2000 సం||రంలో ఝార్‌ఖండ్ ఏర్పడితే యిప్పటిదాకా 5గురు ముఖ్యమంత్రులు పాలించారు. అందరూ గిరిజనులే. ఈ సారి బిజెపి గెలుస్తుందని, గిరిజనేతరుణ్ని ముఖ్యమంత్రి చేస్తుందని ప్రచారం జరుగుతోంది. లోకసభ ఎన్నికలలో ప్రధాని అభ్యర్థిని ఏడాది ముందే ప్రకటించిన బిజెపి, అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు గోప్యంగా వుంచుతోంది. హరియాణాలో జాటేతర అభ్యర్థిని, మహారాష్ట్రలో మరాఠేతర అభ్యర్థిని ముఖ్యమంత్రులను చేసింది. ఝార్‌ఖండ్‌లో కూడా అదే సూత్రం అవలంబించి గిరిజనేతరుణ్ని చేస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే గిరిజన ముఖ్యమంత్రుల కాలంలో యిప్పటివరకు ఝార్‌ఖండ్‌లో రాజకీయ అస్థిరత రాజ్యం చేసింది. 14 ఏళ్లలో 9 ప్రభుత్వాలు మారాయి, మధ్యలో మూడుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. 81 మంది సభ్యులుండే అసెంబ్లీలో ఎవరికీ మెజారిటీ లేదు. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడం, కలహించుకుని విడిపోవడం జరుగుతూ వచ్చింది. 2001 జనాభా లెక్కల ప్రకారం జనాభాలో గిరిజనులు శాతం 27.6. అది 2011 నాటికి 1% తగ్గింది. అంటే గిరిజనేతర జనాభా ఆ మేరకు పెరిగిందన్నమాట. ఇతర వర్గాల్లో గిరిజనేతర స్థానికులు, యుపి, బిహార్ వంటి యితర ప్రాంతాల నుండి వచ్చి స్థిరపడిన గని కార్మికులు, పారిశ్రామిక కార్మికులు వున్నారు. గిరిజనులందరూ ఐక్యంగా లేరు. వారిలో 32 తెగలుగా విడిపోయివున్నారు. వారిలో 4 తెగలు – సంతాల్, ముండా, ఓరాన్, హో – ప్రధానమైనవి. జాతీయ పార్టీలేవీ గిరిజనులను కలిపి వుంచలేకపోయాయి. అందుకే ఝార్‌ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) వంటి ప్రాంతీయ పార్టీలు లాభపడ్డాయి. దీనితో బాటు అనేక మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికవుతూ ప్రభుత్వాలకు మద్దతు యిస్తూ, ఉపసంహరిస్తూ ఆటలాడడంతో ప్రభుత్వాలు కూలిపోతున్నాయి.
2009 లోకసభ ఎన్నికలలో యీ స్వతంత్ర అభ్యర్థులకు 11.2% ఓట్లు వచ్చినా, 2014 ఎన్నికల నాటికి మోదీ తరంగం వలన 14 సీట్లలో 12 సీట్లు బిజెపికి దక్కి స్వతంత్రుల ఓట్ల శాతం 3.3%కి పడిపోయింది. ఇది చూసి చాలా మంది స్వతంత్రులు యీ సారి ఏదో ఒక పార్టీలో చేరిపోయారు. ఆ తరంగమే యీసారి తమను గట్టెక్కిస్తుందని, ఎవరిపై ఆధారపడనవసరం లేని మెజారిటీని అందిస్తుందని బిజెపి నాయకులు ఆశిస్తున్నారు. ఝార్‌ఖండ్‌ను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం చేస్తానని మోదీ ఎన్నికల సభల్లో హామీలిచ్చారు. ఎన్ని నెంబరు 1లు వుంటాయో తెలియటం లేదు. కెసియార్ తెలంగాణను నెంబరు 1 చేస్తానంటారు, బాబు ఆంధ్రను చేస్తానంటారు, మోదీ యిప్పుడు ఝార్‌ఖండ్ అంటారు, రేపు ఢిల్లీ అంటారు. ఫలానా హామీకి సంబంధించిన ఫైలుపై తొలిసంతకం పెడతా అంటూ పది హామీలు గుప్పిస్తారు. ఎన్ని తొలి..