ఎమ్బీయస్‌: కలతల బెనర్జీ

బెంగాల్‌లో బిజెపి ఆడుతున్న మైండ్‌గేమ్‌తో మమతా బెనర్జీ శివాలెత్తిపోతోంది, సంయమనం కోల్పోయి పొరపాట్లు చేస్తోంది. ఇప్పటిదాకా నియంతలా పాలిస్తూ యితర పార్టీలను తృణప్రాయంగా చూసిన తృణమూల్‌ అధినేత్రి యిప్పుడు బెంబేలెత్తి తనతో ఎవరైనా కలిసి…

బెంగాల్‌లో బిజెపి ఆడుతున్న మైండ్‌గేమ్‌తో మమతా బెనర్జీ శివాలెత్తిపోతోంది, సంయమనం కోల్పోయి పొరపాట్లు చేస్తోంది. ఇప్పటిదాకా నియంతలా పాలిస్తూ యితర పార్టీలను తృణప్రాయంగా చూసిన తృణమూల్‌ అధినేత్రి యిప్పుడు బెంబేలెత్తి తనతో ఎవరైనా కలిసి వస్తారేమోనని ఎదురు చూస్తోంది. ఇన్నాళ్లూ తన అహంకార ధోరణి రుచిచూసిన పార్టీలేవీ కలిసి రావటం లేదు. దాంతో ఆమె ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోంది. ఆ క్రమంలో తప్పులు సవరించుకోబోతే అవి బెడిసి కొడుతున్నాయి. ఇన్నాళ్లూ బెంగాల్‌ రాణిగా వెలిగిన ఆమెకు కష్టకాలం దాపురించింది.

పార్లమెంటు ఎన్నికలలో ఫలితాలు చూసి మమత దిమ్మెరపోయింది. ఆమెకు తెలుసు – బిజెపికి బెంగాల్‌లో పెద్దగా బలం లేదనీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటుతోనే అది 18 సీట్లు గెలిచిందనీ. తన ప్రభుత్వాన్ని ప్రజలు యింతగా అసహ్యించుకుంటున్నారనే వాస్తవాన్ని ఆమె జీర్ణం చేసుకోలేక పోతోంది. ఇన్నాళ్లూ తృణమూల్‌ గ్రామగ్రామాల్లో యినుపహస్తంతో ప్రతిక్షకులను అణచి వేస్తూ వచ్చింది. ఇక ఎప్పటికీ తనకు ఎదురు లేదనుకుంది. కానీ బిజెపి గట్టిగా నిలబడడం, తనంటే పడని విపక్షాలన్నీ ఏకం కావడం చేతనే యిలాటి ఫలితం వచ్చిందని ఆమెకు అర్థమయింది. గతంలో సిపిఎం కానీ, కాంగ్రెసు కానీ యీమె పార్టీ నుంచి ఫిరాయింపుల క్రీడకు పాల్పడలేదు. ఆట్టే మాట్లాడితే యీమెయే వాళ్ల నుంచి గుంజుకుంది. ఇప్పుడు ఫిరాయింపులతో బిజెపి ఆమెకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని సాక్షాత్తూ ప్రధాని బహిరంగంగా చెప్పారు. ఆ 40 మంది ఎవరా అన్న ఆలోచనే ఆమెను తినేస్తోంది. 

ఆమె స్థయిర్యాన్ని దెబ్బ తీయడానికి బిజెపి అంచెల వారీగా ఫిరాయింపులు చేస్తోంది. ఫలితాలు వచ్చిన నెల్లాళ్లలో 6గురు ఎమ్మెల్యేలు గోడదూకారు. 5 మునిసిపాలిటీలు, 850 గ్రామ పంచాయితీలు చేజారాయి. ఇంకా ఎంతమంది వెళతారో తెలియని పరిస్థితిలో ప్రతివారినీ శంకించే అయోమయంలో పడింది మమత. గోడ దూకుతారన్న అనుమానం ఉన్న పార్టీ సభ్యులపై ఏదో ఒక కారణం చెప్పి కేసులు పెట్టిస్తోంది. ఈ గందరగోళంలో విశ్వాసపాత్రులైౖన వారు కూడా నష్టపోతున్నారు. పార్టీకి దూరమవుతున్నారు. అవతలివాళ్లు కాస్త పేరున్న నాయకులైతే రాయబారాలు పంపుతోంది. గతంలో అమె యిలాటివి చేయలేదు. వీళ్లందరికీ అలుసై పోయినందుకు ఆమెకు ఉక్రోషంగా ఉంది. రాష్ట్రంలో ఏ ఆందోళన జరిగినా, ఏ గొడవ జరిగినా అది బిజెపి చేయిస్తున్నదేమోనన్న భీతి ఆమెను వెంటాడుతోంది. అందుకే నీల రతన్‌ సర్కార్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌) ప్రభుత్వ కాలేజీ, ఆసుపత్రి డాక్టర్ల విషయంలో కోతిపుండును బ్రహ్మరాక్షసిగా చేసుకుంది.

