ఎమ్బీయస్‌ : బుడగలమ్ముతున్నారు..2

ఈ ప్రకటనల వలన జరుగుతున్న అనర్థం ఏమిటంటే ప్రజలంతా అప్పులు చేసి (కృష్ణా జిల్లాలో బ్యాంకుల్లో బంగారం రుణాలు ఉధృతంగా పెరిగాయిట) స్థలాలు కొంటున్నారు. డబ్బంతా రియల్‌ ఎస్టేటుపై పెడితే పరిశ్రమలకు పెట్టుబడి పెట్టేవారెవరు?…

ఈ ప్రకటనల వలన జరుగుతున్న అనర్థం ఏమిటంటే ప్రజలంతా అప్పులు చేసి (కృష్ణా జిల్లాలో బ్యాంకుల్లో బంగారం రుణాలు ఉధృతంగా పెరిగాయిట) స్థలాలు కొంటున్నారు. డబ్బంతా రియల్‌ ఎస్టేటుపై పెడితే పరిశ్రమలకు పెట్టుబడి పెట్టేవారెవరు? రియల్‌ ఎస్టేటు వలన ఎకనమిక్‌ యాక్టివిటీ, వస్తూత్పత్తి, ఉద్యోగ కల్పన ఏమీ వుండదు. అందరూ స్థలాలు కొని స్తబ్దంగా కూర్చుంటారు. ఇళ్లు కూడా కట్టరు. పక్కవాడు కడితే రేటు పెరుగుతుంది, అప్పుడు అమ్ముకుందాం అని కూర్చుంటారు. ఎవరు ఏడ్చినా, మొత్తుకున్నా విజయవాడ-గుంటూరు మధ్యే రాజధాని అని బాబు పదేపదే చెప్పేస్తున్నారు. నడిబొడ్డు సిద్ధాంతం ఒకటి జోడించారు. అక్కణ్నుంచి ఏ జిల్లాకు ఎంతదూరమో మ్యాప్‌లతో సహా వివరిస్తున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల నుండి 10 కి.మీ.ల దూరంలో లభ్యంగా వున్న భూమి తక్కువగా వుంది మొర్రో అని ఓ పక్క ఉపముఖ్యమంత్రి చెప్తున్నారు.  

రాజధాని దక్కలేదని తక్కిన జిల్లాల వాళ్లు గోల చేయకుండా జిల్లాకో స్మార్ట్‌ సిటీ పెట్టేస్తానంటున్నారు. దేశం మొత్తం మీద 100 పెడతామని మోదీ అంటే వాటిలో 13 మనకే వస్తాయన్నమాట! భేష్‌! అసలు స్మార్ట్‌ సిటీ పెట్టడానికి ఎంత విద్యుత్‌ అవసరమౌతుందో లెక్క వేశారో, రుణమాఫీ లాగానే అనుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. రాష్ట్రంలో యీ రోజు అదనపు విద్యుత్‌ కనబడుతోందని మురిసిపోకూడదు. ఇది కొంతకాలం ముచ్చటే. పిపిఏల రద్దు వాదన కేంద్రమో, కోర్టో కొట్టి పారేయవచ్చు. విభజన బిల్లులో వున్నది అమలు చేయాల్సిందే అని ఎవరైనా చెప్తారు. భద్రాచలం ముంపు గ్రామాల గురించి ఆలస్యంగానైనా కెసియార్‌ వాస్తవపరిస్థితి గ్రహించి బహిరంగంగా అవి మావి కావు అని ఒప్పుకున్నారు. విద్యుత్‌ పంపిణీ గురించి కూడా బాబు త్వరగా ఒప్పుకుంటే మంచిది. పంపిణీ అన్యాయంగానే జరిగిందనడంలో సందేహం లేదు. ఆస్తులు, అప్పులు అన్నీ జనాభా ప్రాతిపదికన పంచి, యిది మాత్రం ఐదేళ్ల వినియోగం ప్రాతిపదికన పంచడం తప్పు. సాధారణంగా రాజధానికి కరంటు యిచ్చి పట్టణాలకు సరఫరా తక్కువగా యిస్తారు, పల్లెలకు యింకా తక్కువ యిస్తారు. ఆ రకంగా ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు వున్న తెలంగాణలో ఎక్కువ వినిమయం అనుమతించారు. విభజన టైములో ఆ వినిమయం లెక్కన ఆంధ్రకు తక్కువ కేటాయించారు. 

