''ఇద్దరు మిత్రులు'' సినిమా తీసినది అన్నపూర్ణా పిక్చర్స్‌వారు. దానిలో అక్కినేని నాగేశ్వరరావు గారు భాగస్వామి అయినా సారథి దుక్కిపాటి మధుసూదనరావుగారే. ''వెలుగు నీడలు'' తర్వాత ఏ సినిమా తీద్దామాని ఆలోచిస్తూ ఆయన సాటి నిర్మాత ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ఎ.వి.సుబ్బారావులతో కలిసి కలకత్తా వెళ్లి ఉత్తమ్ కుమార్ ద్విపాత్రాభినయం చేసిన 'తాషేర్ ఘర్' చూశారు. అప్పటిదాకా నాగేశ్వరరావు ద్విపాత్రాభినయం వేయలేదు. ఆయనకి యీ సినిమా సూటవుతుందనిపించింది దుక్కిపాటిగారికి. 'మీకేమైనా ఉద్దేశ్యం వుందా?' అని సుబ్బారావుగార్ని ప్లెయిన్‌గా అడిగేశారు. 'అబ్బే, దీనిలో డ్యూయల్ రోల్ తప్ప విశేషం ఏమీ లేదు, నాకేమీ అక్కరలేదు' అన్నారు సుబ్బారావు. 'విశేషం ఏమీ లేకపోతే కల్పిస్తే సరి' అనుకుంటూ మధుసూదనరావు గారు 'తాషేర్ ఘర్' సినిమా హక్కులు కొన్నారు. 'తాషేర్ ఘర్' అంటే 'పేకముక్కల గది' అని అర్థం. తాష్ అంటే పేకముక్కలు. ఘర్ అంటే హిందీలో యిల్లు కానీ బెంగాలీలో గది అని అర్థం. పేకముక్కలు పేర్చి మనం పేకమేడలు అంటాం, వాళ్లు గది అంటారు. భావం ఒకటే. ఈ సినిమా కథ రాస్‌బిహారీ లాల్. స్క్రీన్‌ప్లే, దర్శకత్వం మంగళ్ చక్రవర్తి.
కలకత్తాలో గ్రాండ్ హోటల్. డాన్సు జరుగుతోంది. కానీ అజయ్ మిత్రాకు అదేమీ రుచించటం లేదు. విసుక్కుని బయటకు బయలుదేరాడు. అతను డబ్బున్న వాడు. తలిదండ్రులు లేరు. గుడ్డి మేనత్త వుంది. తండ్రి సంపాదించి పెట్టిన ఆస్తి వుంది. కానీ వ్యవహారాలన్నీ అస్తవ్యస్తంగా వున్నాయి. తండ్రితో పార్ట్‌నర్‌గా మొదలెట్టి యిప్పటికీ భాగస్వామిగా కొనసాగుతున్న మజుందార్ గారున్నారు. వాళ్లమ్మాయి యితన్ని పెళ్లాడమని వెంటపడుతోంది. ఇతనికి ఆ అమ్మాయంటే యిష్టం లేదు. తెలుగులో యింత డల్‌గా మొదలెట్టలేదు. ఓ ఖవ్వాలీ పాట పెట్టారు. అజయ్‌కి మిత్రబృందాన్ని పెట్టి వాళ్ల చేత యితని ఆస్తులను, అప్పుల బాధలను కూడా చెప్పించారు.
అజయ్ యింటికి వెళుతూండగా ఒక వ్యక్తి కారుకింద పడబోయాడు. ఇతను వినయ్ దత్తా అనే ఓ బీదవాడు. పెళ్లికాని చెల్లెలు మీనా వేరే వారింట్లో వుంటూ చదువుకుంటోంది. ఇతను ఉద్యోగం దొరకక పొట్టగడవడానికి ట్యూషన్లు చెప్పుకుంటూ ఒకరింట్లో అద్దెకుంటున్నాడు. ఇంటివాళ్ల అబ్బాయికి ట్యూషన్ చెపుతున్నాడు. ఆ అబ్బాయికి ఓ అక్క కూడా వుంది. ఆమెకు యితనంటే జాలి, యిష్టం. అయిదేళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ విసిగిపోయిన వినయ్ ఆత్మహత్య చేసుకుని చద్దామనుకున్నాడు. అందువల్ల అజయ్ కారుకింద పడ్డాడు. ఇక్కడ తమాషా ఏమిటంటే డబ్బున్న అజయ్, బీదవాడైన వినయ్ ఒకేలా వుండడం! మార్క్ ట్వేన్ రాసిన 'ప్రిన్స్ అండ్ పాపర్' నాటినుండి మనకు యిదొక ఫాసినేటింగ్ థీమ్ – రాజూ పేదా ఒకేలా వుండడం, ఇద్దరూ స్థానాలు మార్చుకుని అక్కడి పరిస్థితులు చక్కదిద్దడం! దీనిలో కూడా ఆ పొటెన్షియల్ వుందని గుర్తించడమే దుక్కిపాటివారి ఘనత! మూలకథకు ఎన్నో పాత్రలు చేర్చి, ఎన్నో ట్విస్టులు పెట్టి, డ్రామాను పెంచడం ఆయన ప్రజ్ఞ.
