దీని మొదటి భాగం టోకరేశుడు సుఖేశ్ 01 చదివాక యిది చదివితే మంచిది. జైల్లో పడ్డాక సుఖేశ్ తన దగ్గరున్న డబ్బుతో జైలు అధికారులను వశపరచుకున్నాడు. ముంబయి నివాసి ఐన పింకీ ఇరానీ అనే ఓ ఏజంటును నియమించుకుని, ఆమె ద్వారా అనేక మంది సుందరాంగులను రప్పించుకున్నాడు. దగాకోరు వ్యవహారాలు చక్కపెట్టాడు. భార్య బయటే ఉండిపోయింది కాబట్టి డబ్బు కలక్షన్, పంపిణీ సంగతులన్నీ కొందరు సహాయకుల ద్వారా చూసుకుంది. జైల్లో ఉంటూండగానే రూ. 200 కోట్ల ఫ్రాడ్ చేశాడు కాబట్టి యిప్పుడివన్నీ ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాయి. ఆ ఫ్రాడ్ గురించి చెప్పబోయే ముందు రెండు, మూడు చిల్లర కేసుల గురించి, రాసలీలల గురించి చెప్పాలి.
మన మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు ఓ బ్యాంకు ఫ్రాడ్ కేసులో యిరుక్కుంటే, సిబిఐకి లంచం యిచ్చి మిమ్మల్ని బయటపడేస్తానని బేరం పెట్టాడు. తను జైల్లో పడ్డాక తన కేసు చూస్తున్న స్పెషల్ జజ్ పూనమ్ చౌధరీకి ఫోన్ చేసి ‘నేను సుప్రీం కోర్టు జస్టిస్ కురియన్ జోసెఫ్‌ని, పాపం ఆ సుఖేశ్‌కు బెయిల్ యిచ్చేయండి’ అని చెప్పాడు. అలాగే తీహార్ జైలుని కాపలా కాసే బాధ్యత తీసుకున్న కార్తికేయన్ అనే ఎసిపికి ఫోన్ చేసి ‘నేను యూనియన్ లా మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ పెర్శనల్ సెక్రటరీ శరవణ కుమార్ ఐఏఎస్‌ని. తీహార్ జైల్లో ఉంటున్న సుఖేశ్‌ను బాగా చూసుకోండి. అతనికి కావలసినవన్నీ సమకూర్చండి.’ అని చెప్పాడు. ఓ సినిమాలో హాస్యనటుడు సునీల్ తన యింట్లోవాళ్లకే ఫోన్ చేసి ‘నేను అరబ్ షేక్‌ని. మీ యింట్లో సునీల్‌ని బాగా చూసుకోండి.’ అని చెప్తాడు. అది కామెడీ అనుకున్నాం. కానీ నిజజీవితంలో కూడా యిలాటివి జరుగుతాయని సుఖేశ్ కథ చూస్తే తెలుస్తుంది.
ఇక రాసలీలల గురించి చెప్పాలంటే – 37 ఏళ్ల జాక్విలిన్ ఫెర్నాండెజ్‌తో మొదలుపెట్టాలి. ఈమె తండ్రి ఎల్రాయ్ ఫెర్నాండెజ్ శ్రీలంకలో యూరోప్ సంతతికి చెందినవాడు. తల్లి కిమ్ మలేసియా-కెనడియన్ వారసత్వం కలది. వృత్తి రీత్యా ఎయిర్‌హోస్టెస్. తండ్రి సేల్స్‌మన్, డిజె కూడా కావడంతో 1980లలో బహరైన్‌కు వెళ్లి స్థిరపడ్డాడు. జాక్విలిన్ ఆస్ట్రేలియాలో మాస్ కమ్యూనికేషన్స్ చదివింది. 2006లో శ్రీలంకలో మిస్ యూనివర్శ్, శ్రీలంకగా ఎంపికైంది. 2009లో ముంబయి వచ్చి మోడల్‌గా పని చేసింది. అదే సంవత్సరం ‘‘అలాడీన్’’ సినిమాలో వేషం వేసింది. ‘‘మర్డర్ 2’’ (2011) హిట్ కావడంతో తనకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘‘కిక్’’ (2014), ‘‘రాయ్’’ (2015)లలో మరింత పేరు వచ్చింది.
