ఇది పెరోల్‌ సీజన్‌

తిహార్‌ జైలులో వున్న విఐపి ఖైదీలందరికీ కోర్టువారు డిసెంబరు నెలలో ఎడాపెడా పెరోల్‌ యిచ్చేశారు. జెస్సికా లాల్‌ హత్య కేసులో నిందితుడు మను శర్మ అలియాస్‌ సిద్దార్థ్‌ వశిష్ట శర్మకు డిసెంబరు 18న 9…

తిహార్‌ జైలులో వున్న విఐపి ఖైదీలందరికీ కోర్టువారు డిసెంబరు నెలలో ఎడాపెడా పెరోల్‌ యిచ్చేశారు. జెస్సికా లాల్‌ హత్య కేసులో నిందితుడు మను శర్మ అలియాస్‌ సిద్దార్థ్‌ వశిష్ట శర్మకు డిసెంబరు 18న 9 రోజుల పెరోల్‌ వచ్చింది. 36 ఏళ్ల మను తను పోస్టు గ్రాజువేట్‌ పరీక్షకు హాజరు కావడానికి గాను  పెరోల్‌ యివ్వాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరాడు. వాళ్లు కిమ్మనలేదు. చూసి చూసి ఢిల్లీ హై కోర్టును ఆశ్రయిస్తే వారు అనుమతి యిస్తూ ఆ పరీక్షను ఢిల్లీ సెంటరులోనే రాయాలని షరతు విధించారు. అంతకుముందు యూత్‌ కాంగ్రెసు నాయకుడు సుశీల్‌ శర్మకు కూడా  డిసెంబరు మధ్యలో పెరోల్‌ యిచ్చారు. తందూరి మర్డర్‌ కేసులో అతనికి ఉరిశిక్ష పడింది. దాన్ని అక్టోబరులో జీవితఖైదుగా మార్చారు. 18 ఏళ్లగా జైల్లో వున్నాడు. అతని బెయిలుకి కారణమేమంటే  – అతని ముసలి తలిదండ్రులను వెళ్లి చూసి వస్తాట్ట. 

ఈ శర్మద్వయానికి కంటె ముందు హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌటాలా ఆరోగ్యకారణాలపై యిచ్చారు.  2013 జులైలో ఆరోగ్య కారణాలపై చౌటాలా బెయిలు తీసుకున్నాడు. దాన్ని ఆగస్టులో మళ్లీ పొడిగించారు. సెప్టెంబరు వచ్చినా అతను జైలుకి తిరిగి రాకపోవడంతో సుప్రీం కోర్టు వైద్యనిపుణుల బృందాన్ని నియమించి వాళ్ల అభిప్రాయాన్ని కోరింది. అతను నిక్షేపంలా వున్నాడనీ, ఆసుపత్రివాసం అక్కరలేదని వాళ్లు చెప్పడంతో బెయిలు రద్దు చేసి జైలుకి పంపారు. ఇప్పుడు మళ్లీ హృద్రోగం అంటూ రామ్‌ మనోహర్‌ లోహియా ఆసుపత్రిలో చేరాడు. బెయిల్‌ కోరాడు. కోర్టు యిచ్చింది. ఎన్నికల సమయం కదా, పొత్తుల గురించి మాట్లాడవలసిన విషయాలు చాలా వుంటాయి మరి. ఖైదులో పడేస్తే ఎలా? ముసలాయన కాబట్టి అనారోగ్యం సహజం అనుకోకండి. అదే కేసులో సహనిందితుడిగా వున్న అతని కొడుకు అజయ్‌కు కూడా అనారోగ్యమే పాపం! ఆ సాకు చెప్పి మాటిమాటికీ బెయిలు అడుగుతున్నాడు, పొందుతున్నాడు. డిసెంబరులో తాజాగా మళ్లీ పొందాడు.

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ – న్యూస్‌, వ్యూస్‌, రివ్యూస్‌ – (జనవరి 2014)

[email protected]