2012 నవంబరులో ఆపేసిన యీ సీరీస్ మళ్లీ ప్రారంభిస్తున్నాను. పాత కథలకోసం ఆర్కయివ్స్ చూడగోర్తాను. మనం ఓల్డ్ టెస్టమెంటులో 12 వ చాప్టరైన రాజులు రెండో గ్రంథంలో వున్నాం. ఎలీషా మహిమలతో బాటు క్రీ.పూ.850 తర్వాత ఇస్రాయేలు, యూదా మండలాలు ఎలా పరుల వశమయ్యాయో యీ గ్రంథం చెపుతుంది.
యెహూ(అలినీతి)తో యుద్ధంలో రెండో అహస్యా (Ahaziah) మరణించాడన్న వార్త వినగానే అతని తల్లి ఐన అతల్యా (Athaliah) అతని కుమారులను, రాజబంధువులను అందర్నీ చంపించి, యూదా (Judah) మండలంలో రాజ్య సింహాసనం అధిష్టించింది. అయితే ఆమె కూతురు, అల్లుడు కలిసి ఓ రాకుమారుణ్ని దాచారు. యోవాషు (Joash) అనే ఆ రాకుమారుడు తన అక్క, బావల వద్ద ఆరేళ్లు పెరిగాడు. బావ యెహోయూదా (Jehoiada) గుళ్లో పూజారి కావడం వలన యీ బాలుణ్ని గుడిలో దాచగలిగారు. ఏడో ఏడాది నడుస్తూండగా కొందరు సైనికాధికారులు బావ వద్దకు వచ్చారు. అప్పుడు అతను యీ పిల్లవాడి నెత్తిపై కిరీటం పెట్టి రాజుగా ప్రకటించాడు. వారంతా బాలరాజు ముందు మోకరిల్లారు. ఈ సందడి విని గుడిలోకి వెళ్లిన అతల్యా మనుమడు రాజైన విషయం గ్రహించి ''నమ్మకద్రోహం, రాజద్రోహం'' అని కేకలు పెట్టింది. ఆమె అల్లుడు యెహోయూదా ''ఆమెను నరకండి, అయితే గుళ్లో వుండగా మాత్రం వద్దు.'' అని సైనికాధికారులకు ఆజ్ఞ యిచ్చాడు. వాళ్లు ఆమెను బయటకు గుంజి కత్తితో నరికారు.
ఏడేళ్ల బాలుడైన యోవాషు క్రీ.పూ. 835లో రాజయ్యాడు. అతను జెరూసలెంను 39 ఏళ్లపాటు పాలించాడు. పూజారి ఐన బావగారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ, అన్యదైవమైన బాలు దేవాలయాలు పడగొట్టి, అతను దేవుణ్ని మెప్పించాడు. సిరియా రాజైన హజాయేలు (Hazael) తమ దేశంపై దండెత్తినపుడు యోవాషు రాజప్రాసాదంలో, దేవాలయంలో వున్న బంగారమంతా అతనికి సమర్పించి సంధి చేసుకున్నాడు. అది నచ్చని యోవాషు పనివాళ్లంతా కుట్ర పన్ని అతన్ని చంపేశారు. అతని తర్వాత అతని కొడుకు అమస్యా (Amaziah) రాజయ్యాడు.
యోవాషు సింహాసనం ఎక్కి యూదా మండలాన్ని పాలిస్తున్న 23 వ సంవత్సరంలో యెహూ కుమారుడు యెహోవాహాసు (Jehoahaz) ఇస్రాయేలు మండలానికి రాజయి 17 ఏళ్లు పాలించాడు. అతని పాలనలో యితర దేవతారాధన సాగడంతో దేవుడు అతనిపై కోపించాడు. సిరియా రాజు వారిపై దండెత్తి పీడించాడు. యెహోవాహాసు చనిపోయేటప్పటికి అతని వద్ద మిగిలినది కొద్ది సైన్యం మాత్రమే.
అతని తర్వాత అతని కొడుకు యెహోవాసు (Jehoash) (క్రీ.పూ.814-798) రాజయి సమారియా (Samaria) నుండి ఇస్రాయేలును ఏలసాగాడు. ఇతను అమస్యాను యుద్ధంలో గెలిచిన వీరుడే కానీ అన్యదేవతా ప్రార్థన చేసి దేవుడికి కోపం తెప్పించాడు. అందువలన సిరియా రాజుని ఓడించలేకపోయాడు. ఇంతలో ఎలీషా (Elisha) ప్రవక్త మరణిస్తున్నాడని తెలిసింది. వెళ్లి ''ఇన్నాళ్లూ నువ్వే కదా మమ్మల్ని కాపాడుతున్నది, ఇప్పుడు మా గతేమిటి?'' అని అంగలార్చాడు. ఎలీషా విల్లుబాణాలు తెప్పించి తూర్పు వైపు కిటికీ తెరిచి బాణం వేయమన్నాడు. యెహోవాసు వేశాడు. ఆ తర్వాత బాణాలను నేలకు గురిపెట్టమన్నాడు. మూడు బాణాలు వేశాక రాజు ఆగిపోయాడు. ఎలీషా కోప్పడ్డాడు – ''అలా ఎందుకు చేశావ్? ఇలా అయితే నువ్వు సిరియాపై మూడుసార్లు మాత్రమే గెలవగలవు. అయిదారుసార్లు వేయవలసినది. అప్పుడు వాళ్లు పూర్తిగా అంతమయ్యేవారు'' అన్నాడు. ఆ విధంగానే జరిగింది.
