జన లోక్‌పాల్ బిల్లు పాస్ చేయడానికి ఎవరూ సహకరించలేదంటూ అలిగి అర్ధాంతరంగా గద్దె దిగిపోయినప్పటి నుంచి ఆప్‌కు దుర్దశ పట్టిందని అందరం అనుకుంటున్నాం. దురాశకు పోయి దేశమంతా నిలబడి, ఎక్కడా దృష్టి కేంద్రీకరించలేక చతికిలపడ్డారు కాబట్టి యిక వారు సోదిలోకి లేకుండా పోతారనే భావన వుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి విజయం కచ్చితం అనుకోవడం జరుగుతోంది. కానీ బిజెపి తన జాగ్రత్తలో తనుంది. ఎందుకంటే దేశమంతా మోదీ హవా వీచిన సమయంలో కూడా ఢిల్లీలో ఆప్‌కి ఓటింగు శాతం 4% పెరిగింది.
అసెంబ్లీ ఎన్నికలలో మోదీ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదని అక్షరాస్యత బాగా వున్న ఢిల్లీ ఓటర్లకు బాగా తెలుసు. ఆప్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా యింకా గ్లామర్ మిగిలివున్న అరవింద్ కేజ్రీవాల్ వున్నాడు. అతన్ని దీటుగా ఎదుర్కునేందుకు బిజెపి తన తరఫు నుండి ఎవరినైనా ముఖ్యమంత్రిగా చూపుతుందా అంటే చూపటం లేదు. ఢిల్లీ బిజెపిలో అంతఃకలహాలు చాలా ఎక్కువ. ఒకరి పేరు చెపితే మరొకరికి కోపం. ఇక దాని వలన కుట్రలు, వెన్నుపోట్లు, గోతులు తవ్వడాలు.. ఇవి జరగకూడదని 'హరియాణా, మహారాష్ట్రలలో మేం ముఖ్యమంత్రి పేరు ప్రకటించలేదు కదా, అలాగే యిక్కడానూ..' అంటోంది బిజెపి. చెప్పాలంటే ఆ రెండు రాష్ట్రాలలో బిజెపి ఎప్పుడూ అగ్రస్థానంలో లేదు. ఒంటిచేత్తో అధికారం అందుకున్నదీ లేదు.
Click Here For Great Andhra E-Paper
ఢిల్లీ పరిస్థితి అది కాదు. ఇక్కడంతా మాజీ మంత్రులు, ముఖ్యమంత్రులు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రప్రభుత్వం ఏర్పరచలేకపోవడంతో హర్షవర్ధన్ పార్లమెంటుకి ఎన్నికై కేంద్రమంత్రి అయిపోయారు. ఆయన తిరిగి వెళ్లే ప్రశ్న లేదు. ఆయనతో బాటు మరో యిద్దరు ఎమ్మెల్యేలు యిప్పుడు ఎంపీలయ్యారు. అందువలన జగదీశ్ ముఖీ అనే సీనియర్ బిజెపి నాయకుడే తన ప్రత్యర్థి అని అరవింద్ అంటున్నారు. తమకు 45 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో 29% ఓట్లు 27 సీట్లు తెచ్చుకున్నారు.
పార్లమెంటు ఎన్నికలలో 33% ఓట్లు వచ్చినా ఒక్క సీటూ దక్కలేదు. ఇప్పుడు అవినీతి, ప్రజలకు అధికారం వంటి హామీలతో బాటు విద్యుత్ ధరల విషయంలో సబ్సిడీ, ఉచితంగా నీటి పంపిణీ వంటి హామీలు కూడా యిస్తున్నారు. మూడో ప్రధానపక్షం కాంగ్రెసుకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. రంగంలోకి దిగకపోయితే క్యాడర్ చెల్లాచెదురై పోతుంది. షీలా దీక్షిత్‌ను మళ్లీ దింపుదామా అని ఆవిణ్ని అడిగి చూస్తే ఆవిడ దణ్ణం పెట్టేసిందట. మొన్న పార్లమెంటు ఎన్నికలలో ఓడిపోయిన వారినే అసెంబ్లీకి అభ్యర్థులుగా దింపి అదృష్టాన్ని పరీక్షించుకోమంటోంది.
ఎమ్బీయస్ ప్రసాద్