ఎమ్బీయస్‌: చూసి నేర్చుకోవచ్చు…

ఇటీవల తెలుగు మీడియాలో ఓ వార్త వచ్చింది. ఆంధ్రలో బాబు ఎంత కష్టపడుతున్నా, కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతూ ఆయన ప్రయత్నాలకు తూట్లు పొడుస్తున్నారుట. ఆ వార్త రాగానే దాన్ని ఖండిస్తూ ప్రభుత్వం నుంచి…

ఇటీవల తెలుగు మీడియాలో ఓ వార్త వచ్చింది. ఆంధ్రలో బాబు ఎంత కష్టపడుతున్నా, కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతూ ఆయన ప్రయత్నాలకు తూట్లు పొడుస్తున్నారుట. ఆ వార్త రాగానే దాన్ని ఖండిస్తూ ప్రభుత్వం నుంచి ప్రకటన ఏదీ రాలేదు. పోగా, ఆ వార్త వచ్చాక బాబు అధికారులతో దాన్ని ప్రస్తావించి 'ఇప్పటికైనా మారండి, లేకపోతే జాగ్రత్త' అని హెచ్చరించినట్లుగా కూడా మర్నాడు అదే పత్రికలో యింకో వార్త వచ్చింది. దానికీ ఖండన లేదు. ఏదైనా ఘనత జరిగితే సిఎంకు కట్టబెట్టడం, అవినీతి, బంధుప్రీతి జరిగితే అధికారుల నెత్తిన రుద్దడం ఒక అలవాటుగా మారుతోందనుకున్నా అధికారగణం సవ్యంగా ప్రవర్తించటం లేదన్న సందేహమైతే గాఢంగానే నాటుకుంది. బాబు గారి ప్రణాళికలు నిజంగా రూపు ధరిస్తే ఆంధ్రలో పెట్టుబడులు వరదలా రాబోతున్నాయి, భారీ నిర్మాణాలు జరగబోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అధికారుల్లో అవినీతి జాడ్యం వుంది అనుకుంటే రాష్ట్ర భవిష్యత్తు గురించి భయం వేస్తుంది. దాన్ని దూరం చేస్తే కానీ ప్రజల మనసు కుదుటపడదు. పెట్టుబడిదారుల అడుగు ముందుకు పడదు. అధికారుల అవినీతిని అరికట్టడానికి యితర ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారో గమనించడం ఆంధ్ర ముఖ్యమంత్రికి చాలా అవసరమనిపిస్తోంది. ఝార్‌ఖండ్‌ను పాలిస్తున్న రఘువర్‌ దాస్‌ ఏడాది పదవీకాలంలోనే చాలా మంచి పనులు చేశారని మీడియాలో వ్యాసాలు వస్తున్నాయి. అవి వాస్తవాలకు దగ్గరగానే వున్నాయని నమ్ముతూ, ఆయన్ని చూసి తెలుగు ముఖ్యమంత్రులు కాస్తయినా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను.

అన్నిటికంటె ముందు నాకు నచ్చిన విషయమేమిటంటే – 2014 డిసెంబరు 28న ఆయన ప్రమాణస్వీకారం చేశాడు. స్థానిక నమ్మకాల ప్రకారం అవి మంచి రోజులు కావట. అయినా ఫర్వాలేదన్నాడట. అలాగే కాంకే రోడ్డులో నెం. 3 యింటిని తన అధికార నివాసంగా చేసుకోవడానికి ఆయన జంకలేదు. 'గత ముఖ్యమంత్రులందరూ తమ పదవులు పోవడానికి ఆ యిల్లే కారణమని నమ్మారు కదా మీకేం బెదురు లేదా?' అని అడిగితే 'పాత వాళ్లందరూ తమ అధికారం కొనసాగుతుందా లేదా అని ఆలోచించారు. నేను ప్రజల అధికారం కొనసాగితే చాలనుకుంటున్నాను.' అని జవాబిచ్చాడు. ఈ కాలంలో యిలాటి సమాధానం కొంత వింతగా తోస్తుంది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు టంగుటూరి ప్రకాశం గారికి చెప్పారట – ''అక్టోబరు 1 ముహూర్తం మంచిది కాదట. మార్పిస్తే మంచిదేమో అని.'' ''నాకా? రాష్ట్రానికా?'' అని అడిగారాయన. ''మీకే.., ఆ రోజు ప్రమాణస్వీకారం చేస్తే ముఖ్యమంత్రిగా మీరు ఎక్కువకాలం వుండరట.'' అని జవాబు వస్తే ''నాకేమైనా ఫర్వాలేదు, రాష్ట్రం బాగుంటే అదే చాలు. ఆ ముహూర్తం మార్చవలసిన పని లేదు.'' అని జవాబిచ్చారు. ఇప్పుడు ప్రమాణస్వీకారాలన్నీ సెకన్లతో సహా ముహూర్తాల బట్టే నడుస్తున్నాయి. ఇక అధికారిక నివాసమైతే మంత్రి మారగానే ఆయన జాతకానికి అనుగుణంగా వాస్తు మార్పులంటూ కోట్లు తగలేస్తున్నారు. అది తాత్కాలిక నివాసమైనా సరే! సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటే ఎవరూ ఏమీ అనరు. కానీ పోతున్నది ప్రజాధనం. 60 ఏళ్ల వయసున్న రఘువర్‌ వయసు తెచ్చే చాదస్తానికి కూడా లొంగకుండా వ్యవహరించడం ఎంతైనా ముచ్చటగా వుంది. 

