టీవీ ఇంగ్లీషు ఛానెల్ ప్రేక్షకుల్లో అర్ణబ్ గోస్వామి తెలియనివారెవరూ వుండి వుండరు. టైమ్స్ నౌ ఛానెల్‌లో అరిచేస్తూ, కాట్లకుక్కలా కరిచేస్తూ, కనీసం ఆరడజను మందిని చుట్టూ పెట్టుకుని, వాళ్లను అదిలిస్తూ, బెదిరిస్తూ, తీర్పులిచ్చేస్తూ, శిక్షలేసేస్తూ, నానా హంగామా చేసేస్తూండడమే అతని ప్రత్యేకత. తక్కిన న్యూస్ ఛానెల్స్‌లో చెప్పిందే చెప్పి బోరు కొడుతూ వుంటే యీ ఛానెల్‌కు వస్తే చాలు, ఏదో జరిగిపోతోందన్న భ్రమ కలిగించేస్తాడు అర్ణబ్. యాంకర్ అన్నవాడు అవతలివాడు చెప్పేది వినాలి, అసలు వాణ్ని చెప్పనివ్వాలి, వాణ్ని ఖండించేవాణ్నీ మాట్లాడనివ్వాలి, వాళ్లు హద్దు మీరుతున్నా, దారి తప్పుతున్నా చర్చను సరైన దారికి మళ్లిస్తూండాలి. ఒకవేళ ప్యానెల్‌లో ఒక సభ్యుడు తప్పు చెపితే, తక్కిన సభ్యులకు అది తప్పని తోచక, ఖండించకపోతే స్వయంగా ఖండించేటంత పరిజ్ఞానం యాంకర్‌కు వుంటే చాలు. అందరి వాదనలను ప్రేక్షకుడికి సరైన రీతిలో చేరేట్లా యాంకర్ చూస్తే చాలు, ప్రేక్షకుడే ఎవరి వాదన సవ్యంగా వుందో తేల్చుకుంటాడు.
అయితే అర్ణబ్ ప్రేక్షకుడికి ఆ ఛాన్సివ్వడు. తన ఏదో ఒక పక్షం తీసుకుని తక్కినవాళ్ల మీద విరుచుకు పడుతూంటాడు. వాళ్లని నోరెత్తనివ్వడు. పైగా తను అనుకున్న మాటలను అవతలి వాళ్లు అనుకున్నట్టుగా చెప్పేసి, దాన్ని ఖండించేందుకు సందివ్వడు. నువ్వు అన్నావు, నేను విన్నాను అంటూ రంకెలు వేసేస్తాడు. సర్కస్‌లో రింగ్ మాస్టర్‌లా వుంటుంది అతని వ్యవహారం. అతనికి ప్యానెల్ సభ్యులపైనా గౌరవం వుండదు, ప్రేక్షకుడిపైనా వుండదు. ప్రేక్షకుల తరఫున వకాల్తా పుచ్చేసుకుని వచ్చినవాళ్లను చీల్చిచెండాడేసి వాళ్లకు వైకేరియస్ ప్లెజర్ (పరోక్షానందం) కలిగిస్తాననుకుంటాడు. చర్చా కార్యక్రమం జరగవలసిన తీరు యిది కాకపోయినా ఆ ''న్యూస్ అవర్'' కార్యక్రమానికి విపరీతమైన రేటింగ్స్ వస్తాయి. దాని కారణంగానే ఐదేళ్లగా టైమ్స్ గ్రూపుకి చెందిన ఆ ఛానెల్‌కు ఆ సమయంలో టాప్‌మోస్ట్ స్లాట్ అయింది. ఎందుకలా? అంటే పాతకాలం రోమన్లు గుర్తుకు వస్తారు. ఆ కాలంలో సింహాలకు క్రైస్తవులను ఆహారంగా వేస్తూ వుంటే వాళ్లు కేరింతలు కొట్టేవారట.
