జవాబులు – ఒక పాఠకుడు మారుతి కంపెనీని జనతా పార్టీ లిక్విడేట్ చేసేసింది అన్నారు. నా వ్యాఖ్య తర్వాత 'లిక్విడేషన్‌కు దారితీసే పరిస్థితులు కల్పించింది' (క్రియేటెడ్ కండిషన్స్ టు లిక్విడేట్) అని వివరించారు. రెండో వ్యాఖ్య మొదటే రాసి వుంటే చర్చే వుండేది కాదు. స్వయంగా మూసేయడానికి, మూసే పరిస్థితి కల్పించడానికి తేడా వుంది కదా. అవును, చిక్కులు కల్పించగల శక్తి ప్రభుత్వానికి వుంటుంది. అలాగే అయినవాళ్లకి అన్నీ కట్టబెట్టే శక్తీ వుంటుంది. సంజయ్ విదేశీ కంపెనీలతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే అతన్ని అడ్డుకునే శక్తి 1977 వరకు లేదు. ముఖ్యంగా ఎమర్జన్సీ నడిచిన 19 నెలల్లో అతని మాటే వేదవాక్కు. పొత్తు పెట్టుకోవాలనుకున్నాడని ఓ కాలమిస్టు ఏదో రాయవచ్చు, మరి ఎందుకు పెట్టుకోలేకపోయాడో రాసినప్పుడే నమ్మవచ్చు. నిజం ఏమిటంటే ఎంట్రప్రెనార్‌గా తన ప్రయత్నాలు విఫలమయ్యేసరికి సంజయ్ ఆసక్తి రాజకీయాలవైపు మళ్లింది. 2) ఖుశ్వంత్ సింగ్ కూడా నా అభిమాన రచయితే. అంత మాత్రాన అతను రాసినదంతా నేను నమ్మను. 'వినదగు నెవ్వరు చెప్పిన..' అనే పద్యాన్ని నేను అనుసరిస్తాను. అందరివీ చదవాలి. చదవగానే తొందరపడి ఒక అభిప్రాయానికి రాకుండా విచక్షణ, వివేకం ఉపయోగించి సత్యాన్వేషణ చేయాలి. గతితార్కిక సిద్ధాంతాన్ని (థీసిస్, యాంటీ-థీసిస్, సింథసిస్) అనుసరిస్తేనే స్పష్టత వస్తుంది. ఒక సిద్ధాంతం వినగానే దాన్ని పూర్వపక్షం చేసే వాదనల గురించి వెతికి, రెండిటినీ సమన్వయం చేసుకున్న రోజునే యదార్థం గోచరించే అవకాశం వుంది. కొంతకాలానికి కొత్త సమాచారం బయటకు వస్తే యీ సింథసిస్, థీసిస్‌గా మారవచ్చు కూడా. అప్పుడు మళ్లీ యాంటీ-థీసిస్ కోసం వెతకాలి. 3) సెంట్రల్ బ్యాంక్ తర్నేజా వ్యవహారం వగైరా ఎమర్జన్సీ అత్యాచారాల గురించి రాసినప్పుడు రాస్తాను. అప్పుడు ఎవరిదో తప్పో, ఎవరిది ఒప్పో పాఠకులే తేల్చుకుంటారు.
