లో కొంత భాగాన్ని తమ చేతిలో పెట్టుకుని, తక్కిన భాగానికి పెటైన్‌ను కీలుబొమ్మ పాలకుడిగా పెట్టారు. అతన్ని పారిస్‌ దక్షిణ ప్రాంతంలో వున్న విచీ అనే చిన్న పట్టణానికి తరలించారు. అందువలన ఆ ప్రభుత్వానికి విచీ ప్రభుత్వం అని పేరు వచ్చింది. పేరుకు విచీ ప్రభుత్వం పాలన, పెత్తనమంతా జర్మన్లది. 20 లక్షల మంది ఫ్రెంచి సైనికులను నాజీలు ఖైదు చేశారు. యూదులు, కమ్యూనిస్టులు యిలాటి వారిని సుమారు 72,500 మందిని చంపేశారు. ఈ వరస నచ్చని ఫ్రెంచి పౌరులు కొందరు ప్రతిఘటన ఉద్యమం (రెసిస్టెన్స్) నడిపారు. పరపాలన నడిచిన చోటల్లా యీ ఉద్యమం నడుస్తుంది. వీళ్లు బహిరంగంగా ఆయుధాలు ధరించి యుద్ధం చేయరు. రహస్యంగా అధికార యంత్రాంగాన్ని ఎదిరిస్తూ, వారి ప్రయత్నాలను భగ్నం చేస్తూ వుంటారు. శత్రు సైనికులు వచ్చినపుడు వారికి సహకరిస్తూ వుంటారు.

ఫ్రాన్స్ ప్రతిఘటనోద్యమాన్ని ద గాల్ ఇంగ్లండు నుంచి నడిపించాడు. చివరకు 1944 జూన్‌లో మిత్రపక్షాలు నార్మండీ రేవులో దిగి ఫ్రాన్స్‌ను విముక్తి చేశాయి. 1945 ఏప్రిల్ కల్లా విచీ హయాం నాటి అధికారులందర్నీ పట్టుకుని శిక్షించారు. పెటైన్‌కు మరణశిక్ష వేశారు కానీ ద గాల్ దాన్ని జీవితఖైదుగా మార్చాడు. మన కథాస్థలం కేసబ్లాంకా వున్న మొరాకో కథాకాలం 1941 డిసెంబరు నాటికి విచీ ఫ్రాన్స్ పాలన కింద వుంది. విచీ ఫ్రెంచ్ పోలీసు అధికారి రెనో, జర్మన్ అధికారి స్ట్రాసర్ యీ కథలో కీలకమైన వ్యక్తులు. కేసబ్లాంకాలో నైట్ క్లబ్ నడుపుతున్న హీరోకి వాళ్లతో వ్యవహరించక తప్పదు. వాళ్లూ యీ నైట్ క్లబ్‌పై ఓ కన్నేసి వుంచుతారు. ఎందుకంటే యూరోప్ నుంచి వచ్చిపడే శరణార్థులు, వారిని దొంగ వీసాలపై పోర్చుగల్‌కు పంపే ఏజంట్లు, రకరకాల నేరాలు చేసేవాళ్లు యీ క్లబ్‌లో తచ్చాడుతూంటారు.

శరణార్థులు ఎందుకంటే, 1940 జూన్‌లో ఫ్రాన్స్ ఆక్రమించిన జర్మనీ 1940 సెప్టెంబరు-1941 మే మధ్య లండన్‌పై, బ్రిటన్ లోని యితర పారిశ్రామిక నగరాలపై రాత్రి పూట విమానదాడులు నిర్వహించి బెంబేలెత్తించింది. అదే సమయంలో హంగరీ, రొమేనియా, బల్గేరియాలను కలుపుకుని, గ్రీస్, యుగోస్లావియాలను ఏప్రిల్‌లో గెలిచింది. దాని ప్రధాన గమ్యం రష్యా కాబట్టి 1941 జూన్‌లో ఆపరేషన్ బార్బరోసా పేరుతో రష్యాపై దండయాత్రకు వెళ్లింది. జర్మన్‌లు యిలా అప్రతిహతంగా దేశాలు ఆక్రమించుకున్నకొద్దీ వారి బాధలు భరించలేక పారిపోయే జనం ఎక్కువై పోయారు. యూదులే కాదు, అనేక వర్గాల వారు నాజీల హింసలు తట్టుకోలేక పోయారు.

