మూడు దశాబ్దాల పాటు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన జమున గారు వెళ్లిపోయారు. ఆవిడకిచ్చిన నివాళి, అంత్యక్రియలు జరిగిన తీరు చూస్తే ‘ఇంతేనా?’ అనిపించింది. ఇటీవలే సత్యనారాయణగారు పోయినప్పుడు ఎలా జరిగిందో, యీవిడ పోయినప్పుడు ఎలా జరిగిందో తేడా స్పష్టంగా కొట్టవచ్చినట్లు కనబడింది. ఆయన కంటె యీవిడ సినీరంగంలో ఆరేళ్లు సీనియర్. సత్యనారాయణ చాలా కాలం పాటు చిన్న పాత్రలే వేశారు. విలన్ పాత్రలు, కారెక్టరు పాత్రలతోనే పేరు వచ్చింది. మరి జమున? పాతికేళ్లపాటు హీరోయిన్గా ఉన్నారు. భారతదేశ నటీమణుల్లో నాకు తెలిసి ఎవరూ అంతకాలం హీరోయిన్గా లేరు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ రంగాల్లో అగ్రశ్రేణి, ద్వితీయ శ్రేణి హీరోలతో నటించడమే కాదు, తెలుగులో రెండు తరాల నటుల సరసన నటించారావిడ. రెండు తరాల కథానాయికల పక్కన వేషాలు వేసిన హీరోలు కనబడతారు తప్ప హీరోయిన్లు కనబడరు.
సత్యనారాయణ గారికి ప్రభుత్వలాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఆయన ఓసారి ఎంపీగా ఎన్నికయ్యాడు కాబట్టి అందామా? ఈవిడా ఓసారి ఎన్నికైంది. ఆయన రాజకీయాల్లో ఎన్నికల సమయంలోనే ప్రచారం చేశారు. ఈవిడలా సోషల్ వర్క్ చేసి ‘ప్రజానటి’ వంటి బిరుదు తెచ్చుకోలేదు. సోషల్ కాజ్ కోసం విరాళాలు సేకరించింది లేదు, ఇతర కళాకారుల కోసం శ్రమించింది లేదు. జమున పెదనాన్నగారు కమ్యూనిస్టు. ఈవిడ ప్రజా నాట్యమండలి ద్వారానే సినిమాల్లోకి వచ్చింది. ప్రజాసేవలోకి రావడానికి అది దోహదపడి ఉండవచ్చు. తెలుగు పరిశ్రమలో అందరి కంటె ముందుగా హైదరాబాదుకి వచ్చేసిన హీరోయిన్ ఆవిడ. హైదరాబాదులో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినపుడు ఈవిణ్ని సంగీత నాటక అకాడెమీకి నామినేట్ చేశారు. అకాడమీ బిల్డింగు ఫండ్ కోసం ఈవిడ ఓ స్టార్‌నైట్ ఆర్గనైజ్ చేసి 16 లక్షల దాకా వసూలు చేసి యిచ్చారు.
అది చూసి రంగస్థల వృత్తి కళాకారుడు ఒకతను ‘అమ్మా మమ్మల్ని ఆదుకోండి’ అని కోరాడు. అప్పుడు వాళ్ల అసోసియేషన్‌కి ఈవిడ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించి కారేసుకుని ఉత్తరాంధ్ర అంతా తిరిగి సభ్యులను చేర్పించారు. ఈవిడ ఉత్సాహం చూసి అనేకమంది స్పందించారు. క్రమంగా వృత్తి కళాకారుల సమాఖ్యలో 10 వేల మంది సభ్యులయ్యారు. 26 బ్రాంచ్‌లు ఏర్పడ్డాయి. స్టేజి నుండి సినిమాల్లోకి వచ్చిన అనేకమంది చెయ్యని పనిని జమునగారు చేశారు. అది మెచ్చుకోదగ్గ విషయం. ఈవిడ వర్క్ చూసి అంజయ్యగారు నాటక అకాడెమీకి చైర్మన్‌గా చేశారు. ఈ రెండు పదవుల ద్వారా కళాకారులకు గవర్నమెంటు పెన్షన్లు అందిస్తూ, ఇళ్లు కట్టించారు. ఈవిడ పేర తూర్పు గోదావరి జిల్లాలో జమునా నగర్ అనే కాలనీ కూడా ఉంది. ఈ పని చేస్తూ వుండగా కాంగ్రెసు ప్రభుత్వం పోయి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. జమున గారు వెంటనే రాజీనామా పత్రం రాసుకుని ఎన్టీయార్ వద్దకు వెళ్లి ‘నాది నామినేటెడ్ పోస్ట్. నైతికంగా నేను రాజీనామా చేస్తున్నాను’ అని లెటర్ చేతికి యిచ్చారు. దానికి రామారావుగారు ‘జమునగారూ, మీరు బాగా చేస్తున్నారని తెలుసు. కంటిన్యూ అవండి’ అంటూ రాజీనామా చింపేశారు..
