అలహాబాద్ బదులు అహ్మదాబాద్ కోర్టు అని రాసినందుకు క్షంతవ్యుణ్ని. ఎత్తిచూపిన వారికి ధన్యవాదాలు. మొత్తం మూడు పేరాల్లో ముగించే ఉద్దేశం నాకు లేదు. నా దగ్గరున్న పాత సమాచారమంతా దుమ్ము దులుపుతున్నాను. గతంలో కొందామనుకుని మానేసి, చదివి వూరుకున్న జనార్దన్ ఠాకూరు పుస్తకాల కోసం నెట్లో వెతికి అవి అలభ్యమని తెలిసి బాధపడుతున్నాను. ''ఇంప్రింట్'' మ్యాగజైన్లో వేసిన సంక్షిప్త వెర్షన్ వుంది కదాని వూరడిల్లాను. వినేవాళ్ల ఓపిక మీదే చెప్పేవాడి ఉత్సాహం వుంటుంది. చెప్పేటప్పుడు ప్రస్తుత తరానికి అర్థమయ్యే పోలికలు చెప్పడం, లింకులు పెట్టి వివరించడం టీచరు లక్షణం. ఇవన్నీ బోరు అనుకున్నవాళ్లు సాగదీస్తున్నానని, త్వరగా ముగించమని సతాయించేవాళ్ల బరువు దించుకోవడానికే ఆ మూడు పేరాలు. ఇక యిప్పుడు కథనంలోకి దిగుదాం.
1975 జూన్ 12. ఉదయం 10 గం||లు. ప్రధాని ఇందిరా గాంధీ యింట్లో రెండు టెలిప్రింటర్లు టకటకా పనిచేస్తున్నాయి. పిటిఐ (ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా), యుఎన్ఐ (యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా) అనే న్యూస్ ఏజన్సీల నుంచి వస్తున్న వార్తలను అవి చేరవేస్తున్నాయి. ఇందిర ప్రయివేటు సెక్రటరీల్లో సీనియర్మోస్ట్ అయిన ఎన్కెఐ శేషన్ వాటి కేసి ఆదుర్దాగా చూస్తున్నాడు. ఆ రోజు అలహాబాదు కోర్టు ఇందిర ఎన్నిక పిటిషన్‌పై తీర్పు చెప్పే రోజు. న్యాయమూర్తి జగ్ మోహన్‌లాల్ సిన్హా ఏం తీర్పు చెపుతాడో అని కాస్త టెన్షన్‌గా వుంది.
అసలు ఆ కేసు వేసినపుడు అది చాలా చిన్న కేసనే ఇందిర అనుయాయులు భావించారు. ఇందిరకు వ్యతిరేకంగా ఎవరైనా నిలబడగలరా అని అందరి ఆశ్చర్యం. బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత జరిగిన 1971 ఎన్నికలలో ఆమె కాంగ్రెస్ (ఆర్ – రిక్విజిషన్ – ప్రజలు తమను అడిగి సేవ చేయించుకోవచ్చనే అర్థంలో పెట్టారేమో యీ పేరు) పార్టీ పేర 43% ఓట్లు , 524 సీట్లలో 352 సీట్లు తెచ్చుకుని ఘనవిజయం సాధించింది. ఆమెకు వ్యతిరేకంగా గ్రాండ్ ఎలయన్స్ పేర జట్టు కట్టిన పార్టీలు 23% ఓట్లు తెచ్చుకుని పరాజయం పాలయ్యాయి. ఆ ఎలయన్సులో భాగస్వాములుగా వున్న పార్టీలు నాలుగూ చతికిల పడ్డాయి. పలు దశాబ్దాలుగా పార్టీ దిగ్గజాలుగా వెలిగి, సిండికేటుగా పేరుపడి, ఆమెతో విభేదించి, ఆమెను కాంగ్రెసు నుంచి బహిష్కరించిన కాంగ్రెసు (ఓ-ఆర్గనైజేషన్) 239 సీట్లలో పోటీ చేసి 16 గెలుచుకోగలిగింది. ఉత్తరాది రాష్ట్రాలలో బలంగా వుందనుకునే జనసంఘ్ (బిజెపి పూర్వరూపం) 154 సీట్లలో పోటీ చేసి 22 గెలుచుకుంది. దాని ముఖ్యనాయకుడు వాజపేయి ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేసే ధైర్యం