పైగా అర్ణబ్ తన దూకుడుకు, దురుసుతనానికి దేశభక్తి రంగు పులుముతాడు. మనకు వ్యవస్థను ఎదిరించాలని వుంటుంది. దాని కొమ్ము కాస్తున్న రాజకీయనాయకులందరూ మన దృష్టిలో దుర్మార్గులే. కనబడితే వాళ్లను నోరెత్తనీయకుండా కడిగేద్దామని వుంటుంది. వ్యవస్థను దునుమాడే వ్యక్తిగా మీ బదులు ఆ పని నేను చేసిపెడుతున్నానుగా నాలో మిమ్మల్ని మీరు చూసుకోండి అన్నట్టుంటాడు అర్ణబ్. అందుకని ఏం తోచకపోయినా, లైఫ్ కాస్త డల్‌గా వున్నా, పిల్లల హోంవర్కు చేయించవచ్చు కదా అని భార్య నస పెడుతూంటే అది వినబడకుండా వుండాలన్నా అతని షో ట్యూన్ చేస్తే చాలు. చాలామంది ప్రేక్షకులు అలా అలవాటు పడ్డారు. పోనుపోను అర్ణబ్ కూడా తన మాయలో తనే పడిపోయాడు. కావాలనుకుంటే ఎవరినైనా ఆకాశానికి ఎత్తేయగలను, అక్కరలేదనుకుంటే పాతాళానికి తొక్కేయగలను అనుకోసాగాడు. అందుకే అతనిలో 'సెల్ఫ్‌రైటియస్ నెస్' (నేనే కరక్టు అనుకోవడం), 'హోలియర్-దేన్-దౌ' (నీ కంటె పుణ్యాత్ముణ్ని) యాటిట్యూడ్ ప్రస్ఫుటంగా కనబడసాగాయి. అతని పరిజ్ఞానానికి మెచ్చుకుంటూనే, అతని ధోరణికి నివ్వెరపోవాల్సి వస్తోంది. అయినా అతని కార్యక్రమం చూస్తూనే వున్నారు.
ఇటువంటి పరిస్థితిలో అర్ణబ్ టైమ్స్ నౌకు ఎడిటర్-ఇన్-చీఫ్ పదవి నుంచి రాజీనామా చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కారణాలు యిప్పటిదాకా తెలియరాలేదు. ఒక పరిశీలనేమిటంటే అర్ణబ్‌కు వచ్చిన గ్లామరంతా అతను వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడడం చేతనే! అలాటిది ఎన్‌డిఏ ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి అతని ధోరణిలో మార్పు వచ్చింది. ప్రభుత్వానికి మద్దతిస్తూ దాన్ని విమర్శించినవాళ్లపై విరుచుకుపడుతున్నాడు. గత ఆర్నెల్లగా యిది మరీ ముదిరింది. ప్రభుత్వవ్యతిరేకులకు వున్న గ్లామర్ మద్దతుదారులకు వుండదు. పైగా టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు యాజమాన్యం ఎటూ మొగ్గు చూపకుండా తటస్థత కనబరచాలని ప్రయత్నిస్తుంది. పాకిస్తాన్ నటీనటులను భారతీయ సినిమాల్లో నటింపచేయడం దేశద్రోహమే అనే స్టాండ్ అర్ణబ్ తీసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తూ గ్రూపు ఎండీ వినీత్ జైన్ 'సినిమాలొక్కటేనా? రెండు దేశాల మధ్య రూ.20 వేల కోట్ల బిజినెస్ అవుతోంది. దాన్నీ ఆపేయాలా?' అంటూ ట్వీట్ చేశాడు. సాధారణంగా టైమ్స్ వాళ్లు ఎవరికీ పబ్లికేషన్ కంటె అధిక స్థానం కల్పించరు. అర్ణబ్‌ను స్టార్‌లా చూస్తున్నా ఆ ఛానెల్‌కు 11 ఏళ్లల్లో రూ.553 కోట్ల క్యుములేటివ్ (తెలుగులో సంచిత అనవచ్చా?) నష్టం వచ్చింది. అది యాజమాన్యంకు నచ్చలేదు.
కానీ యిలాటి కారణాలతో అర్ణబ్ ఉద్యోగం మానేయలేదు. అతనికి వేరే చోట నుంచి ఆఫర్లు వచ్చాయట. యుకెలో ఫాక్స్ న్యూస్ నుంచి అని కొందరంటారు. కాదు, రుపర్ట్ మర్దోక్ స్టార్ గ్రూపులో చేరతాడని కొందరంటారు. అబ్బే కాదు, బిజెపికి ఆత్మీయుడైన ఒక పారిశ్రామికవేత్త మద్దతుతో, ఏసియానెట్‌కు సొంతదారు రాజీవ్ చంద్రశేఖర్‌తో కలిసి కొత్త ఛానెల్ పెడతాడట అంటున్నారు. అదేదో తేలేదాకా, మన చెవులకు కొన్నాళ్లు విరామం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2016)