సుఖేశ్ రోహిణీ జైల్లో ఉండగానే 2020 డిసెంబర్లో షాన్ అనే జాక్విలిన్ మేకప్ ఆర్టిస్టుకు ఫోన్ చేశాడు. అతని ఫోన్‌లో స్పూఫింగ్ యాప్ ఉంది. దాని సాయంతో వేరే చోట నుంచి కాల్ వచ్చినట్లు అవతలివాళ్లను భ్రమింప చేయవచ్చు. ‘నేను యూనియన్ హోం మినిస్ట్రీలో ఒక అధికారిని. జాక్విలిన్‌కు వేషాలిప్పించడానికి సాయం చేయమని మంత్రి చెప్పారు. ఆమెను చెన్నయ్‌లో ఉన్న శేఖర్ అనే జయలలిత బంధువును కాంటాక్ట్ చేయమని చెప్పండి.’ అని చెప్పాడు. నెంబరు ఎక్కడిదాని షాన్ చెక్ చేస్తే అది హోం మినిస్ట్రీ వాళ్ల లాండ్‌లైన్ నెంబరే! సరేనని జాక్విలిన్‌కు చెప్పాడు. ఆమె శేఖర్‌కై ప్రయత్నించింది కానీ అతను దొరకలేదు. చివరకు 2021 జనవరి నెలాఖరులో శేఖర్ ఫోన్ చేసి ‘నా గురించి ప్రయత్నించారని తెలిసింది. మీ పని మీదే ఉన్నాను. లియోనార్డో డికాప్రియోతో హాలీవుడ్ వాళ్లు ఓ సినిమా తీయబోతున్నారు. దానిలో నీకో వేషం యిప్పిద్దామని చూస్తున్నాను.’ అన్నాడు. జాక్విలిన్ పొంగిపోయింది.
ఇంతకీ ఈ శేఖర్ మరెవరో కాదు, జైల్లో ఉన్న సుఖేశే! ఈ విషయాన్ని న్యూస్‌పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్‌లో ఫోటో చూసి షాన్ కనిపెట్టేశాడు. జాక్విలిన్‌ను హెచ్చరించాడు. ఇతనో జైలుపక్షి అని చెప్పాడు. జాక్విలిన్ శేఖర్ (సుఖేశ్)ని నిలదీసింది. ‘నేను అమాయకుణ్ని. ఎడిఎంకె రాజకీయాల గొడవల్లో, నన్ను కేసులో యిరికించి జైల్లో పెట్టారు. కానీ నాకు సర్వసౌఖ్యాలు యిచ్చారు. కొద్ది రోజుల్లోనే బయటకు వచ్చేస్తాను.’ అని చెప్పాడు. తర్వాత తన తండ్రి అనారోగ్యం పేరుతో జూన్‌లో బెయిల్ తీసుకుని చెన్నయ్ వెళ్లాడు. తర్వాత ఆయన పోయాడంటూ బెయిల్ కాలాన్ని పొడిగింప చేసుకున్నాడు.