చేయలేక, రాజభరణాల రద్దు విషయంపై ఇందిరపై కత్తి కట్టిన మాజీ సంస్థానాధీశుల్లో ఒకడైన గ్వాలియర్ మహారాజా యిచ్చిన మద్దతుతో మధ్యప్రదేశ్ నుంచి గెలిచాడు. పూర్తి రైటిస్టు భావాలతో వెలిసిన స్వతంత్ర పార్టీ 58 సీట్లు పోటీ చేసి 8 గెలిచింది. సోషలిస్టు పార్టీలు చీలి, మళ్లీ కలిసి, మళ్లీ చీలి తయారైన ఎస్ఎస్పి (సంయుక్త సోషలిస్టు పార్టీ) 93 సీట్లు పోటీ చేసి 3 గెలిచింది. కాంగ్రెసుకు పక్కలో బల్లెంలా వున్న చరణ్ సింగ్ నేతృత్వంలోని బికెడి (భారతీయ క్రాంతి దళ్) 1 గెలిచింది. ఇందిరతో చేతులు కలిపిన సిపిఐ (అప్పట్లో సిపిఐ-ఆర్ (రైట్) అనేవారు) 23 సీట్లు, డిఎంకె 22 సీట్లు గెలిచాయి. ఇందిరతో పొత్తు కుదుర్చుకోలేకపోయిన అకాలీ దళ్ 13 స్థానాల్లో పోటీ చేసి ఒక్కటే గెలుచుకుంది. ఇందిరను వ్యతిరేకించిన సిపిఎం (అప్పట్లో సిపిఐ – ఎల్ (లెఫ్ట్) అనేవారు) బెంగాల్, కేరళలలో 25 సీట్లు గెలుచుకుంది. ప్రత్యేక తెలంగాణ నినాదంపై పోటీ చేసిన తెలంగాణ ప్రజా సమితి 10 స్థానాలు గెలుచుకుంది.
నెహ్రూ కాలంలో బలంగా వున్న కాంగ్రెసు, లాల్ బహదూర్ శాస్త్రి కాలంలో బలహీనపడింది. ఆయన అకాల మరణంతో ఏ మాత్రం పాలనానుభవం లేని ఇందిరను కీలుబొమ్మగా పెట్టి కాంగ్రెసు సిండికేటు నాయకులు పాలించినప్పుడు మరింత బలహీనపడింది. ఆ కారణంగా 1967 ఎన్నికలలో ఉత్తరాదిన ప్రతిపక్ష పార్టీలు సంయుక్త విధాయక దళ్ పేరుతో పొత్తులు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పరచాయి. అంతఃకలహాల వలన ఎక్కువకాలం అవి నడవకపోయినా ఆ పార్టీల కంటూ కొంత బలం వుంది. కాంగ్రెసుకు వచ్చేసరికి ఇందిర చేతిలో అధికారం వుంది కానీ ఆర్గనైజేషన్ మొత్తం సిండికేటు చేతిలో వుంది. ఇలాటి పరిస్థితుల్లో 1971 ఎన్నికలలో ఇందిర చీలిక పార్టీ అంతటి ఘనవిజయం సాధిస్తుందని ఎవరూ అనుకోలేదు. దిమ్మ తిరిగిపోయిన ప్రతిపక్షాలు ఏదో మోసం జరిగిందని ఆరోపించసాగాయి. అప్పట్లో జనసంఘ్‌కు అధ్యక్షుడుగా వున్న బలరాజ్ మధోక్ ఇందిర ప్రభుత్వోద్యోగుల చేత రష్యా నుంచి దిగుమతి చేసుకున్న మాయ యింకు వాడించిందని, ఎవరికి ఓటేసినా, అది మర్నాటి కల్లా మాసిపోయి, ఇందిర గుర్తయిన ఆవు-దూడ (కాంగ్రెసుకు ఎన్నికల గుర్తుగా కాడి జోడెద్దులు వుండేది. ఇందిరను బహిష్కరించారు కాబట్టి వేరే గుర్తు కేటాయించారు) పైకి తేలుతుందని వాదిస్తూ ఏకంగా ఒక పుస్తకమే రాశారు. అవేమీ నిరూపణ కాలేదనుకోండి. చిత్రం ఏమిటంటే 1971 ఎన్నికలలో చావుదెబ్బ తిన్న యీ ప్రతిపక్ష నాయకుల కూటమి 1977 వచ్చేసరికి ఇందిర పార్టీని అనేక రాష్ట్రాలలో తుడిచిపెట్టేసింది. దీనికి కారణం – ఎమర్జన్సీ! ఇంకో చిత్రం ఏమిటంటే అంతటి విజయాన్ని చేకూర్చిన ఎన్నికే ఇందిరకు కష్టాలు తెచ్చిపెట్టింది.