ప్రయివేటు ఆసుపత్రుల్లో కూడా చికిత్స పూర్తయ్యాక పేషంట్లు, డాక్టర్లు ఘర్షణ పడడం సాధారణం. సవ్యంగా పూర్తయితే బిల్లు ఎక్కువగా వేశారనీ, పేషంటు మృతి చెందితే డాక్టర్లు నిర్లక్ష్యం చేశారనీ గొడవ చేస్తూంటారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అయితే చెప్పనే అక్కరలేదు. ముఖ్యంగా వ్యాధిగ్రస్తుడు పేదవర్గాలకు, విద్యావిహీన వర్గాలకు చెందినవాడైతే అతని తరఫున పోట్లాడడానికి పదుల సంఖ్యలో బంధుమిత్రులు వచ్చి ఆసుపత్రిపై పడి పరికరాలను విరక్కొట్టడం, డాక్టర్ల కాలరు పట్టుకోవడం చేస్తూంటారు. మన మజ్లిస్‌ ఎమ్మెల్యేల వంటి ప్రజాప్రతినిథులు తోడు వస్తే డాక్టర్లను కొడతారు కూడా! ఎన్‌ఆర్‌ఎస్‌ ఆసుపత్రి ఘటనలో చనిపోయినవాడు 75 ఏళ్ల మహమ్మద్‌ సయీద్‌. ''అతనికి గుండె పోటు వచ్చింది. చికిత్స నడుస్తూండగానే సాయంత్రం గుండె లయ తప్పింది. ఇంజక్షన్లు యిచ్చినా లాభం లేకపోయింది, చనిపోయాడు'' అంటారు డాక్టర్లు. ''సాయంత్రం 5 గంటల దాకా ఏ సమస్యా లేదు. సమస్య రాగానే డాక్టర్ల గురించి వెతికితే గంటన్నరకు కానీ ఎవరూ దొరకలేదు. చివరకు ఒకాయన వచ్చి ఇంజక్షన్‌ యిచ్చాడు. దాంతో ఆయన చనిపోయాడు.'' అంటారు బంధువులు. 

పేషంటు హఠాత్తుగా మరణించడంతో అతనితో పాటు వచ్చిన ముగ్గురు ఆగ్రహావేశాలతో ''ఇదంతా మీ నిర్లక్ష్యఫలితమే'' అంటూ ముగ్గురు (ఇద్దరు ఆడ, ఒక మొగ) హౌస్‌సర్జన్లను తిట్టి, తోసేశారు. దాంతో పోస్ట్‌మార్టమ్‌ చేస్తే తప్ప శవాన్ని యివ్వమని డాక్టర్లు అన్నారు. పోలీసులకు కబురు పెట్టారు. రాత్రి 10.30కు 150 మంది వచ్చి శవాన్ని యిమ్మనమన్నారు. తమకు క్షమాపణ చెపితే తప్ప శవాన్ని యివ్వం అని డాక్టర్లు అన్నారు. పేషంటు అల్లుడు, మరొకరు క్షమాపణ చెప్పారు. ''మమ్మల్ని తిట్టినవాళ్లే వచ్చి చెప్పాలి. వాళ్ల తరఫున మీరు చెపితే కుదరదు.'' అని డాక్టర్లు పట్టుబట్టారు. ఏం గొడవ అవుతుందోనన్న భయంతో పోలీసులు డాక్టర్లను, పేషంటు బంధువులను హాస్పటల్‌లో ఒక బహిరంగ ప్రదేశానికి పిలిపించి మాట్లాడించబోయారు. ఇంతలో కొందరు డాక్టర్లు హాకీ కర్రలు చేతబట్టుకుని దాడి చేశారు. 