4) సంఘీయులంటే ఆరెస్సెస్, జనసంఘ్ వారే, దానికి నిందార్థం ఏమీ లేదు. సంఘ్ పరివార్ అని ఇంగ్లీషు, హిందీ మీడియా వారంటారు. తెలుగులో సంఘీయులు పదం బాగుంటుంది. వారు సంజయ్‌ను అభిమానించడానికి తుర్క్‌మాన్ గేట్ ఒక్కటే కాదు, మరో రెండు కారణాలు రాశాను చూడండి. ఎమర్జన్సీ నడిచే సమయంలో దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ రహస్య కరపత్రాలు పంచిన సంస్థల్లో ఆరెస్సెస్ ఒకటి. అవి చదివేవాణ్ని. వాటిలో ఇందిరను ఎంత తీవ్రంగా నిందించారో, సంజయ్‌ను ఏ మాత్రం నిందించారో నాకు గుర్తుంది. నెహ్రూ తర్వాత సోషలిజం సమాధి అయిపోయిందనుకుని అనుకున్న సంఘీయులు కమ్యూనిస్టులు ఇందిరకు మద్దతుగా నిలిచి, పాతకాంగ్రెసు వాదులతో జరిగిన పోరాటంలో ఆమె గెలిచేట్లా చేసి ఆమె ద్వారా సోషలిస్టు విధానాలను అమలు చేయించడంతో నిరాశ చెందారు. ఎమర్జన్సీ టైములో సంజయ్ భావిభారత నాయకుడిగా ఎదిగి 'కమ్యూనిస్టులు దేశద్రోహులు, 1942లో బ్రిటిషువారి తొత్తులుగా వ్యవహరించారు' అని ప్రకటించినపుడు అతను తమ భాష మాట్లాడుతున్నాడని వారు ఆనందించడంలో ఆశ్చర్యమేముంది? 5) ఈ సీరీస్‌ను విస్తారంగా రాస్తున్నానని ముందునుంచీ చెపుతున్నాను. రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోతే దీన్ని చదవలేరు. ఎమర్జన్సీ ఎత్తేయగానే ఎమర్జన్సీ అత్యాచారాలు అంటూ అనేక పుస్తకశకలాలు వెలువడ్డాయి, ఎంతమందిని జైల్లో పెట్టారు, ఎన్ని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయి, ఆ ఆపరేషన్లు తప్పించుకోవడానికి ఎంతమంది మగాళ్లు రాత్రుళ్లు పొలాల్లో పడుక్కునేవారు, జైల్లో పోలీసులు ఎంతమందిని చంపారు.. యిలాటి వివరాలతో! కార్టూనిస్టు ఆబూ అబ్రహామ్ వాటిని 'ఫయర్‌సైడ్ స్టోరీస్' అంటూ ఎద్దేవా చేశాడు కూడా. మళ్లీ అలాటి పుస్తకం వెలువరించే వుద్దేశం నాకు లేదు. అప్పటి రాజకీయ పరిస్థితులను, పార్టీల బలాబలాలను అర్థం చేసుకునేట్లా విపులంగా రాస్తున్నాను. 50 ఏళ్ల లోపు పాఠకులలో ఎంతమందికి కృపలానీ, మీనూ మసానీ, పీలూ మోదీ, నిజలింగప్ప పేర్లు తెలుసో నాకు డౌటే. స్వతంత్ర పార్టీ, ఎస్‌ఎస్‌పి పార్టీల పేర్లు విన్నారో లేదో కూడా! అన్నీ సేకరించి ఓర్పుగా రాస్తున్నాను. ఓపిక వుంటేనే చదవండి. 6) వ్యంగ్యం అర్థం చేసుకోలేని వారికి సమాధానం – చిరునవ్వే
సోషలిస్టు పార్టీ కథ కొనసాగిద్దాం. 1953 జూన్‌లో బేతల్‌లో జరిగిన పార్టీ సమావేశంలో అశోకా మెహతా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు – మనది అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఆర్థిక స్వావలంబనే ప్రప్రథమ లక్ష్యం కాబట్టి దాన్ని సాధించడానికి ప్రతిపక్షం అధికారపక్షంతో నిర్మాణాత్మకంగా సహకరిస్తూ, అవసరమైన చోట విమర్శిస్తూ వుంటే చాలు అని. నెహ్రూ అంటే అస్సలు పడని లోహియా దాన్ని ప్రతిఘటించాడు. అత్యధికులు అతన్నే సమర్థించారు. చట్టానికి, రాజ్యాంగానికి వ్యతిరేకమైనా సరే హింసాత్మక ఆందోళనలు చేసి ప్రజల దృష్టిని ఆకర్షించాలి అనే లోహియా నమ్మకం. అతని అనుచరులు ప్రభుత్వాన్ని, చట్టాన్నే కాదు, పార్టీ క్రమశిక్షణను కూడా పట్టించుకోలేదు. లోహియా దూకుడు పార్టీ నాయత్వానికి రుచించలేదు. చివరకు అతనూ, అనుచరులు 1955 చివర్లో పార్టీ విడిచి వెళ్లిపోయి సోషలిస్టు పార్టీ పెట్టారు. ఆచార్య నరేంద్ర దేవ్ 1956లో పోయారు. జయప్రకాశ్ నారాయణ్ ఆచార్య వినోబా భావే శిష్యుడై పోయి భూదాన ఉద్యమానికి అంకితమై పోయాడు. 1957 తర్వాత రాజకీయాల్లోంచి పూర్తిగా విరమించుకున్నాడు. భారతదేశానికి పార్టీ రహిత ప్రజాస్వామ్యమే తగినదని వాదించాడు. 1955 జనవరిలో తమిళనాడులోని ఆవడిలో జరిగిన పార్టీ జాతీయ సమావేశంలో కాంగ్రెసు సోషలిజమే తన బాట అని ప్రకటించి, రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ వంటి సోషలిస్టు పార్టీ ముఖ్య నినాదాలను కొల్లగొట్టింది. (ఇందిరా గాంధీ తన రాజకీయ అవసరాలకై అమలు చేసేవరకూ ఈ తీర్మానాన్ని కాంగ్రెసు నాయకులు ఎవరూ పట్టించుకోలేదు) 1960లో కృపలానీ పార్టీ వదిలిపెట్టి స్వతంత్రంగా వ్యవహరించసాగాడు. 1963లో అశోకా మెహతా ప్రభుత్వపు ప్లానింగ్ కమిషన్‌కు డిప్యూటీ చైర్మన్ కావడానికి సమ్మతించడంతో పార్టీ అతన్ని బహిష్కరించింది. ఇక అతను 1964లో కాంగ్రెసు పార్టీలో మళ్లీ చేరిపోయాడు. వెళుతూ వెళుతూ పార్టీలో మూడో వంతును తనతో తీసుకుని పోయాడు. ఇక రాష్ట్రాలలో కేరళలో పట్టం థాను పిళ్లయ్, బెంగాల్‌లో పిసి ఘోష్, బిహార్‌లో మహామాయా ప్రసాద్ సిన్హా, ఉత్తర ప్రదేశ్‌లో త్రిలోకి సింగ్ కాంగ్రెసులో చేరిపోయారు. 1971 నాటికి పార్టీలో సగం కంటె ఎక్కువమంది క్యాడర్ కాంగ్రెసులో తేలారు. ఇలాటి వాటి వలన పిఎస్‌పి ఓటింగు శాతం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 1957లో దానికి 10.4% ఓట్లు, లోకసభలో 19 సీట్లు రాగా 1962లో అది 6.8%-12, 1967లో 3.1%-13, 1971లో 1% ఓట్లు 2 సీట్లు వచ్చాయి.
విడిగా వెళ్లిన లోహియా గారి సోషలిస్టు పార్టీ ఆందోళనల ద్వారా, అసెంబ్లీలో వాకౌట్ల ద్వారా, అల్లరి చేయడం ద్వారా తన ఉనికిని చాటుకుంది. ఇంగ్లీషు భాషను వెంటనే రద్దు చేసి దాని స్థానంలో హిందీని పెట్టాలని, ఉద్యోగాలలో 60% వెనకబడిన కులాలకు, షెడ్యూల్డ్ కులాలకు, మహిళలకు, షెడ్యూల్ తెగలకు కేటాయించాలని ఉద్యమం లేవదీసింది. ఇంత చేసినా దానికి 1957లో 8 పార్లమెంటు సీట్లు దక్కాయి. 