నాకు నచ్చిన యింకో అంశమేమిటంటే ప్రభుత్వశాఖలను తగ్గించడం! మన రెండు తెలుగు రాష్ట్రాలలోను ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు. వచ్చినవాళ్లందరికీ మంత్రిపదవులు యివ్వాలంటే పరిమితి వుంది. అందువలన ఆ పదవితో సమానమైన హోదా యిస్తూ అనేక పోస్టులు సృష్టిస్తున్నారు. కార్పోరేషన్లు పెంచుతున్నారు. కులం పేర, ప్రాంతం పేర, రంగం పేర కార్పోరేషన్‌ సృష్టిస్తూ పోతే ఖజానాపై ఎంత భారమో చూడండి. ఈ రఘువర్‌ 43 డిపార్టుమెంట్ల నుండి 31 చేశాడు. కొన్ని కలిపేసి, కొన్ని తీసేసి, మరి కొన్నిటిని పునర్వ్యవస్థీకరించి అధికారులను కూడా తగ్గించాడు. సుస్థిరప్రభుత్వం వుంది కాబోలు ఏం చేసినా చెల్లిపోతుంది అనుకోనక్కరలేదు. 82 స్థానాలున్న ఝార్‌ఖండ్‌ అసెంబ్లీలో బిజెపికి 37, దాని భాగస్వామి ఐన ఆల్‌ ఝార్‌ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఎజెఎస్‌యు)కు 5 వచ్చాయి. ఇద్దరు ఫిరాయించినా ప్రభుత్వం కుప్పకూలుతుంది. అలాటి పరిస్థితుల్లో ఝార్‌ఖండ్‌కు తొలి గిరిజనేతర ముఖ్యమంత్రిగా యితనికి బిజెపి అవకాశం యిచ్చింది. ఏం చేసినా గిరిజనుల నాయకులు తప్పుపడుతూనే వచ్చారు. ఎందుకైనా మంచిదని పదవిలోకి వచ్చిన మూణ్నెళ్లకు ఝార్‌ఖండ్‌ వికాస్‌ మోర్చా ఎమ్మెల్యేలు ఆరుగుర్ని పార్టీలో చేర్చుకుని సుస్థిరత సంపాదించుకున్నాడు. సాధారణంగా ఫిరాయింపులు ప్రోత్సహించినపుడు అవినీతిపై చూసీ చూడనట్లు పోవడం జరుగుతుంది. కానీ రఘువర్‌ ఎసిబి సిబ్బందిని 258 నుంచి 608కి పెంచాడు. జంషెడ్‌పూర్‌, హజారీబాగ్‌, ధుమ్కా, పలామూలలో ఎసిబి ప్రాంతీయ ఆఫీసులను తెరిచాడు. ఇప్పటివరకు 61 మంది అధికారులు పట్టుబడ్డారు. 8 మందిని అక్రమాస్తుల కేసులో, మరో 15 మందిని అధికారదుర్వినియోగం కేసుల్లో బుక్‌ చేయడం జరిగింది. అవినీతిని రూపుమాపుతామనే నినాదంతో  ''సీధీ బాత్‌'' అనే కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు 181 నెంబరుకు బాధితులు డయల్‌ చేస్తే తనే ఫోన్‌ తీసుకుని సంబంధిత అధికారులకు అప్పటికప్పుడే ఆదేశాలు యిచ్చే ఏర్పాటు చేశాడు.

