ఎమ్బీయస్‍: ఫలితాల విహంగవీక్షణం

ఐదు అసెంబ్లీ ఫలితాలు వచ్చేశాయి. వాటి గురించి యీ వ్యాసంలో విహంగావలోకనం చేస్తాను. పత్రికల్లో విపులమైన విశ్లేషణలు వచ్చిన తర్వాత వాటి సహాయంతో చిన్న రాష్ట్రాల గురించి ఒక దానిలో, పంజాబ్ గురించి, యుపి…

ఐదు అసెంబ్లీ ఫలితాలు వచ్చేశాయి. వాటి గురించి యీ వ్యాసంలో విహంగావలోకనం చేస్తాను. పత్రికల్లో విపులమైన విశ్లేషణలు వచ్చిన తర్వాత వాటి సహాయంతో చిన్న రాష్ట్రాల గురించి ఒక దానిలో, పంజాబ్ గురించి, యుపి గురించి వేర్వేరు వ్యాసాల్లో రాస్తాను. ముఖ్యంగా చెప్పుకోవలసినది 5టిలో 4 రాష్ట్రాలలో బిజెపి ఘనవిజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అన్ని చోట్లా మించింది, పంజాబ్‌లో తప్ప! అక్కడ గతంలో కంటె దెబ్బ తింది. బిజెపి యుపి యిత్యాది రాష్ట్రాలలో అందుకున్న విజయం కన్న ఘనంగా ఆప్ పంజాబ్‌లో నెగ్గింది. క్రైస్తవులు గణనీయంగా ఉన్న గోవా, మణిపూర్‌లలో కూడా బిజెపి సొంత మెజారిటీ తెచ్చుకుంది. యుపిలో సీట్ల సంఖ్య తగ్గినా ఓట్ల శాతం పెంచుకుంది. యోగి మళ్లీ నెగ్గి 37 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టారు. 8 ఏళ్లలో బిజెపి వరుసగా 40% కంటె ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది. ఎస్పీ గతంలో కంటె 2.4 రెట్లు సీట్లు తెచ్చుకుని, 10% ఓట్లు పెంచుకుంది కానీ ఆ కూటమికి ఎగ్జిట్ పోల్స్ 150 వస్తాయని అంచనా వేస్తే 125 దగ్గరే ఆగిపోయింది.

చావుదెబ్బ తిన్న పార్టీల్లో బియస్పీ, అకాలీ ఉన్నాయి. ఇక కాంగ్రెసైతే ఘోరాతిఘోర పరాజయం పొందింది. ఒక్క ఉత్తరాఖండ్‌లో మాత్రమే 8 సీట్లు, 4.4% ఓట్లు పెంచుకుంది. యుపిలో కంచుకోటలనుకునే రాయబరేలీ, అమేఠీలలో కూడా పార్టీ తుడిచిపెట్టుకుని పోయింది. వందలాది ర్యాలీలలో ప్రియాంకా పాల్గొని ప్రచారం చేసినా, ఓటర్లు కరుణించలేదు. ‘ఆంధ్రజ్యోతి’ కాంగ్రెసు గురించి ‘నెగ్గేదే-లే’ అని చమత్కరించింది. ఇప్పటికైనా గాంధీ నాయకత్వం తప్పుకుని సంస్థాగత ఎన్నికలు నిర్వహించి, ఎవరు నెగ్గితే వారికి ఆ యా రాష్ట్ర యూనిట్లు అప్పగిస్తే మంచిది. తను బతికుండగా సోనియా అది జరగనివ్వదు కాబట్టి, ప్రజాబలం ఉన్న నాయకులు కాంగ్రెసు నుంచి బయటకు వచ్చేసి ప్రాంతీయ పార్టీలు పెట్టుకుంటే మేలని యీ ఎన్నికలు చాటి చెప్పాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ క్రోడీకరించి ఎన్‌డిటివి వేసిన అంచనాలివి. ఫైనల్‌గా వచ్చినవి బ్రాకెట్లో యిచ్చాను.  యుపిలో బిజెపి ప్లస్‌కు 242 (273), పంజాబ్‌లో ఆప్‌కు 63 (92), గోవాలో బిజెపికి 15 (20), మణిపూర్‌లో బిజెపికి 30 (32), ఉత్తరాఖండ్‌లో బిజెపికి 35 (47).

