ఇవాళ కొంతమందికి నిద్ర పడుతుంది – బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసిపోయింది కనుక. సినిమా టిక్కెట్టు కొని, యింకా చూసే అవకాశం రానివాళ్లను ఆ ప్రశ్న యింకా వేధిస్తూనే వుండవచ్చు. 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' అన్న ప్రశ్నను మీడియా జాతీయస్థాయికి తీసుకుపోయింది. దేశంలో యింకే సమస్యా లేనట్లు ప్రజలంతా దీనికి సమాధానం తెలుసుకోవడానికే ఉగ్గబట్టుకుని వున్నట్లు బిల్డప్ యిస్తున్నారు. సినిమా కథలో ఒక మలుపు గురించి యింత చర్చ అవసరమా? గతంలో ''పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా?'' అనే ప్రశ్నకు పని గట్టుకుని ప్రభుత్వం విపరీతంగా ప్రచారం కలిగించింది. ఎయిడ్స్ గురించి అందరూ బాహాటంగా మాట్లాడేటట్లు చేయాలని, తద్వారా దానిపై అవగాహన పెంచాలని చేసిన వినూత్న ప్రయత్నమది. ఆ తర్వాత యీ ప్రశ్న గురించే కాబోలు యింత చర్చ జరిగింది. ఎవరు ఎవర్ని చంపినా కథలో భాగంగానే వస్తుంది కదా. పాత్ర స్వభావాలను ఎలాగైనా మార్చవచ్చు, దానికి లీడ్ చేసే ఘట్టాలను ఎలాగౖౖెనా కల్పించవచ్చు ఎందుకంటే యిది కాల్పనికమైన జానపద కథ!
అదే పౌరాణికం అనుకోండి. ఆ నాటి కాలంలో పాఠకులను కన్విన్స్ చేయాలన్న తపన లేకుండా వాళ్లు సంఘటనలు చెప్పుకుంటూ పోయారు. నేటి తరం వాళ్లు అలా వూరుకోరు. ఎందుకలా చేశాడు? ఔచిత్యభంగమైంది కదా, అంటారు. సినిమాగా తీసినపుడు పాత్రధారి యిమేజి దెబ్బ తినకుండా చూడాలి. చంద్రుడికి, గురుపత్ని యైన తారతో అక్రమ సంబంధం ఏర్పడినట్లు చూపించాలంటే దానికి ముందూ వెనకా ఎంతో కల్పించాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ తప్పు చేసినట్లు ప్రేక్షకులను ఒప్పించడానికి కొన్ని ఘట్టాలు పెట్టాలి. ఎందుకంటే మూల కథను మార్చలేరు. అలాగే కృష్ణదేవరాయలు తనను చిన్నప్పటి నుంచి పెంచి, పెద్ద చేసి, తీర్చిదిద్దిన తిమ్మరసు కళ్లు పీకించాడు అనే చారిత్రక సత్యాన్ని మరుగు పరచలేరు, మార్చలేరు. ''మహామంత్రి తిమ్మరసు''గా ఆ కథను సినిమాగా తీసినపుడు హీరో యిమేజికి భంగం కలగకుండా వుండడానికి హంవీరుడనే ఓ విలన్ పాత్ర సృష్టించి, అతని కపటం వలన అపోహలు వచ్చాయని చూపించాల్సి వచ్చింది. కృష్ణదేవరాయలు చివర్లో తన తప్పు తెలుసుకుని తిమ్మరసుకి మళ్లీ పదవి కట్టబెట్టినట్లు మార్చవలసి వచ్చింది. చరిత్ర ప్రకారమైతే కృష్ణదేవరాయలు కొడుకుని ఎవరో చంపివేశారు. అప్పటికే అతనికి సలహాదారులుగా కుదురుకున్న పోర్చుగీసు వాళ్లు తిమ్మరుసుమీద నేరం నెట్టారు. అతనికే ఈ ట్రిక్కులన్నీ తెలుసు అన్నారు. పుత్రశోకంతో వున్న కృష్ణదేవరాయలు ఆ చెప్పుడు మాటలు విన్నాడు. 80 ఏళ్లు దాటిన తిమ్మరుసు కళ్లు పీకించి, జైల్లో పెట్టాడు. అది చూసి తిరుగుబాటు చేసిన అతని కొడుకునీ, తమ్ముణ్నీ కూడా అలాగే శిక్షించాడు. అబ్బే వాళ్లని చంపించాడు అని కొందరు రాశారు. సినిమాలో అలా చూపించలేక కృష్ణదేవరాయలు పశ్చాత్తాప పడినట్లు మార్చారు.