ఇక 2021 జూన్ నుంచి జాక్విలిన్ అతనితో తిరిగింది. 2021 ఆగస్టులో యీ రూ.200 కోట్ల కేసులో మళ్లీ అరెస్టు కావడంతో ప్రణయం ఆగింది. ఈ లోపునే సుఖేశ్ జాక్విలిన్‌పై బహుమతుల వర్షం కురిపించాడు. బంగారం, రత్నాలు, గుఱ్ఱాలు, పిల్లులు, కార్లు, వాళ్ల అమ్మానాన్నకై బహరైన్‌లో ఓ యింటికి అడ్వాన్సు..యిలా. వీటి విలువ రూ. 12 కోట్ల కంటె ఎక్కువే. ఇవి తీసుకున్నావు కాబట్టి నువ్వూ దోషివే అని ఈడీ అంటే ‘అభిమాని నుంచి బహుమతులు తీసుకోవడం రూ. 200 కోట్ల మోసంలో పాలు పంచుకోవడం ఎలా అవుతుంది? అతను ఎలా సంపాదించాడో యీమెకేం తెలుస్తుంది?’ అని ఆమె లాయరు వాదించాడు. కోర్టు సెప్టెంబరు 26న ఆమెకు బెయిలు యిచ్చింది.
ఈమె మాత్రమే కాకుండా అనేక మంది చిన్నా, పెద్దా నటీమణులను, మోడల్స్‌ను అతను జైలుకి రప్పించుకున్నాడు. కొందరు పెద్ద తారలను తన భార్య కంపెనీ ప్రమోషన్ కంటూ ఆహ్వానించి, విలువైన బహుమతులు యిచ్చాడు. మొత్తం మీద 2015 నుంచి రూ. 20 కోట్లు అమ్మాయిల కోసం ఖర్చు పెట్టాడని ఈడీ అంచనా. కొందరు నటీమణులు యితన్ని దూరం పెట్టినా, మరి కొందరు యితని వలలో పడ్డారు. తీహార్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ డిఎస్ మీనాకి పక్షానికి రూ.75 లక్షల లంచం యిస్తూ లోబరుచుకున్నాడని ఈడీ అభియోగం. దానిలోంచి మీనా రూ. 50 లక్షలు అసిస్టెంటు సూపరింటెండెంటు క్యాడర్ అధికార్లందరికీ పంచేవాడు. దానికంటె కింది ర్యాంకు వాళ్లకు రూ. 10 లక్షలు పంచేవాడు. తక్కినది తను ఉంచుకునేవాడు. ఇప్పుడు అరెస్టయ్యాడు.
ఈ లంచాల వలన 15, 20 మంది ఉండాల్సిన బ్యారక్ నెం. 204ని పూర్తిగా ఖాళీ చేయించి, సుఖేశ్ ఒక్కడికీ అప్పగించారు. ఇతర ఖైదీలు యితని బట్టలుతుకుతారు, గిన్నెలు తోముతారు. సిసిటివి కెమెరాల కంట పడకుండా కర్టెన్లు వేస్తారు. సెల్‌ఫోన్లు వాడుకోవచ్చు. ఇతర ఖైదీల గురించి యితనడిగిన సమాచారాన్ని ధారాళంగా యిచ్చేవారు. జైల్లోకి ఇతని బిఎండబ్ల్యు కారు యథేచ్ఛగా వస్తూ పోతూ ఉండేవి. దానిపై తీహార్ జైలు స్టిక్కరు ఉండేది. ఇతని కోసం వచ్చినవాళ్లని సెక్యూరిటీ వాళ్లు ఐడీ చూపమని అడగరు. సెక్యూరిటీ కెమెరాల కంటపడకుండా కారులో తల వంచుకోమని చెప్తారంతే. వచ్చినవాళ్లు చిత్తమొచ్చినంత సేపు ఉండి, వెళ్లవచ్చు. ఈ హంగులన్నీ చూసి వచ్చినవాళ్లు యితను ఒక పెద్ద బిగ్‌విగ్ అనీ, రాజకీయ కక్షలకు గురై ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడని, కానీ ప్రభుత్వపు మద్దతుతో సుఖవంతంగా ఉన్నాడనీ నమ్మడంలో ఆశ్చర్యమేముంది?
