ఇప్పటిదాకా ఇంద్రాణీ ముఖర్జీ పేరు వినగానే సొంత కూతురు షీనా బోరాను దారుణంగా హత్య చేసిన దుర్మార్గురాలేగుర్తుకు వస్తుంది. భర్త పీటర్ ముఖర్జీ డబ్బుతో టీవీ ఛానెల్ పెట్టినపుడు చలాయించిన పెత్తనమే గుర్తుకు వస్తుంది. కానీ యిటీవల ఆవిడ చేసిన ఒక సాహసకృత్యం వలన ఆమెలో మరో కోణం – మానవహక్కుల కోసం పోరాడే కోణం – బయటపడింది. ప్రస్తుతం ఆమె షీనా బోరా హత్య కేసులో కోర్టుకి హాజరవుతోంది. నాలుగు నెలల విరామం తర్వాత కోర్టు విచారణ మళ్లీ చేపట్టింది. కేసులో ఆమె సహనిందితులుగా వున్న ఆమె రెండో భర్త సంజీవ్ ఖన్నా, మూడో భర్త పీటర్ ముఖర్జీ కూడా హాజరవుతున్నారు.
ఆర్నెల్ల క్రితం పీటర్‌తో ఆమె విడాకులకై అభ్యర్థన పెట్టుకుంది. 2012లో హత్య జరిగితే 2015లో అది వెలుగులోకి వచ్చింది. అప్పణ్నుంచి ఆమెను బైకుల్లా జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో పెట్టారు. అక్కడ 291 మంది మహిళా అండర్‌ట్రయల్ (కేసులు విచారణ దశలో వున్నవారు) ఖైదీలున్నారు. ఇతర జైళ్లలో లాగానే వాళ్ల పరిస్థితీ బాగా లేదు. ఇంద్రాణి వాళ్ల అవస్థల గురించి గళమెత్తింది. ఆహార ఎలవెన్సు పెంచాలంటూ మహజర్లు పెట్టింది. ఇతర ఖైదీలు ఆమెతో కలిసి ఆందోళన చేయసాగారు. సహజంగా జైలు అధికారులకు యిది నచ్చలేదు. ఖైదీలను అదుపు చేయబోయారు. బాగా అల్లరి చేసినవాళ్లను పట్టుకుని చావగొట్టారు.
అలా దెబ్బ తిన్నవాళ్లలో 45 ఏళ్ల మంజులా షేత్యే అనే మహిళ ఉంది. ఆమె తన తల్లితో కలిసి వదినగార్ని హత్య చేసి జైల్లో పడింది. మంజులా, ఆమె తల్లి పుణెలోని ఎరవాడ జైల్లో గడిపారు. తల్లి ఏడునెలల క్రితం చనిపోయింది. ఈమెకు వార్డన్‌గా ఉద్యోగం యిచ్చారు. జైలులో కొన్ని ప్రాంతాలకు తప్ప తక్కిన అన్నిచోట్లకూ వెళ్లవచ్చు. నెలన్నర క్రితం యీ జైలుకి బదిలీ చేయించుకుంది. ఇంతలో సిబ్బందికి, ఆమెకు ఏం గొడవ వచ్చిందో తెలియదు. వాళ్లు ఆమెను బాగా కొట్టారు.
ఆ దెబ్బల తీవ్రత వలన ఆమె కొన్ని రోజులకు అంటే జూన్ 23న చనిపోయింది. దాంతో ఇంద్రాణి నాయకత్వంలో 200 మంది ఖైదీలు రెచ్చిపోయి, గోడలెక్కి రెండంతస్తుల జైలరు యింటి మిద్దెమీదకు ఎక్కి నినాదాలు చేశారు. కాగితాలూ, బట్టలూ తగలబెట్టారు. జైలు అధికారులు వాళ్లపై గలభా (రయట్), కుట్ర కేసు పెట్టి అదే చేత్తో మంజులను కొట్టిన ఆరుగురు జైలు సిబ్బందిని సస్పెండ్ చేసి అరెస్టు చేశారు.
అయితే ఇంద్రాణి ఊరుకోలేదు. మూడు పేజీల ఫిర్యాదు రాసి నాగ్పాడా పోలీసు స్టేషన్లో దాఖలు చేసింది. జైలర్ మనీషా పోఖార్కర్, యింకో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరింది. 'వాళ్లు నన్ను కూడా కొట్టారు, గాయాలయ్యాయి. జైలు సూపరింటెండెంట్ చంద్రామణి ఇందూర్కర్కు ఫిర్యాదు చేస్తే అతను నన్ను తిట్టాడు. మా అందరిపై పగబట్టాడు' అని ఆరోపించి నాకు మెడికల్ టెస్టు చేసి గాయాలున్నాయో లేదో తేల్చమనండి అని సెషన్స్ కోర్టుని అడిగింది.
మహారాష్ట్ర విమెన్స్ కమిషన్ వారు యీ సంఘటనపై స్పందించి సుమోటోగా చేపట్టి సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీము) చేత విచారణ జరిపిస్తామంటున్నారు. తన బాధల్లో తను వున్నా యితర ఖైదీల బాగోగుల కోసం ఉద్యమించిన ధీరవనితగా ఇంద్రాణి మెప్పు పొందసాగింది.
ఇదంతా పెద్ద నాటకం అని కొట్టి పారేసింది ప్రముఖ కాలమిస్టు శోభా దే. ''ముంబయి మిర్రర్'' పత్రికలో రాసే కాలమ్‌లో ''తనకున్న పాతకురాలి యిమేజిని మార్చుకోవడానికే ఇంద్రాణి యీ ప్లాను వేసింది. పెద్ద టీవీ ఛానెల్ నడిపిన దిట్ట. కూతుర్ని సోదరిగా ఏళ్ల తరబడి చలామణీ చేసిన జాణ. తన ప్లాన్లకు అడ్డు వస్తోందంటే నిర్దాక్షిణ్యంగా చంపి పాతేసిన ఘాతకి. ఖైదీలకు నాయకత్వం వహించలేదా? ఖైదీల్లో ఒకరికి పొగ తాగే అలవాటుంది. ఆమె దగ్గర అగ్గిపెట్టె వుంది. ఆ అగ్గిపుల్లలతో పుస్తకాలు, పేపర్లు, బట్టలు తగలబెట్టమని సలహా యిచ్చినది ఇంద్రాణే. ఖైదీల పిల్లలు కూడా అక్కడే వుంటారు.
జైలు అధికారులు దగ్గరకు రాబోతే వాళ్లను మధ్యలో పెట్టుకుని బెదిరిస్తూ దహనకాండ పూర్తి చేశారు. ఇప్పుడు మహిళా హక్కుల కార్యకర్త అవతారం ఎత్తింది. ఛార్లెస్ శోభరాజ్ కూడా యిలాగే చేశాడు. ఈమె అతని ఆడవెర్షన్.' అని కొట్టి పారేసింది. ఇంద్రాణి అసలు ఉద్దేశమేమిటో యిప్పట్లో తెలియదు. కానీ జైల్లో పరిమితికి మించి ఖైదీలను వుంచుతున్నారనీ, వారికి సరిగ్గా తిండీతిప్పలు వుండటం లేదనీ వెలుగులోకి వచ్చింది. ఇంద్రాణి మాట ఎలా వున్నా, ఆ పరిస్థితిని చక్కదిద్దితే అంతే చాలు.
(ఫోటో – కస్టడీలో ఇంద్రాణీ ముఖర్జీ)
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]