హేమమాలినికి, రైతు ఆత్మహత్యలకు సంబంధం ఏమైనా వుంటుందా? ఆవిడ నాట్యకళాకారిణి, నటీమణి, బిజెపి తరఫున పార్లమెంటు సభ్యురాలు. నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత, మార్కెటింగ్ సౌకర్యాల లేమి, గిట్టుబాట ధర లేకపోవడం, ప్రకృతి వైపరీత్యం యిత్యాది అనేక కారణాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. మరి రెండింటికి లింకెక్కడ దొరుకుతుంది? కానీ లింకు దొరకబుచ్చుకున్నారు మహారాష్ట్ర ఇండిపెండెంటు ఎమ్మెల్యే ఓంప్రకాశ్ బచ్చూ కాడూ. ''మద్యపానం వలన రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అంటున్నారు. అలా అయితే హేమమాలిని రోజూ తాగుతారు.
ఆవిడేమైనా ఆత్మహత్య చేసుకుందా?'' అని వాదించాడు. హేమమాలిని మద్యం సేవిస్తారో లేదో జనాలకు తెలియదు. ఆవిడ తన నృత్యకార్యక్రమాలకు కానీ, సినిమా షూటింగులకు కానీ, ఎన్నికల ప్రచారసభలకు కానీ తాగి వచ్చిన సంఘటనలు బయటకు రాలేదు. మరి ఆవిడ పేరు యితనెందుకు వాడుకున్నట్లు? ఆవిడ పేరే కాదు మరో బిజెపి ఎంపీ, కేంద్రమంత్రి గడ్కరీ పేరు కూడా వాడాడు. ''ఇంట్లో పెళ్లిళ్లకు ఎక్కువగా ఖర్చు పెట్టేసి, అప్పులపాలై పోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని కూడా చెప్తున్నారు. నితిన్ గడ్కరీ తన కొడుకు పెళ్లికి రూ.4 కోట్లు ఖర్చుపెట్టాడు. ఆయనేమైనా ఆత్మహత్య చేసుకున్నాడా?'' అని కూడా తర్కించాడు. నోట్ల రద్దు చేసిన వెంటనే గడ్కరీ భారీ ఖర్చుతో కొడుకు పెళ్లి చేశాడు. చేతిలో అన్ని రకాల డబ్బు, పలుకుబడి వున్నాయి కాబట్టి చేయగలిగాడు. అతనికి, ఆత్మహత్య చేసుకునే రైతుకి పోలిక ఏమిటి? ఇవేమీ కాడూకి పట్టవు. అతని తరహాయే అంత.
ఎలాగైనా ప్రజల దృష్టి ఆకర్షించడమే అతని లక్ష్యం. 1999లో అతను అమరావతి జిల్లాలోని తన అచలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వసుధా దేశ్‌ముఖ్ అనే కాంగ్రెసు అభ్యర్థిని చేతిలో 1300 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 'రైతు సమస్యల పట్ల నేనెంత ఎలుగెత్తి మొత్తుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఎర మింగిన కొండచిలువలా స్తబ్దంగా పడి వుంటోంది. దాన్ని మేల్కొల్పాలంటే అలాటి కొండచిలువ ఎలా వుంటుందో చూపించాలి' అంటూ ఓ కొండచిలువను పట్టుకుని వచ్చి తనపై నెగ్గిన వసుధ యింట్లో వదిలిపెట్టాడు! పాముల్ని ఆయుధాలుగా వాడుకోవడంలో అతను ఆరితేరాడు. ఆ ప్రాంతంలో పాములు ఎక్కువగా మసలుతాయి. కరంటు కోతలూ ఎక్కువే. చీకట్లో పాములు బాగా మసలుతూ జనాలను కరుస్తూంటాయి. అయితే అక్కడున్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో పామువిషానికి విరుగుడు మందులు ఎక్కువగా పెట్టుకునేవారు కారు.
