రానురాను బిజెపి కాంగ్రెసుకు నకలుగా తయారవుతోంది. ఫిరాయింపుదార్లను, గవర్నర్లను ఉపయోగించుకుని ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చడం వంటి టక్కుటమార విద్యలను ప్రాక్టీసు చేస్తోంది. కానీ ఎంతైనా గురువు గురువే. అరుణాచల్‌లో ఆ సంగతి రుజువైంది. జంపు జిలానీలు కప్పల వంటి వారనీ, కప్పల తక్కెడ తమ వైపే ఒరుగుతుందని అనుకోవడం మూర్ఖత్వమని యీ పాటికే బిజెపికి తెలిసి వచ్చి వుంటుంది.
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి నబామ్ టుకీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమను పట్టించుకోవటం లేదని, అవినీతికి పాల్పడుతున్నాడని కాంగ్రెసు ఎమ్మెల్యేలు హై కమాండ్‌కు ఫిర్యాదు చేస్తూ వచ్చారు. అయినా మాతాసుతులకు తీరిక లేకపోయింది. పట్టించుకోలేదు. ఆ అలుసు చూసుకుని టుకీ రెచ్చిపోయాడు. ఎవర్నీ పట్టించుకోవడం మానేశాడు. తన మాట కాదన్నవారిని కాబినెట్‌లోంచి తీసేయసాగాడు. పోనుపోను అసమ్మతివాదులు పెరిగారు. వారికి నాయకులు కూడా ఏర్పడ్డారు. పేమా ఖండూ అనే అతని వద్ద 11 మంది ఎమ్మెల్యేలు, చౌనా మీన్ అనే అతని వద్ద 6గురు, కలికో పాల్ అనే అతని వద్ద 12 మంది ఎమ్మెల్యేలు చేరారు. ఈ పరిణామాల పట్ల కాంగ్రెసు అధిష్టానం కళ్లు మూసుకుంది కానీ, బిజెపి కళ్లు విప్పార్చి చూసింది. కాంగ్రెసు కొంప కూల్చి, అవే యిటికలతో తన యిల్లు కట్టుకుందామనుకుంది. నిజానికి 2014 పార్లమెంటు ఎన్నికల ప్రచారం సందర్భంగా 2014 మార్చి 31 న అరుణాచల్ వచ్చిన మోదీ, సిఎం టుకీని హెచ్చరిస్తూ ''మే 16 ఎన్నికల ఫలితాలు వచ్చాక కాంగ్రెసు ప్రభుత్వాలను రక్షించడడానికి ఢిల్లీలో ఎవరూ వుండరు.'' అన్నాడు. ఆ మాట నిజం చేయడానికి కాబోలు గవర్నరును వాడుకున్నాడు. స్పీకరు టుకీ వైపు వున్నాడని గ్రహించిన గవర్నరు స్పీకరు అధికారాన్ని తన చేతిలోకి తీసుకుని అసెంబ్లీ సమావేశం తేదీని జనవరి 14 నుంచి డిసెంబరు 16కి మార్చి, హోటల్లో డిప్యూటీ స్పీకరు చేసిన సమావేశాన్ని గుర్తించి, టుకీకి బలం లేదని తీర్మానించి, రాష్ట్రపతి పాలన పెట్టించి, ఫిబ్రవరిలో తిరుగుబాటు నాయకుడు కలికో పాల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించాడు. కాంగ్రెసు లోంచి బయటకు వచ్చిన 29 ఎమ్మెల్యేలు పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పిపిఎ)గా ఏర్పడితే తన 11 సభ్యుల మద్దతు అందించింది. ఇంకో యిద్దరు స్వతంత్రులు కూడా చేరారు. 42 మంది మద్దతు వుంది కాబట్టి పాల్ ముఖ్యమంత్రి అయిపోయాడు. టుకీ సుప్రీం కోర్టుకి వెళ్లాడు.