అయితే తర్వాత గ్రాంట్లు రావడంలో చాలా ఆలస్యం జరిగింది. ఎడ్మినిస్ట్రేటివ్ కారణాలే కావచ్చు. కానీ పెన్షన్ అందక ఓ 90 ఏళ్ల కళాకారుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఈవిడ చలించిపోయి వెంటనే రాజీనామా చేసేశారు. జమున టాలెంట్ ఇందిరా గాంధీ దాకా చేరింది. ఆవిడ ఫోతేదార్కి చెప్పి ఈవిణ్ని కాంగ్రెసులో చేరమన్నారు. 1983 ఆగస్టులో కాంగ్రెసులో చేరారీవిడ. రెండు చోట్ల మధ్యంతర ఎన్నికల్లో ఎన్టీయార్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఓ చోట ఆవిడ కాండిడేట్ నెగ్గాడు కూడా. దానితో పార్టీ రాజకీయ చైతన్యం బాగా వున్న రాజమండ్రి ఎంపీ సీటుకి టిక్కెట్ యిచ్చింది. ఆవిడ మూడేళ్లు పార్లమెంటు సభ్యురాలిగా వున్నారు. సినిమాల్లో పనిచేసేటప్పుడే తమిళం, హిందీ రాయడం, చదవడం కూడా నేర్చుకున్నారు. పార్లమెంటులో ప్రసంగించేవారు.
ఈవిడ ఎంపీగా వుండగానే అప్పట్లో పుష్కరాలు కూడా వచ్చాయి. పుష్కరాల పనులు సూపర్వైజ్ చేయడం, వ(ర)ల్డ్ బ్యాంకు నుండి రోడ్ల విస్తరణకు గ్రాంట్ తెప్పించడం.. యిలా చురుగ్గా పనిచేశారు. ఆ తర్వాత వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోయారు. 1994లో కాంగ్రెసు మహిళా విభాగం అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలి. ఈవిడ ఎంత చేసినా వాళ్లు గ్లామర్, హార్డ్ వర్క్ వుపయోగించుకున్నారే కానీ మంచి పదవులు యివ్వలేదు. ఈవిడను లెక్క చేయలేదు. ప్రాణం విసిగి, 9 నెలల్లోనే మహిళా విభాగం పదవికి రాజీనామా చేశారు. రాజీవ్‌గాంధీ పోయిన తర్వాత ఈవిడకు అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేశారు. సైడ్‌లైన్ చేసేశారు. కాంగ్రెసుపార్టీ వాజ్‌పేయి గారి ప్రభుత్వాన్ని కూలగొట్టడం ఈవిడకు కోపం తెప్పించింది. అక్కడ రిజైన్ చేసి బిజెపిలో చేరింది. అక్కడా యాక్టివ్‌గా ఏమీ లేరు.
ప్రతీ నటుడికి, ప్రతీ నటికి ప్రభుత్వం తరఫున అంత్యక్రియలు జరగాలని నేననను. కానీ ప్రజాక్షేత్రంలో, సేవారంగంలో కూడా జమున కంట్రిబ్యూషన్ సత్యనారాయణ గారి కంటె తక్కువేమీ కాదని చెప్పడానికే యివి రాశాను. ప్రభుత్వం సంగతి వదిలేయండి, సినీరంగమైనా ఘననివాళి అర్పించాలి కదా. ఫిలిం ఛాంబర్లో ఓ గంట సేపు శవాన్ని ఉంచి తరలించేశారు. ‘‘కాగజ్ కే ఫూల్’’ సినిమాలో పాత తరాన్ని కృతఘ్నతతో తృణీకరించే కాగితపు పూలవనంగా సినీరంగాన్ని చూపాడు గురుదత్. అనేక సినీనిర్మాణ సంస్థలు తమ తొలి సినిమాలో జమున నటిస్తే విజయపరంపరతో దశాబ్దాల పాటు సాగవచ్చని నమ్మిన రోజులున్నాయి. ఆ గోల్డెన్ లెగ్ హీరోయిన్ను చూడడానికి ఎందరు అగ్రనటీనటులు వచ్చారీవేళ? ఆనాటి హీరోల్లో మురళీమోహన్ ఒక్కరే రావడమే కాదు పాడె మోశారు కూడా.