బాహుబలి పూర్తి జానపద కథ కాబట్టి ఏ పాత్రను ఎలా తిప్పినా అడిగేవాడు లేడు. ఫలానా కారణం చేత చంపాడు అంటూ వస్తున్న ఐదారు రకాల రూమర్లన్నీ కన్విన్సింగ్‌గానే వున్నాయి. వాటిలో ఏదైనా నిజం కావచ్చు. దాని కోసమే సినిమా చూడాలనుకోవడం వింతగా తోస్తుంది నాకు. అలాగైతే డిటెక్టివ్ నవల రెండో సారి చదవనక్కరలేదు, సస్పెన్సు సినిమా రెండోసారి చూడనక్కరలేదు. కానీ చదువుతాం, చూస్తాం. ఎందుకు? కథ నడిపించిన విధానం కోసం. ఈ వాదనకు ''ప్రాణమిత్రులు'' సినిమా (1967) మంచి ఉదాహరణ. దానికి నేపథ్యం వుంది. 12 వ శతాబ్దంలో రెండవ హెన్రీ తన మిత్రుడైన బెకెట్ను ఆర్చిబిషప్ ఆఫ్ కాంటర్‌బరీగా నియమించి చర్చిని తన అధీనంలోకి తీసుకుందామని ప్రయత్నించాడు. కానీ చర్చి వ్యవహారాల్లోకి లోతుగా దిగాక బెకెట్‌కు మతపరమైన భక్తిశ్రద్ధలు పెరిగి రాజు అధికారానికి అడ్డుకట్ట వేశాడు. వారి మధ్య విభేదాలు ముదిరాయి. దాంతో రాజు విసిగిపోయి ఓ సారి 'ఈ తగవులమారిని నా దారి నుంచి ఎవరైనా తప్పిస్తే బాగుండును' అన్నాడు. దాన్ని వేరేలా అర్థం చేసుకున్న సైన్యాధికారులు రాజుకి చెప్పకుండా వెళ్లి బెకెట్ను చంపివేశారు. అది రాజును చలింపచేసింది. దరిమిలా ప్రాయశ్చిత్తం చేసుకుని బెకెట్ను ఆరాధించాడు.
ఈ థీమ్‌పై ''మర్డర్ ఇన్ కాథెడ్రల్'' అనే నాటకం, దాని ఆధారంగా ''బెకెట్'' (1964) అనే ఆంగ్లసినిమా తయారయ్యాయి. ముళ్లపూడి వెంకటరమణ గారు యీ థీమ్‌ను తీసుకుని యజమాని, కార్మికుల మధ్య సమస్యగా మార్చి ప్రాణమిత్రులు కథ రూపొందించారు. షిప్‌యార్డ్ కాంట్రాక్టర్ (జగ్గయ్య) తన స్నేహితుణ్ని (నాగేశ్వరరావు) కార్మికుడిగా ప్రవేశపెట్టి, లేబర్ యూనియన్ను తన వశంలోకి తెచ్చుకుందామని చూస్తాడు. కానీ కార్మికుల కడగండ్లు చూసిన నాగేశ్వరరావు కార్మిక పక్షపాతిగా మారి స్నేహితుడికి ఎదురు తిరుగుతాడు. అనేక ఘర్షణల తర్వాత జగ్గయ్య నాగేశ్వరరావుపై తుపాకి ఎక్కుపెడతాడు. ఆ తరుణంలో విలన్ నాగేశ్వరరావును కాల్చి చంపేస్తాడు. జగ్గయ్య పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. సినిమా ప్రారంభంలో నాగేశ్వరరావు ఫోటోకు దండవేసి, దాని ముందు జగ్గయ్య నిలబడి ఫ్లాష్‌బ్యాక్‌లో కథ చెప్పాలని రమణ ఉద్దేశం. దర్శకనిర్మాత పి.