ఎమ్బీయస్‌ : ఆప్‌ ఏడాది పాలన

ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వం యీ నెలతో ఏడాది పూర్తి చేసుకుంది. ఎన్నో ఆశలు రగిలించి అధికారంలోకి వచ్చిన అరవింద్‌ చేయగలిగినదేమిటి, చేయలేకపోయినదేమిటి అని గుర్తుకు తెచ్చుకుందామంటే మోదీతో నిత్యఘర్షణ తప్ప వేరేదీ చటుక్కున తోచదు.…

ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వం యీ నెలతో ఏడాది పూర్తి చేసుకుంది. ఎన్నో ఆశలు రగిలించి అధికారంలోకి వచ్చిన అరవింద్‌ చేయగలిగినదేమిటి, చేయలేకపోయినదేమిటి అని గుర్తుకు తెచ్చుకుందామంటే మోదీతో నిత్యఘర్షణ తప్ప వేరేదీ చటుక్కున తోచదు. దాన్ని పక్కకు పెట్టి చూడబోతే కొన్ని విజయాలు కనబడతాయి. ముందుగా గ్రహించవలసినదేమిటంటే ఢిల్లీ ముఖ్యమంత్రి మామూలు ముఖ్యమంత్రి కాదు. అరవింద్‌ మాటల్లోనే చెప్పాలంటే 'సగం రాష్ట్రానికి పావు ముఖ్యమంత్రి'. ఏం చేయాలన్నా కేంద్రం చేతులు కట్టేస్తోంది. ఇలాటి పరిస్థితుల్లో సరైన మదింపు వేయడం కష్టం. అరవింద్‌ బ్యూరోక్రాట్‌ కాబట్టి ఏ పని ఏ మేరకు సాగుతుందో గ్రహింపు వుందని, అందుకని కొన్ని సులభమైన పనులు చేసి పేరు తెచ్చుకున్నాడని అంటారు కొందరు పరిశీలకులు. అలాటి వాటిల్లో – 400 యూనిట్ల వరకు విద్యుత్‌ బిల్లుల్లో 50% సబ్సిడీ, నెలకు 20 వేల లీటర్ల నీరు ఉచితంగా సరఫరా చేయడం, విద్య కోసం బజెట్‌లో 106% పెంపు, హెల్త్‌కేర్‌ విషయంలో 45% పెంపు, దేశమంతటా ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు నిర్లక్ష్యానికి గురవుతూంటే ఢిల్లీలో మాత్రం అనేక ప్రాంతాల్లో మొహల్లా క్లినిక్కులని పెట్టి సామాన్యులకు ఆరోగ్యసౌకర్యాలు కల్పించడం వున్నాయి. ఉచితంగా మందుల సరఫరా స్కీము కూడా వుంది. అనేక రాష్ట్రప్రభుత్వాలు మునిసిపాలిటీలకు, పంచాయితీలకు నిధులు యివ్వకుండా ఎండగడుతూ వుంటే, ఢిల్లీలో మాత్రం లోకల్‌ బజెటింగ్‌ అని పెట్టి వికేంద్రీకరణ చేశాడు. నిజానికి అధికార వికేంద్రీకరణ తన కాబినెట్‌తోనే మొదలుపెట్టాడు. తన వద్ద ఏ పోర్టుఫోలియో పెట్టుకోకుండా శాఖలన్నీ సహచరులకు పంచేసి, తను కేవలం సమీక్షలు చేస్తూ వుంటాడు. తన పార్టీ పరపతి ఎలా వుందో ప్రతి 15 రోజులకు సర్వే చేయించుకుంటూ వుంటాడు. ఢిల్లీ డైలాగ్‌ కమిషన్‌ అని ఒకటి పెట్టి కొత్త ఐడియాల గురించి ఆలోచించమన్నాడు. 