యూరోప్‌లో పారిస్ వరకు వచ్చేసి, అక్కణ్నుంచి దక్షిణాన వున్న మార్సేల్ (పారిస్ నుంచి 660 కి.మీ.) చేరి, అక్కణ్నుంచి నావలో మధ్యధరా సముద్రం దాటి, అల్జీరియాలోని ఒరాన్ రేవుకి వచ్చి, అక్కణ్నుంచి రైలు లేదా రోడ్డు మార్గం ద్వారా 880 కి.మీ.ల దూరంలోని మొరాకోలోని కేసబ్లాంకా చేరి, అక్కడ బస చేస్తూ తాము తెచ్చుకున్న వజ్రాలు, నగలకు బదులుగా దొంగ వీసా ఏదైనా సంపాదించి, సముద్రం దాటి, యుద్ధంలో తటస్థంగా వున్న పోర్చుగల్‌లోని లిస్బన్ (కేసబ్లాంకా నుంచి 365 నాటికల్ మైళ్లు) కు వెళ్లిపోతే అక్కణ్నంచి అమెరికాకు పారిపోవచ్చని వారి ఆశ. ఇదే యీ సినిమాకు మూలకథాంశం. మూడు రోజుల్లో కథ ముగిసిపోతుంది.

ఉగార్తే అనే ఓ వీసా ఏజంటు జర్మనీకి చెందిన యిద్దరు వార్తాహరులను ఒరాన్ నుంచి వస్తూంటే చంపేసి, వారి జేబుల్లోంచి ఖాళీ అనుమతి పత్రాలు కొట్టేశాడు. వాటిపైన తన పేరు రాసుకుంటే చాలు, యూరోప్ అంతా తిరగవచ్చు, పోర్చుగల్‌కు వెళ్లవచ్చు. ఆ హత్య గురించిన వార్తతో సినిమా ప్రారంభమైంది. అనుమానితులను పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారు. అది చూపుతూ అక్కడి సంక్లిష్ట వాతావరణాన్ని దర్శకుడు పరిచయం చేస్తాడు. ఆ రోజే మేజర్ స్ట్రాసర్ అనే జర్మన్ అధికారి ఆ వూరికి రావడం, ఫ్రెంచ్ పోలీసు అధికారి రెనో అతన్ని రిసీవ్ చేసుకోవడం చూపిస్తారు. రకరకాల మనుష్యులు రిక్ క్లబ్‌కు రావడం, రిక్ ఎవరితో కలవకుండా ముభావంగా వుండడం, జర్మన్లంటే భయపడకుండా ధైర్యంగా వుండడం, అతనంటె కొంతమంది అమ్మాయిలు పడిచావడం కూడా మనకు తెలుస్తుంది. అదే వూళ్లో బ్లూ పేరట్ అనే పోటీ నైట్‌క్లబ్ నడిపే ఫెరారీ అనే అండర్‌వరల్డ్ వ్యక్తి తనతో చేతులు కలుపుదామని చూస్తే రిక్ కాదనడం, గాయకుడు, పియానిస్టు శామ్‌కు రిక్ ఎంత యిష్టమో యివన్నీ తెలిసి రిక్‌కు కొన్ని సిద్ధాంతాలున్నాయని ప్రేక్షకుడికి అర్థమౌతుంది.

ఆ రోజు సాయంత్రం ఉగార్తే రిక్ వద్దకు వచ్చాడు. ‘పోలీసులు జర్మన్ కొరియర్ల హంతకుడి కోసం వెతుకుతున్నారు. నేనే ఆ హంతకుణ్ని. నా దగ్గరున్న పత్రాలను మంచి ధరకు అమ్మడానికి ఒకరితో ఒప్పందం కుదుర్చుకున్నాను. వాళ్లని నీ క్లబ్‌కు రమ్మనమన్నాను. కాస్సేపటిలో వస్తారు. డబ్బు చేతులు మారేలోగా పత్రాలు నా వద్ద వుంటే పోలీసులు లాక్కోవచ్చేమోనని నా భయం. నీపై నమ్మకంతో నీ కిస్తున్నాను. కొద్ది గంటలు దాచి వుంచితే చాలు.’ అన్నాడు. రిక్ సరేనంటూ వాటిని పియానోలో దాచాడు.

కాస్సేపటికి రెనో వచ్చి మద్యం తీసుకుంటూ రిక్‌తో కబుర్లు చెప్పాడు. రెనో స్వార్థపరుడు, లంచగొండి. గాలి ఎటు వీస్తే అలా వెళతానంటాడు. సిగ్గూశరమూ ఏమీ లేనివాడు. అతనికి రిక్ అంటే గౌరవమూ వుంది, అభిమానమూ వుంది. ‘‘విక్టర్ అనే చెక్ దేశస్తుడు యిక్కడకు ఒక అమ్మాయితో కలిసి వస్తున్నాడు. అతను చెక్ ప్రతిఘటనోద్యమంలో పాలు పంచుకుని, పట్టుబడి, కాన్సన్‌ట్రేషన్ క్యాంపుకి తరలింప బడ్డాడు. అక్కణ్నుంచి పారిపోయాడు. అనేక దేశాల్లో అతని అనుయాయులున్నారు. నాజీలు అతన్ని పట్టుకోవాలని చూస్తున్నారు. ఇక్కణ్నుంచి దొంగ వీసాతో అమెరికాకు పారిపోయి, అక్కణ్నుంచి ఉద్యమాన్ని నడుపుదామని అతని ఆలోచన. ఈ ప్రాంతాన్ని జర్మన్లు ఆక్రమించలేదు. ఇదంతా నా రాజ్యం. సాంకేతికంగా చూస్తే జర్మన్‌లు యిక్కడి పాలకులు కాదు. వాళ్లేమైనా చేయదలిస్తే నా ద్వారా, నన్ను మొహమాటపెట్టి చేయాల్సిందే. అతన్ని అరెస్టు చేయమని స్ట్రాసర్ నన్ను కోరాడు. ఇక్కడే యీ క్లబ్బులో అతని సమక్షంలో విక్టర్‌ను అరెస్టు చేస్తాను. నువ్వు అడ్డు రాకు.’ అన్నాడు.

