ఎమ్బీయస్‌: అవినీతి ఆరోపణలపై స్పందన – 1/3

అమరావతి చుట్టూ భూములపై ''సాక్షి'' పత్రిక చేసిన అవినీతి ఆరోపణలపై బాబు స్పందనలో రెండు, మూడు అంశాలు నాకు వింతగా తోచాయి. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే పాలనా వ్యవహారాల్లో అవినీతి జరగడమూ,…

అమరావతి చుట్టూ భూములపై ''సాక్షి'' పత్రిక చేసిన అవినీతి ఆరోపణలపై బాబు స్పందనలో రెండు, మూడు అంశాలు నాకు వింతగా తోచాయి. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే పాలనా వ్యవహారాల్లో అవినీతి జరగడమూ, దానిపై ప్రతిపక్షనాయకులు ఆరోపణలు చేయడమూ, పాలకపక్షం వాటిని తిప్పికొట్టడమూ జరుగుతూనే వుంటుంది. మొదట్లో ఆసక్తిగా చదివినా, పోనుపోను యివి బోరు కొట్టేస్తాయి. జరిగిన అవినీతికి పది రెట్లు ఆరోపణలు వస్తాయి, ఒక్కోప్పుడు నిప్పు లేనిదే పొగ కూడా పుట్టిస్తారు. ప్రతిపక్షాలో, మీడియాయో బోల్డు హంగామా చేస్తుంది. చేతనైతే ఆధారాలు చూపమని పాలకులు ఛాలెంజ్‌ చేస్తారు. డివి నరసరాజు గారు చమత్కరించేవారు – 'ఆ ఛాలెంజ్‌లో అంతరార్థం ఏమిటంటే, ఆధారం దొరక్కుండా అవినీతి చేశాను, చూస్కో' అనిట. ఆరోపణలు చేసినవారు 'బోల్డు ఆధారాలున్నాయి, సరైన సమయంలో బయటపెడతాం, ముందు సిట్టింగ్‌ జడ్జిచేత విచారణ జరిపించండి (ఇప్పటికే కోర్టుల్లో కేసులు పెండింగు, యిక జడ్జిలకు యివి కూడా అప్పగిస్తే ఎలా?) సిబిఐకు అప్పగిస్తే నిజాలన్నీ బయటకు వస్తాయి' అంటారు. ప్రభుత్వం శ్వేతపత్రం ప్రచురించాలి అంటారు. తప్పు చేసినవాడికి భయం వుంటుంది, మాకెందుకు భయం? అంటారు పాలకులు. ఇలా కొన్నాళ్లు గడిచేసరికి యింకో ఆరోపణ వస్తుంది, దీని విషయం మర్చిపోతారు. 

సామాన్యుడికి అర్థంకాని విషయమేమిటంటే – యిన్ని ఆధారాలున్నపుడు కోర్టుకి ఎందుకు వెళ్లకూడదు? అని. పత్రికల్లో ఏవేవో డాక్యుమెంట్లు చీమతలకాయంత అక్షరాలతో ఫోటోలు వేస్తారు, వాటి పూర్వాపరాలు తెలియవు. ఆరోపణలకు గురైన వారు 'ఈ ఆస్తులు నావని నిరూపిస్తే రాసి యిచ్చేస్తా' అంటారు. ఆస్తులు వాళ్ల పేర కాక బినామీల పేర వున్నాయని ఆరోపించినవారంటారు. ఫలానావాళ్లు మీ బినామీ అంటారు. అవునని వాళ్లు ఒప్పుకోరు. కాదంటే వీళ్లు ఒప్పుకోరు. ఇది ఎప్పటికీ తేలదు. కోర్టుకి వెళతామని అనేవారే తప్ప వెళ్లేవాళ్లుండరు. ఎవరైనా వెళ్లినా మధ్యలో కేసు విరమించుకుంటారు. ఇరుపక్షాలూ రాజీ పడ్డాయేమో మనకు అర్థం కాదు. నిజం ఎప్పటికీ వెలుగులోకి రాదు. కానీ మధ్యమధ్యలో పాత ఆరోపణలను గుర్తు చేస్తూంటారు తప్ప లాజికల్‌ ఎండ్‌కు తీసుకురారు. చాలా ఏళ్లగా చాలా మంది గురించి యిలాటివి వినివిని చలించడం మానేయడానికి కారణం యిది. స్వతంత్రం వచ్చి యిన్నేళ్లయింది కదా, ఎంతో అవినీతి జరిగి వుంటుంది కదా, కానీ అవినీతి ఆరోపణలపై జైలుకి వెళ్లిన నాయకులు పట్టుమని పదిమంది కూడా వుండరు. పదవి పోగొట్టుకున్నవారున్నారు కానీ అది శిక్ష కాదు కదా. అవినీతిపరుడు ఎలాగోలా ఎన్నికల్లో నెగ్గాడంటే 'ప్రజాకోర్టు నన్ను నిర్దోషిగా తీర్పు యిచ్చింది' అని క్లెయిమ్‌ చేస్తాడు. అంటే వీరెవరూ ఆధారాలు దొరక్కుండా అవినీతి చేస్తున్నారని అనుకోవాలి. లేదా తమ చేతికి మట్టి కాకుండా అధికారులనో, అసిస్టెంట్లనో యిరికిస్తున్నారనుకోవాలి. 