సుఖేశ్ కోరిన తారలను పింకీ తీసుకుని వచ్చేది, యితని తరఫున వారికి బహుమతులు కొనిచ్చేది. సుఖేశ్ దక్షిణాదికి చెందిన శేఖర్ అనే పెద్ద నిర్మాత అనీ, అతన్ని మెప్పిస్తే తను తీయబోయే సినిమాలో వేషం యిస్తాడనీ చెప్పేది. జాక్విలిన్‌తో పాటు డాన్సర్-నటి నోరా ఫతేహిపై సుఖేశ్ కన్ను పడింది. నోరా సుఖేశ్‌ను ప్రత్యక్షంగా కలవలేదు. వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారానే పరిచయం. లీనా తన కంపెనీ ఓ స్టూడియో ప్రారంభోత్సవానికి యీమెను పిలిచి పారితోషికం బదులు రూ. 64 లక్షల కారు యిస్తానంది. నోరాకు అనుమానం వచ్చి, కారు తనకు కాకుండా తన బావ పేర యిమ్మనమంది. తర్వాత అతను దాన్ని అమ్మేశాడు. ఈడీ యిప్పుడు నోరాను కూడా ప్రశ్నిస్తోంది. తనకు సుఖేశ్ కానీ, అతని భార్య కానీ వ్యక్తిగతంగా పరిచయం లేదని, వృత్తిలో భాగంగా కంపెనీ ఫంక్షన్‌కు వెళ్లానని నోరా ఈడీకి చెప్పింది.
తెలుగు, తమిళ సినిమాలలో, హిందీ టీవీ సీరియల్స్‌లో నటించి బిగ్‌బాస్ ద్వారా అందరికీ తెలిసిన నిక్కీ తంబోలీ 2018లో తీహార్ జైల్లో సుఖేశ్‌ను కలిసింది. సుఖేశ్ పింకీకి రూ.10 లక్షలిస్తే, దాంట్లోంచి ఆమె నిక్కీకి రూ.1.50 లక్షలిచ్చిందట. మూడు వారాల తర్వాత మళ్లీ వెళితే యీసారి రూ. 2 లక్షలిచ్చారట. టీవీ స్టార్ చాహత్ ఖన్నా వచ్చి జైల్లో కలిసినందుకు రూ.2 లక్షలు, వాచీ దక్కాయి. మరో టీవీ తార సోఫియా సింగ్ కూడా రెండుసార్లు వచ్చి కలిసింది. వచ్చిన ప్రతిసారీ రూ.2 లక్షలు ముట్టాయి. ఆరుషీ పటేల్ అనే నటీమణి స్వయంగా వచ్చి కలవకపోయినా కేవలం వాట్సాప్ వీడియో కాల్స్ చేసినందుకు గాను ఆమెకు 2020 డిసెంబరులో రూ.5.20 లక్షలు పంపించారు. దానిలో నుంచి బ్రోకరుగా వ్యవహరించినందుకు పింకీకి లక్ష రూపాయలు బాంకు ట్రాన్స్‌ఫర్‌గా పంపించిందట.
సారా ఆలీ ఖాన్‌తో కూడా పరిచయం పెంచుకోవాలని సుఖేశ్ చూశాడు. 2021 మేలో వాట్సాప్ కాల్స్ చేసేవాడు. బహుమతులు పంపుతానని ఆఫర్ చేసేవాడు. కారు యిస్తానన్నాడు. ఆమె వద్దంటూ వచ్చి, చివరకు విసుగెత్తి, సరే చాక్‌లెట్ బాక్స్ పంపండి చాలు అంది. ఆ బాక్స్‌లో ఖరీదైన వాచీ పెట్టి పంపించాడు సుఖేశ్. జాహ్నవి కపూర్‌తో స్నేహం చేసుకోవాలని తన భార్య కంపెనీ ఫంక్షన్ పేరు చెప్పి 2021 జులైలో బెంగుళూరు ఆహ్వానించి, పారితోషికంగా రూ.19 లక్షలిప్పించి, దానితో పాటు తన అత్తగారి చేత ఖరీదైన బ్యాగ్ యిప్పించాడు. 2021 జనవరలో హిందీ నటి భూమి పెడ్నేకర్‌కి ఫోన్ చేసి కారు బహుమతిగా యిస్తానన్నాడు. ఆమె వద్దని చెప్పేసింది.
