ఎమ్బీయస్‍: ఆత్మహత్యేనా, ‘మతహత్యా’?

తమిళనాడులోని తంజావూరు జిల్లాలో మైకేల్‌పట్టి అనే పల్లెటూరుంది. అక్కడున్న 800 కుటుంబాలలో క్రైస్తవులు, హిందువులు, ముస్లిములు అందరూ ఉన్నారు. మతకలహాల చరిత్రే లేదు. శతాబ్దాల క్రితం కట్టిన సెయింట్ మైకేల్ చర్చి కారణంగా ఆ…

తమిళనాడులోని తంజావూరు జిల్లాలో మైకేల్‌పట్టి అనే పల్లెటూరుంది. అక్కడున్న 800 కుటుంబాలలో క్రైస్తవులు, హిందువులు, ముస్లిములు అందరూ ఉన్నారు. మతకలహాల చరిత్రే లేదు. శతాబ్దాల క్రితం కట్టిన సెయింట్ మైకేల్ చర్చి కారణంగా ఆ ఊరికి ఆ పేరు వచ్చింది. ఆ ఆవరణలో 163 ఏళ్లగా ఉన్న సేక్రెడ్ హార్ట్‌స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ప్రస్తుతం 677 మంది విద్యార్థినీ విద్యార్థులుంటే వారిలో 60శాతం మంది హిందువులే. స్కూలుకి సంబంధించిన హాస్టల్లో కూడా చాలామంది హిందువులుంటారు. ఆ స్కూల్లో 12వ క్లాసు చదివే లావణ్య అనే 17 ఏళ్ల హిందూ విద్యార్థిని జనవరి 19న ఆత్మహత్య చేసుకున్న కారణంగా అది యిప్పుడు వార్తల్లో కెక్కింది. ఆమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన వీడియో కారణంగా ‘మతమార్పిడి ఒత్తిళ్లకు తట్టుకోలేకనే ఆమె ఆత్మహత్య చేసుకుంది’ అనే ఆరోపణ ముందుకు వచ్చింది. ఇన్నేళ్లగా ఆ స్కూలు కానీ, చర్చికానీ యిలాటి వివాదాల్లో చిక్కుకోలేదు కాబట్టి ‘ఆమె కుటుంబకారణాల చేతనే చేసుకుంది’ అనే ప్రతివాదన ఉంది. నిజానిజాలు నింపాదిగా తేలతాయేమో కానీ యీలోగా వెలుగులోకి వచ్చిన వివరాలిలా ఉన్నాయి.

లావణ్యది పొరుగున ఉన్న అరియలూరు జిల్లాలోని వడుగపాలయం. చిన్న రైతు. తండ్రి పేరు మురుగనాథం. తల్లి కనిమొళి. తమ్ముడు చెల్లి ఉన్నారు. లావణ్యకు 9 ఏళ్ల వయసుండగా, 2013లో  భర్తతో పోట్లాట జరిగి కనిమొళి ఆత్మహత్య చేసుకుంది. ఏడాది తిరక్కుండా అతను శరణ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఆమె ద్వారా ఒక కొడుకుని కన్నాడు. సవతితల్లి వచ్చాక లావణ్యకు కష్టాలు ప్రారంభమయ్యాయని, లావణ్య మాతామహుడు అంటున్నాడు. ‘‘మేం ఒకే ఊళ్లో వుంటున్నా, మా అల్లుడు మాతో సంబంధాలు తెంపుకున్నాడు. సవతితల్లి భయంతో మా మనవలు మా యింటికి రారు.’’ అని పోలీసులకు చెప్పాడు. తండ్రి, సవతి తల్లి కలిసి 8వ తరగతి నుంచి ఆమెను స్కూలు హాస్టల్లోనే పెట్టారు.