1971 పార్లమెంటు ఎన్నికలో రాయబరేలీ నియోజకవర్గం నుండి గెలిచిన ఇందిరకు 183309 ఓట్లు వచ్చాయి, ఆమె ప్రత్యర్థిగా నిలబడిన సోషలిస్టు పార్టీ నాయకుడు ఎస్ఎస్పి పార్టీ తరఫున నిలబడిన రాజ్ నారాయణ్‌కు 71499 ఓట్లు వచ్చాయి. అంటే లక్షకు పైగా మెజారిటీ అన్నమాట. ఓడిపోయిన రాజ్ నారాయణ్ ఎన్నికలలో అక్రమాలు జరిగాయంటూ కోర్టుకి వెళ్లాడు. అవును, జరిగాయి అంది అలహాబాదు హైకోర్టు. ఇందిరను ఆరేళ్ల పాటు రాజకీయాల్లోంచి తప్పుకోమంది. దాని పర్యవసానమే ఎమర్జన్సీ! ఎమర్జన్సీని సడలించి నిర్వహించిన 1977 ఎన్నికలలో బిఎల్డి (జనతా పార్టీ ఏర్పడింది కానీ సాంకేతిక కారణాల వలన అలా అనవలసి వచ్చింది) రాజ్ నారాయణ్ ఇందిరను 55 వేల పై చిలుకు ఓట్లతో ఓడించాడు. అతనికి 177719 రాగా, ఇందిరకు 122517 వచ్చాయి. ఇది ఇందిర చవిచూసిన ఏకైక ఓటమి. రాజ్ నారాయణ్‌ను జయింట్ కిల్లర్ అన్నారు. వికీపీడియాలో అతని గురించి చదివితే 'ఇందిరను ఓడించాడు కాబట్టి ఆమె స్థానంలో అతన్నే ప్రధాని చేయాలి' అని జయప్రకాశ్ నారాయణ్ అన్నారు అని రాశారు. ఆ రైటప్ అంతా రాజ్ నారాయణ్ వీరాభిమాని ఎవరో రాశారు. అతన్ని ప్రధాని అభ్యర్థిగా ఆనాడు ఎవరూ అనుకోలేదు. మొరార్జీ, చరణ్ సింగ్, జగ్జీవన్‌ల మధ్యే అదృష్టచక్రం తిరిగింది. రాజ్ నారాయణ్‌కు ఆరోగ్యమంత్రిత్వ శాఖ దక్కింది. తర్వాతి రోజుల్లో అతను కాంగ్రెసు సహాయంతో జనతాలో చీలిక తెచ్చి, మొరార్జీని పడగొట్టి, చరణ్ సింగ్‌ను ప్రధానిని చేయబోయి, చివరకు ఆపద్ధర్మ ప్రధానిగా మిగిల్చాడు. చరణ్ సింగ్‌కు హనుమంతుడు లాటివాణ్ని అన్నాడు. చివరకు రామాంజనేయ యుద్ధం జరిగి 1984 ఎన్నికలలో అదే చరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిలబడి ఓడిపోయాడు. ఎమర్జన్సీ చరిత్ర రాజ్ నారాయణ్‌తో ప్రారంభమైంది కాబట్టి అతని సంగతి పూర్తిగా తెలుసుకోవాలి. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2015)