హీరోయిన్లలో ఎవరూ వచ్చినట్లు లేదు. జమున పాతికేళ్ల పాటు గ్లామరస్ హీరోయిన్గా ఉండడమే కాదు, ఆత్మాభిమానం, స్వాతిశయం ఉన్న నటీమణి అంటే ఏమిటో లోకానికి చాటిన ధీరవనిత. ‘మేం కూడా మీటూ..కి బలైనవారమే’ అని పదేళ్లు పోయాక నిట్టూర్చే తారామణులు జమునను చూసి సిగ్గుపడాలి. అగ్రహీరోల ముందు కూడా కాలు మీద కాలేసుకుని కూర్చునే గట్సున్న ఫిమేల్ స్టార్ అనే ఖితాబు గుర్తు చేసుకునైనా యీనాటి హీరోయిన్లలో కొందరు వచ్చి అంజలి ఘటించాల్సింది. జమునను చూసి కళాకారిణులు చాలా నేర్చుకోవాలి. మంచి ఆలవాట్లతో ఫిజిక్ ఎలా కాపాడుకోవాలన్నది మొట్టమొదటి విషయం. పిల్లలు పుట్టాక పదేళ్ల దాకా హీరోయిన్ రోల్స్ వేస్తూనే వున్నారు. కొడుకు పుట్టాక ఆవిడ కథానాయికగా వేసిన సినిమా ‘మనసు-మాంగల్యం’. ఎక్కడా లావుగా అనిపించదు. రాజకీయాల్లోకి వెళ్లాక 1983 ఎన్నికల్లో ఊరూరూ తిరిగి 5,6 వేల ఉపన్యాసాలు యిచ్చారు. ఎన్టీయార్‌తో పోటీపడి చైతన్యరథం మోడల్ వాహనంలో ఈవిడా తిరగగలిగిందంటే ఆవిడ స్టామినా ఎలాటిదో చూడండి. 86 వచ్చినా యింకా సభల్లో పాల్గొంటూ, యింటర్వ్యూలు యిస్తూనే ఉన్నారు. మెడ ఊగే వ్యాధి ఒక్కటే ఆమె పాలిట శాపం.
తెర మీద సాహసవనితలా కనబడే అనేమంది తారామణులు తెర వెనుక కుటుంబం చేతిలో కీలుబొమ్మల్లా ఉంటారు. తలిదండ్రులో, అక్కచెల్లెళ్లో, అన్నదమ్ములో, సమీప బంధువులో వీళ్ల ఆదాయాన్ని కాజేస్తూ ఉంటారు. వీళ్లను సరిగ్గా తిండి తిననివ్వరు. ఎవరినైనా పెళ్లి చేసుకుంటానంటే బంగారు బాతు యింకోరి వశమై పోతుందనే భయంతో పెళ్లి చెడగొడతారు. జమున విషయంలో ఆమె తలిదండ్రులు ఎంతో చక్కగా ఆమె కెరియర్ నడిపిస్తూ, ఆమె సంపదను నిర్వహించారు. లక్షణంగా పెళ్లి చేసి ఆమె ఆస్తిపాస్తులను ఆమెకు భద్రంగా అప్పచెప్పారు. ఆవిడ సంపాదనపై పడి తినాలనుకోలేదు. ఈనాటి హీరోయిన్లు తమ తలితండ్రులను ‘మీరు జమున అమ్మానాన్నల్లా ఎందుకుండరు?’ అని అడగాలన్నా ఆమె గురించి తెలుసుకుని గౌరవాన్ని ప్రకటించాలి. అనేక మంది హీరోయిన్లు హీరోలను పెళ్లి చేసుకుని ఇగో సమస్యలతో బాధపడతారు. రెండోపెళ్లివాణ్ని చేసుకుని, యింకో స్త్రీ కాపురాన్ని చెడగొట్టి, తర్వాత కొన్నాళ్లకు తమ కాపురం చెడిపోతే దుఃఖిస్తారు. లేదా డబ్బున్న బిజినెస్‌మన్‌ను పెళ్లి చేసుకుని, అతను తనను తన వ్యాపారప్రయోజనాలకు వాడుకుంటున్నాడని ఆరోపించి విడిపోతారు. తమ జీవితంలోని టెన్షన్లు సినిమారంగానికి చెందిన వారయితేనే అర్థం చేసుకుంటారని సినిమా తారలందరూ అనుకునే సమయంలో జమున బయటివాడిని చేసుకుంది. అప్పటిదాకా అలా చేసుకున్న తార పద్మిని మాత్రమే. తెలుగుతారల్లో ఎవరూ లేరు.