అంతే పేషంటు బంధువులు సహనం కోల్పోయారు. కలకత్తాలో మాబ్‌ మెంటాలిటీ ఎలా వుంటుందో గతంలోనే రాశాను. ఆసుపత్రి ఆవరణలో హింసకు పాల్పడ్డారు. అందుబాటులో ఉన్న రాళ్లను, కొబ్బరి బొండాలను డాక్టర్ల మీదకు విసిరేశారు. అలా విసిరేసిన ఓ కొబ్బరిబొండం నెత్తిన పడి పరివాహ ముఖోపాధ్యాయ అనే డాక్టరు కపాలానికి తీవ్రంగా దెబ్బలు తగిలి సర్జరీ చేయవలసి వచ్చింది. అతని తండ్రి ప్రైమరీ స్కూలు టీచరు, తల్లి అంగన్‌వాడీ సేవకురాలు. యశ్‌ తేక్వానీ అనే మరో డాక్టరుకి కూడా తలమీదే దెబ్బ తగిలింది కానీ ఆపరేషన్‌ అవసరం పడలేదు. వెంటనే తమకు రక్షణ కల్పించాలంటూ డాక్టర్లు ఆందోళనకు దిగారు. ఇది ఏ ఊళ్లోనైనా జరిగే వ్యవహారమే. ఈ సందర్భాలలో ఆరోగ్యశాఖ మంత్రి 'డాక్టర్లకు రక్షణ కల్పిస్తామని, పేషంటు కుటుంబానికి న్యాయం చేయడానికి లక్షో, రెండు లక్షలో యిస్తామ'ని అనేసి వ్యవహారం ముగించేస్తారు.

కానీ ఇక్కడ మమత స్వయంగా రంగంలోకి దిగింది. ఈ డాక్టర్ల ఆందోళన వెను బిజెపి లేదా సిపిఎం హస్తముందనే శంకతో దీన్ని మొగ్గలోనే తుంచేయాలనుకుని డాక్టర్లపై విరుచుకు పడింది. వాళ్లను 'ఔట్‌సైడర్స్‌' అంది, 'అర్బన్‌ నక్సల్స్‌' అంది. వీటితో బాటు దానికి మతం రంగు పులమబోయింది. 'రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించడానికి బిజెపి-సిపిఎం చేస్తున్న కుట్రలో భాగమిది. ముస్లిము పేషంట్లకు చికిత్స అందించవద్దని వాళ్లు డాక్టర్లకు చెపుతున్నారు. డాక్టర్లు తమ వృత్తిధర్మాన్ని వీడి పేషంటును పరీక్షించేముందు వాళ్ల యింటిపేరు ఏమిటాని చూడడం ఘోరం. ఫయర్‌ ఆఫీసర్లు, మిలటరీ వాళ్లు కూడా అలా చూడడం మొదలుపెడితే సహించగలమా?'' అంది. దాంతో డాక్టర్లు మండిపడ్డారు. మమతకు బుద్ధి చెప్పాలనుకున్నారు. చర్చలకు పిలిచినా వెళ్లలేదు. ఆమెయే తమ దగ్గరకు రావాలన్నారు. దేశమంతటా డాక్టర్లు వారికి సంఘీభావం తెలిపి, ఆందోళనలు చేపట్టారు. మమత కాబినెట్‌లోని మంత్రులు, పార్టీలోని నాయకులు, స్పీకరు, ఆఖరికి మెడిసిన్‌ చదువుతున్న ఆమె మేనల్లుడు ఆవేశ్‌ అందరూ డాక్టర్ల తరఫునే మాట్లాడారు. ఇక గత్యంతరం లేక మమత దిగి వచ్చింది. డాక్టర్లు చెప్పినవాటికి ఔనంది.