కానీ అడ్డు చెప్పేది వుంటే అప్పుడే చెప్పాలి. అప్పుడు నోరు మూసుకున్నాక యిప్పుడు ఒప్పుకోవాల్సిందే. తెలంగాణకు చెందిన టిడిపి నాయకులు యీ ఫార్ములాను ఆమోదించారని, విభజన బిల్లును పాస్‌ చేయించుకున్నారని, అడ్డు రాబోయిన తన పార్టీ ఆంధ్ర ఎంపీని చావగొట్టి చెవులు మూశారని, అయినా టిడిపి అధ్యకక్షుడు వారిని పార్టీలోంచి బహిష్కరించకపోగా మళ్లీ టిక్కెట్లు యిచ్చి సత్కరించారని యీ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఇప్పుడాయన అన్యాయం జరిగిందని వాపోతే అది అరణ్యరోదనే. బిల్లులో ఒప్పుకున్నట్లు అమలు చేస్తే ఆంధ్రకు విద్యుత్‌ తగ్గుతుందని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం అక్కడ పరిశ్రమలు పెద్దగా లేవు కాబట్టి విద్యుత్‌ సరిపోతోంది. కోతలు లేవు. కానీ నిజంగా పరిశ్రమలు తరలి రావడమో, కొత్తవి రావడమో జరిగినా, బాబు చెప్తున్న ప్రాజెక్టుల్లో పదోవంతు అమలు కాబోయినా యిది సరిపోదు. 24 గంటల విద్యుత్‌ సరఫరా రాష్ట్రంగా ఆంధ్రను ఎంపిక చేశారు కాబట్టి ఢోకా వుండదని అనుకున్నా, ఏ ప్రాతిపదికను చేశారో కూడా చూడాలి. ఈ రోజు వినిమయం బట్టి హామీ యిచ్చారా? లేక భవిష్యత్తులో పదిరెట్లు వినిమయం పెరిగినా సరఫరా చేస్తామంటున్నారా? ఎంతకాలం చేస్తారు? వాళ్లకు కూడా విద్యుత్‌ సరిపోవాలి కదా. 100 స్మార్ట్‌ సిటీలు తయారుచేస్తామంటున్నాక వాళ్లకు ఏమైనా మిగులుతుందా? 

స్మార్ట్‌ సిటీ నిర్వచనం యితమిత్థమని యింకా చెప్పలేకున్నా ఆరు అంశాలుండాలని మాత్రం అందరూ అంటున్నారు – స్మార్ట్‌ ఎకానమీ, స్మార్ట్‌ పీపుల్‌, స్మార్ట్‌ మొబిలిటీ, స్మార్ట్‌ ఎన్వైర్‌మెంట్‌, స్మార్ట్‌ లివింగ్‌ అండ్‌ స్మార్ట్‌ గవర్నెన్స్‌. మొదటిది, ఆఖరిది రాష్ట్రం మొత్తం మీద బాగుంటేనే బాగుంటాయి. పీపుల్‌ అంటారా వాళ్ల మైండ్‌సెట్‌ మారాలి. అమలు చేయలేని ఋణమాఫీ వంటి వాగ్దానాలు చేసిన పార్టీలను నమ్మి ఓట్లు వేసే ప్రజల్లో (వాళ్లదే కదా మెజారిటీ) స్మార్ట్‌నెస్‌ ఎప్పటికి వచ్చేను? 60 ఏళ్ల వృద్ధురాలికి పుట్టిన మూడు తలల పాప నిద్రిస్తే శాశ్వతనిద్రే అని పలికిందంటే నమ్మి రాత్రంతా జాగారం చేసిన జనాభా 5 జిల్లాల్లో వ్యాపించారంటే వారికి స్మార్ట్‌నెస్‌ తెప్పించగలిగేవారెవరు? 