అవినీతి కేసుల్లో వీళ్లు బయటపడే విధానం గురించి నేను గమనించిన ఒక ధోరణి చెప్తాను. ఒక లక్ష రూపాయల గోల్‌మాల్‌ జరిగిందనుకోండి, పది లక్షలకు జరిగిందని పోలీసులు కేసు పెడతారు. దాన్ని కోర్టులో నిరూపించలేకపోతారు. కేసు కొట్టేస్తారు. చూశారా, మేం స్వచ్ఛంగా బయటకు వచ్చాం, మాపై ఉత్తుత్తి ఆరోపణలు చేశారు అని వీళ్లు చెప్పుకుంటారు. అవినీతి కేసుల్లో అనే కాదు, రకరకాల నేరాలు జరిగినప్పుడు పోలీసులు ఎవరినైతే రక్షించదలచారా వారి కోసం యీ ట్రిక్కు వుపయోగిస్తారు. ఈ మధ్యే ఒక జడ్జి రాశారు – ఒక హత్య కేసులో ముద్దాయికి వ్యతిరేకంగా అనేక ఆధారాలున్నాయట, అయినా పోలీసులు కేసు మరింత పకడ్బందీగా చేస్తున్నాం అంటూ ఉత్తరం ఒకటి అనవసరంగా సృష్టించారట. డిఫెన్సు వాళ్లు అది ఫోర్జరీ అని నిరూపించి కేసు కొట్టేయించుకున్నారట. రావెల సుశీల్‌ తనను యీవ్‌-టీజ్‌ చేశాడని ఒకామె టీవీలో కనబడి చెప్పింది. దానికేదో సెక్షన్‌ వుంటుంది కదా, అది కాకుండా 'నిర్భయ' చట్టం కింద కేసు పెట్టడం దేనికి? ఇది కోర్టులో నిరూపించలేరు, అతను బయటకు వచ్చేస్తాడు. ఇలాటి 'అదనపు' సాక్ష్యాలు చేర్చమని, తప్పుడు సెక్షన్లతో కేసులు పెట్టమని పోలీసులకు ఆదేశాలెవరిస్తారు అన్నదే అసలు ప్రశ్న.  ఉదాహరణకి పిల్లిని చంపితే పిల్లిని చంపారనే కేసు పెట్టాలి కానీ 'పులి అని పెడదామండి, వన్యప్రాణి రక్షణ చట్టం కింద జైల్లోకి తోయిస్తే పదేళ్లదాకా బయటకు రాడు' అంటూ కేసు అనవసరంగా పెద్దది చేస్తారు. చివరకు యితనికి తుపాకీ పట్టుకోవడమే రాదు అని డిఫెన్సువారు రుజువు చేస్తారు, కేసు ఎగిరిపోతుంది. పిల్లిని చంపినదానికి మళ్లీ కేసు పెట్టరు. 