తనలాగే వున్న వినయ్‌ను అజయ్ తన గదికి తీసుకుని వచ్చాడు. అతని దారిద్య్రం గురించి తెలుసుకుని, దరిద్రం అనేది అంత భయంకరమైనది కాదని, ఆత్మహత్య చేసుకోవలసినంత అవసరం లేదని వాదించాడు. అనుభవిస్తే తెలుస్తుందన్నాడు వినయ్. అజయ్ ఛాలెంజ్ చేశాడు. కావాలంటే స్థానాలు మార్చుకుందామన్నాడు. తెలుగు వెర్షన్‌లో వినయ్‌ను విజయ్ చేశారు. అతనికి తల్లి లేదు. తండ్రి భక్తిలో మునిగిపోయి యింటి వ్యవహారాలు పట్టించుకోడు. అతనికీ చెల్లెలు వుంది కానీ బెంగాలీ వెర్షన్‌లోలా పెళ్లికాని పిల్లకాదు. పెళ్లయింది కానీ కట్నం సరిపోలేదని మావగారు కాపురానికి రానీయలేదు. పుట్టింట్లోనే వుండిపోయింది.
అజయ్ నేపథ్యంలో కూడా తెలుగులో మార్పు వుంది. బెంగాలీలో మజుందార్ భాగస్వామి కాగా, దీనిలో భానోజీ – గుమ్మడిగారు వేసిన పాత్ర – నయవంచకుడైన మేనేజర్. భానోజీ తన కూతుర్ని అజయ్‌పైకి ఉసికొల్పడం, గుడ్డి మేనత్త దాని కిష్టపడకపోవడం, చుట్టూ విషవలయం వుందని అజయ్‌ని హెచ్చరించడం – యివన్నీ పెట్టి డబ్బున్నవాడి కష్టాలను మరింత పెంచారు. తండ్రి పోయిన తర్వాత ఓ గది మూసి వుంటుంది. ఆ మూసిన గదిలోంచే భానోజీ నగలూ, డబ్బూ తస్కరిస్తాడు. అవన్నీ చివర్లో తెలుస్తాయి. గొప్పవాడు, పేదవాడు ఓ ఏడాది పాటు స్థానాలు మార్చుకోవడానికి రాసుకున్న ఒప్పందం బెంగాలీ వెర్షన్‌లో లాయరుకి పంపిస్తారు. కానీ తెలుగు వెర్షన్‌లో డబ్బున్నవాడి యింట్లో దాస్తారు. అది క్లయిమాక్స్‌లో విలన్ కంట బడి డ్రామా రక్తి కట్టడానికి ఉపకరిస్తుంది.
బెంగాలీలో పేదవాడి స్థానంలో వెళ్లిన డబ్బున్నవాణ్ని యింటివాళ్లమ్మాయి రిసీవ్ చేసుకుంది. దగ్గరుండి అన్నం పెట్టింది. నిరుద్యోగి అయిన యితన్ని చూసి ఆ అమ్మాయి యిష్టపడింది. వీళ్లిద్దరిమధ్యా క్రమేపీ ప్రేమ పుడుతుంది. తెలుగు వెర్షన్‌లో – అతను వెళ్లేసరికి తండ్రి యింటి ఎదురుగా రామమందిరంలో భజన చేస్తున్నాడు. చెల్లి ఆప్యాయంగా పలకరించింది. డబ్బున్నవాడి స్థానంలో వెళ్లిన పేదవాడికి అంతా కొత్తగా వుంది. చెక్కులమీద సంతకాలు పెట్టాలని మేనేజర్ అంటే చాకు కోసుకుపోయినట్టు నటించి గండం గట్టెక్కాడు. ఎంతమంది కళ్లు కప్పినా కళ్లులేని మేనత్తను మాత్రం ఏమార్చలేకపోయాడు. ఆవిడకి వున్న విషయం చెప్పేశాడు. ఇవన్నీ బెంగాలీ వెర్షన్‌లో వున్నవే!
పేదవాడి విషయంలో తెలుగులో పెట్టిన కొత్త సీను ఏమిటంటే అతను చెల్లెలు మావగారింటికి వెళ్లి బావగార్ని బెదిరించాడు. అతను, అతని తల్లి మంచివాళ్లే. మావగారి దాష్టీకానికి దడిసి కోడల్ని కాపురానికి తీసుకురావడం లేదు. ఈ బెదిరింపు కారణంగా అల్లుడు దొంగచాటుగా వీళ్లింటికి రావడం, చెల్లెలు గర్భవతి కావడం, ఆ తర్వాత అల్లరి కావడం జరుగుతుంది. బెంగాలీ ఒరిజినల్లో యిదేమీ లేదు. పేదవాడి చెల్లెలు ఎవరో ఫ్యామిలీ ఫ్రెండ్స్ యింట్లో వుంటుంది. ఇతనోసారి వాళ్లను చూడడానికి వెళ్లి విషయాలు కనుక్కొని వచ్చాడు. తర్వాత సారి వెళ్లినపుడు చెల్లెల్ని, ఆశ్రయం యిచ్చిన వారబ్బాయినీ కలిశాడు. ఆ అబ్బాయి మంచి గాయకుడు. వాళ్లిద్దరి మధ్యా ప్రేమ అంకురించింది. దానికి అతని తల్లి అంగీకారం కూడా వుంది. తన ఉద్యోగం వచ్చి కష్టాలు గట్టెక్కుతాయని హీరో చెల్లెలుకు ధైర్యం చెప్పాడు కానీ అది వచ్చే సూచనలేవీ కనబడటం లేదు. (సశేషం) (ఫోటో ''తాషేర్ ఘర్''లో ఉత్తమ్ కుమార్ ద్విపాత్రాభినయం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2015)