40 సీట్ల గోవా – బిజెపికి సింపుల్ మెజారిటీకి ఒకటి తక్కువగా 20 వచ్చాయి. గతంలో కంటె 7 సీట్లు పెరిగాయి. ఓట్లు 0.8% పెరిగి 33.3% వచ్చాయి. కాంగ్రెసుకు 6 సీట్లు, 4.9% ఓట్లు తగ్గి 11 సీట్లు, 23.5% ఓట్లు వచ్చాయి. దానితో జత కట్టిన జిఎఫ్‌పికి 2 తగ్గి 1 సీటు 1.7% తగ్గి 1.8% ఓట్లు వచ్చాయి. బెంగాల్ నుంచి వచ్చి హడావుడి చేసిన తృణమూల్‌కు 5.2% ఓట్లు వచ్చినా ఒక్క సీటూ రాలేదు. దానిలో చేరిన మాజీ గోవా ముఖ్యమంత్రి చర్చిల్ ఓడిపోయాడు. దానితో పొత్తు పెట్టుకున్న ఎంజిపికి 1 సీటు తగ్గి 2 వచ్చాయి.3.7% తగ్గి 7.6% ఓట్లు వచ్చాయి. కొత్తగా వచ్చిన ఆర్‌జిపికి 1 సీటు 9.45% ఓట్లు వచ్చాయి. ఆప్‌కు 2 సీట్లు, 0.5% పెరిగి 6.8% ఓట్లు వచ్చాయి. ముగ్గురు స్వతంత్రులు గెలిచారు. వీళ్లు బిజెపికి అప్పుడే జై కొట్టారు. తృణమూల్ పొత్తు వదిలేసి, ఎంజిపి కూడా బిజెపికి సై అంది. మాజీ ముఖ్యమంత్రి పారికర్ కొడుకు ఉత్పల్ స్వతంత్రుడిగా పోటీ చేసి, 700 ఓట్ల తేడాతో బిజెపి అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు.

60 సీట్ల మణిపూర్ – పదేళ్ల క్రితం వరకు ఒక్క సీటూ లేని బిజెపి యీసారి ఒంటరిగా పోటీ చేసి, 32 స్థానాలు తెచ్చుకుని తనంతట తానే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. 11 సీట్లు పెరిగాయి. ఓట్లు 2.7% పెరిగి 37.8% వచ్చాయి. కాంగ్రెసు 23 సీట్లు, 18.6% ఓట్లు పోగొట్టుకుని, 5 సీట్లు, 16.8% ఓట్లు తెచ్చుకుంది. సంగ్మా ఎన్‌పిపికి 3 సీట్లు పెరిగి 7 వచ్చాయి. ఓట్లు 12.2% పెరిగి 17.3% వచ్చాయి. చివరివరకు బిజెపికి దగ్గరగా మసలిన ఎన్‌పిఎఫ్‌కు 1 పెరిగి 5 సీట్లు వచ్చాయి. ఓట్లు 0.9% పెరిగి 8.1% వచ్చాయి. కొత్తగా రంగంలోకి దిగిన జెడియుకు 10.77% ఓట్లతో 6 సీట్లు వచ్చాయి. కొత్తగా వచ్చిన మరో పార్టీ కెపిఏకు 2 రాగా, ముగ్గురు స్వతంత్రులు నెగ్గారు. 1972లో రాష్ట్ర హోదా వచ్చిన దగ్గర్నుంచి మణిపూర్‌ను సంకీర్ణ ప్రభుత్వాలే పాలిస్తూ వచ్చాయి. 2012లో కాంగ్రెసుకు 42 వచ్చి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచింది. మళ్లీ యిప్పుడు బిజెపి ఆ పని చేయబోతోంది.