వైయస్‌ హయాంలో రోజుకో అవినీతి ఆరోపణతో మీడియా దద్దరిల్లింది. వాటిలో ఎన్ని విచారణ దశకు వచ్చాయి, ఎన్ని నిరూపణ అయ్యాయి, వాటి స్టేటస్‌ ఏమిటో ఎవరైనా రిసెర్చి స్టూడెంటు పట్టిక వేసి చూపితే ఎంతో బాగుంటుంది. అంతకుముందు చంద్రబాబుపై కూడా అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి, వాటివీ అజాపజా తెలియదు.  వైయస్‌ కోర్టులో కేసు వేసి, ఏం బేరం కుదిరిందో ఏమో విత్‌డ్రా చేసేశారు. మళ్లీ యింకోళ్లు వేయవచ్చు కదా, వేయలేదు. దాని జాబితా కూడా ఎవరైనా వేయాలి. ఎన్టీయార్‌ పైనా వేసిన కేసు సుప్రీం కోర్టులో వుండాలి, ఏమైందో తెలియదు. ఇప్పుడు అమరావతి ఆరోపణల గతీ యింతే అవుతుంది. రెండు మూడేళ్లు పోయేసరికి మొత్తమంతా గప్‌చుప్‌. సాక్షిలో వచ్చిన ఆధారాలు నిజమైనవైతే వైసిపి కోర్టుకి వెళ్లాలి, కడదాకా పోరాడాలి, ఇవి అబద్ధపు ఆరోపణలు, పరువునష్టం దావా వేస్తాం అంటున్న టిడిపి నాయకులు నిజంగా కేసులు వేయాలి. కానీ యివేమీ జరిగేదాకా నమ్మకం లేదు. న్యాయకోవిదులను సంప్రదిస్తున్నాం, వేయబోతున్నాం, వేసేశాం.. అని రెండు మూడు రోజులు పేపర్లో వార్తలు రాయించుకుంటారు, అంతటితో సరి. ఎవరికీ చిత్తశుద్ధి లేదు. స్కాముల్లో యిరుక్కున్నవాళ్లు తమ పార్టీలోకి ఫిరాయిస్తే, మళ్లీ నోరెత్తరు. కేసుల విషయం ఏమైంది అని ఎవరైనా అడిగితే సాక్షులను భయపెడుతున్నారు, అయినా పట్టుదలతో వున్నాం అంటూంటారు. ప్రజలు మాకు అవకాశం యిస్తే అధికారంలోకి వచ్చి అవినీతి సొమ్ము రాబట్టి, అందరికీ పంచుతాం అంటారు. 

ఇప్పుడు అమరావతి భూములపై సాక్షి ఉధృతంగా విరుచుకుపడింది. అమరావతి చుట్టూ అనేకమంది నాయకులు భూములు కొన్నారన్నది బహిరంగరహస్యం. అన్ని ప్రాంతాల (తెలంగాణ జిల్లాలతో సహా) నాయకులే కాదు, ధనికులే కాదు, మధ్యతరగతివారు కూడా అప్పులు చేసి కొన్నారు. గత యిరవై ఏళ్లగా అనుకోవచ్చు – తెలుగునాట ఉపద్రవంగా జరుగుతున్న వ్యాపారం ఏమిటయ్యా అంటే రియల్‌ ఎస్టేటే! స్థలాలు కొనడం, అమ్మడం మధ్యలో లాభపడడం! చేతిలో డబ్బుంటే యిదివరకు వ్యవసాయం చేసేవారు, వ్యాపారం చేసేవారు, పరిశ్రమలు పెట్టేవారు. ఇరవై ఏళ్లగా అలా చేసేవారిని చూసి నవ్వేవారు తయారయ్యారు. ఎక్కడో అక్కడ స్థలం కొనిపడేస్తారు. గవర్నమెంటు అక్కడ ఆ ప్రాజెక్టు వస్తోంది, యీ ప్రాజెక్టు వస్తోందని డప్పు కొడుతుంది. అది చూసి జనాలు వీళ్ల దగ్గర ఎగబడి కొనేస్తారు. కాలు మీద కాలేసుకుని కూచుంటే కట్టలకు కట్టలు డబ్బు వచ్చిపడింది. దీనిలో తెలివితేటలతో పని లేదు. తెగింపు, కాస్త అదృష్టం వుంటే చాలు. ఇలా డబ్బు సులభంగా సంపాదించవచ్చని తెలుసుకున్నాక అందరూ దీనిమీదే పడ్డారు. అందువలన వ్యవసాయం, వ్యాపారం, పరిశ్రమలూ అన్నీ మూతపడ్డాయి. 

