దిల్లీలో వున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం లెఫ్టినెంటు జనరల్ (ఎల్-జి) ద్వారా ఓ ఆట ఎలా ఆడిస్తోందో, అరవింద్ కేజ్రీవాల్ ఎల్-జితో ఎలా పోట్లాడుతున్నాడో చూస్తున్నాం. మరో కేంద్ర పాలిత రాష్ట్రమైన పుదుచ్చేరిలో అలాటి ఘర్షణ వాతావరణమే సృష్టించడానికి పూనుకుంది కిరణ్ బేదీ. గతంలో కేంద్రంలో ఎవరున్నా, రాష్ట్రంలో ఎవరున్నా పుదుచ్చేరిలో ఎల్-జి, ముఖ్యమంత్రి మధ్య యిలాటి పరిస్థితి నెలకొనలేదు. ఇప్పుడు కిరణ్ తనకు అధికారాలున్నాయని వాదిస్తూ తడాఖా చూపించడానికే నిశ్చయించుకున్నారు. పుదుచ్చేరి చాలా చిన్న కేంద్రపాలిత ప్రాంతం.
దిల్లీకి లేని ప్రత్యేక సమస్యలు దానికి వున్నాయి. 130 కిమీల దూరంలో తమిళనాడులో వున్న కారైక్కల్, 600 కిమీల దూరంలో కేరళలో వున్న మాహే, 800 కిమీ. దూరంలో ఆంధ్రలో వున్న యానాం – యివన్నీ పుదుచ్చేరి పరిధిలోకే వస్తాయి. ఇక్కణ్నుంచే వాటిని పాలించాలి. ఇదో పెద్ద అవస్థ అనుకుని 1977లో మొరార్జీ ప్రభుత్వం యానాం, మాహే, కారైక్కల్‌లను ఆయా రాష్ట్రాల్లో కలిపేద్దామనుకుంది. కానీ ప్రజలు తిరగబడడంతో ఆగిపోయింది. పుదుచ్చేరిలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెసు గెలిచింది.
నాలుగుసార్లు ఎంపీగా నెగ్గిన వి నారాయణస్వామిని ముఖ్యమంత్రిగా చేసి పంపించింది కాంగ్రెసు. 2004-09 మధ్య యుపిఏ1కి మెజారిటీ తక్కువగా వుండి, వామపక్షాల మద్దతుపై ఆధారపడిన రోజుల్లో పార్లమెంటులో కాంగ్రెసు తరఫున ఫ్లోర్ మేనేజరుగా వుండి, యితర పార్టీ నాయకులతో చాకచక్యంగా వ్యవహరించిన దిట్ట నారాయణస్వామి. 2009-14 మధ్య ప్రధాని కార్యాలయంలో మంత్రిగా వున్నాడు. అవినీతి ముద్ర పడలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అధికారులతో బాగా మసలుతూ తన పాలనాసామర్థ్యం కనబరుస్తూనే వున్నాడు.
కిరణ్ బేదీ నిర్భయానికి, నిజాయితీకి పేరుబడిన ఐపియస్ అధికారిణి. కానీ ఆమెకు ప్రచారప్రీతి ఎక్కువ. సొంత యిమేజి పెంచుకోవడం కోసం విలక్షణ పద్ధతులు చేపడుతూ అనేక వివాదాల్లో యిరుక్కున్నారు. ఉద్యోగ విరమణానంతరం అన్నా హజారే ఉద్యమంలో పాలు పంచుకుని, మళ్లీ అందరి నోళ్లలో నాని, దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరి, బిజెపి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థినిగా ముందుకు వచ్చారు. కిరణ్ కార్యక్షేత్రం దిల్లీయే. కానీ దిల్లీ ఓటర్లు ఆమెను, బిజెపిని తిరస్కరించారు. ముఖ్యమంత్రి కాలేకపోయిన ఆమెను బిజెపి పుదుచ్చేరికి ఎల్‌జిగా పంపింది.
చురుకుతనం పాలు ఎక్కువున్న కిరణ్ పుదుచ్చేరికి రాగానే ఏదో ఒకటి అడావుడి చేయసాగింది. దిల్లీ విషయంలో నైతే అరవింద్ మాటిమాటికీ కేంద్రంతో పేచీలకు దిగుతాడు. నారాయణస్వామి కూడా ప్రతిపక్ష ముఖ్యమంత్రే అయినా కేంద్రంతో తగాదాలకు దిగడు. అందువలన కిరణ్‌కు అవకాశం దొరకలేదు. అయినా దిల్లీ ఎల్‌జిని ఆదర్శంగా తీసుకుని నాదే సర్వాధికారం అనసాగింది.