ఆమె తన అధికారగణాన్ని కూడా నమ్మడం మానేసింది. ఎన్నికల క్లిష్టసమయంలో వీళ్లంతా బిజెపి చెప్పినట్లు ఆడారని ఆమెకు అపనమ్మకం. ఫలితాలు వచ్చిన 21 రోజుల్లోనే 43 మంది ఐపిఎస్‌లను మార్చేసింది. బిజెపి నెగ్గిన చోటల్లా జిల్లా మేజిస్ట్ల్రేట్లను, ఎస్పీలను మార్చేస్తోంది. డార్జిలింగ్‌లో గూర్ఖా జనముక్తి మోర్చా (బినయ్‌ తమాంగ్‌ వర్గం) అభ్యర్థికి తృణమూల్‌ మద్దతిచ్చింది. వాళ్లు ఎన్నికల సమయంలో జిల్లా మేజిస్ట్రేటు జయషీ దాస్‌గుప్తాపై ఒత్తిడి తెచ్చినా ఆమె పట్టించుకోలేదు. దాంతో ఫలితాలు రాగానే ఆమెను బదిలీ అయిపోయింది – రెండు రోజుల్లో రెండు సార్లు! ఇప్పుడు రాష్ట్రమంతటా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ''వీటిలో బిజెపి కార్యకర్తలపై మేం చేస్తున్న ఫిర్యాదులను పోలీసు వారు నమోదు చేసుకోవటం లేదు'' అని తృణమూల్‌ నాయకులు వాపోతున్నారు. గతంలో తృణమూల్‌ గురించి యితరులు వాపోయేవారు. 

తన పార్టీకి అనుకున్నన్ని సీట్లు రాకపోవడానికి అవినీతియే కారణమని మమత గ్రహించింది. ఎన్నికలలో డబ్బులు ఖఱ్చు పెట్టగలిగినవారికే పార్టీ టిక్కెట్లు యిస్తున్నారు. వాళ్లు దాన్ని రాబట్టడానికి తమ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనుల్లో కమిషన్‌ (కట్‌ మనీ) తీసుకుంటున్నారు. పనులు చేసిపెడతామని ప్రజల నుంచి డబ్బు తీసుకుంటున్నారు. పని జరగకపోయినా డబ్బు తిరిగి యివ్వటం లేదు. ఈ ఎన్నికలలో ప్రజలు తమ కసి తీర్చుకున్నారు. ఈ సంగతి గుర్తించిన మమత తన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఉద్దేశించి ''మీలో ఎవరైనా ప్రజల నుంచి డబ్బు తీసుకుని ఉంటే దాన్ని వెనక్కి యిచ్చేయండి. నా పార్టీలో దొంగలుండడం నేను సహించను.'' అని ఉపన్యసించింది. ఆ విధంగా తను అవినీతికి అతీతం అని చూపించుకోబోయింది. కానీ యిది అనుకోని ఫలితాల నిచ్చింది. రాష్ట్రమంతటా ప్రజలు స్థానిక తృణమూల్‌ నాయకుల యిళ్లపై పడి ''మీ నాయకురాలు చెప్పింది కదా, మా డబ్బు మాకు వెనక్కి యిచ్చేయండి'' అని గొడవ చేయసాగారు. పంచాయితీ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి దాకా ఏ నాయకుణ్నీ వదలటం లేదు. వాళ్లేదైనా సర్దిచెప్పబోయినా పిల్లికూతలతో వెక్కిరిస్తున్నారు. కొన్ని జిల్లాలలో తృణమూల్‌ నాయకుల యిళ్లు ధ్వంసం చేశారు కూడా.

దీంతో పార్టీ నాయకుల ధైర్యం చెదిరిపోయింది. జనాలలోకి వెళ్లడం మానేశారు. కొంతమంది నాయకులు ''పెద్ద నాయకులు తాము గట్టున పడడానికి మమ్మల్ని బలిపశువుల్ని చేశారు.'' అని వాపోయారు. తృణమూల్‌ ఎంపీ శతాబ్ది రాయ్‌ ''ఇలాటివి ఎప్పుడో ఆపేయాల్సింది. ఇప్పుడైతే కష్టం. ఆ కట్‌ మనీ కింది స్థాయి వాళ్ల దగ్గర ఉంటుందా ఏమన్నానా? ఇదో గొలుసుకట్టు వ్యవహారం. అందరి నుంచి వెనక్కి తీసుకోవడం అయ్యే వ్యవహారం కాదు.'' అంది. ఇది చివికి చివికి గాలివాన అయిపోయింది. మమతా బెనర్జీ అనుచరుడే అయినా బెంగాలీ గాయకుడు నచికేత 'కట్‌ మనీ'పై ఒక వ్యంగ్యగీతం రాసి పాడాడు. అది సోషల్‌ మీడియాలో పాప్యులరై, పార్టీని అన్‌పాప్యులర్‌ చేసింది. దాంతో చివరకు పార్టీయే ''మా పార్టీలో 99.99% మంది నిజాయితీపరులే'' అని ప్రకటన విడుదల చేయవలసి వచ్చింది.