ఢిల్లీ నగరం అధికారులమయం. ఏ పనికైనా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఎవరైనా ఫంక్షన్‌ పెట్టుకోవాలంటే 27 డిపార్టుమెంట్ల దగ్గర్నుంచి అనుమతులు తెచ్చుకోవాలి. దానికి నాలుగు నెలలు పట్టేది. అన్నిటి కంటె ముఖ్యమైన ఫయర్‌ డిపార్టుమెంటు వాళ్ల దగ్గర్నుంచి ఫంక్షన్‌ జరగడానికి గంట ముందు అనుమతి వచ్చేది. ఈవెంట్‌ మేనేజర్లు యీ విషయాన్ని అరవింద్‌కు చెప్పుకోగానే మొత్తమంతా ఆన్‌లైన్‌ చేసేసి గంటలో అన్నీ వచ్చేట్లు చేశాట్ట. 'జుబిన్‌ మెహతా కచ్చేరీకి నిర్వాహకులు 20 ని||ల్లో తెచ్చుకున్నారు' అని చెప్పుకున్నాడు అరవింద్‌. బర్త్‌ సర్టిఫికెట్‌, డెత్‌ సర్టిఫికెట్టు, కాస్ట్‌ సర్టిఫికెట్టు వంటి 18 రకాల సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో జారీ చేసేస్తున్నారు. డాక్యుమెంట్లు సెల్ఫ్‌ అసెస్టేషన్‌ చేస్తే చాలంటున్నారు. ఢిల్లీ నగరం కాలుష్యభరితం అయిపోయిందన్న సంగతి గమనించి సరి-బేసి సిస్టమ్‌ పెట్టి ఢిల్లీ వాసుల ఆమోదాన్ని, ప్రశంసలను చూరగొన్నాడు. ఆ స్కీము ప్రజలకు నచ్చదని తప్పుడు అంచనా వేసిన కొందరు బిజెపి నాయకులు ముందుగానే విమర్శించి నాలిక కరుచుకోవలసి వచ్చింది. 

వీటితో పాటే కొన్ని వైఫల్యాలు కూడా వున్నాయి. నగరమంతా వుచితంగా వైఫై యిస్తానని ప్రకటించాడు. అది జరగలేదు. 2016 జులైలో మొదలుపెట్టి రెండేళ్లలో పూర్తి చేస్తాం అంటోంది ఆప్‌. కొత్త బస్సులు ప్రవేశపెడతామన్న వాగ్దానమూ నెరవేరలేదు. 2016 ఆఖరుకు 3 వేల బస్సులు పెడతాం, ఎలివేటెడ్‌ బిఆర్‌టి కారిడార్లు బస్సుల కోసమే కడతాం అంటోంది. 9 లక్షల పబ్లిక్‌ టాయిలెట్స్‌ కట్టిస్తామంది. అది యింకా ఏమీ కాలేదు. వాట్‌ పెంచం అని చెప్పింది కానీ పెంచింది. ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలను కాగ్‌ చేత ఆడిట్‌ చేయిస్తామని వాగ్దానం చేసింది. గతంలో ప్రభుత్వం నడిపినప్పుడు ముకేశ్‌ అంబానీ, పెట్రోలియం మంత్రులిద్దరు, షీలా దీక్షిత్‌లపై కేసులు పెట్టింది ఆప్‌. ఈ సారి ఏమీ పట్టించుకోలేదేం? అని అడిగితే అరవింద్‌ ''మా ప్రభుత్వం పడిపోగానే రాష్ట్రపతి పాలన వచ్చింది. వాళ్లు ముందుకు వెళ్లకపోగా ఫైళ్లు మాయం చేసేశారు. మేం వచ్చి వాటిని వెతికి పట్టుకుని రిలయన్సు సిఇఓను పిలిపించాం. పని జరుగుతోంది. కానీ అవినీతిపై మా పోరాటం ముందుకు సాగకుండా పారా మిలటరీ ఫోర్సు పంపి ఎసిబి (యాంటీ కరప్షన్‌ బ్యూరో)ను లాగేసుకుంటే ఏం చేయగలం?'' అని అడిగాడు అరవింద్‌. 