తక్కినవాటి మాట ఎలా వున్నా ఎనర్జీ, ఎన్వైర్‌మెంట్‌ అనే రెండు అంశాల గురించి ఎనర్జిటిక్స్‌ నిపుణుడు సాగర్‌ ధారా ''హిందూ''లో చక్కని వ్యాసం రాశారు. తరచి చూస్తే వాటికీ ఎకానమీకి, మొబిలిటీకి, లివింగ్‌కు కూడా లింకు వుంది. ప్రగతి సాధించాలంటే మనకు యింధనం (ఇంగ్లీషులో ఎనర్జీ అంటున్నారు) కావాలి. ఇంధనం అనగానే విద్యుత్‌, పెట్రోలు మాత్రమే కాదు, ఫ్యాక్టరీలలో, యిళ్లల్లో అవసరపడే బొగ్గుతో  శక్తి పుట్టించే వనరులన్నిటితో సహా లెక్క వేసుకోవాలి. విద్యుత్‌ పలురకాలుగా తయారవుతోంది – సౌరవిద్యుత్‌, జలవిద్యుత్‌, అణువిద్యుత్‌, పవన విద్యుత్‌, బయోగ్యాస్‌తో వచ్చే విద్యుత్‌, బొగ్గు ద్వారా లభించే విద్యుత్‌..యిలా! మన ఎనర్జీ అవసరాలలో 73% శిలాజ యింధనాల ద్వారా లభిస్తోంది. బొగ్గు, భూమిలోంచి వెలికితీసే పెట్రోలు, గ్యాస్‌ వీటన్నిటినీ కలిపి శిలాజ యింధనాలుగా వ్యవహరిస్తారు. దాన్ని ఆయిల్‌ ఈక్వివలెంట్‌ యూనిట్లలో కొలుస్తారు. 

భారతదేశంలోని నగరాల్లో రెండు భాగాలుంటాయి. పెట్రోలుతో నడిచే వాహనాలు కనిపెట్టడానికి ముందు కట్టిన పాతబస్తీ. అక్కడ ఇరుకు సందులు, ఎద్దుబళ్లు, పాదచారులు వెళ్లేందుకు వీలున్న రోడ్లు, ఒకటి, రెండు అంతస్తుల బంగళాలు వుంటాయి. పెట్రోలు వాహనాలు వచ్చిన తర్వాత కట్టిన కొత్త నగరంలో కాంక్రీట్‌ రోడ్లు, ఎత్తయిన బిల్డింగులు వుంటాయి. పాత బస్తీలలోని 5 వేల కి.మీ. దూరాన్ని అధునాతనంగా మార్చడానికి 600 మిలియన్‌ టన్నుల ఆయిల్‌ ఈక్వివలెంట్‌ (ఎమ్‌టిఓఇ) పడుతుంది. ఇది ఎంతో తెలుసా? మన దేశానికి ప్రస్తుతానికి పట్టే మొత్తం ఎనర్జీ! (టోటల్‌ ప్రైమరీ ఎనర్జీ సప్లయ్‌ – టిపిఇఎస్‌). దీని ఖరీదు రూ. 35 లక్షల కోట్లు. అనగా మన 2014-15 కేంద్ర బజెట్‌కు రెట్టింపు. 2000 సం||రం నుండి మన దేశంలో జిడిపి 7% పెరుగుతూంటే, ఎనర్జీ వినియోగం కూడా అదే శాతంలో పెరుగుతోంది. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2014)

[email protected]

Click Here For Part-1