తెలంగాణ ఉద్యమం వూపందుకునేవరకూ హైదరాబాదుపై పడ్డారు. ఎక్కడెక్కడి భూములూ కొనిపడేశారు, అమ్మిపడేశారు, మళ్లీ కొనేశారు, మధ్యలో వచ్చిన లాభాలతో సినిమాలు తీశారు, పోగొట్టుకున్నారు, మళ్లీ తీశారు. ఈ రంగులరాట్నం తిరుగుతూ తిరుగుతూ కెసియార్‌ కరీంనగర్‌లో గెలవడంతో ఒక్కసారి స్తంభించింది. రాష్ట్రవిభజనపై కేంద్రం ఎటూ తేల్చకుండా నాన్చడంతో హైదరాబాదు భవిష్యత్తు గురించి సందేహాలు వచ్చాయి. ఎప్పుడైనా, ఎక్కడైనా ఊళ్లో స్థలాల రేట్లు ఒక సాధారణ వేగంతో పెరుగుతూ వుంటాయి. కానీ హైదరాబాదు విషయంలో ఆ ధరలు షేరు మార్కెట్‌లో బుల్‌లా అయిపోయింది. ఆ పరుగు ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ బుల్‌ మళ్లీ పరుగు పెడుతుందా, పడిపోయిన రేట్లు తిరిగి వస్తాయా అని ఎవరికీ తెలియకుండా పోయింది. స్థలం సొంతదారులు నష్టానికి (అంటే వాళ్లు అంచనా వేసిన రేటు కంటె తక్కువ రేటుకి) అమ్మడానికి యిష్టపడలేదు, కొనేవాళ్లు రేటు యింకా తగ్గుతుందని ఆగారు. దాంతో భూమి రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు, నిర్మాణరంగం అన్నీ నిలిచిపోయాయి. 

ఇలా కొన్నేళ్లు గడిచేసరికి భూమి కొనడం, అమ్మడం తప్ప వేరే ఏదీ చేతకానివాళ్లు ఖాళీగా వుండలేకపోయారు. రాష్ట్రం విడిపోతుందని, కొత్త రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య వెలుస్తుందని ఊహించనారంభించి కొనుగోళ్లు ప్రారంభించారు. పేపర్లలో వార్తలు రాయించారు. అబ్బే కాదు, అక్కడకాదు వైజాగ్‌లో అన్నారు. అలాటివి కొన్నాళ్లు సాగి మళ్లీ ఆగింది. చివరకు విభజన తథ్యం అన్నాక ఒంగోలు వద్ద రాజధాని అని పుకారు వచ్చింది. అక్కడ విరగబడి కొనేశారు. విభజన ప్రకటన వచ్చాక, ఆంధ్రలో బాబు అధికారంలోకి తప్పకుండా వస్తారని, ఆయన వస్తే ఆయన మద్దతుదారులున్న విజయవాడ, గుంటూరు మధ్యలోనే రాజధాని పెడతారని ఊహాగానాలు బలంగా వినవచ్చాయి. అక్కడా కొనేశారు. చివరకు రాష్ట్రం విడిపోయింది. అందరూ అనుకున్నట్టే శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులు బేఖాతరు చేసి బాబు అక్కడే రాజధాని పెట్టేశారు. నూజివీడు, మంగళగిరి అని అక్కడక్కడే తిరుగుతూంటే అక్కడా కొనేశారు. చివరకు తుళ్లూరు దగ్గర అని తేల్చారు. తక్కిన చోట కొన్నవాళ్లందరూ ఘొల్లుమన్నారు. (సశేషం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2016) 

[email protected]