ఎసిబి విషయంపై అరవింద్‌ వాదనలో బలం వుందనిపిస్తుంది. అతను చెప్పిన ప్రకారం – మొదటి మూడు నెలల్లో ఎసిబి వాళ్ల దగ్గర వుండగా 52 మంది అవినీతిపరులైన అధికారులను జైలుకి పంపారు. కానీ జూన్‌లో ఎసిబిని కేంద్రం లాగేసుకున్న తర్వాత యిప్పటిదాకా కేవలం 8 ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి. అవినీతికి బాగా ఆస్కారం వున్న ఢిల్లీ పోలీసు, డిడిఏ, ఎంసిడి వంటివి ఎసిబి కిందే వస్తాయి. వాటిని అదుపు చేయలేనప్పుడు అవినీతిపై విజయం సాధించలేరు. రాష్ట్రప్రభుత్వం కేవలం విజిలెన్సు ద్వారానే యితర శాఖల్లో అవినీతి ఆపగలదు. ''మేం ఎవరైనా అవినీతిపరుడైన అధికారిని బదిలీ చేయగానే లెఫ్టినెంట్‌ గవర్నరు (ఎల్‌జి) దాన్ని ఆపేస్తున్నాడు. ఇక అధికారులకు మేమంటే భయం ఏముంటుంది?'' అని అరవింద్‌ ప్రశ్న. బదిలీల విషయంలో ముఖ్యమంత్రి సలహా మేరకే ఎల్‌జి నడుచుకోవాలి అని హైకోర్టు కూడా చెప్పింది. ఎసిబికి అధిపతిగా ఎస్‌ఎస్‌ యాదవ్‌ను తీసేసి, ఎంకె మీనాను వేశాడు ఎల్‌జి. ఇద్దరు స్పెషల్‌ సెక్రటరీలు తన మాట వినటం లేదని ఢిల్లీ ప్రభుత్వం సస్పెండ్‌ చేస్తే కేంద్రం సస్పెన్షన్‌ ఎత్తివేసింది. చీఫ్‌ సెక్రటరీ పోస్టు దగ్గర్నుంచి అంతా ఎల్‌జి యిష్టమే తప్ప సిఎం మాట చెల్లటం లేదు. ఢిల్లీ ఎసెంబ్లీ పాస్‌ చేసిన అరకొర జనలోక్‌పాల్‌ బిల్లు కూడా ఎల్‌జి ఆఫీసులో పడి మూలుగుతోంది. ఢిల్లీ కింద మూడు మునిసిపల్‌ కార్పోరేషన్లుంటే మూడూ బిజెపి చేతిలోనే వున్నాయి. అవి తమ ఖర్చులను ఆడిట్‌ చేయడానికి కూడా ఒప్పుకోవటం లేదు. 

ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మోదీకి అరవింద్‌ను చూస్తే అరికాలి మంట నెత్తికెక్కుతుందనేది బహిరంగ రహస్యం. ఢిల్లీ ఎన్నికల్లో తను ప్రచారం చేసినా 70 సీట్లలో 67 గెలిచేసిన అరవింద్‌ అంటే ఎందుకు పడుతుంది? తాజాగా డిడిసిఎ వ్యవహారం ఒకటుంది. ''పాకిస్తాన్‌ వెళ్లి నవాజ్‌ షరీఫ్‌కి పుట్టినరోజు గ్రీటింగ్స్‌ చెప్తాడు కానీ నన్ను దగ్గరకు రానీయడు. ఎపాయింట్‌మెంట్‌ అడిగితే రెండు నెలల పాటు యివ్వలేదు, నేను మీడియాకు యీ విషయం చెప్తే అప్పుడు యిచ్చాడు. వెళ్లి 'మేం తప్పు చేస్తే సరిచేయండి, కానీ మా కార్యక్రమాలకు అడ్డుపడకండి' అని చెప్పాను. ఆ తర్వాత కూడా ఏ సహకారమూ లేదు. నను వ్యవసాయభూములకు సర్కిల్‌ రేటు ఎకరానికి రూ. 54 లక్షల నుంచి రూ.3-4 కోట్లకు పెంచితే రైతులు సంతోషించారు. ఎల్‌జి నా ఆర్డర్లు చెల్లుబాటు కావని కొట్టిపారేశాడు. ఇలా రద్దు చేసిన ఆర్డర్లు 30 దాకా వున్నాయి. రాష్ట్రాలతో వ్యవహరించే తీరు యిదేనా? ఎన్నికల మానిఫెస్టోలో బిజెపి ఢిల్లీని పూర్తి స్థాయి రాష్ట్రంగా చేస్తానని హామీ యిచ్చింది. దాన్ని నెరవేర్చమని అడుగుతున్నాను.'' అంటాడు అరవింద్‌. అరవింద్‌లో లౌక్యం ఏమిటంటే అతను మోదీపైనే విరుచుకుపడతాడు తప్ప బిజెపిని పెద్దగా ఏమీ అనడు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అతనికి ఆరెస్సెస్‌ కార్యకర్తలు సాయపడ్డారు. ఆరెస్సెస్‌ యుపిఎస్‌సికి ప్రిపేరయ్యే విద్యార్థుల కోసం నిర్వహించే సంకల్ప్‌ అనే కోచింగ్‌ సెంటరులో అతను లెక్చర్లిచ్చేవాడు. అతని కుడిభుజం మనీశ్‌ శిశోదియాకు ఆరెస్సెస్‌లో చాలామంది మిత్రులున్నారు. ప్రజల కళ్లల్లో అరవింద్‌ తనను మోదీ బాధితుడిగా చూపుకుంటూ తన వైఫల్యాలకు కారణం మోదీ సృష్టించే అడ్డంకులే అనే అభిప్రాయం కలిగిస్తున్నాడు. తన తరఫు నుంచి మోదీ ఏమీ మాట్లాడటం లేదు. అరవింద్‌ చేసే ఆరోపణలకు జవాబు చెప్పడం తన స్థాయికి తగని పని అనుకుంటున్నాడు కాబోలు, పట్టించుకోవటం లేదు. విద్యాధికులు బహుళంగా వున్న ఢిల్లీలో యీ స్ట్రాటజీ ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందో తెలియదు.