లు వుంటాయి? ఝార్‌ఖండ్ ఏర్పడి దాదాపు 5వేల రోజులైతే వాటిలో యించుమించు 3 వేల రోజులు బిజెపియే పాలించింది. అప్పుడు చేయలేనిది యిప్పుడు చేయగలదా అని ఓటర్లకు సందేహం. ఆ సందేహాలను సొమ్ము చేసుకోవడానికి అనేక పార్టీలు రంగంలోకి దిగాయి. కాంగ్రెసు, ఝార్‌ఖండ్ ముక్తి మోర్చా, ఝార్‌ఖండ్ వికాస్ మంచ్, (బిజెపి నుండి బయటకు వెళ్లిన బాబూలాల్ మరాండీ పెట్టిన పార్టీ), లాలూగారి ఆర్‌జెడి, శరద్ యాదవ్ జెడియు, మమతా గారి టిఎంసితో బాటు యిప్పటిదాకా అన్ని రంగుల ప్రభుత్వాలలో పాలు పంచుకుని విడిగా పార్టీ పెట్టుకున్న సుధేష్ మహతో గారి ఆల్ ఝార్‌ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ అనే పార్టీ కూడా వుంది. దీనితో బిజెపి పొత్తు పెట్టుకుంది.
బిజెపి నెగ్గితే మాజీ కేంద్రమంత్రి యశ్వంత సిన్హా (ఈయన కొడుకు జయంత్‌ను యిప్పటికే కేంద్రమంత్రి చేశారు కాబట్టి యీయనకు ఛాన్సు తక్కువ అంటున్నారు) రాష్ట్ర బిజెపి అధ్యకక్షుడు రఘుబర్ దాస్, సరయూ రాయ్‌లకు ఛాన్సుంది అంటున్నారు. వీరందరూ గిరిజనేతరులే. మోదీ తన ఎన్నికల సభల్లో 'బాప్-బేటేకా సర్కార్' అంటూ గత ప్రభుత్వాలను యీసడించాడు. ఈ బాప్-బేటేలు శిబు సొరేన్, హేమంత్ సొరేన్. వీళ్లిద్దరూ జెఎంఎం నేతలే. ఈ రకంగా గిరిజనేతరుల ఓట్లు ఆకర్షిద్దామని బిజెపి ప్రయత్నిస్తోందన్న సందేహంతో గిరిజనులలో భయాలు రెచ్చగొట్టి వారిని ఏకీకృతం చేసి, గుత్తగా ఓట్లు సంపాదించాలని జెఎంఎం ప్రయత్నిస్తోంది. అది గత ఏడాదిన్నరగా కాంగ్రెసుతో కలిసి పాలిస్తోంది. కాంగ్రెసు యీ సారి ఎన్నికలలో పూర్తిగా చప్పబడిపోయింది. ఎన్నికల ప్రచారానికై అది తెప్పించిన హెలికాప్టర్ వాడేవాళ్లే లేరు. లాలూ వచ్చి దాన్ని కాస్త వుపయోగించుకున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా వున్న హేమంత్ సొరేన్ తనకు మళ్లీ అధికారం అప్పగిస్తే క్లాస్ 3, 4 ఉద్యోగాలు బయటివారికి (గిరిజనేతరులకు అని అతని భావం) దక్కకుండా చట్టం చేస్తానని గిరిజనులను వూరిస్తున్నాడు. ఎన్నికల అనంతరం సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న ధైర్యం బిజెపిలో, భయం యితర పార్టీలలో కనబడుతోంది. అస్థిరత వున్నపుడే రాజకీయక్రీడలకు అవకాశాలు మెండుగా వుంటాయి.
-ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2014)