70 సీట్ల ఉత్తరాఖండ్ – ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చడం చేత బిజెపి ఖ్యాతి మసకబారిందని, పరిస్థితి కాంగ్రెసుకు అనుకూలంగా మారుతుందని, బిజెపి తిరిగి వచ్చినా 35 సీట్ల కంటె గెలుచుకోదని అంచనాలు వేశారు. కానీ గతంలో కంటె 10 తగ్గి 47 తెచ్చుకుంది. ప్రతి ఎన్నికకు ప్రభుత్వం మారిపోయే సంప్రదాయాన్ని బిజెపి తిరగరాసింది. అంతఃకలహాలతో సతమతమైన కాంగ్రెసు అవకాశాన్ని చేజార్చుకుంది. 4.4% ఓట్లు, 8 సీట్లు పెంచుకుని 37.9% ఓట్లతో 19 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెసు ప్రముఖ నాయకుడు హరీశ్ రావత్ 18 వేల తేడాతో ఓడిపోయారు. ఎంతో హడావుడి చేసిన ఆప్‌కు ఒక్క సీటూ రాలేదు. బియస్పీ తన ముఖ్యకేంద్రమైన యుపిలో ఒక్క సీటుతో సరిపెట్టకున్నా, యిక్కడ మాత్రం 2 తెచ్చుకుంది. 2.2% ఓట్లు పెంచుకుని 4.8% తెచ్చుకుంది. బిజెపి 67% సీట్లు గెలుచుకున్నా దాని ముఖ్యమంత్రి పుష్కర్ ధామీ 7 వేల తేడాతో ఓడిపోయారు.

117 సీట్ల పంజాబ్- పంజాబ్ గురించి మంచి జోక్ విన్నాను. అక్కడ అందరూ సంతోషంగా ఉన్నారట. తనను ధిక్కరించిన కెప్టెన్ ఓడిపోయినందుకు రాహుల్ ఖుష్. సిద్దూ ఓడిపోయినందుకు కెప్టెన్ ఖుష్. తన సిఎం కుర్చీని ఎత్తుకుపోయిన చన్నీ ఓడిపోయినందుకు సిద్దూ ఖుష్. అనూహ్య పరిస్థితుల్లో కొద్దికాలం పాటైనా సిఎం అయినందుకు చన్నీ ఖుష్. అకాలీలతో సహా వీళ్లందరూ తుడిచిపెట్టుకుని పోయినందుకు ఓటరు ఖుష్! ఆప్ ముఖ్యమంత్రి కాండిడేటు భగవంత్ మాన్ తప్ప తక్కిన సిఎం కాండిడేట్లందరూ దారుణంగా ఓడిపోయారు. కెప్టెన్ పాటియాలాలోనే 20 వేల తేడాతో ఓడిపోయారు. అతనితో పొత్తు పెట్టుకున్న బిజెపికి గతంలో కంటె 1 స్థానం తగ్గి 2 వచ్చాయి. చాలా స్థానాల్లో పోటీ చేయడం వలన కాబోలు ఓట్లు 1.2% పెరిగి 6.6% వచ్చాయి.