అధికారులు ఫైళ్లన్నీ తనకు పంపాలని, చీఫ్ సెక్రటరీ తనకు వచ్చి రిపోర్టు చేయాలని ఆదేశాలివ్వసాగింది. ముఖ్యమంత్రి మద్దతున్న అధికారగణం తనను పట్టించుకోకపోవటం ఆమెను మరింత మండిస్తోంది. ప్రజాసమస్యలపై రోజూ పేపర్ కటింగ్స్ అధికారులకు పంపుతూ దీని గురించి ఏం చేశారో నాకు నివేదించండి అంటూ అడుగుతూంటుంది. 'ఇదెక్కడా చూడని విడ్డూరం. రాష్ట్రపతి సైతం ప్రధానికి యిలాటి పేపర్ కటింగ్స్ పంపరు' అన్నాడు నారాయణస్వామి.
వారంవారం తన వద్దకు స్వయంగా వచ్చి వారంలో జరిగిన విషయాలన్నిటిపై రిపోర్టు చేయాలని కిరణ్ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. ''ఇప్పటికే ఎడిషనల్ సెక్రటరీ వారంవారం రిపోర్టును ఎల్‌జి ఆఫీసుకి పంపుతున్నారు. అంతకుమించి నేను చెప్పేదేమీ లేదు. ప్రభుత్వం ద్వారా జరిగే పనులకు బాధ్యత వహించవలసినది మంత్రులే. పుదుచ్చేరి వంటి చిన్న రాష్ట్రాలలో సెక్రటరీలు మంత్రులను రోజుకి రెండు, మూడుసార్లు కలుస్తారు.
విషయాలు చెప్తూనే వుంటారు. ఇది చాలనట్లు ఎల్‌జికి కూడా రిపోర్టులు పంపడమంటే టైము వేస్టే'' అని జవాబిచ్చాడాయన. ఆవిడ పదవిలోకి వచ్చిన దగ్గర్నుంచి వారాంతాలలో పొద్దున్న 6 గంటలకు పుదుచ్చేరి వూళ్లో రౌండ్లు కొడుతూ పరిసరాలు శుభ్రంగా వున్నాయో లేదో చెక్ చేస్తూ వుంటుంది. ఇప్పటికి 77 రౌండ్లు అయ్యాయి. తను రౌండుకి వెళ్లినపుడు వాళ్లూవీళ్లూ కాదు, ఏకంగా చీఫ్ సెక్రటరీ కూడా తనతో రావాలని ఆవిడ ఉద్దేశం. ఆయన వెళ్లలేదు.
మీరు వచ్చి తీరాలంటూ ఆమె ఉత్తరాలు రాయసాగింది. ''మీరు నాతో పాటు రాకపోవడం నాకు చింత కలిగిస్తోంది. ప్రధాని మోదీ స్వచ్ఛతకు, శ్రమదానానికి ఎంత ప్రాధాన్యత యిస్తారో మీకు తెలియనిది కాదు. మనం గిరి గీచుకుని వుండిపోకూడదు. మోదీ గారి కోసమైనా చేయవలసినదాని కంటె ఎక్కువ చేయాలి.'' అంటూ యీ మెయిల్ రాసింది యీ మధ్య. ఇలాటివాటికి చలించేవాడు కాదు, చీఫ్ సెక్రటరీగా వున్న 1986 బ్యాచ్ ఐయేయస్ మనోజ్ కుమార్ పరీడా.
ఇది పని కాదని, కిరణ్ కేంద్రానికి రాసింది – దిల్లీ ఎల్‌జి సర్వాధికారాలు చలాయిస్తున్నపుడు, తను మాత్రం ఎందుకు చలాయించకూడదని. ఇక్కడ చిన్న సాంకేతిక అంశం వుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 ప్రకారం రాష్ట్రానికి గవర్నరు ఎలాగో, కేంద్రపాలిత ప్రాంతాలకు రాష్ట్రపతి అలాగ. ఎల్‌జి రాష్ట్రపతి పక్షాన పనిచేస్తూ ఆయనకు కళ్లూ, చెవులూగా పనిచేస్తాడు తప్ప గవర్నరుతో సమానం కాలేడు.