ఇప్పుడు సుఖేశ్ చేసిన అతి పెద్ద ఫ్రాడ్ గురించి చెప్తాను. రాన్‌బాక్సీ ఫార్మా, ఫోర్టిస్ హెల్త్‌కేర్ సంస్థల అధినేతలు మాళవీందర్ సింగ్, శివీందర్ సింగ్ సోదరులు పెద్ద ఫ్రాడ్ చేసి, తీహార్ జైల్లోనే పడ్డారు. సుఖేశ్ కన్ను శివీందర్‌పై పడింది. లంచాల ద్వారా వశపరుచుకున్న జైలు అధికారుల ద్వారా అతనికి సంబంధించిన సమస్త వివరాలు సేకరించాడు. 2020 మేలో సుఖేశ్‌ను రోహిణి జైలుకి తరలించారు. అక్కణ్నుంచి అతను ఫోన్ ద్వారా శివీందర్ సింగ్ భార్య అదితికి ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ వివరాలు జైలు అధికారులు యితనికి యిచ్చారు. ఇతని ఫోన్‌లో ఇజ్రాయేలీ సిమ్ కార్డుతో పాటు స్పూఫింగ్ యాప్ ఉందని చెప్పాను కదా, దాని సహాయంతో 2020 జూన్‌లో అదితికి ఫోన్ చేసి, తను కేంద్ర హోం శాఖ నుండి ఫోన్ చేస్తున్నానని నమ్మించాడు.
‘‘నేను యూనియన్ లా సెక్రటరీ అనూప్ కుమార్‌ని. కరోనా ఉధృతంగా ఉంది. దాన్ని ఎలా కట్టడి చేయాలాని ప్రధాని కార్యాలయం తీవ్రంగా ఆలోచిస్తోంది. హెల్త్‌కేర్ రంగంలో మీ భర్తకున్న అనుభవాన్ని ఉపయోగించుకుంటే మంచిదని ఎవరో సూచించారు. ఆయన్ని బెయిల్ మీద బయటకు తీసుకుని వచ్చి, కరోనా కమిటీలో వేద్దామని సూచన వచ్చింది.’ అని చెప్పాడు. ఆ సాయంత్రం సుఖేశ్ మళ్లీ ఫోన్ చేశాడు. ఈసారి తన పేరు అభినవ్ అనీ, అనూప్ కుమార్‌కి అండర్ సెక్రటరీనని చెప్పుకున్నాడు. ‘సూచన వచ్చిన మాట నిజమే కానీ అది కార్యరూపం ధరించాలంటే మీరు కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుందని కుమార్ చెప్పమన్నారు. మీ భర్త యింట్లో సుఖంగా ఉండాలంటే మీరు రిస్కు తీసుకోక తప్పదు.’ అన్నాడు. ఎంత అంటే పార్టీ ఫండ్‌కు రూ. 20 కోట్లు యివ్వాలి అన్నాడు. ఆమె ఆలోచించి చెప్తానంది.