సిద్దూని ఎప్పుడూ గెలిపిస్తూ వచ్చిన అమృతసర్ యీసారి 7వేల తేడాతో మొండిచేయి చూపించింది. చన్నీ ఎంత ప్రచారం గుప్పించినా, పోటీ చేసిన రెండు చోట్లా, ఆప్ నిలబెట్టిన అతి సామాన్యుల చేతిలో ఓడిపోయాడు. ఒక చోట 38 వేల తేడాతో, మరో చోట 8 వేల తేడాతో! కాంగ్రెసుకు 59 సీట్లు తగ్గి 18 వచ్చాయి. 15.5% ఓట్లు తగ్గి 23% వచ్చాయి. అకాలీ దళ్ అయితే పార్టీ అధినేత 94 ఏళ్ల ప్రకాశ్ సింగ్ బాదల్ 11వేల తేడాతో ఓడిపోయారు. గత 50 ఏళ్లగా ఆయన గెలుస్తూనే వస్తున్నారు. ఆయనే కాదు, ఆయన కుటుంబీకులందరూ ఓడిపోయారు, కోడలి ఆడపడుచు తప్ప! 12 సీట్లు తగ్గి 3 వచ్చాయి. 6.8% ఓట్లు తగ్గి 18.4% వచ్చాయి. ఆప్ 20 సీట్ల నుంచి 92 సీట్లకు ఎగసింది. 1997లో అకాలీ-బిజెపి కూటమికి 93 వచ్చాక యిదే రికార్డు. దీన్ని ఆప్ ఒంటరిగా సాధించింది. ఓట్లు 18.3% పెరిగి 42% వచ్చాయి.

403 సీట్ల యుపి – ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలు. ఇండియా టుడే-యాక్సిస్ బిజెపిప్లస్ 288-326, ఎస్పీప్లస్‌కి 71-101. టుడేస్ చాణక్య బిజెపి 294, ఎస్పీ 105, సిఎన్ఎన్, సీ మార్క్ బిజెపి 240, ఎస్పీ 140 న్యూస్ ఎక్స్ బిజెపి 223, ఎస్పీ 153. ఫలితాలు చూడబోతే, బిజెపికి గతంలో కంటె 1.6% ఓట్లు పెరిగి 41.3% ఓట్లతో, గతంలో కంటె 57 తక్కువగా 255 సీట్లు తెచ్చుకుంది. ఎస్పీకి గతంలో కంటె 10.2% ఓట్లు పెరిగి 32% ఓట్లతో, గతంలో కంటె 64 ఎక్కువగా 111 సీట్లు తెచ్చుకుంది. బిజెపికి భాగస్వామ్య పక్షాలైన నిషాద్‌కు 5 పెరిగి 6 సీట్లు, ఎపిఎస్‌కు 3 పెరిగి 12 వచ్చాయి. ఎన్‌డిఏ కూటమికి మొత్తం 273, అంటే 68% సీట్లు వచ్చాయి. ఎస్పీ భాగస్వామ్య పక్షాలైన ఆర్‌ఎల్‌డికి 7 పెరిగి 8, ఎస్‌బిఎస్‌పికి 2 పెరిగి 6 వచ్చి మొత్తం కూటమికి 125 వచ్చాయి. కాంగ్రెసుకు 5 తగ్గి 2 సీట్లు రాగా బియస్పీకి 9.4% ఓట్లు, 18 సీట్లు తగ్గి 1 సీటు, 12.9% ఓట్లు వచ్చాయి. ఆప్‌కు 0.3% ఓట్లు వచ్చాయి. మజ్లిస్‌కు 0.5% వచ్చాయి. ఇద్దరికీ సీట్లు నిల్.

యోగి 2.02 లక్షల ఓట్లతో, అఖిలేశ్ 67 వేల ఓట్లతో గెలిచారు. ఉపముఖ్యమంత్రుల్లో ఒకరైన కేశవ ప్రసాద్ మౌర్య ఏడు వేల తేడాతో ఓడిపోయారు. ఎన్నికలకు ముందు పార్టీలు మారిన 21 మందిలో 17 మంది ఓడిపోయారు. ఫిరాయింపుదారులలో బిజెపి ద్వారా పోటీ చేసినవారు 9 మంది, ఎస్పీ నుంచి 10 పోటీ చేశారు. బిజెపి మంత్రులుగా వుంటూ ఎస్పీలోకి చేరిన స్వామి ప్రసాద్ మౌర్య 45 వేల మార్జిన్‌తో ఓడిపోయాడు. ఫిరాయించిన మరో మంత్రి ధరమ్ సింగ్ సైనీ 315 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆందోళన చేస్తున్న రైతుల మీదుగా బిజెపి నాయకుడు కారు పోనిచ్చేసి 8మంది మృతికి కారకుడైనా లఖింపూర్ జిల్లాలో మొత్తం 8 సీట్లూ బిజెపి గెలుచుకుంది. ఘటన జరిగిన నియోజకవర్గంలో ఏకంగా 41 వేల ఓట్ల మార్జిన్‌తో బిజెపి గెలిచింది.