దాంతో అనేక మంది ప్రజలు పాముకాట్లకు బలయ్యేవారు. ఈ సమస్యను ఎత్తి చూపించడానికి కాడూ బుట్టెడు బుట్టెడు పాములను ఆరోగ్యకేంద్రాల్లోనూ, కరంటు ఆఫీసుల్లోనూ విడిచిపెట్టాడు! పంటలకు మద్దతు ధర పెంచాలని ఆందోళన చేస్తూ 50 మంది అనుచరులతో సహా చందూర్ బజారు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీసు ప్రాంగణంలో గోతులు తీసి పీకలదాకా కప్పెట్టుకున్నాడు. రైతు ఆత్మహత్యల గురించి అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండు చేస్తూ 2009లో తన అనుచరులతో సహా నాగపూరులో ఓ పెద్ద వాటర్ ట్యాంకు ఎక్కి అక్కడే 24 గంటలపాటు కాపురం పెట్టాడు. 2016 మార్చిలో తను చెప్పినది వినటం లేదంటూ ఒక సెక్రటేరియట్ ఉద్యోగి చెంపపై కొట్టాడు. అక్కడ ఉద్యోగులందరూ సమ్మెకు దిగారు.
ఇలాటి పెద్దమనిషిని 2004 నుంచి అతని నియోజకవర్గపు ప్రజలు గెలిపిస్తూ వస్తున్నారు. ఎందుకంటే అతను పబ్లిసిటీ కోసం కానీయండి, మరో దాని కోసం కానీయండి, కొన్ని మంచిపనులు కూడా చేస్తూంటాడు. నయన అనే ఒక ప్రొఫెసర్‌ను పెళ్లి చేసుకున్నపుడు వాళ్లు దండలు మార్చుకోలేదు. జాతీయ పతాకాన్ని యిచ్చిపుచ్చుకున్నారు. పెళ్లి సందర్భంగా విందు యిచ్చేబదులు వికలాంగులకై 100 మూడు చక్రాల వాహనాలు పంచిపెట్టాడు. ప్రహార్ యువశక్తి సంఘటన అనే సంస్థ నెలకొల్పి యిప్పటివరకు 30 వేలమంది వికలాంగులకు ఆదుకున్నాడు. ఏటా 500 సీసాల రక్తాన్ని తన అనుచరుల చేత దానం యిప్పిస్తాడు. తన ప్రాంతంలో రోజుకి 16 గంటల కరంటు కోత వున్న రోజుల్లో అర్ధరాత్రి కాగడాలతో ప్రదర్శన నిర్వహించి అనేకమంది దానిలో పాల్గొనేట్లా చేశాడు.
ఇలా ప్రజల్లో పేరు తెచ్చుకుంటూ వీళ్లు తమ ప్రతాపాన్ని ఉద్యోగుల మీద చూపుతుంటారు. దీనికి తాజా ఉదాహరణ ఎయిర్ ఇండియా ఘటనతో పేపర్ల కెక్కిన రవీంద్ర గాయీక్వాడ్. అతనికి తను ఎక్కబోతున్న విమానంలో బిజినెస్ క్లాసు సీటు లేదని తెలుసు. అయినా ఎక్కాడు. దిల్లీ చేరాక తనను ఎకానమీ క్లాసులో కూర్చోబెట్టారంటూ విమానం దిగను పొమ్మన్నాడు. బతిమాలడానికి వచ్చిన ఎయిర్ ఇండియా ఉద్యోగిని చెప్పుతీసి 25 సార్లు కొట్టాడు. అలా కొట్టానని గర్వంగా చెప్పుకున్నాడు కూడా. అదేమంటే 'బిజినెస్ క్లాసు లేదని తెలిసి కూడా విమాన కంపెనీవాళ్లు నా బోర్డింగ్ పాస్‌పై బిజినెస్ క్లాస్ అని ఎందుకు వేశారు?' అని లాజిక్ లాగాడు.