1962లో అది 6 అయింది. పోనుపోను మేధావులంటే పడని పార్టీగా, అల్లరి మూకల పార్టీగా పేరు తెచ్చుకుంది. సోషలిస్టు సిద్ధాంతాలు వల్లిస్తూనే అవంటే పడని స్వతంత్ర పార్టీ, జనసంఘ్ పార్టీలతో కాంగ్రెసు పట్ల గుడ్డి వ్యతిరేకతతో 1967లో జట్టు కట్టింది. దానివలన 1967లో 23 సీట్లు తెచ్చుకున్నా పార్టీలో చీలికలు వచ్చాయి. కొందరు నాయకులు పార్టీ మారిపోయారు. ఉదాహరణకు పివిజి రాజు. తెలుగునాట సోషలిస్టు పార్టీ అనగానే గుర్తు వచ్చే పేరు ఆయనదే. విజయనగరం రాజవంశీకులు. అశోక, ఆనంద గజపతి రాజుల తండ్రి. విశాల భావాలు కలిగిన వ్యక్తి. నష్టపరిహారం లేకుండా ఎస్టేట్లు రద్దు చేయాలని కోరిన ఉదారుడు. విజయనగరం నుండి 1952 నుండి 1967 వరకు నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1971లో లోకసభకు ఎన్నికయ్యారు. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలలో మంచి పలుకుబడి వున్న ఆయన పిఎస్‌పిలో వుండేవారు. పిఎస్‌పి నుండి లోహియా బయటకు వచ్చి సోషలిస్టు పార్టీ పెట్టినపుడు యీయనా ఆయన వెంట నిలిచారు. అయితే కొన్నాళ్లకు ఆ పార్టీ కేంద్ర నాయకత్వంతో వివాదపడితే వాళ్లు రాష్ట్ర శాఖను రద్దు చేశారు. అప్పుడు పివిజి వర్గీయులు పార్టీలోంచి విడిగా వచ్చి కాంగ్రెసుకు వ్యతిరేకంగా చెన్నారెడ్డి, గౌతు లచ్చన్న తదితరులు ఏర్పరచిన సోషల్ డెమోక్రాటిక్ పార్టీలో చేరారు. 1959 డిసెంబరులో జాతీయ స్థాయిలో కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా స్వతంత్ర పార్టీ ఏర్పడడంతో ఎన్‌జి రంగా కాంగ్రెసు విడిచిపెట్టి స్వతంత్ర పార్టీకి అధ్యక్షుడయ్యారు. సోషలిస్టు డెమోక్రాటిక్ పార్టీలో రంగా అనుచరులు ఎక్కువమంది వున్నారు. వారంతా రిజైన్ చేసి స్వతంత్ర పార్టీలో చేరారు. సోషలిస్టులు, పివిజి రాజు, చెన్నారెడ్డి కాంగ్రెసులోకి చేరుకున్నారు. అప్పణ్నుంచి పివిజి కాంగ్రెసు కాబినెట్లలో మంత్రి అయ్యారు. ఇలా సోషలిస్టు భావాలు కలిగిన అనేకమంది ఆ తరం రాజకీయనాయకులు కాంగ్రెసులోనే చేరిపోయారు.
మన రాష్ట్రంలో పిఎస్‌పి సంగతి కాస్త చెప్పుకుందాం. కాంగ్రెసుపై అలిగి, టంగుటూరి ప్రకాశం గారు ఏర్పరచిన కెఎంపిపి 1952 ఎన్నికలలో మద్రాసు శాసనసభలో 78 స్థానాలకు పోటీ చేసి 20 గెలుచుకోగలిగింది. ప్రతిపక్షాలన్నీ ఫ్రంట్‌గా ఏర్పడి మెజారిటీ పక్షంగా క్లెయిమ్ చేసినా, గవర్నరు, పార్టీలను విడివిడిగా లెక్కేసి, ఆ విధంగా పెద్ద పార్టీగా కాంగ్రెసుకు పరిగణించి, మెజారిటీ లేకపోయినా దాని నాయకుడు రాజాజీని ముఖ్యమంత్రిగా ఆహ్వానించారు. ప్రకాశం ముఖ్యమంత్రి కాలేకపోయారు. తర్వాతి రోజుల్లో కెఎంపిపి పిఎస్‌పిగా మారడం చేత ప్రకాశం పిఎస్‌పి లీడరు అయ్యారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. ఏ పార్టీకి బలం లేదు. 