దళితబాలిక అత్యాచారానికి, హత్యకు గురైన హత్రాస్‌లో కూడా బిజెపియే గెలిచింది. 44 స్థానాలున్న పశ్చిమ యుపిలో జాట్ రైతులు, ముస్లిములు చేతులు కలిపేసి బిజెపిని ఘోరంగా ఓడగొట్టేస్తారనే అంచనాలూ తప్పాయి. అక్కడ 70% సీట్లు గెలుచుకుంది. 28 స్థానాలు నిలుపుకుని ఎస్పీ నుంచి 1, బియస్పీ నుంచి 1 గెలుచుకుని మొత్తం 30 తెచ్చుకుంది. 2013 నాటి ముజఫర్‌పూర్ నగర్ అల్లర్లను జాట్‌లు మర్చిపోకుండా బిజెపి చూడగలిగింది. ఎస్పీ-ఆర్‌ఎల్‌డి కూటమి 3 నిలుపుకుని, బిజెపి నుంచి 9, కాంగ్రెసు నుంచి 2 గెలుచుకుని మొత్తం 14 తెచ్చుకుంది.

యోగి పాలనలో ఎన్నో లోపాలున్నాయి. కరోనా సమయంలో ప్రజలు ఎన్నో యిక్కట్లు పడ్డారు. అయినా యోగికే మళ్లీ పట్టం కట్టడానికి కారణం ఏమిటి? అన్నదానికి శాసన్-రేషన్ (వాళ్లు రేసన్ అనే పలుకుతారు కాబట్టి ప్రాస కుదురుతుంది) అని సమాధానం వస్తోంది. ఎస్పీ పాలనలో గూండాలు వీరవిహారం చేశారు. యోగి పాలనలో గూండాలను అతి క్రూరంగా అణచివేయడం జరిగింది. పోకిరీలను జైల్లో పడేశారు. శాంతిభద్రతలు మెరుగుపడ్డాయి. బయట తిరగడానికి మహిళలకు ధైర్యం పెరిగింది. కేసుల సంఖ్య పెరగలేదని కాదు. పెరిగాయి. పైగా అనేక కేసులు నమోదు చేయడం లేదని, రక్షణ పూర్తిగా లేదని, తప్పు చేసినవారు బిజెపి వారైతే వదిలేస్తున్నారనీ కూడా ఫిర్యాదులున్నాయి. ఏది ఏమైనా యోగి ప్రచారం అనండి, మరోటనండి, ప్రజల్లో ఒక భద్రతాభావం కలిగింది. అందుకని మహిళలలో అధిక శాతం యోగి ప్రభుత్వానికి ఓటేశారు అంటున్నారు. పూర్తి గణాంకాలు వచ్చాక వివరాలు రాస్తాను.

