దీపావళికి ఓ రెండు నెలల ముందు నుంచి మనవాళ్లలో ఆవేశం ఆవహించింది. ఉగ్రవాదానికి పుట్టిల్లు పాకిస్తాన్. దాన్ని మేనమామలా కాపాడుతున్నది చైనా. కాబట్టి ఈ దీపావళికి చైనా బాణసంచా కొనకుండా వాళ్లకు ఆర్థిక నష్టం చేకూర్చి మన ఇండియాతో పెట్టుకుంటే వాళ్ల కెంత చేటో తెలియచెప్పాలి – అని మెసేజిలు, వాట్సాప్ ఫార్వార్డులు గుప్పించారు. చిత్రమేమిటంటే ఇవన్నీ పంపించినది చైనాలో తయారైన సెల్ఫోన్ల ద్వారానే! మన రాష్ట్రాలన్నీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి వివిధ దేశాల వ్యాపారస్తులను ఆహ్వానిస్తూ వుంటాయి. మధ్యప్రదేశ్లోని బిజెపి ప్రభుత్వం కూడా అక్టోబరు 20న ఓ సమావేశం జరిపి, చైనా వాళ్లను కూడా పిలిచింది. దానిపై కినిసిన స్వదేశీ జాగరణ్ మంచ్ అనే ఆరెస్సెస్ ఆర్థిక విభాగం మంత్రుల దిష్టిబొమ్మలు తగలేసింది. దీపావళి జరిగిన రెండు వారాలకు తమ ఉద్యమం సఫలమైందని గుజరాత్, పంజాబ్, న్యూఢిల్లీలలో చైనా బాణసంచా కొనుగోళ్లు 20% మేరకు తగ్గాయని ప్రకటించుకుంది. అందువలన మనం చైనావాళ్ల డ్రాగన్ కాటుకి చెప్పుదెబ్బ కొట్టినట్లే సంతోషించవచ్చా?
నవంబరు 8న ప్రభుత్వ వర్గాలు విడుదల చేసిన గణాంకాల ప్రకారం చైనా నుండి మన దిగుమతులు గతంలో కంటె 7% పెరిగాయి. జూన్లో మన దిగుమతులు ఎంత వున్నాయో అక్టోబరులోనూ అంతే వున్నాయి. అంటే మనం చైనా సరుకులు కొనడం మానలేదన్నమాట! నిజానికి చైనా నుండి మనం దిగుమతి చేసుకునే వస్తువుల్లో బాణసంచా వంటి చిల్లర సరుకులు, చీప్ సరుకుల వాటా కేవలం 1-2%! అంకెల్లో చెప్పాలంటే 10 లక్షల డాలర్ల కంటెలోపు. చైనా నుండి చేసుకునే ఎలక్ట్రానిక్ దిగుమతులు 2,000 కోట్ల డాలర్లు, న్యూక్లియార్ రియాక్టర్లు, మెషినరీ 1,500 కోట్ల డాలర్ల్లు, కెమికల్స్ 600 కోట్ల డాలర్లు, ఉక్కు 230 కోట్ల డాలర్లు. మనం అమెరికా, సౌదీ అరేబియా, యుఎఈల నుంచి దిగుమతి చేసుకునే మొత్తం చైనా నుంచి చేసుకునేదానితో దాదాపు సమానంగా వుంటుంది. అందువలన చైనా చౌకసరుకులు మనం పూర్తిగా వాడడం మానేసినా తేడా ఏమీరాదు.
చైనాతో మన వ్యాపారం పెరుగుతోంది – అది కూడా చైనాకు అనుకూలంగా. 2015-16లో మొత్తం ద్వైపాక్షిక వ్యాపారం 7100 కోట్ల డాలర్లయితే మనం ఎగుమతి చేసినది 1800 కోట్ల డాలర్లు, దిగుమతి చేసుకున్నది 5300 కోట్ల డాలర్లు. 'మనం టెలికామ్, పవర్ రంగాలలో విస్తరిస్తున్నాం కాబట్టి చైనా నుంచి ఎక్కువ దిగుమతులు చేసుకోవలసి వస్తోంది. చైనా సరుకులు నిషేధించాలనే డిమాండ్ అర్థరహితం. మనమూ, చైనా డబ్ల్యుటిఓలో సభ్యులం. దిగుమతులపై ఆంక్షలు విధించడానికి వీలులేదు.'' అని పార్లమెంటులో నిర్మలా సీతారామన్ వివరించారు. మనం దేశభక్తి పేర చైనాకు వ్యతిరేకంగా గొంతు చించుకుంటున్నాం కానీ వాస్తవాలు మరోలా వున్నాయి. పేటిఎమ్ వాడమని ప్రభుత్వం తన ఖర్చుతో ప్రకటనలు ఇచ్చి ఊదరగొడుతోందా? చైనా ఈ-కామెర్స్ దిగ్గజం ఆలీబాబాకు దానిలో 40% వాటా వుంది! స్థానిక టాక్సీ కంపెనీలను నిరాదరించి మనం ఎక్కుతున్న ఓలాలో కూడా చైనా వారి పెట్టుబడులున్నాయి. ప్రజాదరణ పొందిన మేక్మైట్రిప్ అనే ట్రావెల్ వెబ్సైట్లో కూడా. ఈ ఆగస్టులోనే ముంబయిలో మీడియా డాట్ నెట్ అనే స్టార్టప్ కంపెనీలో చైనీస్ కన్సార్షియం (ఋణదాతల సమూహం) 90కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది. చైనావాళ్లు మన వస్తువులు లేకుండా బతకగలరు కానీ, మనం చైనావాళ్ల వస్తువులు లేకుండా బతకలేం.