ఐదు నెలల పాటు పాల్ పాలించాక, జులై 13 న సుప్రీం కోర్టు తీర్పు చెపుతూ అసెంబ్లీ సమావేశం తారీకు మార్చడానికి గవర్నరుకు అధికారం లేదంది. గడియారాన్ని వెనక్కి తిప్పి డిసెంబరు 15 నాటి యథాపూర్వస్థితికి తీసుకుని వచ్చి టుకీయే ముఖ్యమంత్రి అంది. అసెంబ్లీలో కొత్తగా తన బలాన్ని నిరూపించుకోమంది. చట్టరీత్యా ముఖ్యమంత్రి అయ్యాడు కానీ అతని దగ్గర బలమేది? అసెంబ్లీలో 60 మందిలో యిద్దరు రాజీనామా చేయడం చేత మిగిలిన 58 సభ్యులలో యితని అనుచరులు 15 మాత్రమే. 29 మందిని వెనక్కి తీసుకురావాలంటే కాస్త టైము కావాలి. బలనిరూపణకు కాస్త టైమివ్వమని గవర్నరును అడుగుదామా అనుకుంటూండగానే గవర్నరుగారే చురుగ్గా అడుగేశారు. కోర్టు తీర్పు వచ్చిన రాత్రి 9గంటలకే యీ మెయిల్ ద్వారా జులై 16 కల్లా మెజారిటీ నిరూపించుకో అని గడువు విధించాడు. ఇతను రాజ్‌ఖోవా కాదు. అతను అనారోగ్యంతో లీవులో వెళితే త్రిపుర గవర్నరు తథాగత రాయ్‌ను తాత్కాలికంగా వేశారు. కానీ యితనూ అదే జాతి పక్షిలా వ్యవహరించాడు. ఎందుకంటే టుకీ అప్పుడు ఢిల్లీలో వున్నాడు. అతను అరుణాచల్ రాజధాని ఈటానగర్ రావాలి, పాత సహచరులను పలకరించాలి, ఒప్పించాలి. ఇదంతా రెండు రోజుల్లో జరగడం సాధ్యమా? సాధ్యం కాదనే బిజెపి కూడా ధీమాగా వుంది.
అయితే వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే కలికో పుల్ ప్రభుత్వం సజావుగా సాగటం లేదు. అతను తన పార్టీని బిజెపిలో కలిపేస్తాననడం సాటి తిరుగుబాటుదారులకు నచ్చలేదు. పైగా టుకీలాగే యితను కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని ఖండూ, ఉప ముఖ్యమంత్రిగా వున్న మీన్ బహిరంగంగా కూడా అనసాగారు. ఢిల్లీ కాంగ్రెసు నాయకులకు యీ విషయం తెలిసింది. సోనియా గాంధీ యీ బేరసారాల్లో కలగజేసుకోనని చెప్పి కపిల్ సిబ్బల్‌కు, అరుణాచల్ ఎంపీ నినాంగ్ ఎరింగ్‌కు అప్పచెప్పింది. నినాంగ్ అసమ్మతి నాయకులతో చర్చలు సాగించాడు. ''టుకీని దింపడం ఖాయం. మీలో ఎవరు సిఎం కావాలో మీలో మీరే తేల్చుకోండి'' అని చెప్పాడు. ఓ పక్క టుకీకి సిబ్బల్ నచ్చచెప్పసాగాడు – ''రేపు కోర్టులో మనం గెలిచినా, నువ్వు సిఎం కాలేవు. నువ్వు వెనక్కి తగ్గి తిరుగుబాటు నాయకులకు ఛాన్సిస్తే వాళ్లు వెనక్కి పార్టీలోకి వస్తారు. లేకపోతే 15 మందితో ఎటూ కాకుండా పోతావు.'' అని. ఇవన్నీ బిజెపికి తెలిసినట్లు లేదు. తెలిసినా మితిమీరిన ఆత్మవిశ్వాసంతోనో, అసాంలో కాంగ్రెసు నుంచి ఫిరాయించి బిజెపి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన హిమాంత్ విశ్వ శర్మ శక్తిసామర్థ్యాలపై నమ్మకం చేతనో ఖాతరు చేయలేదేమో.
