ఎన్నికల ఫలితాలపై యిచ్చిన ''ఫ్రంట్‌లైన్''కు యిచ్చిన యింటర్వ్యూలో కాంగ్రెసు ఓటమి గురించి జైరాం రమేశ్ వాపోయారు – ''గత పదేళ్లలో డిజిపి అభివృద్ధి రేటు 8% వుంది. 14 కోట్ల మంది దారిద్య్రరేఖ నుండి బయటపడ్డారు. 2005లో సమాచారహక్కు చట్టం తెచ్చాం. 2013లో భూమి స్వాధీన చట్టం తెచ్చాం. ఎన్రేగా (పనికి ఆహారపథకం) స్కీము ప్రవేశపెట్టాం. యుపిఏ అధికారంలోకి వచ్చినపుడు 3 కోట్ల మొబైల్ ఫోన్లు వుంటే యీ రోజు 90 కోట్ల ఫోన్లు వున్నాయి. ఫోన్లు, ఆధునిక కమ్యూనికేషన్ సౌకర్యాలు బిజెపి ప్రచారానికి ఉపయోగపడ్డాయి. ఎన్నో గొప్పపనులు చేసినా మేం చెప్పుకోలేకపోవడం వలన వెనకపడ్డాం. కమ్యూనికేషన్లో, నిధుల విషయంలో మేం బిజెపితో పోటీ పడలేకపోయాం.
అటు మోదీ 2013 సెప్టెంబరు నుండి ఉధృతంగా ప్రచారం చేస్తూ పోయారు. యుపి, బిహార్లలో ఆయన ఓట్లను కేంద్రీకృతం చేశారు. దేశంలో వీస్తున్న కాంగ్రెసు వ్యతిరేక పవనాలను ఆయన తనకు అనుకూలంగా మలచుకున్నాడు. కాంగ్రెసు పక్షాన ప్రధానమంత్రి, అధ్యకక్షురాలు, ఉపాధ్యకక్షుడు ఆయనంత ప్రభావవంతంగా కమ్యూనికేట్ చేయలేకపోయారు. సోనియా, రాహుల్ మర్యాదస్తుల్లా మాట్లాడారు, మోదీ, సుష్మ దూకుడుగా మాట్లాడి ఓటర్లను ఆకర్షించారు. మన్మోహన్ మృదుభాషి కావడంతో, మోదీ అంత మొనగాడు కాడన్న అభిప్రాయం జనంలో కలిగింది. పదేళ్లలో మొదటి ఏడెనిమిదేళ్లు అంతా బాగా వుందన్న ఫీలింగు దేశప్రజల్లో వుండేది. చివరి రెండు, మూడు సంవత్సరాలలో అవినీతి ఆరోపణలు, అన్నా హజారే ఉద్యమం వంటివి కాంగ్రెసు యిమేజిని ధ్వంసం చేశాయి.''
ఇన్ని చెప్పి ఆయన చివర్లో అన్నదేమిటంటే – ''ఇప్పుడు మళ్లీ మేము కోలుకోవాలంటే రాష్ట్రస్థాయిలో లీడర్లను బలోపేతం చేయాలి. 1950ల నాటి కాంగ్రెసు సంస్కృతిని మళ్లీ తీసుకురావాలి. నిర్ణయాలు రాష్ట్రస్థాయిలోనే తీసుకోవాలి. అసలు ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు విభజించారో నాకు యిప్పటికీ అర్థం కావటం లేదు!'' ఇదీ జోక్! విభజన ఛాంపియన్‌గా, అన్నీ నేనే చూసుకుంటున్నాను మీకేం తెలుసు అంటూ రాష్ట్రనాయకులను పూచికపుల్లలా తీసిపారేస్తూ వచ్చిన జైరాం యీనాడు విభజన కారణంగా కాంగ్రెసు అధోగతికి చేరగానే ఆ నిర్ణయంతో తనకేం సంబంధం లేనట్లు మాట్లాడుతున్నాడు. ఢిల్లీనుండే సకల ఆదేశాలు యిస్తూ వచ్చినవాడు, యీనాడు హఠాత్తుగా ప్లేటు ఫిరాయించి రాష్ట్ర నాయకత్వం బలపడాలంటున్నాడు. హౌ ఫన్నీ!
ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2014)