అలాటి సందర్భాల్లో మనలాటి వాళ్లను కోర్టుకి వెళ్లి విమాన కంపెనీపై కేసు వేసి నష్టపరిహారం తెచ్చుకోమంటారు. కానీ యీ దొరగారు ఉద్యోగిని పట్టుకుని చితక్కొట్టాడు. ఉద్యోగులు ఆగ్రహించడంతో అతన్ని ఏ విమానంలోనూ ఎక్కనివ్వద్దంటూ కేంద్ర విమానయాన శాఖ ఆదేశాలు యిచ్చింది. తన సభ్యుడి ప్రవర్తనకు శివసేన సిగ్గుపడలేదు సరికదా ఆ వ్యవహారంపై పార్లమెంటులో గొడవ చేసింది. శివసేన మంత్రి, తన కాబినెట్ సహచరుడైన అశోకగజపతి రాజుపై చెయ్యి ఎత్తారు. కేంద్రం తమాషా చూసింది. చివరకు ఎలా సద్దు మణిగిందంటే – ''2017 మార్చి 23న ఎయిర్ ఇండియా ఫ్లయిట్లో జరిగిన దురదృష్ట సంఘటనకు విచారిస్తున్నాను.'' అని గాయీక్వాడ్ లేఖ రాశాడంతే. సిబ్బంది పట్ల తన అనుచిత ప్రవర్తనకు క్షమాపణ చెప్పనే లేదు.
అయినా కేంద్ర ప్రభుత్వం వ్యవహారాన్ని అంతటితో వదిలేసింది. విమాన సిబ్బందికి యీ వివరణ తృప్తి కలిగించకపోయినా తమ మంత్రి సహకరించకపోవడంతో ఏమీ చేయలేక వూరుకున్నారు. గాయీక్వాడ్ మళ్లీ యింకోసారి యిలాటి పనికి తెగబడినా ఆశ్చర్యం లేదు. శివసేనకే చెందిన ఎంపీ రాజన్ విచారే దిల్లీలో మహారాష్ట్ర సదన్‌లోని కాంటీన్లో తింటూండగా అతనికి చపాతీ రుచి నచ్చలేదు. మరొకరైతే తినడం మానేస్తారు, కాంటీన్ మేనేజర్‌కు ఫిర్యాదు చేస్తారు. ఏ బొద్దింకో కనబడితే పార్లమెంటులో ఆ అంశాన్ని లేవనెత్తుతారు. అయితే యితను మాత్రం అప్పటికప్పుడు అన్నం పెట్టే సిబ్బందిని పిలిచి ''నువ్వే చూడు, ఎంత దరిద్రంగా వుందో' అంటూ చపాతీని అతని నోట్లో కుక్కాడు. అతను ముస్లిము. 'రంజాన్ సందర్భంగా నేను ఉపవాసం చేస్తున్నాను మొర్రో' అన్నా వినిపించుకోలేదు.
ఇటువంటివాళ్లను ప్రజలు ఎన్నికల్లో ఓడించకపోవటం వింతగా తోచే వాస్తవం. 1970లలో జంబూవంత్ రావ్ ధోతే అనే శాసనసభ్యుడు స్పీకరు మీదకు పేపర్ వెయిట్ విసిరేస్తే అతన్ని సభ నుంచి బహిష్కరించారు. ఉపయెన్నిక జరిగింది. అతను నిలబడ్డాడు. గతంలో కంటె ఎక్కువ మార్జిన్‌తో నెగ్గాడు. నిఫాడ్ నియోజకవర్గం నుంచి శివసేన ద్వారా రెండుసార్లు ఎన్నికైన అనిల్ కదమ్ 2013 ఆగస్టులో ఒక స్నేహితుడి కారులో ముంబయి-ఆగ్రా నేషనల్ హైవేపై వెళుతున్నాడు. మహిళా సిబ్బంది నిర్వహించే పింపల్గావ్ టోల్ ప్లాజా వద్ద ఆపి టోల్ కట్టమన్నారు. 'నేను ఎమ్మెల్యేని' అన్నాడితను. కారు మీద అలాటి స్టిక్కర్ ఏదీ లేదు కదా, కట్టాల్సిందే అని సిబ్బంది అన్నారు. నేను ఎమ్మెల్యేనని చెప్తున్నా కదా అన్నాడు అనిల్ కదమ్. అయితే ఐడెంటిటీ కార్డు చూపించండి అంది సిబ్బందిలో ఒకామె. అప్పుడతను కారులోంచి దిగి, 'ఆట్టే మాట్లాడావంటే పదిమందిలో గుడ్డలిప్పించి తంతా' అని బెదిరించాడు.