పార్లమెంటు ఎన్నికలకు ముందు ప్రధాని అవుదామని కలలు కన్న మమత ''కలకత్తాలో అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారు. ఇది మినీ ఇండియా లాటిది.'' అంటూ తను ప్రాంతీయవాదానికి అతీతమైన జాతీయ నాయకురాలినని చెప్పుకుంది. ఎప్పుడైతే ఫలితాలు ఎదురు తన్నాయో అప్పణ్నుంచి బెంగాలీ పాట అందుకుంది. కలకత్తాలో, బెంగాల్‌లోని యితర ప్రాంతాల్లో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పనివారు చాలామంది బతుకుతుంటారు. (బెంగాలీలు వారిని 'హిందూస్తానీలు' అంటారు) ఆ యా రాష్ట్రాల్లో బిజెపి బలంగా ఉంది కాబట్టి ఆ ప్రభావానికి లోనై వారంతా బిజెపికి ఓటేశారని మమతకు సందేహం. బహుశా సర్వేలు కూడా అలా చెపుతున్నాయేమో! అందువలన వారిపై పగబట్టింది. వాళ్లని 'బయటివారి'గా వ్యవహరిస్తోంది, ''బెంగాల్‌లో ఉంటే బెంగాలీ నేర్చుకుని తీరాలి.'' అని నినదిస్తోంది. ఇన్నేళ్లగా యీ విషయం ఎందుకు గుర్తుకు రాలేదో మరి! బిజెపి హిందూ, నాన్‌-హిందూగా ఓటర్లను విడగొడుతూంటే, మమత హిందువులను బెంగాలీలు, హిందూస్తానీలుగా విడగొడుతోంది. 

బిజెపి 'జై శ్రీరామ్‌' నినాదాన్ని రణన్నినాదంగా మార్చుకుంది. మమతను ఉడికించడానికి వాడుకుంటోంది. అది వింటే చాలు మమతకు పూనకం వచ్చేస్తోంది. తన కారుకి అడ్డం పడి జై శ్రీరామ్‌ అని అరిచే వాళ్లను తన్నమని పోలీసులకు చెపుతోంది. 'అదేమిటి, దేవుడి పేరు పలికినా తప్పేనా?' అంటూ బిజెపి అమాయకత్వం నటిస్తోంది. దేవుడి పేరు పలికే చోట పలకాలి. గుళ్లో భజన చేస్తూ జై శ్రీరామ్‌ అంటే ఎవరూ తప్పు పట్టరు. దాన్ని రోడ్ల మీద ప్రదర్శనలు చేస్తూ, రాజకీయంగా వాడినప్పుడే చిక్కు. మతపరమైన రాజకీయాలు చేసే పార్టీలు మాత్రమే అలా చేస్తాయి. రాజకీయంగా బెంగాల్‌లో దృఢపడుతున్న బిజెపికి నిజానికి అలాటి అవసరం లేదు. కానీ మమతను హిందూద్వేషిగా, ముస్లిం పక్షపాతిగా చిత్రీకరించడానికి యీ టెక్నిక్‌ వాడుతున్నారు. 'జై శ్రీరామ్‌ అంటే లాఠీ దెబ్బలు కొట్టించింది అని చెప్పుకుంటారు తప్ప, మేం వెళ్లి ఆమె దారికిి అడ్డుపడ్డాం, ఆమె మాట్లాడుతూంటే గోల చేశాం' అని చెప్పరుగా! మమతకు సహనం, చాకచక్యం ఉంటే వీరిని సరైన విధానంలో టేకిల్‌ చేయగలిగేది. కానీ ఆమెవన్నీ మొరటు పద్ధతులు. ఇన్నాళ్లూ చెల్లాయి. ఇప్పుడు చెల్లటంలేదు.
– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2019)
[email protected]