2020 జులైలో లావణ్య తల్లివైపు బంధువైన నిత్యానంద సరస్వతి ‘లావణ్యను సవతితల్లి బాధలకు గురి చేస్తోందని, కాల్చివాతలు పెట్టిందని ఊళ్లో అనుకుంటున్నార’ని శిశుసంరక్షణ చూసే చైల్డ్‌లైన్ అనే ప్రభుత్వ సంస్థకు ఫిర్యాదు చేసింది. వాళ్లు ఊళ్లో లావణ్య యింటికి వెళ్లి అడిగితే, ‘అబ్బే, అదేం లేదు’ అనేసిందామె. ‘సవతి తల్లి యింకెన్ని బాధలు పెడుతుందోనన్న భయం చేత అలా చెప్పింది. మా వద్దకు వస్తానన్నందుకే లావణ్య ఒంటిపై శరణ్య కాల్చి వాతలు పెట్టిందని విన్నాను. అందుకే మేమూ ధైర్యం చేయలేదు.’ అన్నాడు మాతామహుడు.

ఏది ఏమైనా 10వ తరగతి నుంచి స్కూలుకి సెలవులు యిచ్చినప్పుడు కూడా లావణ్య యింటికి వెళ్లడానికి యిష్టపడేది కాదు. హాస్టల్లోనే వుండేది. శ్రద్ధగా చదువుకునేది. ఎస్సెల్సీలో 500కి 489 మార్కులు తెచ్చుకుంది. ఆమె స్కూలు ఫీజు చాలా సార్లు వార్డెన్ సిస్టర్ సహాయ మేరీ కట్టేదని అంటున్నారు. ఈ జనవరి 9న హాస్టల్లో వుండగానే లావణ్య మూలికలతో చేసిన ఏదో విషపదార్థం తిని ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. దాంతో వాంతులయ్యాయి. హాస్టలు వార్డెన్ వంటమనిషినిచ్చి ఆమెను ఊళ్లో ఓ నర్సు దగ్గరకు పంపింది. నర్సు యింజక్షన్, మాత్రలు యిచ్చింది. అయినా వాంతులు తగ్గకపోవడంతో హాస్టలు వాళ్లు ఆమె తండ్రికి కబురు పెట్టారు. అతను వచ్చి తీసుకెళ్లి ఊళ్లో ఆసుపత్రిలో కడుపునొప్పంటూ చూపించాడు. అక్కడా తగ్గకపోతే తంజావూరు ప్రభుత్వాసుపత్రికి జనవరి 15న తీసుకెళ్లి చేర్పించాడు.

అక్కడి డాక్టరు పరీక్ష చేసి ఇదేదో ఆత్మహత్యాప్రయత్నంలా వుంది, విషమేదో మింగింది అన్నాడు. అప్పటిదాకా దాని గురించి ఏమీ మాట్లాడని లావణ్య ‘ఔను నిజమే’ అంది. వెంటనే డాక్టర్లు పోలీసులను, మేజిస్ట్రేటును పిలిచారు. వారి ఎదుట ఆమె మరణవాంఙ్మూలం యిచ్చింది. ‘మా హాస్టలు వార్డెన్ సిస్టర్ సహాయ మేరీ నా చేత అడ్డమైన చాకిరీ చేయించింది. ఆ బాధ భరించలేక నేను విషం తీసుకున్నాను.’ అని. దానిలో మతమార్పిడిపై స్కూలు వాళ్లు ఒత్తిడి చేశారు అని చెప్పలేదు. ఆమె తలిదండ్రులు కూడా ఆ విషయం పోలీసులకు చెప్పలేదు. స్టేటుమెంటు యివ్వగానే పోలీసులు 67 ఏళ్ల వార్డెన్ మీద నాలుగు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు పెట్టి అరెస్టు చేశారు. సూసైడ్ నోట్ ఏదీ దొరక్కపోయినా, లావణ్య తన భావాలు రాసుకున్న నోట్‌బుక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లావణ్య జనవరి 19న మరణించింది. ఆమె మరణించిన కొన్ని గంటలకే ఒక 47 సెకన్ల వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దానిలో లావణ్య ‘రెండేళ్ల క్రితం మా స్కూలు కరస్పాండెంటు నన్ను క్రైస్తవంలోకి మార్చడం గురించి మా అమ్మానాన్నతో మాట్లాడారు.’ అని చెప్పింది. ‘నువ్వు మారనని చెప్పడం చేతనే నిన్ను అవస్తలకు గురి చేశారా?’ అనే ప్రశ్నకు ఆమె తలూపింది. వీడియో బయటకు వచ్చిన కొన్ని గంటలకే బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరుప్పు మురుగనాదం, యితర బిజెపి నాయకులు స్కూలు నిర్వాహకులపై చర్య తీసుకోవాలంటూ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. మర్నాడే ఆమె తలిదండ్రులు ‘మతమార్పిడి ఒత్తిడి చేతనే మా అమ్మాయి మరణించింది’ అంటూ ప్రకటించి, ఆ రోజునే ‘స్థానిక పోలీసుల విచారణపై మాకు నమ్మకం లేదు, ఈ కేసుని సిబిఐకి అప్పగించ’మని మద్రాసు హైకోర్టు మధురై బెంచ్‌కు పిటిషన్ పెట్టుకున్నారు. అదే రోజు హిందూ సంఘాలు, బిజెపి కలిసి ఈ ‘బలవంతపు మతమార్పిడి’ సంఘటనపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సిపిసిఆర్)కి ఫిర్యాదు చేశాయి. మొత్తం 3545 ఫిర్యాదులు వెళ్లాయట.