నిజానికి రఘువర్‌ వచ్చిన దగ్గర్నుంచి అధికారులను గడగడలాడిస్తున్నాడు. ఝార్‌ఖండ్‌లో రాజకీయ అస్థిరత ఎక్కువ. రాష్ట్రం ఏర్పడిన 14 ఏళ్లలో 5గురు ముఖ్యమంత్రులు మారారు. ఇతను ఆరోవాడు. నాయకులు వస్తూ పోతూ వుండడంతో అధికారగణానిది ఆడింది ఆట, పాడింది పాటగా వుంటూ వచ్చింది. ఝార్‌ఖండ్‌లో టాటా స్టీల్‌, టాటా మోటర్స్‌, సెయిల్‌, కోల్‌ ఇండియా వంటి 32 మెగా కంపెనీలున్నా, ఐఐఎమ్‌, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, బిట్‌, ఐఎస్‌ఎమ్‌ వంటి ఎన్నో గొప్ప సంస్థలున్నా, రాష్ట్రం మాత్రం అనేక రంగాల్లో వెనకపడి వుంది. విద్య, వైద్యం వంటి రంగాల్లో దాని స్థానాన్ని పెంచడానికి రఘువర్‌ కృషి చేస్తున్నాడు. 2016-17 బజెట్‌లో రూ. 37 వేల కోట్లు ప్లానింగ్‌కు కేటాయించి రూ. 26 వేల కోట్లను నాన్‌-ప్లాన్‌కు కేటాయించాడు. అతను టిస్కోలో కార్మికుడిగా వుండేవాడు. అతని తండ్రీ అక్కడే కార్మికుడు. బియస్సీ, ఎల్‌ఎల్‌బి చదివి ఉద్యోగంలో చేరాడు. కాలేజీలో వుండగా జయప్రకాశ్‌ ఉద్యమంలో పాల్గొని, తర్వాత జనతా పార్టీలో చేరిి, బిజెపి ప్రారంభించినపుడు దానిలో సభ్యుడయ్యాడు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గాడు. శిబు సొరేన్‌ ముఖ్యమంత్రిగా వున్నపుడు సంయుక్తప్రభుత్వంలో కొంతకాలం ఉపముఖ్యమంత్రిగా వున్నాడు. అందువలన అతనికి ఝార్‌ఖండ్‌లో సామాన్యుల నుంచి నాయకులదాకా అందరూ బాగా తెలుసు. రాష్ట్ర సమస్యల గురించి కూడా పూర్తి అవగాహన వుంది. 

రఘువర్‌ ముఖ్యమంత్రి ఐన నెలలోపునే ఒక అఫీషియల్‌ మీటింగులో చీఫ్‌ సెక్రటరీ తన మాట వినకుండా మొండికేస్తే అతన్ని తీసేసి సంజయ్‌ కుమార్‌ను అనే ఆయన్ని బిహార్‌నుంచి  తెచ్చుకున్నాడు. అలాగే డిప్యూటీ డెవలప్‌మెంట్‌ కమిషనరు దినేశ్‌ ప్రసాద్‌ను తీసేశాడు. మావోయిజంపై తీసిన వీడియోలో తన అనుమతి లేకుండా కనబడినందుకు ఆ శిక్ష! మావోయిస్టులపై కఠిన వైఖరి అవలంబించి, జన్‌ అదాలత్‌లు నిర్వహించి, వాళ్ల బలాన్ని క్షీణింపచేశాడు. 2015లో మావోయిస్టులు ఒక్క పోలీసుస్టేషన్‌పై కూడా దాడి చేయలేకపోయారు. ఆగస్టులో దేవగఢ్‌ గుడి వద్ద  ఉత్సవంలో జనసమ్మర్దం కారణంగా 10 మంది చనిపోతే ఒక ఐయేయస్‌ను, ఒక ఐపియస్‌ను, మరో యిద్దరు ఆఫీసర్లను సస్పెండ్‌ చేశాడు. ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో చెట్లు కొట్టేయించినందుకు డిసెంబరులో కోడెర్మా డిప్యూటీ కమిషనర్‌ను తీసేశాడు. తనకు కావలసిన అధికారులను తెచ్చుకుని వారిచేత సమర్థవంతంగా పనిచేయించుకుంటున్నాడు. బ్యూరోక్రాట్లపై పట్టు సాధించడం చేత కాబోలు, పాలన మొదలుపెట్టి ఏడాదిలోనే బాగానే సాధించాడంటున్నారు. ఇప్పుడే మరీ కితాబులు యిచ్చేస్తే ఎబ్బెట్టుగా వుంటుంది కానీ సరైన దారిలోనే నడుస్తున్నాడనీ, అతన్ని చూసి మనవాళ్లు కొన్ని నేర్చుకోవచ్చని అనుకుంటూ ఝార్‌ఖండ్‌కు మంచి రోజులు వచ్చాయని భావిద్దాం.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016) 

[email protected]