కోర్టు తీర్పు రాగానే టుకీ కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్సుకి వెళ్లాడు. అక్కడ ఒక సీనియరు నాయకుడు చెప్పాడు – ''నీకు మెజారిటీ వుంటుందనుకుంటే ప్రయత్నించు, లేకపోతే మర్యాదగా తప్పుకుని తక్కినవాళ్లకు ఛాన్సియ్యి. కోర్టు తీర్పు ద్వారా బిజెపి నైతికంగా దెబ్బ తింది. దాన్ని సొమ్ము చేసుకునే తరుణమిది.'' అని. సోనియా, రాహుల్ కూడా అదే చెప్పారు – 'నిన్ను వెనకేసుకుని వచ్చి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడు నువ్వేం చేస్తావో మాకు తెలియదు, మాకు కావలసినది అక్కడ మళ్లీ కాంగ్రెసు ప్రభుత్వం' అని. ఎవరికి బలం వుందో అంచనా వేసి, వ్యవహారాలు చక్కబెట్టడానికి కాంగ్రెసు నాయకులు ముకుల్ వాస్నిక్, సిపి జోషి, కె జయకుమార్ అతనితో బాటు ఈటానగర్ వెళ్లారు. జులై 14న టుకీ ఢిల్లీ అరుణాచల్ భవన్‌లో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించి, ఆ రోజే ఈటానగర్ వెళ్లాడు. తను దిగిపోవడానికి సిద్ధంగా వున్నానని కబురంపాడు. దానికి మొదటగా స్పందించినది పేమా ఖండూ. అతను 2011లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన గత ముఖ్యమంత్రి డోర్జీ ఖండూ కొడుకు. బౌద్ధుడు. ఢిల్లీలో హిందూ కాలేజీలో డిగ్రీ చదివాడు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. గత ప్రభుత్వంలో మంత్రిగా చేశాడు. టుకీ ప్రభుత్వంలో టూరిజం మంత్రిగా చేసి అతనితో విభేదాలు రావడంతో 2015 అక్టోబరులో రాజీనామా చేసి పుల్ క్యాంపులో చేరాడు. అతని వద్ద 11 మంది ఎమ్మెల్యేలున్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలతో చౌనా మీన్ కూడా వచ్చి చేరాడు.
నిజానికి వీళ్లంతా గువాహటిలో ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో బిజెపి నడుపుతున్న క్యాంప్‌లోనే వున్నారు. వీళ్లంతా ఎక్కడికీ పోరనే ధీమాతో, కోర్టు తీర్పు రాగానే అసెంబ్లీలో టుకీకి బలం లేదు, నాకే వుంది అంటూ పుల్ తన తరఫున వున్న 42 మంది ఎమ్మెల్యేలను జులై 14 న మీడియా ముందు ప్రదర్శించాడు. హిమాంత విశ్వ శర్మ జులై 15 న కూడా మాకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుంది అని ప్రకటించాడు. కోర్టులో ఓడిపోయినా, అసెంబ్లీలో గెలుస్తామన్న ధీమా వ్యక్తపరచాడు. కానీ ఒక్కోళ్లు జారిపోతున్న విషయం గ్రహించిన పుల్ చివరగా తను కూడా వచ్చి చేరాడు. ఎందుకంటే యింతమంది మద్దతు వుంటే స్పీకరు అసమ్మతి వాదులను అనర్హులుగా ప్రకటించి, టుకీని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయవచ్చు. అందుకని చర్చల్లో కూర్చున్నాడు. ముగ్గురి మధ్య చర్చలు జరిగి 37 ఏళ్ల ఖండూను ముఖ్యమంత్రిని చేయడానికి ఒప్పందం కుదిరింది. స్వతంత్రులు కూడా ఫిరాయించేశారు. మొత్తం 44 మంది మద్దతు కూడగట్టారు. ఈ చర్చలన్నీ 15 అర్ధరాత్రి తర్వాత జరిగాయి. తెల్లవారుఝామున అందరూ ఈటానగర్ చేరారు. రాత్రికి రాత్రి ఫిరాయింపులు పూర్తయ్యాయని బిజెపి గ్రహించలేక పోయింది. వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదు.
జంప్ జిలానీలను ఎల్లవేళలా నమ్మకూడదనే నీతి యీ కథలో వుంది. పరిస్థితి అటూయిటూ అయితే వాళ్లు ఎటైనా దూకగల సమర్థులు. మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యీ కథను ఓ సారి చదువుకుని నెత్తిమీద తమకు తామే అక్షింతలు వేసుకుంటే మంచిది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2016)