తెలంగాణ యిచ్చినందుకైనా కాంగ్రెసును యీసారి గెలిపించరా? అనే ప్రశ్నకు జవాబు వెతకాలంటే గతంలోకి వెళ్లాలి. రాష్ట్రం యిచ్చినందుకు గెలిపించాలన్న నియమమేమీ లేదు. 1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతాన్ని విడగొట్టి ఆంధ్ర రాష్ట్రం చేసింది కాంగ్రెసు. 1955లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెసుకు 39.35% ఓట్లు వచ్చాయి. ప్రతిపక్షాలైన కమ్యూనిస్టులు (31.1%), కృషికార్ లోక్ పార్టీ (7.3%) ప్రజా సోషలిస్టు పార్టీ (5.6%)ల మధ్య ఓట్లు చీలిపోయాయి కాబట్టి కాంగ్రెసుకు 142లో 119 సీట్లు వచ్చాయి కానీ లేకపోతే 39% ఓట్లతో చతికిల పడేదే! ఆంధ్ర యిచ్చినందుకు కాంగ్రెసుపై ప్రేమ పొంగి పొరలలేదు. విభజన నిర్ణయాన్ని చాలా ఆలస్యం చేసి, పొట్టి శ్రీరాములు గారి ప్రాణాలు బలిగొన్నాకనే యిచ్చారు అని ఆంధ్రులు కోపగించుకున్నారు.
తెలంగాణ యిచ్చిన సోనియాకు కృతజ్ఞత తెలుపడానికి కాంగ్రెసును గెలిపించండి అని 2014లోనూ, 2018లోనూ కాంగ్రెసు ప్రచారం చేసింది. అప్పుడే ఓటర్లు వినలేదు. 2018లో బొత్తిగా ఆరో వంతు సీట్లు యిచ్చారు. అలాటిది తొమ్మిదేళ్ల తర్వాత గుర్తు పెట్టుకుని, ఓట్లేస్తారా? అయినా కాంగ్రెసు తెలంగాణ యిచ్చిన విధం అత్యంత ఘోరంగా, కిరాకతకంగా ఉంది. అసలది తెలంగాణ యిచ్చేస్తున్నామన్న ప్రకటన చేసింది ఎప్పుడు? 2009 డిసెంబరు 9న! చివరకు ఇచ్చింది ఎప్పుడు? 2014లో! ఈ నాలుగున్నరేళ్ల పాటు ఎన్ని డ్రామాలు నడిచాయి? ఎన్ని సమ్మెలు, ఎన్ని నిరసనలు, ఎన్ని రాజీనామాలు, ఎన్ని ఉపయెన్నికలు, ఎన్ని చర్చలు, ఎన్ని దిల్లీ రాకపోకలు, ఎన్ని అభిప్రాయ సేకరణలు, ఎన్ని ఉద్యమాలు, ఎన్ని కౌంటర్ ఉద్యమాలు, ఎన్ని చావులు, ఎన్ని ‘సరైన టైములో సరైన నిర్ణయాలు’… వీటన్నిటి తర్వాత రాష్ట్రం యిస్తే ఆనందంగా, సంతోషంగా యిచ్చినట్లయిందా?
అసలు డిసెంబరు 9 ప్రకటన ఎలా వచ్చింది? కెసియార్ నిరాహార దీక్ష చేసినప్పుడు యిచ్చారు. రాజకీయ చాతుర్యం అస్సలు లేని చిదంబరం, ముఖ్యమంత్రి రోశయ్యకు ఒక ప్రకటన చూపించి, దిల్లీ నుంచి హైదరాబాదు విమానం ఎక్కించి, ఆయన విమానంలో ఉండగానే తద్భిన్నమైన మరో ప్రకటన విడుదల చేశారు. ప్రణబ్ ముఖర్జీకి చూపించకుండా, ఆంధ్ర ప్రాంతపు వారి అభిప్రాయాలను తెలుసుకోకుండా, విభజన విధివిధానాలను నిర్ధారించుకోకుండా, ఏ కమిటీ వేయకుండా హఠాత్తుగా ప్రకటించేశారు. చిదంబరం, జైరాం రమేశ్, వీరప్ప మొయిలీ వంటి వారు దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్ ఎదుగుదలను సహించలేక సోనియాను తప్పుదారిన పట్టించి, దాన్ని డైరక్టుగా విడుదల చేశారు. ముఖ్యమంత్రి ద్వారా చెప్పించాల్సిందన్న ఇంగితం కూడా ప్రదర్శించలేదు. రెండు ప్రాంతాలకు చెందిన తన పార్టీ నాయకులెవర్నీ విశ్వాసంలోకి తీసుకోలేదు.