జమున తన కంటె తక్కువ ఆదాయం వచ్చే ఎకడమిషియన్ను పెళ్లి చేసుకుంది. సినీనటి ఆదాయం ముందు లెక్చరర్ ఆదాయం ఎంత చెప్పండి. భర్తకు డాక్టరేటు పూర్తయి, ఉస్మానియాలో ఉద్యోగం రాగానే హైదరాబాదుకి తరలి వచ్చేసింది. అసలు ఆవిడ భర్త సెలక్షన్ కూడా తమాషాగా జరిగింది. ఆవిడకి 28 యేళ్లు వచ్చి సినిమాల్లో బాగా పేరు తెచ్చుకున్నాక పెళ్లి చేద్దామనే ఆలోచన తలిదండ్రులకు వచ్చింది. కానీ యింత డబ్బున్న, పేరున్న సినిమాతార పెళ్లాడుతుందంటే బోల్డుమంది వచ్చిపడతారు. వాళ్లలో సెలక్షన్ మహా కష్టం. అందుకని వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండ్, సినీనిర్మాత డియల్ నారాయణ గారు ‘మా వినోదా వాళ్లు తీయబోయే సినిమాకు కథానాయకుడిగా వేషం వేయడానికి విద్యాధికులు కావాలి, వివరాలూ, ఫోటో పంపండి’ అని ప్రకటన యిచ్చారు.
ఓ పదిహేనుమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు ఫోటోలు పంపారు. అందులోంచి యిద్దర్ని ఫిల్టర్ చేశారు. ఒకాయన డాక్టర్. ఆయన అమ్మానాన్న వద్దకు వెళ్లి ‘సినిమా వేషం ఉట్టిదే, జమునను కోడల్ని చేసుకుంటారా?’ అని అడిగితే ‘దానికేం భాగ్గెం? కానీ ఆస్తంతా మా అబ్బాయిపేర ట్రాన్స్ఫర్ చేయించండి’ అన్నారు. ‘వీళ్లు డబ్బు మనుష్యుల్రా బాబూ’ అనుకుని డ్రాప్ చేసుకుని ఇంకో కాండిడేట్ ఐఏయస్ వద్దకు వెళ్లారు. ఆయన డబ్బు గురించి అడగలేదు కానీ తాగుబోతు అని తెలిసింది. ఇంత ప్రయత్నమూ వేస్టయింది. ఇంతలో ఆవిడ పెత్తండ్రి కొడుకు తిరుపతిలో జువాలజీ లెక్చరర్ రమణారావుగారి సంబంధం చెప్పారు. ఆయన జమునతో ‘మీరు నటించిన మూగమనుసులు చూశాను. చాలా బాగుంది. మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడాలని అనుకున్నాను.’ అన్నార్ట. ఈవిడ ‘మీరు సినిమాలు మానేయమంటే నిరభ్యంతరంగా మానేస్తాను. తర్వాత లేనిపోని అపార్థాలు దేనికి?’ అంటే ఆయన ‘నటన అనేది గాడ్ గివెన్ గిఫ్ట్. ఇవాళ నేను హీరోను కావాలంటే కాగలనా? చేద్దామనుకున్నంత కాలం చేయండి. విసుగుపుడితే మానేయండి.’ అని అన్నారు.