సంఘటన జరగగానే వెంటవెంటనే యిన్నేసి ఘటనలు జరగడంతో అసలీ వీడియో ఎప్పుడు తీశారు? ఎవరు తీశారు? తీయగానే పోలీసులకు ఎందుకు యివ్వలేదు? ఇస్తే యీ ఆరోపణపై పోలీసులు మరో మరణ వాఙ్మూలం తీసుకునేవారు కదా! అనే చర్చ ప్రారంభమైంది. విశ్వ హిందూ పరిషత్ జిల్లా సెక్రటరీ ముత్తువేల్ వీడియో తీసినట్లు తేలింది. ఎందుకు తీశావు అని అడిగితే ‘నా స్నేహితుడు ఆ అమ్మాయికి బంధువు. చికిత్స సరిగ్గా జరిగేట్లు చూడమని కోరితే అతనితో కలిసి జనవరి 17న ఆసుపత్రికి వెళ్లాను. ఆమె సవతితల్లి కోరికపై మొబైల్ ఫోన్‌లో ఆమె స్టేటుమెంటు రికార్డు చేశాను.’ అన్నాడు. వెంటనే పోలీసులకు ఎందుకివ్వలేదో చెప్పలేదు. హైకోర్టు ఆ ఫోన్‌ను ఫోరెన్సిక్ నిపుణులకు అప్పగించమని ఆదేశిస్తే అప్పగించాడు.

తర్వాత బయటకు వచ్చిన సంగతేమిటంటే, హిందూత్వ నాయకుడు నాలుగు వీడియోలు తీసుకున్నాడు. వాటిలో మూడిటిలో లావణ్య మతమార్పిడి గురించి ఏమీ చెప్పలేదు కానీ నాలుగో దానిలోనే పైన చెప్పిన విషయం ఉంది. రెండేళ్ల క్రితం మతమార్పిడికై అడిగితే మరి యిన్నాళ్లూ ఏం చేసింది? ఆ నన్‌పై స్కూలు అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు కదా! డిఇఓ, సిఇఓ (చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసరు) గత పదేళ్లలో ఆ స్కూలుకి 16 సార్లు విజిట్స్‌కు వచ్చారు. వాళ్లకు చెప్పి వుండవచ్చుగా! వాళ్లు వినరనుకుంటే, స్కూలు, హాస్టలు వదిలేసి అక్కణ్నుంచి వెళ్లిపోవచ్చు కదా! సెలవుల్లో యింటికి కూడా వెళ్లకుండా యిక్కడే వుండడం దేనికి? ఆ నన్ నుంచి సాయం తీసుకోవడం దేనికి? ఇంట్లో తండ్రికి చెప్తే అతనే వెళ్లి పోట్లాడేవాడు కదా, ఎవరైనా సంఘాల మద్దతు తీసుకుని వాళ్లని నిలదీసేవాడు కదా! అదేమీ చేయకుండా ప్రాణం తీసుకోవడం దేనికి? 2013 నుంచి 2022 వరకు మొత్తం 5270 మంది హిందూ స్టూడెంట్స్ చదివారు. క్రైస్తవమతంలోకి మారమని స్కూలు యాజమాన్యం మమ్మల్ని ఒత్తిడి చేసిందని వాళ్లెవరూ ఆరోపించలేదు. వేరెవ్వరిపైనా పెట్టని ఒత్తిడి యీమెపై మాత్రమే ఎందుకు పెట్టారు?