దీని తర్వాత యూదు, ఇస్రాయేలు మండలాల్లో ఒకరి తర్వాత మరొక రాజు వస్తూనే వున్నారు. వారిలో కొందరు దేవుడు ఒల్లని కార్యాలు చేస్తూ శిక్షలు అనుభవించారు. ఇస్రాయేలుకు రాజైన హోషేయ (Hoshea) సమారియా నుండి తొమ్మిదేళ్లు (క్రీ.పూ.732-724) పాలించాడు. అస్సీరియా (Assyira) రాజైన షల్మనేసేరు (Shalmaneser) అతని మీదకు దండెత్తి వస్తే సంధి చేసుకుని సామంతరాజుగా ఏటా కప్పం కడతానని ఒప్పుకున్నాడు. కానీ ఒక ఏడు కప్పం ఎగ్గొట్టి ఈజిప్టు రాజు దగ్గరకు దూతలని పంపాడు. దాంతో షల్మనేసేరుకి ఒళ్లు మండి అతన్ని ఖైదు చేసి సమారియా పై దండెత్తాడు. మూడేళ్ల తర్వాత ఆక్రమించగలిగాడు. అప్పుడు ఇస్రాయేలీలను బందీలగా అస్సీరియాకు తీసుకుపోయాడు. ఇలా ఎందుకు జరిగింది అంటే ఇస్రాయేలు ప్రజలు దేవుడి మాటలు వింటూనే వున్నారు కానీ అన్యదైవాల ప్రార్థన మానలేదు. స్థానికజాతులు ఎప్పటి నుంచో ప్రార్థిస్తూ వస్తున్న విగ్రహాలను పూజిస్తున్నారు. అందువలన దేవుడు వాళ్లకు శిక్ష విధించాడు కానీ యూదా మండల వాసులను మాత్రం సహించాడు. అయితే త్వరలోనే యూదా మండల వాసులు కూడా ఇస్రాయేలు వాళ్లలాగానే తయారయ్యి శిక్షకు గురయ్యారు.
అస్సీరియా రాజు షల్మనేసేరు సమారియా నుండి ఇస్రాయేలు వాసులను అస్సీరియాకు పంపి, వారి స్థానంలో అస్సీరియా వాళ్లను సమారియాలో స్థావరం కల్పించాడు. వాళ్లకంటూ వేరే దైవాలు వున్నారు కాబట్టి వచ్చిన కొత్తల్లో వాళ్లు దేవుణ్ని పట్టించుకోలేదు. దేవుడు వాళ్ల మీదకు సింహాలు పంపి చంపించాడు. షల్మనేసేరుకు ఆ మేరకు శకునం ద్వారా కబురు పంపాడు. అతను ''మనం బందీలుగా పట్టి తెచ్చిన వారిలో ఎవరైనా పూజారిని సమారియా పంపి, దేవుడి పూజావిధానాలను మన వాళ్లకు నేర్పమనండి.'' అని ఆజ్ఞాపించాడు. అతను వచ్చి నేర్పించాడు కానీ అస్సీరియా నుంచి వచ్చినవాళ్లు అప్పటికే తమ దైవాలను ప్రతిష్ఠాపించుకున్నారు కాబట్టి, కొత్త దేళిరీరిబినీ)వుణ్ని పూజిస్తూనే తమ పాత దేవుళ్లను వదలమన్నారు. వారి వంశీకులు యిప్పటికీ అదే సంప్రదాయం పాటిస్తున్నారు. రెండు రకాల దేవుళ్లనూ కొలుస్తారు.