పుల్లయ్యగారికి కథ బాగా నచ్చింది. అయితే నాగేశ్వరరావు చచ్చిపోతాడని ముందే చెపితే సస్పెన్సు పోతుందని భయపడ్డారాయన. 'ఎంత సస్పెన్సయినా మొదటి ఆట వరకే కదండీ, బెకెట్లో కూడా కథ ఫ్లాష్‌బ్యాక్‌లో చెప్పారుగా' అని రమణ వాదించినా లాభం లేకపోయింది. స్ట్రెయిట్ నేరేషన్లో కథ చెప్పించారు. సినిమా ఫెయిలయింది. పదేళ్లు పోయాక ఇదే కథను ఫ్లాష్‌బ్యాక్ పద్ధతిలో చెప్పిన ''నమక్ హరామ్'' హిట్టయింది. అనుభవజ్ఞులైన పుల్లయ్యగారి అంచనా తప్పిందనుకోవాలి.
చెప్పవచ్చేదేమిటంటే – కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవడానికే బాహుబలి2కి వెళ్లాలనుకోవడం పొరపాటు. సినిమా బాగుంటే చంపడానికి తగిన కారణం చూపలేకపోయినా, లాజిక్ మిస్సయినా, కొంత మేరకు చెల్లిపోతుంది. ఎమోషన్ పండితే ప్రేక్షకులు లాజిక్ మరీ పట్టించుకోరని ఎన్నోసార్లు రుజువైంది. బాహుబలి1లో ఎమోషన్స్ తగినంత లేవని, కళ్లు మిరిమిట్లు గొలిపాయి కానీ చెమర్చలేదని అప్పుడు రాస్తే నాపై కొందరు కోపగించుకున్నారు. తర్వాత్తర్వాత అందరూ అదే అనసాగారు. మొదటిపార్టులో ఎమోషన్లు అంతగా చూపలేకపోయాం, పాత్రలను పరిచయం వదిలేశాం, మొత్తం డ్రామా అంతా రెండో పార్టులో గుప్పించాం అంటున్నారిప్పుడు. ఎమోషన్, డ్రామా, భారీతనం రెండు భాగాల్లోనూ సమంగా సర్దివుంటే బాగుండేది. సరే వాళ్ల యిష్టం వాళ్లది. బాహుబలి 2 వచ్చేసింది. ఎమోషనల్ డ్రామా బాగుందని రివ్యూ కూడా చదివాను. శుభం. దాని కోసమే సినిమా చూస్తాను. ఎందుకు చంపాడన్నది నాకు ముఖ్యం కాదు. ఎవరైనా స్పాయిల్-స్పోర్ట్ అది ముందే చెప్పేసినా చూడడం మానను. దర్శకుడు కథ నడిపించిన తీరు గురించే నా ఆసక్తి. కథ ముందే తెలిసిపోయినా పౌరాణిక సినిమాలు అందుకే చూస్తున్నాం. స్పాయిల్-స్పోర్ట్ అంటే ఓ విషయం గుర్తుకు వచ్చింది. మేం కాలేజీలో వుండే రోజుల్లో ''హమ్రాజ్'' అనే మంచి సస్పెన్స్ సినిమా వచ్చింది. ఓ యిద్దరు స్టూడెంట్స్ ఎందుకోగాని కొట్టుకున్నారు. దెబ్బలు ఎక్కువగా తిన్నవాడు కసి పట్టలేక 'చూస్కో ఏం చేస్తానో, హమ్రాజ్ సినిమాలో విలన్ పేరు చెప్పేస్తున్నా – మదన్ పురి!'' అని అరిచాడు. అవతలివాడు చలించలేదు. ''వాడెవడో నాకు తెలియదుగా!'' అన్నాడు. అజ్ఞానం ఒక్కోప్పుడు వరం!
ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2017)