రాహుల్ గాంధీ సలహాదారు కొప్పుల రాజు రాష్ట్రాన్ని విడగొడితే రెండు చోట్లా దళితులు ముఖ్యమంత్రు లవుతారని సలహా యిచ్చాడట! ఆ ప్రకటన రాగానే నేను ‘సరైన నిర్ణయమూ కాదు, సరైన సమయమూ కాదు’ పేర ఒక వ్యాసం రాశాను. ప్రత్యేక తెలంగాణ ప్రకటించాలనుకున్నపుడు దాని క్రెడిట్ తమకు దక్కేట్లు చూసుకుంటుంది ఏ పార్టీ అయినా. తమ పార్టీ నాయకుల చేత డిమాండు చేయించి, వారి కోరిక మేరకు యిచ్చినట్లు డ్రామా ఆడుతుంది. కాంగ్రెసుకు ఆ బుద్ధి, వివేకం లేకపోయింది. కెసియార్ దీక్ష చేసినప్పుడు విరమించడానికి అంటూ యిచ్చింది. దాంతో కెసియార్ రాత్రికి రాత్రి హీరో అయిపోయాడు. ముఖ్యమంత్రితో సహా స్థానిక కాంగ్రెసు నాయకులందరూ చవటలై పోయారు.
గాంధేయవాది ఐన పొట్టి శ్రీరాములు గారు సాధారణ కార్యకర్త. వక్త, నాయకుడు కాదు. ఆయన పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసుకోవడంతో ఆయనకు చిరకీర్తి లభించింది. ఆయన పేరు ఓ జిల్లాకు పెట్టారు కూడా. ఆయన బతికుండగా యీ వైభోగం చూడలేక పోయారు. కెసియార్‌కు ఆ స్థాయి కీర్తి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం కోసం మృత్యువు నోట్లో తలపెట్టాను అని చెప్పుకునే అవకాశాన్ని కాంగ్రెసు కట్టబెట్టింది. దాన్ని పూర్తిగా ఎన్‌క్యాష్ చేసుకున్నాడాయన.
దీన్ని ఆలస్యంగా గ్రహించింది కాంగ్రెసు అధిష్టానం. రిస్కు తమది, ప్రాఫిట్ కెసియార్‌ది అని అప్పటికి ట్యూబులైటు వెలిగింది. అసలు తమ ప్రకటనకు ఎటువంటి రియాక్షన్ వస్తుందో కూడా కాంగ్రెసు ఊహించలేదంటే దాని బుద్ధిహీనతను, రాజకీయ అపరిపక్వతను అర్థం చేసుకోవచ్చు. ప్రకటన రాగానే ఆంధ్ర నుంచి సకల పార్టీ ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాల పర్వం నడిచింది. ఆ ఐడియా చంద్రబాబుదే నంటారు. కాంగ్రెసు చచ్చినా ప్రత్యేక రాష్ట్రం యివ్వదనే లెక్కతో ఆయన విభజనకు అనుకూలంగా మాట్లాడుతూ మీ సంగతేమిటి అని కవ్విస్తూ వచ్చాడు.
తీరా యిచ్చేసరికి కంగు తిని, యీ ఎత్తు ఎత్తాడు. ఆంధ్రలో టిడిపికి ఎక్కడ పేరు వచ్చేస్తుందోననే భయంతో, కాంగ్రెసు తన ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామాలు చేయించింది. వేసిన తప్పటడుగు వెనక్కి తీసుకోవడానికి శ్రీకృష్ణ కమిటీ వేసింది. ఇదంతా తెలంగాణ ప్రజల మనసు కష్టపెట్టింది. నిజానికి అప్పటికి తెలంగాణ ప్రజల్లో సమైక్యవాదమే బలంగా ఉంది. భారాస బలం ఉపయెన్నికల్లో రానురాను క్షీణిస్తోంది. ఆంధ్రులు మోసం చేశారనే కెసియార్ వాదనను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ 2009 డిసెంబరు 9 తర్వాతి సంఘటనల తర్వాత ఆంధ్రనాయకులది బూటకమని. తాము మోసపోయామని సాధారణ తెలంగాణ ప్రజకు తోచింది. ఆపై విభజన దిశగా ఆలోచించ సాగారు. అప్పణ్నుంచే చంద్రబాబు ప్రభ తెలంగాణలో మసకబారడం మొదలుపెట్టింది. కెసియార్‌ను అనవసరంగా హీరో చేసేశామని గ్రహించిన కాంగ్రెసు అధిష్టానం, అతని ప్రభ తగ్గేదాకా ఆగదలిచింది. అఖిల పార్టీ సమావేశాలంటూ సమయాన్ని సాగదీసింది. ఈలోపున ఆందోళన చెందిన యువత ఆత్మహత్యలు చేసుకోవడాలూ జరిగాయి.
చిదంబరం యిటీవల అన్నారు కూడా ‘మేం పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టేనాటికి, కెసియార్ పూర్తిగా బలం క్షీణించి ఉన్నారు’ అని. అది నిజం. ఒక దశలో కాంగ్రెసు విభజన ప్లాను అటకెక్కించినట్లు కూడా కనబడింది. కానీ కుటిలుడైన కెసియార్ కాంగ్రెసులోని తన కోవర్టుల ద్వారా కాంగ్రెసు అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించి, రాష్ట్రం యిస్తే తను కాంగ్రెసులో చేరతానని నమ్మబలికి, రాష్ట్రం సాధించుకుని, తర్వాత జెల్ల కొట్టాడు. మధ్యలో జరిగిన అనర్థాలన్నిటికీ కాంగ్రెసే బాధ్యత వహించాల్సి వచ్చింది.