బిహార్‌లో నీతీశ్ యిలాగే నెగ్గుకుని వస్తున్నాడు. లాలూ హయాం గూండాగిరీకి మారుపేరుగా మారాక నీతీశ్ శాంతిభద్రతలను మెరుగు పరచడం చేత మహిళలు అతనికే ఓటేస్తున్నారు. నిజానికి నీతీశ్ పాలనాసామర్థ్యం టర్మ్ టర్మ్‌కు తగ్గుతూ వస్తోంది. సీట్ల సంఖ్య కూడా తగ్గుతోంది. అయినా గెలుపు మాత్రం సిద్ధించడానికి యిదే ముఖ్యకారణం. అలాగే ఎస్పీ పాలనలో ములాయం అనుచరులు చలాయించిన హింసారాజకీయాలకు అఖిలేశ్ మూల్యం చెల్లిస్తున్నాడు. బిజెపి ఓడిపోతే మళ్లీ శాంతిభద్రతలు దెబ్బ తింటాయనే భయమే యోగి పట్ల మొగ్గు చూపిందిట. రెండో పాయింటైన రేషన్. మన తెలుగు రాష్ట్రాలలో చేస్తున్నట్లే ప్రభుత్వధనంలో సింహభాగం సంక్షేమ పథకాలకే పోతోంది. అయితే గతంలో కంటె డెలివరీ విధానం చాలాచాలా మెరుగుపడింది. దళారులు లేకుండా డైరక్టుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బు వెళ్లిపడుతోంది. దీనిలో ఏ వివక్షతా చూపటం లేదు. మొత్తం జనాభా 20 కోట్లుంటే, 15 కోట్ల మందికి ఏదో ఒక విధంగా ప్రభుత్వసాయం అందుతోంది.

కరోనా టైములో కేంద్రం ప్రకటించిన ఉచిత రేషన్‌కు, రాష్ట్రప్రభుత్వం మరి కొంత జోడించి కొన్ని నెలలపాటు రేషన్ అందేట్లు చేసింది. ఈ సంక్షేమాల కారణంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులు వెనకబడ్డాయి. ఆరోగ్యవసతులు కల్పించడానికి నిధులు లేవు. అయినా ప్రజలు అవేమీ పట్టించుకోలేదు. యుపిలో తిరిగిన టీవీ జర్నలిస్టులు చెప్పారు, ‘ధరలు పెరిగాయి, ఉద్యోగాలు పోయాయి, ఆలనాపాలనా లేని పశువుల కారణంగా పంటలు నాశనమౌతున్నాయి, పంటలకు గిట్టుబాటు ధరలు లేవు, కరోనా టైములో ఆక్సిజన్ దొరకలేదు..’ యిలా ఓటర్లు అన్ని రకాల ఫిర్యాదులు చెప్పి చివర్లో ‘కానీ పాపం యోగి ఏదో చేస్తున్నారు, ఆయనకే ఓటేస్తాం’ అని ముక్తాయించేవారట. దీనికి తోడు హిందూత్వ ఆకర్షణ, బిజెపి సంస్థాగత శక్తి ఎలాగూ వుంది.

ఇన్ని ఉన్నా యోగి ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చేయాలనే తహతహ ఓటర్లలో లేదనేది నిర్వివిదాంశం. పోలయిన ఓట్ల శాతం చూస్తే అది స్పష్టమౌతుంది. యోగి అంటే యిష్టం లేదు, అలా అని అఖిలేశ్ ఏం ఊడబొడుస్తాడో తెలియదు. ఉన్నదాని కంటె పరిస్థితి హీనమవుతుందేమో అనే భయంతో, నథింగ్ టు చూజ్ ఫ్రమ్ అనుకుని చాలామంది ఓటర్లు ఉదాసీనంగా ఉన్నారు. బిజెపి, ఆరెస్సెస్ క్యాడర్ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి, ప్రతి బూత్‌పైన దృష్టి పెట్టి పని చేస్తేనే ఆ మాత్రం మందిని లాక్కుని రాగలిగారు. లేకపోతే సరాసరి ఓటింగు 50% కంటె తక్కువే ఉండేదేమో! తర్వాత రాయబోయే వ్యాసాల్లో ప్రాంతాల వారీ, కులాల వారీ ఓటింగు సరళి ఎలా వుందో రాస్తాను.

­- ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2022)

[email protected]