అరవింద్‌ పంజాబ్‌పై కన్నేసి వున్నాడు. 2017లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా పంజాబ్‌లో గెలిచి తను పంజాబ్‌ ముఖ్యమంత్రిగా వెళ్లిపోయి, తన స్థానంలో మనీశ్‌ను కూర్చోబెడతాడన్న పుకార్లు కూడా వున్నాయి. 2014 పార్లమెంటు ఎన్నికలలో దేశమంతా మోదీ ప్రభంజనం వీస్తూ వుంటే పంజాబ్‌లో ఆప్‌ 24% ఓట్లు, 4 సీట్లు గెలిచింది, అకాలీ దళ్‌కు 26%, 4 సీట్లు, కాంగ్రెసుకు 33%, 3 సీట్లు రాగా బిజెపికి 9%, 2 సీట్లు వచ్చాయి. ఆప్‌ తరఫున గెలిచినవారిలో యిద్దరు యోగేంద్ర యాదవ్‌ పక్షాన వెళ్లిపోయారు. పంజాబ్‌లో పార్టీ నిర్మించాలని గట్టిగా నిశ్చయించుకుని దుర్గేశ్‌ పాఠక్‌ అనే యువకుడికి ఆ బాధ్యత అప్పగించాడు. అతను బిజెపి మోడల్లోనే బూతువారీగా కార్యకర్తలను తయారుచేశాడు. ఢిల్లీ ఎన్నికలలో ఆప్‌ తరఫున పనిచేయడానికి 10 వేల మంది పంజాబీలను పంపించాడు. ఆప్‌ పంజాబ్‌ యూనిట్‌ 2015 మే నుంచి వరుసగా ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ ప్రజల్లో పలుకుబడి సంపాదించింది. కితం నెల 14 న మాఘీ మేలా అని ముక్తసర్‌ పట్టణంలో నిర్వహించిన సభ దిగ్విజయంగా జరిగింది. దాంతో పంజాబ్‌లో ఆప్‌ గెలిచే అవకాశాలున్నాయని మీడియా కథనాలు వెలువడసాగాయి. దాంతో బాటే అరవింద్‌ పంజాబ్‌కు సిఎం అవుతాడన్న వూహాగానం కూడా! ఇదంతా సహజంగా మోదీకి రుచించే వ్యవహారం కాదు, ముందు ముందు అరవింద్‌తో ఘర్షణ మరింత ముదరవచ్చు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016) 

[email protected]