నెలల తరబడి రాష్ట్రమంతా అల్లకల్లోల మైంది. సమ్మెలు జరిగాయి. పరిశ్రమలు రావడం మానేశాయి. ముఖ్యమంత్రి రోశయ్య చేతులు ఎత్తేశారు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి ఉద్యమాన్ని అదుపు చేయడంతో రాష్ట్రం కుదుట పడింది కానీ లేకపోతే మరీ ఘోరంగా ఉండేది. అస్తవ్యస్తంగా, అపభ్రంశంగా రాష్ట్రాన్ని చీల్చిన అపఖ్యాతి కాంగ్రెసు ఖాతాలో, ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఖ్యాతి కెసియార్ ఖాతాలో పడింది. ఇప్పుడు తెలంగాణ మేమే యిచ్చాం అని చెప్పుకుని కాంగ్రెసు సాధించేది ఏముంది?
విభజన వద్దని మోదీ అన్నాడు అని జైరాం రమేశ్ చెప్పాడు మొన్న. మోదీ తన అభిప్రాయాన్ని ఎన్నడూ దాచుకోలేదు, తల్లిని చంపి, బిడ్డను కాపాడారని అన్నాడు ఎప్పుడో అన్నాడు. విభజన జరిగితే తెలంగాణ తమ చేతికి వస్తుందని కాంగ్రెసు లాగానే బిజెపి కూడా లెక్కలు వేసింది. మోదీకి పార్టీ ప్రయోజనాలు ముఖ్యమే. సమైక్య రాష్ట్రంగా ఉంచితే, ఐదు పదేళ్లలో మొత్తం రాష్ట్రం మన చేతికి వస్తుందనే దీర్ఘకాల ప్రణాళిక వేసి ఉంటాడు. ఎందుకంటే పాతతరం బిజెపి నాయకుల కంటె మోదీ ఏంబిషస్. ఆత్మవిశ్వాసం ఎక్కువ. అందుకే దశాబ్దాలుగా బిజెపికి దుర్గమంగా తోచిన అనేక ప్రాంతాల్లోకి చొచ్చుకుని పోగలిగాడు. విభజన వద్దన్నాడని మోదీని తప్పు పట్టలేము. విభజన తర్వాత అభివృద్ధికి తోడ్పడక పోవడాన్నే తప్పు పట్టగలం.
ఇక కాంగ్రెసు క్లెయిమ్‌కు తిరిగి వస్తే, తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెసు చురుగ్గా ఉండి, తెలంగాణ మేమే యిచ్చామంటూ సభలు నిర్వహించిందా? ఉద్యమకాలంలో తమ పాత్రను చర్చకు పెట్టిందా? అమరవీరుల పాత్రను విస్మరించేట్లా చేసి, వారి కుటుంబాలను పక్కన పడేసి, నేనొక్కణ్నే ప్రాణాలొడ్డి తెలంగాణ తెచ్చా అని కెసియార్ చెప్తూ ఉంటే, చరిత్ర మార్చేస్తూ ఉంటే, పుస్తకాల్లో రాయించుకుంటూ ఉంటే అడ్డుపడిందా? అబ్బే, కాంగ్రెసు టిక్కెట్టుపై గెలిచిన నాయకులు భారాసలోకి దూకడమే పనిగా పెట్టుకున్నారు. ఇక కాంగ్రెసు వారిని ఓటర్లెందుకు ఎవరు నమ్ముతారు?
2018లో 19 మందిని గెలిపిస్తే 12 మంది ఫిరాయించేశారు. ఇలాటి కాంగ్రెసును తెలంగాణ యిచ్చారన్న ఒక్క కారణం చేత ఆదరిస్తారా? భారాసను వ్యతిరేకించేవారు కాంగ్రెసుకు ఎందుకు ఓటేస్తారు? వాళ్లకు వేస్తే అంతిమంగా భారాసకు ఓటేసినట్లే భావిస్తారు. భారాస సీట్లు తగ్గించాలంటే వేస్తేగీస్తే బిజెపి వాళ్లకే వేయాలి. వాళ్లయితే పార్టీ మారరన్న ధీమా ఉండేది. భూతకాలం ఎందుకు ప్రయోగించానంటే, యిటీవల బిజెపి వాళ్లూ తెగ ఫిరాయించేస్తున్నారు. ఎన్నికలకు ముందు కాబట్టి సరేలే అనుకోవచ్చు. గెలిచిన తర్వాత మాత్రం దూకితే, వాళ్లూ కాంగ్రెసు బాటే పట్టారనుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమిటంటే బిజెపికి వేసినా, పరోక్షంగా కెసియార్‌కు మద్దతిచ్చినట్లే అవుతోంది. తక్కిన విషయాలు ఎమ్బీయస్: కెసియార్ హాట్రిక్? లో రాస్తాను.
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2023)