సినిమాల్లో వేయకపోతే కొంపమునిగి పోతుందనుకునే స్వభావం కాదు జమునది. సినిమాల్లో స్థిరపడ్డాక చాలా రోజులకి ‘‘మదర్ ఇండియా’’ సినిమాను తెలుగులో ‘‘బంగారు తల్లి (1971)’’ పేర తీస్తూ 35 ఏళ్ల జమునకు శోభన్‌బాబు, కృష్ణంరాజుల తల్లి పాత్ర ఆఫర్ చేశారు. ఈ సినిమా ఒరిజినల్లో వేశాక నర్గీస్ చిత్రసీమ వదులుకుని పోయింది, నీ గతీ అంతే! అని జనాలు భయపెట్టారు. ఇంత మంచి పాత్ర వేశాక సినిమా రంగాన్ని వదిలేసినా ఫర్వాలేదు అంటూ జమున ఆ సినిమా చేశారు. ఆ సినిమా తర్వాత పుష్కరం పాటు వేసిన వేషాల్లో హీరోయిన్గా కూడా వేశారు. ఇదే సాహసం అనుకుంటే 1959-62 మధ్య అగ్రనటులు ఎయన్నార్, ఎన్టీయార్ల బాయికాట్ను తట్టుకోవడం మరీ సాహసం. దాని గురించి అన్ని పత్రికలు, టీవీ ఛానెళ్లూ కవర్ చేశాయి కాబట్టి దాన్ని వదిలేసి, ఆవిడ ఆ సమయంలో హిందీలో ఎలా రాణించారో చెప్తాను.
ఆవిడ అంతకు ముందే హిందీ సినిమాలు వేశారు. జమునగారి మొదటి హిందీ సినిమా ‘‘నయా ఆద్మీ’’ (1956). తమిళంలో ‘‘వేలక్కారి’’ అనే సినిమాను తీసుకుని జూపిటర్ పిక్చర్స్ వారు తెలుగులో ‘‘సంతోషం’’గా, హిందీలో ‘‘నయా ఆద్మీ’’గా తీశారు. ఎన్టీయార్, జమునా, అంజలీదేవి, రామశర్మ హిందీలో కూడా వేశారు. తెలుగులో పెద్దగా ఆడలేదు కానీ హిందీలో సిల్వర్ జూబిలీ చేసుకుంది. ఆ సినిమాలో అందరి వాయిస్లూ డబ్ చేశారు. ఆ తరువాత ‘‘మిస్మేరీ’’ (1957) సినిమాలో తన వేషమే వేశారు జమున. ఆ సినిమా మూడు వెర్షన్లలోనూ అంటే – మిస్సమ్మ, మిస్సియమ్మ, మిస్మేరీ అన్నిటిలోనూ జమునే ఆ పాత్ర వేశారు. మిస్మేరీలో సావిత్రి పోర్షన్ మీనాకుమారిది. ఆవిడకు జమున బాగా నచ్చింది. ‘జమునా బెహన్’ అని పిలిచేది. పక్కన కూచోబెట్టుకుని తను రాసిన శేర్ శాయ్రీలు వినిపించి, అర్థమైందా అని అడిగి కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేసేది. మిస్మేరీలో జమున జోడీ కిశోర్ కుమార్. ఆయనతో ఇంకో స్ట్రెయిట్ సినిమా కూడా చేశారు ‘‘ఏక్ రాజ్’’ (1963) అని. ‘పాయల్ వాలీ దేఖ్నా’ అనే కిశోర్ పాటకు జమునే డాన్సు చేస్తుంది.
ఆ సినిమాకు ముందే కొన్ని రీమేక్స్ చేశారు జమున. తెలుగులో అగ్రనటులతో గొడవలున్న రోజుల్లో ఎల్వీ ప్రసాద్‌గారు ‘తెలుగులో ఎలాగూ పెద్జగా వేయటం లేదు కదా, హిందీలో వేయి’ అంటూ ఒకేసారి మూడు సినిమాల్లో బుక్ చేశారు. ‘‘ససురాల్’’, ఇల్లరికం హిందీ వెర్షన్. ‘‘హమ్రాహీ’’ (1963) ‘‘భార్యాభర్తలు’’ హిందీ వెర్షన్. మూడోది ‘‘మూగమనసులు’’ హిందీ వెర్షన్ ‘‘మిలన్’’ (1967). మొదటి రెండింటిలో జూబిలీ స్టార్ రాజేంద్రకుమార్ పక్కన. మూడోది సునీల్ దత్ పక్కన. ఇది విని ‘తంతే బూర్లగంపలో పడడం అంటే యిదే కాబోలు’ అని రేలంగి జోక్ చేశారు. వీనస్ పిక్చర్స్ వాళ్లు ‘‘పెళ్లికానుక’’ సినిమాను ‘‘నజరానా’’గా హిందీలో రాజ్ కపూర్, బి.సరోజాదేవిలతో ప్లాను చేశారు. ఓ రోజు షూటింగుకి సరోజాదేవి లేటుగా వెళితే వాళ్లు ఈవిణ్ని తీసేసి వైజయంతిమాలను పెట్టుకున్నారు. సరోజాదేవి ఎల్వీ ప్రసాద్ గారి వద్దకు వెళ్లి మొత్తుకుంది. ‘పోన్లే అమ్మాయ్, ససురాల్లో వేద్దువు గానిలే’ అనేశారు ప్రసాద్.