ఇక ఇస్రాయేలు మండలం విషయానికి వస్తే – క్రీ.పూ. 716 నుండి 687 వరకు హెజికియా (Hezekiah) అనే రాజు పాలించాడు. అతను ఈసయ (Isaiah) అనే ప్రవక్త హితవచనాలను వింటూ దైవభక్తితో వుండడం చేత దేవుడు అతన్ని కాపాడాడు. అతను అస్సీరియా రాజుపై తిరగబడి, కప్పం కట్టడం మానేస్తే వాళ్లు లక్ష ఎనభైఐదు వేల మంది సైన్యంతో దండెత్తి వచ్చారు. అప్పుడు దేవుడి దూత అస్సీరియా శిబిరానికి వెళ్లి రాత్రికి రాత్రి వారందరినీ సంహరించాడు. హెజికియా మరణకాలం ఆసన్నమై నప్పుడు జబ్బుపడ్డాడు. ఆ వార్త విని పొరుగున వున్న బాబిలోనియా రాజు మెరోదక్-బలదాను (Merodach-Baladan) అతని యోగక్షేమం విచారిస్తూ దూతలను పంపాడు. దానికి ఎంతో సంతోషించిన హెజికియా వాళ్లకు తన కోశాగారంతో సహా రాజప్రాసాదంలో వున్న వస్తువులన్నీ చూపించాడు. ఆ కబురు విని ప్రవక్త ఈసయ రాజును మందలిస్తూ దైవవాక్కు వినిపించాడు – ''కొద్దికాలంలో యీ వస్తువులన్నీ బాబిలోనియాకు తరలి వెళ్లిపోతాయి. నీ వారు అక్కడ శక్తిహీనులై బతుకుతారు.'' అని. కొన్నాళ్లకు అదే జరిగింది.
హెజికియా వారసులు దుష్టులయ్యారు. కానీ క్రీ.పూ. 640 నుండి 609 వరకు పాలించిన యోషీయా (Josiah) మతసంస్కరణలు చేపట్టి, యితర దేవుళ్ల ఆలయాలను కూల్చి దేవుడికి ప్రీతిపాత్రుడయ్యాడు. అతను రాజుగా వుండేకాలంలోనే ఈజిప్టు రాజు ఫారో నెకో (Pharaoh Neco) అస్సీరియా రాజుకు తోడ్పడడానికి యూఫ్రటీసు నది దగ్గరకు వచ్చాడు. యోషీయా అతన్ని ఎదిరించి ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. అతని స్థానంలో ప్రజలు యెహోవాహాసును రాజుగా ఎన్నుకున్నారు. కానీ నెకో అతన్ని బందీ చేసి అతని స్థానంలో మరో కుమారుడు యెహోయాకీము (Jehoiakim)ను రాజుగా కూర్చోబెట్టి కప్పం వసూలు చేశాడు. అతను క్రీ.పూ. 609 నుంచి 598 వరకు రాజ్యం చేసే రోజుల్లోనే గొప్ప వీరుడైన బాబిలోనియా (Babylonia) రాజు రెండో నెబుచెడ్నజార్ (Nebuchadnezzar II – ప్రపంచ వింతల్లో ఒకటైన హేంగింగ్ గార్డెన్స్ కట్టినది యితనే) ఈజిప్టుతో సహా అన్ని దేశాలనూ ఓడించాడు. యెహోయాకీము ఫారోకు బదులు యితనికి సామంతరాజుగా మారి మూడేళ్ల తర్వాత తిరుగుబాటు చేశాడు. కానీ అతని చేతిలో ఓడిపోయాడు. యెహోయాకీము మరణం తర్వాత అతని కొడుకు యెహోయాకీను (Jehoiachin) కాలంలో నెబుచెడ్నజార్ మళ్లీ దాడి చేసి యూదు మండలం నుంచి సమస్త సంపదలు దోచుకుపోయాడు. అందరినీ బందీలుగా తీసుకుపోయాడు. రాజును గద్దె దింపి అతని పినతండ్రి జెద్కియాను (Zedekiah) కీలుబొమ్మ రాజుగా కూర్చోబెట్టాడు. బందీగా 37 ఏళ్లు వున్నాక యెహోయాకీనుకు క్షమాభిక్ష లభించింది. బాబిలోనియా పెట్టే తిండి తింటూ వారి రాజభవంతిలోనే వుండిపోయాడు.
జెద్కియా తొమ్మిదేళ్లు రాజ్యం చేశాక నెబుచెడ్నజార్‌పై తిరగబడ్డాడు. ఇక అప్పుడు అతని సైన్యం వచ్చి జెరూసలెం నగరాన్ని ముట్టడించింది. రెండేళ్లపాటు ముట్టడి సాగాక, కరువుబాధ భరించలేక ఒక రాత్రి రాజు, ముఖ్యసైనికులు పారిపోయారు. బాబిలోనియా సైనికులు జెరూసలెం లోని భవంతులను, దేవాలయాన్ని కూల్చారు. పనివారిని బంధించి బాబిలోనియా తీసుకుపోయారు. మిగిలినవారు ఈజిప్టు పారిపోయారు. ఈ విధంగా యూదు మండలం కూడా నాశనమైంది. దీనికి కారణం రాజులు దేవుడి ఆజ్ఞను పాలించకపోవడమే! (సశేషం) (ఫోటో – ఆనాటి బైబిల్ కథ జరిగిన ప్రాంతాల ఆనాటి మ్యాప్, అస్సీరియా సామ్రాజ్యవిస్తారాన్ని రంగుల్లో చూపారు)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2016)