ఇలాటి ప్రశ్నలు ఎన్నయినా వేయవచ్చు. కానీ జవాబు చెప్పడానికి లావణ్య లేదు. ఆమె తలిదండ్రుల వద్ద జవాబు లేదు. ఈ వీడియో ఆమె బతికుండగానే రిలీజు చేసి వుంటే పోలీసులు క్రాస్‌చెక్ చేసుకునేవారు. వారికా అవకాశం లేకుండా చేశాడు ముత్తువేల్. అందుకే తమిళనాడు పోలీసులు మతమార్పిడి కోణాన్ని పక్కన పెట్టేశారు. ‘ఆమె మృత్యుశయ్యపై వుండగా మేం ప్రాథమిక విచారణ చేశాం. అప్పుడు లావణ్య కానీ, ఆమె తలిదండ్రులు కానీ యీ విషయమే ప్రస్తావించలేదు.’ అని ఎస్పీ చెప్పారు. కానీ తమిళనాడులో ఎదగాలని చూస్తున్న బిజెపి, హిందూత్వ శక్తులు యీ వివాదాన్ని వదలదల్చుకోలేదు. బలవంతపు మతమార్పిడి జరుగుతోంది అని ఆ స్కూలుపై దండెత్తారు. నిజానిజాలు తేలుస్తాం అంటూ ఆ వూరికి గుంపులుగుంపులుగా వెళుతున్నారు. ఈ ప్రయత్నాలను ఆ వూరి జనం హర్షించటం లేదు. ‘మా ఊళ్లో మతమార్పిడులు జరగటం లేదు. మా మధ్య ఘర్షణలు ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు అనవసరంగా కొంతమంది చిచ్చు పెడుతున్నారు. ఎక్వయిరీ చేస్తున్నాం అంటూ కొన్ని గ్రూపులు యిక్కడకు రాకుండా చూడండి.’ అని తంజావూరు కలక్టరుకి పిటిషన్లు పెట్టారు.

ఆమె తలిదండ్రులు యీ కేసుని సిబిఐకి అప్పగించమని మద్రాసు హైకోర్టు మధురై బెంచ్‌కు పిటిషన్ పెట్టుకుంటే, సిబిఐకు బదిలీ చేయడాన్ని ఆపాలంటూ తమిళనాడు పోలీసు సుప్రీం కోర్టుకి వెళ్లింది. సుప్రీం కోర్టు వినలేదు. మీరు విచారణ జరపండి అని సిబిఐని ఆదేశించింది. హైకోర్టు ఫిబ్రవరి 15న కేసు సిబిఐకి అప్పగించండి అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సిబిఐ అప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. హాస్టల్ వార్డెన్ సహాయ మేరీని నిందితురాలిగా చేర్చింది. బిజెపి అధ్యక్షుడు నడ్డా నలుగురు సభ్యులతో, మధ్యప్రదేశ్ ఎంపీ సంధ్యా రాయ్, తెలంగాణకు చెందిన విజయశాంతి, మహారాష్ట్రకు చెందిన చిత్ర తాయీ వాఘ్, కర్ణాటకకు చెందిన గీతా వివేకానందలతో ఓ కమిటీని తమిళనాడుకి పంపింది.