దాంతో జమున వెళ్లి ‘‘అదేమిటండీ దాని ఒరిజినల్ ఇల్లరికంలో నేనే కదా వేసినది, ఆవిడ కిచ్చేసేరేమిటి? తెలుగు ఫీల్డులో ఎలాగూ గొడవలున్నాయి. హిందీలో యిలా బుక్ చేసేసి అలా తీసేస్తే నాలోనే తప్పుందనుకోరా?’’ అని అడిగారు. దానికి ఆయన ‘‘ఆ అమ్మాయి తన భవిష్యత్తు పాడయిపోతుందని బాధపడితే సరేలే అన్నాను. నీకెందుకు? మూడు సినిమాలన్నాను కదా, ఇంకో పిక్చర్ యిస్తాను. ‘‘సంతానం’’ సినిమాని ‘‘బేటీ బేటే’’ (1964) అని హిందీలో తీస్తున్నాను. దానిలో ముఖ్యపాత్ర నీదే!’ అన్నారు. ఆ విధంగా జమున వేసిన మూడు సినిమాలూ సూపర్ హిట్స్. మూగమనసులును ‘‘మిలన్’’గా హిందీలో తీసినప్పుడు హీరోహీరోయిన్లకు పాటలు ఎక్కువ పెట్టేసి జమున రోల్ చాలా కట్ చేశారు. అయినా ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆ యేడాది ఫిలింఫేర్ బెస్ట్ సపోర్టింగ్ ఏక్ట్రెస్ ఎవార్డు వచ్చింది.
‘‘హమ్రాహీ’’ అనగానే ‘ముఝ్కో అప్నే గలే లగాలో ఏ మేరే హమ్రాహీ’ అనే ముబారక్ బేగం పాట గుర్తుకు వస్తుంది కదూ. అది తీసేటప్పుడు రాజేంద్రకుమార్ జమున డిక్షన్గురించి చాలా మెచ్చుకునేవారట. డిక్షన్ ఒకటే కాదు, 50, 60 సినిమాల్లో వేసినా ఇంకా ముదురుతనం రాకుండా ఫ్రెష్‌గా వున్నారు. పైగా మీ కళ్లు్ చాలా బాగున్నాయి. అని మెచ్చుకునేవాట్ట. అంతటితో ఆగకుండా తెలుగులో పాట పాడదామని ప్రయత్నించేవాట్ట. తాతినేని ప్రకాశరావు గారి దగ్గిర తెలుగులో రాయించుకుని ‘జమునా నీ కళ్లూ సాలా బాగుంటాయీ’ అని పాడేవాట్ట. ‘సాలా కాదండీ బాబూ చాలా’ అని ఈవిడ తప్పు దిద్దేదిట. రాజేంద్రకుమార్ జమున హిందీ డిక్షన్ మెచ్చుకున్నా సినిమా డిస్ట్రిబ్యూటర్ మాత్రం ‘సౌత్ ఇండియన్ లగ్రహీ హై’ అన్నాట్ట. అందువల్ల ఇంకో అమ్మాయిని పిలిచి ఈవిడ వాయిస్ డబ్ చేయించారు. ఆ అమ్మాయి ఉచ్చారణ ఘోరం. క్షమా అనాలంటే షమా అంటోంది. ఆ పాపం జమున నెత్తిన పడింది. మర్నాడు పేపర్లో ‘జమున డిక్షన్ ఏమీ బాగాలేదు, కొన్ని అక్షరాలు పలకవు కూడా’ అని రాసేశారు. దాంతో ఈ సారి జమునగార్నే పిలిచి మళ్లీ ఆవిడ వాయిస్‌తోనే డబ్ చేయించారు.