'మీ సొంత పార్టీని విడిచి మా పార్టీలో చేరితే, కనీసం అనుబంధ సభ్యుడైతే ముఖ్యమంత్రి చేస్తాం' అని కాంగ్రెసు ఆశ చూపింది. పదవీలాలసతో ప్రకాశం సరే నన్నారు. తనది మైనారిటీ ప్రభుత్వం కాబట్టి పిఎస్‌పి తన ప్రభుత్వంలో చేరి భాగస్వామ్యం తీసుకోవాలని ప్రకాశం కోరగా పిఎస్‌పి అధినాయకత్వం ఒప్పుకోలేదు. అప్పుడు పిఎస్‌పి ఆంధ్ర శాఖ పార్టీలోంచి చీలిపోయి సోషలిస్టు పదం వదిలేసి, ''ప్రజా పార్టీ'' అనే ప్రాంతీయ పార్టీగా ఏర్పడింది. వీరిలో ప్రముఖులు – తెన్నేటి విశ్వనాథం, డా|| ఎబి నాగేశ్వరరావు, క్రొవ్విడి లింగరాజు. ఈ ప్రజా పార్టీ ప్రకాశంకు మద్దతు ప్రకటించింది. తెన్నేటి ఆర్థికమంత్రి అయ్యారు. 13 నెలల తర్వాత కమ్యూనిస్టులు అవిశ్వాస తీర్మానం తెచ్చి ప్రకాశం మంత్రివర్గాన్ని పడగొట్టారు. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన, 1955లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. వాటిలో కాంగ్రెసు, ప్రజాపార్టీ, ఎన్‌జి రంగా గారి కృషికార్ లోక్ పార్టీ కలిసి యునైటెడ్ ఫ్రంట్‌గా ఏర్పడి పోటీ చేశాయి. అతివిశ్వాసంతో ఎన్నికలకు వెళ్లిన కమ్యూనిస్టులు ఓడిపోయారు. కాంగ్రెసు తరఫున బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రి అయి, ఐదు సీట్లు గెలుచుకున్న ప్రజా పార్టీకి ప్రతినిథిగా డా|| ఎబి నాగేశ్వరరావుగారికి మంత్రి పదవి యిచ్చారు. క్రమేణా కృషికార్ లోక్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమై పోయినా ప్రజా పార్టీ స్వతంత్రంగానే వుంది. 1957లో తెలంగాణ ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలలో 2 స్థానాలు గెలుచుకుంది. 1956 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డి ప్రజా పార్టీ సభ్యులకు పదవులు యివ్వలేదు. దాంతో వాళ్లు కాంగ్రెసుకు దూరమయ్యారు. 1962లో ఆ పార్టీ తరఫున తెన్నేటి ఒకరే నెగ్గారు. 1967లోనూ ఆయన ఒక్కరే. 1971లో లోకసభకు పోటీ చేసి ఓడిపోయారు. 1977లో లోకసభకు ఎన్నికయ్యారు. ప్రజా పార్టీకి ఆర్థిక వనరులు కూడా వుండేవి కావు. దాని ప్రభావం విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలకే పరిమితం అయింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్‌లో సోషలిస్టు పార్టీ అవశేషాలు కూడా మిగల్లేదు.
ఇలాటి సంఘటనల కారణంగా పిఎస్‌పి ప్రాబల్యం క్షీణిస్తూ వచ్చింది. 1967లో లోహియా మరణం తర్వాత సోషలిస్టు పార్టీ మరీ నీరసించి 1971లో 3 ఎంపీ సీట్లు గెలుచుకుంది. చివరకు ఈ క్ష్షీణదశలో ఈ రెండు పార్టీలు కలిసి సంయుక్త సోషలిస్టు పార్టీ (ఎస్‌ఎస్‌పి)గా ఏర్పడింది. దీనిలో జార్జి ఫెర్నాండెజ్, మధు లిమయే, మధు దండవతే, రాజ్ నారాయణ్ వంటి ప్రముఖ నాయకులు వుండేవారు. ఎమర్జన్సీకు ముందు ప్రతిపక్ష కూటమిలో భాగమై, ఎమర్జన్సీ తర్వాత జనతా పార్టీలో విలీనమైన ప్రతిపక్షాలలో ఎస్‌ఎస్‌పి ఒకటి. (సశేషం)
(ఆగస్టు 2015) (ఫోటో – టంగుటూరి ప్రకాశం)
– ఎమ్బీయస్ ప్రసాద్