‘‘విక్టర్ గురించి నేను చాలా విన్నాను. ధైర్యశాలి. ఎప్పటికప్పుడు చచ్చిపోయాడని వార్తలు వస్తూంటాయి. మళ్లీ బతికి వస్తున్నాడు. అతన్ని మీరెవరూ ఆపలేరని పందెం.’’ అన్నాడు రిక్. ‘‘నీ క్లబ్‌లో దొంగ వీసాల బేరసారాలు సాగినా, నువ్వు ఎవరికీ యిప్పించవ్. అందుకే నీతో మాకు పేచీ లేదు. నువ్వు పైకి కనబడకపోయినా సెంటిమెంట్లు వున్నవాడివని నా అనుమానం. ఇథియోపియాలో, స్పెయిన్‌లో నువ్వు డబ్బుకోసం కాకుండా, ప్రజాస్వామ్యం కోసం పోరాడావు. ఈ విక్టర్‌కి మాత్రం అవసరంగా సాయం చేయాలని చూడకు.’ అని అనునయంగానే చెప్పాడు రెనో.

రెండవ ప్రపంచయుద్ధానికి భూమికగా అన్నట్లు, స్పెయిన్‌లో అంతర్యుద్ధం జరిగింది. స్పెయిన్‌ను పాలిస్తున్న రిపబ్లికన్ ప్రభుత్వాన్ని వామపక్షవాదులు, ప్రజాస్వామ్యవాదులు సమర్థించేవారు. 1936లో జనరల్ ఫ్రాన్సిస్కో ఫ్రాంకో అనే మిలటరీ అధికారి, నేషనలిస్టులనే పేరుతో ఏర్పడిన రాచరికవాదులు, సంప్రదాయవాదుల కూటమికి నేతృత్వం వహిస్తూ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడు. కొంతమంది అటూ, కొంతమంది యిటూ నిలబడడంతో మూడేళ్ల పాటు అంతర్యుద్దం జరిగింది. 1939లో ఫ్రాంకో గెలిచి, ఆ తర్వాత 36 ఏళ్ల పాటు స్పెయిన్‌ను నియంతగా పాలించాడు. అతను చనిపోయాకే సైనికపాలన అంతమయ్యింది.

హిట్లర్ కంటె ముందే ముస్సోలినీ దురాగతాలు ప్రారంభమయ్యాయి. ఫాసిజం పేరుతో విపరీత జాతీయవాదంతో ఇటలీలో అధికారంలోకి వచ్చి చేరువలో వున్న దేశాలను ఆక్రమించసాగాడు. 1935 అక్టోబరులో ఇథియోపియాపై దండెత్తాడు. 1937 ఫిబ్రవరి నాటికి గెలిచాడు. ఈ రెండు పోరాటాల్లో మన సినిమాలో హీరో పాల్గొన్నాడు. మొదటిదానిలో ఫ్రాంకోకు వ్యతిరేకంగా, రెండో దానిలో ముస్సోలినీకి వ్యతిరేకంగా. అందువలన జర్మన్లకు అతనంటే పడదు.

అంతలోనే స్ట్రాసర్ వచ్చాడు. ‘మీ కొరియర్ల హంతకుణ్ని కాస్సేపటిలో పట్టుకుంటాం చూడండి’ అని రెనో అతనికి చెప్పాడు. క్లబ్‌లో జూదమాడుతున్న ఉగార్తేను పట్టుకోమని తన సిబ్బందికి చెప్పాడు. అతను పారిపోబోయాడు కానీ రిక్ అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించేశాడు. స్ట్రాసర్ రిక్‌ను పిలిచి నీ కథంతా మాకు తెలుసులే అన్నాడు. అయినా రిక్ బెదరలేదు. ‘నువ్వు విక్టర్‌కు సాయం చేయవద్దు సుమా, ఇప్పటికే మూడుసార్లు మా దగ్గర్నుంచి తప్పించుకున్నాడు’ అని స్ట్రాసర్ అంటే ‘ఎవడి కోసమూ నేను రోట్లో తల పెట్టను’ అన్నాడు రిక్. ‘ఔనౌను, రిక్ అన్ని విషయాలలోనూ తటస్థంగానే వుంటాడు. అతనికి రాజకీయాలు పట్టవు.’ అని సర్టిఫికెట్టు యిచ్చాడు రెనో. (సశేషం)

 – ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2021)

[email protected]