అక్కడున్న సిసిటివిల్లో అంతా రికార్డయింది. టీవీ ఛానెల్స్ ద్వారా బయటకు వచ్చింది. కేసు పెట్టారు. ఇతను లొంగిపోయాడు కానీ వెంటనే బెయిల్‌పై బయటకు వచ్చేశాడు. ఇతనికి బంధువో కాదో తెలియదు కానీ రామ్ కదమ్ అని మరో ఎమ్మెల్యే వున్నాడు. అతను మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ సభ్యుడు. వీరమరాఠీ వాది. 2009 అసెంబ్లీ ఎన్నికలు జరిగాక శాసనసభ్యులు ప్రమాణస్వీకారం చేసే వేళ సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఆబూ అసీమ్ అజ్మీ హిందీలో ప్రమాణస్వీకారం చేస్తూంటే యితను వెళ్లి అతన్ని లెంపకాయ కొట్టాడు. ''హిందీలో ఎందుకు చేశావ్? మరాఠీలో చేయవచ్చుగా'' అంటూ. దానిపై చాలా గొడవ జరిగింది. అతని పార్టీ సభ్యులు నలుగురు అతనికి సమర్థనగా అల్లరి చేయడంతో మొత్తం ఐదుగుర్నీ ఏడాది పాటు సస్పెండ్ చేశారు.
ఎవరినైనా తన్నే అవకాశం వస్తే అతను వదులుకోడు. 2013 మార్చిలో క్షితిజ్ ఠాకూర్ అనే యిండిపెండెంట్ ఎమ్మెల్యే కారులో బాంద్రా-ఓర్లి రోడ్డుపై వేగంగా వెళుతూంటే ప్రవీణ్ సూర్యవంశీ అనే పోలీసు అధికారి అతన్ని ఆపి మందలించాడు. క్షితిజ్ మండిపడడంతో బాటు తన హక్కులకు విఘాతం కలిగిందంటూ అసెంబ్లీలో ఆ అంశాన్ని లేవనెత్తాడు. దానిపై చర్చ జరుగుతూండగా ప్రవీణ్ విజిటర్స్ గ్యాలరీలో కూర్చుని వుండడం అతనికి కనబడింది. అంతే, రామ్ కదమ్‌కు, శివసేనకు చెందిన రాజన్ సాల్వీకి, మరో యిండిపెండెంట్ ఎమ్మెల్యే ప్రదీప్ జైస్వాల్‌కు సైగ చేశాడు.
వాళ్లు విజిటర్స్ గ్యాలరీకి వెళ్లి ప్రవీణ్‌ను చితక్కొట్టేశారు. దాని వీడియో ఇంటర్నెట్ ద్వారా అందరికీ వెళ్లిపోయింది. స్పీకరు విచారణకు ఆదేశించాడు. ఇలాటి ఘనచరిత్ర కలిగిన రామ్ కదమ్‌ను బిజెపి తన పార్టీలోకి ఆహ్వానించి ఘాట్కోపర్ సీటు యిచ్చింది. అతను నెగ్గాడు కూడా. గిరీశ్ మహాజన్ అనే మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిని ఒక మూక-బధిర పాఠశాల యాజమాన్యం ముఖ్య అతిథిగా పిలిస్తే తుపాకీ నడుములో పెట్టుకుని వెళ్లాడతను. సభలో వున్నవారందరికీ అది కనబడింది. ఇదేమైనా పద్ధతిగా వుందా? అని అడిగితే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ''అతనికి తుపాకీ లైసెన్సు వుంది. లైసెన్సు కలిగిన ఆయుధాన్ని యింట్లో పెట్టుకుని పూజించరు.'' అని సమాధాన మిచ్చాడు. ముఖ్యమంత్రులు యిలా వెనకేసుకుని వస్తూంటే ప్రజాప్రతినిథులు చెలరేగిపోరా?
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]