నిజనిర్ధారణకై ఎన్‌సిపిసిఆర్ కూడా ఓ కమిటీని పంపింది. కమిటీలో చైర్‌పర్శన్ ప్రియాంక కనుంగో, ఎడ్యుకేషన్ ఎడ్వయిజర్ మధూలికా శర్మ, లీగల్ కన్సల్టెంట్ కాత్యాయని ఆనంద్ ఉన్నారు. వస్తూనే తమిళనాడు ప్రభుత్వం మాకు సహకరించటం లేదు అన్నారు. జనవరి 30-31లో విచారణ జరిపి  మార్చిలో వెలువరించిన ఇంక్వయిరీ రిపోర్టులో అధికారులు చాలా అంశాలు సరిగ్గా యిన్వెస్టిగేట్ చేయలేదని, సాక్ష్యం టాంపరింగ్ జరిగిందని కమిటీ అంది. కానీ మతమార్పిడికై ఒత్తిడి చేతనే అమ్మాయి ప్రాణం తీసుకుందా, వేరే కారణం వుందా అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. స్కూలు అధికారులు ఆ బాలిక ఆరోగ్యం చెడిపోయినపుడు, ఆమెను విడిగా గదిలో పెట్టలేదని, ఓ నర్సుకి అప్పగించారని, రోగం ముదిరినప్పుడు తండ్రిని పిలిచి అప్పగించారని, అలా అప్పగించేముందు ఫీజు బకాయిలు వసూలు చేసుకున్నారని విమర్శించింది.

మైనరైన పిల్ల చేత బుక్ కీపింగు, ఎకౌటింగు, స్టోర్ మేనేజ్‌మెంటు వంటి పనులతో పాటు నేల తుడిపించడం, టాయిలెట్లు కడిగించడం, తలుపు దగ్గర దర్వానుగా వుండడం వంటివి చేయించారని అంది. (ఇవన్నీ చేయవలసి వచ్చినా ఆ పిల్ల యిక్కడే వుంది తప్ప యింటికి వెళ్లలేదేం? అని కమిటీ ఆలోచించలేదు) ఆమె మరణించిన తర్వాత పోలీసు అధికారులు విచారణ సరిగ్గా జరపలేదని, ఆమె నివసించిన ప్రదేశాన్ని సీల్ చేయకపోవడం చేత సాక్ష్యాలు చెదిరిపోయి వుంటాయని అంది. నిజానికి లావణ్య చనిపోయినది ఆసుపత్రిలో! ఇప్పుడున్న పిల్లల్ని హాస్టల్ నుంచి వేరే చోటకి (ఎక్కడికి?) మార్పించమని సిఫార్సు చేసింది.

ఇలా ఏవేవో అంశాలు ప్రస్తావించారు తప్ప మతమార్పిడి ఒత్తిడి వల్లనే చనిపోయిందని కమిటీ యితమిత్థంగా చెప్పనందుకు హిందూ సంస్థలు కోపం తెచ్చుకున్నాయి. రిపోర్టు అసంపూర్ణంగా వుందని పెదవి విరిచాయి. ‘కమిటీ ఎవరెవర్ని కలిసిందో ఆ వివరాలు బయటపెట్టలేదు. స్కూలు నిర్వహణ గురించి వ్యాఖ్యలు చేశారు సరే, మతమార్పిడికై ఒత్తిడి చేయలేదు అని స్పష్టంగా చెప్పలేదేం? వాళ్లు వచ్చినది ఆ ఫిర్యాదు గురించే కదా!’ అని యితర వర్గాలు మూతి ముడిచాయి. కుటుంబ కారణాల చేతనో, హాస్టలు వార్డెన్ దాష్టీకం చేతనో, మతమార్పిడి ఒత్తిళ్ల చేతనో కానీ 17 ఏళ్ల పిల్ల తన ప్రాణం తీసుకోవడం దురదృష్టకరం. దాన్ని రాజకీయ కారణాలకు వాడుకోవడం మరీ దురదృష్టకరం. బలవంతపు మతమార్పిడి ఒత్తిడే కారణమా అంటే ఆమె తలూపినప్పుడు ఆ వీడియోను వెంటనే విడుదల చేయకుండా రెండు రోజులు దాచి, ఆమె మరణం తర్వాతనే రిలీజు చేయడం అత్యంత దురదృష్టకరం, దుర్మార్గం.

– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2022)

[email protected]