తర్వాతి రెండు మూడు రోజుల్లో మూడుసార్లు ‘అభినవ్’ ఫోన్ చేయడంతో ఆమె సరేనంది. ఒక కోటి రూపాయలు హాంగ్‌కాంగ్ ద్వారా పంపింది. 19 కోట్లు దిల్లీలోనే క్యాష్ ఏర్పాటు చేసింది. సుఖేశ్ మనుషులు వచ్చి పట్టుకెళ్లారు. కానీ సుఖేశ్ ఆశ తీరలేదు. ఇంకా డబ్బు కావాలని పీడించసాగాడు. జైలు అధికారుల ద్వారా సేకరించిన కచ్చితమైన సమాచారంతో అదితిని భయపెట్టాడు. మీరెక్కడ తిరుగుతారో తెలుసు, మీ పిల్లలు ఎక్కడ తిరుగుతారో తెలుసు. నీ భర్తకు చెప్పావో, వాళ్ల ప్రాణాలకే హాని అని బెదిరించాడు. అదితి పూర్తిగా దడిసిపోయింది. భర్తతో కాదు కదా, కుటుంబసభ్యు లెవ్వరితో చెప్పకుండా తన నగానట్రా అమ్మేసి, ఆస్తులమ్మేసి, డిపాజిట్లు తీసేసి యితనికి డబ్బు యిస్తూ పోయింది. ఆమె వెల్త్ మేనేజరు శిఖా సింగ్ ఓ యిద్దర్ని అప్పగించాడు. వాళ్లు యీమె ఆస్తులకు అమ్మేసి డబ్బుగా మార్చి సుఖేశ్ మనుష్యులకు యిచ్చారు. మధ్యలో భారీగా కమీషన్లు తీసుకున్నారు. కొందరు బ్యాంకు అధికారులు కూడా వీళ్లకు సహకరించారు. సుఖేశ్ వీళ్లందరికీ డబ్బిచ్చి ఆడించి ఉండవచ్చు. 2020 జూన్ నుంచి 2021 మే లోపున అదితి సుఖేశ్‌కి 40 ట్రాన్సాక్షన్లలో రూ.200 కోట్లు చెల్లించింది. దీనిలో కొంత వెచ్చించి లీనా చెన్నయ్‌లో పెద్ద భవంతి కొంది.
రాన్‌బాక్సీ కేసు నిందితుడి భార్య కాబట్టి అదితిపై ఈడీ నిఘా అప్పటికే ఉంది. సడన్‌గా యింత యాక్టివిటీ జరగడంతో వాళ్లకు అనుమానం వచ్చి అదితి వద్దకు వచ్చి నిలదీశారు. కొన్ని నెలలగా ఆవేదనతో కుమిలిపోతున్న అదితి ఏడ్చేసింది. సమస్తం చెప్పేసింది. ‘దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయి, మేం సుఖేశ్ పని పడతాం’ అంది ఈడీ. 2021 ఆగస్టులో ఆమె ఫిర్యాదు చేసింది. వెంటనే దిల్లీ పోలీసు సుఖేశ్‌ను అరెస్టు చేసింది. ఈడీ మనీలాండరింగ్ కేసు పెట్టింది. డబ్బు ఎలా వచ్చింది, ఎక్కడకు పోయింది అని వెతకడంతో డొంకంతా కదిలి, సుఖేశ్ పాత వ్యవహారాలన్నీ పేపర్లలో వచ్చేశాయి. కానీ సుఖేశ్ తను నేరం చేశానని ఒప్పుకోవటం లేదు. కార్పోరేట్ లాబీయింగులో నేను కోట్లు సంపాదించాను, వాటిని రియల్ ఎస్టేటులో, రిసార్టుల్లో పెట్టి, వ్యాపారాల్లో పెట్టి సంపద పెంచుకున్నాను అని చెప్పుకుంటున్నాడు.