తర్వాత ‘‘తోడూ-నీడా’’ సినిమాను హిందీలో ‘‘రిస్తే నాతే’’ (1965)గా తీసినప్పుడు తెలుగులో పోర్షనే హిందీలోనూ వేశారు. ఆవిడ పక్కన వేసినది రాజ్‌కుమార్. మొత్తం మీద జమునగారివి హిందీలో 12, కన్నడంలో 5, తమిళంలో 20 సినిమాలున్నాయి.. ఇలాటి అనేక విషయాలు ఆవిడ స్వయంగా చెపితే నేను మేనేజింగ్ ఎడిటర్‌గా ఉన్న మా ‘‘హాసం’’ పత్రికలో ‘‘నేనూ- నా పాటలూ’’ శీర్షికన వేశాం. తన మీద చిత్రీకరించిన పాటల గురించి చెపుతానంటూ ఆవిడ అప్పటి విషయాలు చెప్పేది. దానికి తగ్గ ఫోటోలు కూడా యిచ్చేది. ఆవిడ చెప్పినది రికార్డు చేసుకుని, దాన్ని అక్షర రూపంలో పెట్టినది మా ఎడిటరు రాజా. ఆ శీర్షిక నడుస్తూండగానే 2004లో పత్రిక ఆగింది. ‘‘హాసం’’ పత్రికలో వచ్చిన శీర్షికలను పుస్తకరూపంలో తేవడం మొదలుపెట్టాక ఆవిడ అడిగింది, ‘నాదీ పుస్తకరూపంలో తెస్తారా?’ అని. నేను ఆలోచిస్తామండి అని చెప్పాను.
ఎందుకంటే ఆవిడ తిక్కమనిషి, వేగడం కష్టం. పైగా అది రాసుకొచ్చిన రాజా కూడా తిక్కమనిషే. అతనితోనూ యిబ్బందే. అందుకని ఆవిడ విశేషాలన్నీ పత్రికలోనే ఉండిపోయాయి. పుస్తకరూపంలో తెచ్చేందుకు హక్కులున్నా ఆవిడా వినియోగించుకోలేదు. ఆవిడకి తిక్క అని ఎందుకంటున్నానంటే, ఆవిడ తన స్వీయచరిత్ర ‘‘జమునాతీరం’’ను జర్నలిస్టు భగీరథ గారి చేత రాయించుకుంది. మిత్రులు ఎస్వి రామారావు గారి చేత రూపుదిద్దించుకుంది. అయితే ఎవరి మీద అలిగిందో ఏమో ఆ పుస్తకాన్ని మార్కెట్లో రిలీజు చేయలేదు. ఎస్వి రామారావు గారి సౌజన్యంతో ఆ పుస్తకం కాపీ సంపాదించి, నేను చాలా ఏళ్ల క్రితం గ్రేట్ ఆంధ్రాలోనే సుదీర్ఘ వ్యాసం రాశాను. దానిలో కొన్ని భాగాలు యింటర్నెట్లో కొందరి బ్లాగ్‌లలో ఉన్నాయి. అదంతా మళ్లీ రాయడమెందుకని పత్రికల వాళ్లు స్పృశించని కొన్ని అంశాలు దీనిలో రాశాను.
జమున గారి దగ్గర ఆవిడ నటించిన సినిమాల తాలూకు ఫోటోలు ఎన్నో ఉన్నాయి. ఆవిడ కుటుంబానికి వాటిని ఏం చేసుకోవాలో తెలియదు. మనసు ఫౌండేషన్ వాళ్లు ఇ-చిత్రపురి అని తెలుగు సినిమాలకు సంబంధించిన అన్ని విశేషాలతో ఒక వెబ్సైట్ తయారీ పనిలో ఉన్నారు. జమున కుటుంబం ఆ ఫోటోలను అలాటి వారికి అప్పగిస్తే సముచితంగా ఉంటుంది. సినిమాచరిత్రను నిక్షిప్తం చేయడానికి దోహదపడిన వారవుతారు. చివరగా చెప్పాలంటే, తక్కిన ఆర్టిస్టులకు ఘనమర్యాదలు జరిగినందుకు నాకు చింత లేదు, జమునగారికి తగినరీతిలో శ్రద్ధాంజలి ఘటించలేదనే బాధ మాత్రం కలుగుతోంది. నా తరఫు నుంచి ఆవిడకు అశ్రునివాళి అర్పిస్తూ, ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2023)