ఎందుకలా అంటే గ్లోబలైజేషన్ పేరు చెప్పి మనం దేశంలో ఉత్పత్తి మానేశాం, రీసెర్చి అటకెక్కించాం. అన్నిటా విదేశీ సామానులే వాడుతున్నాం. మరి చైనా? స్వదేశంలోనే అన్నీ ఉత్పత్తి చేసుకుంటూపోయారు. ప్రపంచానికే మాన్యుఫేక్చరింగ్ కేంద్రంగా అవతరించారు. ప్రపంచంలోని కంప్యూటర్లలో సగం అక్కడే తయారవుతున్నాయి, డివిడిలలో మూడింట రెండు వంతులు అక్కడే. ఇక ఆటబొమ్మల సంగతి చెప్పనే అక్కరలేదు. ఇటీవలి కాలంలో మన ఇళ్లల్లో ఫర్నిచర్ కూడా చైనాకి వెళ్లి కొనుక్కుంటున్నాం. దక్షిణ చైనాలోని ఈవూ పట్టణానికి ఏటా 3-4 లక్షల మంది ఇండియన్లు వెళ్లి సరుకులు కొంటారట. అక్కడ మన ఇండియన్ దేవుళ్ల విగ్రహాలు, మన తరహా జ్యూయలరీ తయారుచేసి ఇండియా కంటె 40% తక్కువ ధరలో అమ్ముతున్నారు. ఇండియన్ ఫార్మా పరిశ్రమ చైనా దిగుమతులపై ఆధారపడి నడుస్తోంది. తయారీ రంగంలో చైనా ఎందుకు దూసుకుపోతోంది అనే విషయంపై మన దేశం తరఫున 2011లో అధ్యయనం జరిగింది. అప్పటికే ఇండియన్ టెలికాం దిగుమతుల్లో 62% చైనావి. ఇప్పుడు 3జి, 4జి కూడా వచ్చాయి కాబట్టి 75% దాటి వుంటుంది. ఇండియా మాన్యుఫేక్చరింగ్ జిడిపిలో చైనా వాటా 2011లో 26% వుందని, ఐదేళ్లలో అది 75%కు చేరవచ్చని అధ్యయన బృందం అంచనా వేసింది. వారిని నిరోధించడం కంటె ఇండియాలో పెట్టుబడి పెట్టి, మీరు సాధించిన అనుభవంతో ఆ వస్తువులేవో ఇక్కడే తయారుచేసి, మా వాళ్లకు ఉద్యోగాలు కల్పించండి అని అడగడం మేలని ప్రభుత్వం భావిస్తోంది.
చైనా వస్తువులు వాడవద్దని వాట్సాప్ మెసేజి ఫార్వార్డ్ పంపడంతో దేశానికి మేలు కలగదు. జాతి గౌరవం వుందని నిరూపించడానికి బలవంతంగా సినిమా హాల్లో (అక్కడే ఎందుకో నా కర్థం కాదు, కళ్యాణమంటపంలో అయితే ఇంకా ఎక్కువమంది పోగడతారు) జాతీయగీతం వినిపించి, లేచి నిల్చోనివాళ్లను అరెస్టు చేయనక్కర లేదు. గాంధీగారు విదేశీ వస్తుబహిష్కారంతో జాతీయభావాన్ని రగిలించారు. ఇప్పటికిప్పుడు బహిష్కరిద్దామంటే వీలుపడని పరిస్థితి. ఇప్పటికైనా స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించాలి. మన వస్తువులు ఎగుమతి కాకపోయినా ఫరవాలేదు. మన మార్కెట్లలో మన వస్తువులున్నా చాలు, కంపెనీలు నిలదొక్కుకుంటాయి. మనం ఆర్థికంగా బలపడితే చైనా కాదు, పాకిస్తాన్ కాదు, ఎవరికైనా జవాబు చెప్పగలం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2016)