మన ప్రభుత్వం దేశంలో జరిగే నేరాలకు, ఘోరాలకు పాకిస్తాన్ సైన్యాన్ని, ఐఎస్‌ఐని నిందిస్తూంటుంది. దేశంలో చాలామంది పాక్ భక్తులున్నారంటూ ప్రచారం హోరెత్తిస్తుంది. సర్జికల్ స్ట్రయిక్స్‌తో పాక్‌కు బుద్ధి చెప్పామంటుంది. ఉగ్రవాదులను అణచామంటుంది, వేర్పాటువాదుల నుంచి కష్టపడి దేశాన్ని కాపాడమంటుంది. ఇవన్నీ చేయడం మంచిదే కానీ యిక్కడున్న వ్యవస్థను బాగు చేయగలదా అనిపిస్తుంది సుఖేశ్ కథ వింటే. అతను మోసగాడు సరే, కానీ అతని వద్దకు వెళ్లినవారెవరు? అత్యాశాపరులు, అడ్డదారులు వెతికేవారు. అవినీతితోనైనా డబ్బు సంపాదించాలని చూసేవారు. వాళ్లలో మధ్యతరగతి వాళ్లూ ఉన్నారు, డబ్బున్నవాళ్లూ ఉన్నారు. బయటి శత్రువులతో పోరాడడం సరే, వ్యవస్థను కుళ్లబెడుతున్న యీ అంతశ్శత్రువుల మాటేమిటి? జైలు అధికారులు, పోలీసులు, బ్యాంకు అధికారులు అందరూ యీ దుర్మార్గాలలో పాలుపంచుకున్న వారే! ఇతని కేసులో వెయ్యి మంది అసలు కథ తెలిసింది. బయటపడని సుఖేశ్‌లు ఎన్ని వేల మంది ఉన్నారో తలచుకుంటే భయం వేస్తుంది.
2021 ఆగస్టులో ఈడీ రూ.200 కోట్ల కేసు పెట్టి సుఖేశ్‌ను, లీనాను తీహార్ జైల్లో పెట్టిన తర్వాత కూడా 2022 ఫిబ్రవరిలో తీహార్ జైలు నెం.4కు సంబంధించిన ముగ్గురు అధికారులకు లంచం యిచ్చాడని తాజా ఆరోపణ. దాంతో అతన్ని జైలు నెం.1కి మార్చారు. అతనూ, అతని భార్యా తమకు తీహార్ జైలులో ప్రాణభయం ఉందని, అందువలన అక్కణ్నుంచి వేరే జైలుకి మార్చాలని సుప్రీం కోర్టుకి పిటిషన్ పెట్టుకున్నారు. అయితే వాళ్లను మాండోలి జైలుకి మార్చండి అంది కోర్టు. కానీ అది కూడా తీహార్ నిర్వహణలోనే ఉంది. సుఖేశ్ తీహార్ నిర్వహణలో లేని జైలుకి మార్చాలంటూ మరో పిటిషన్ పడేశాడు. దిల్లీ పోలీసు వాళ్లు రోహిణి జైల్లో పనిచేసే 81 మంది ఉద్యోగులపై అవినీతి కేసులు మోపింది. అదితి సింగ్‌ను మోసం చేయడానికి సుఖేశ్‌కు సహకరించిన జైలు అధికారి మీనాను దిల్లీ పోలీసు అరెస్టు చేసింది.
ప్రస్తుతం సుఖేశ్‌పై 30కి పైగా కేసులున్నాయి. దేనిలోనూ యిప్పటివరకు శిక్ష పడలేదు. చాలావాటిల్లో విచారణ కూడా ప్రారంభం కాలేదంటే న్యాయవ్యవస్థ పరిస్థితి కూడా బోధపడుతుంది. 2018 జూన్ నుంచి 2021 జులై వరకు అతను ఏదో ఒక కారణం చెప్పి 300 రోజులు బెయిలు మీద ఉన్నాడు. ఇప్పుడు పెట్టిన సెక్షన్ల ప్రకారం శిక్ష పడినా మాగ్జిమమ్ పదేళ్ల శిక్ష పడుతుంది. చాలా కేసుల్లో బెయిలు సులభంగా దొరుకుతుంది. ఇప్పుడు ఈడీ కేసులు పెట్టింది కాబట్టి బెయిలు దొరకదు. కానీ ఈడీ జాక్విలిన్ మీద కేసు పెట్టినట్లు పిచ్చి చేష్టలు కావాలని చేసి, కేసులను నీరుకారుస్తుందేమో తెలియదు. (సమాప్తం) (ఫోటో – సుఖేశ్, జాక్విలిన్, శివీందర్ సింగ్, సుఖేశ్ భార్య లీనా)
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2022)