ఆర్టికల్ 240 ప్రకారం ఆ ప్రాంతాలకు ఎన్నికలు జరిగి ప్రజాప్రభుత్వం ఏర్పడినపుడు రాష్ట్రపతి లెజిస్లేటివ్ అధికారాలకు కత్తెర పడుతుంది. అయితే ఆర్టికల్ 239ఎ ప్రకారం సిద్ధాంతపరమైన విషయాలలో రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి. ఏది సిద్ధాంతపరమైన నిర్ణయం, ఏది కాదు అనేదానిలోనే వివాదం వస్తోంది. దిల్లీ దేశరాజధాని కాబట్టి 239ఎఎ అనే ప్రత్యేక సవరణ తెచ్చి పోలీసుపై అధికారాన్ని కేంద్ర హోం మంత్రికి అప్పచెప్పారు. పుదుచ్చేరిలో అయితే పోలీసు రాష్ట్ర ప్రభుత్వం కిందే వుంటుంది. ఇది రాజ్యాంగపరంగా వున్న పరిస్థితి.
అయితే ఫైళ్లు చూసే అధికారం తనకుందని కేంద్రం స్పష్టత యివ్వాలని కిరణ్ పట్టుబట్టడంతో 2017 జనవరి 27న సతీశ్ కుమార్ సింగ్ అనే హోం శాఖ అండర్ సెక్రటరీ ఐదు పేజీల క్లారిఫికేషన్ పంపారు. ''రోజువారీ వ్యవహారాల్లోను, సిద్ధాంతపరమైన నిర్ణయాలలోను ఎల్‌జికి పాత్ర వుంటుంది కాబట్టి తను చూద్దామనుకుంటున్న కాగితాలను ఎల్‌జి తెప్పించుకోవచ్చు, అధికారులను పిలిచి మాట్లాడవచ్చు. ఎల్‌జికి కావలసిన సమాచారాన్ని అందించవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి వుంది.'' అని దానిలో రాశారు.
కేంద్రం కిరణ్ బేదీ పక్షాన నిలిచి, ప్రజాస్వామ్యయుతంగా నెగ్గిన ప్రభుత్వం విలువ తగ్గిద్దామని చూస్తూన్న యీ లేఖను పట్టించుకోకూడదని ముఖ్యమంత్రి, అతని అధికారగణం నిర్ణయించుకున్నారు. అది వచ్చాక కూడా చీఫ్ సెక్రటరీ ఆమెకు ఫైళ్లు పంపలేదు. ముఖ్యమంత్రి విలేకరులు అడిగితే ''రాజ్యాంగానికి ఎక్కువ విలువ వుంటుందా? హోం శాఖ క్లారిఫికేషన్‌కు ఎక్కువ విలువ వుంటుందా? ఆ లేఖ వచ్చాక నేను అభ్యంతరం తెలుపుతూ హోం శాఖకు ఉత్తరం రాశాను. ఇప్పటిదాకా వాళ్ల నుంచి జవాబు రాలేదు.'' అన్నాడు.
క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా చీఫ్ సెక్రటరీ తనను పట్టించుకోవటం లేదంటూ కిరణ్ ఏప్రిల్ 15 న కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఎల్‌జి లేవనెత్తిన అంశాలపై తమ వంతు కర్తవ్యం నెరవేరుస్తున్నామని, రోజువారీ రిపోర్టులు పంపనవసరం లేదని చీఫ్ సెక్రటరీ సమాధానమిచ్చాడు. అతన్ని సమర్థిస్తూ నారాయణస్వామి ''చీఫ్ సెక్రటరీ, యితర సెక్రటరీలు ముఖ్యమంత్రి కింద పనిచేస్తారు. వారి ప్రవర్తనపై ఎక్స్‌ప్లనేషన్ కోరే అధికారం కేంద్ర హోం శాఖకు మాత్రమే వుంది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని తన ప్రాధాన్యతలను నిర్ణయించుకోనివ్వండి.
రోజువారీ కార్యకలాపాల పర్యవేక్షణ పని మీది కాదు' అంటూ కిరణ్‌కు లేఖ రాశాడు. ఇది నచ్చని కిరణ్ మే 2 న దిల్లీకి వెళ్లి హోం మంత్రి రాజనాథ్ సింగ్‌ను వెళ్లి కలిసింది, ఆ విషయాన్ని తన ట్విటర్ ఖాతాలో పెట్టింది. ప్రతికూల పరిస్థితుల్లోనే కిరణ్ బేదీ చెలరేగిపోయేవారు. ఇప్పుడు కేంద్రంలో తన పార్టీ ప్రభుత్వం విరాజిల్లుతూండగా వదిలిపెడతారా?
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]