ముందుగా తన సొంత రాష్ట్రం యుపిపై దృష్టి పెట్టింది. దాని ముఖ్యమంత్రి సిబి గుప్తాని కూల్చడానికి లఖ్‌నవ్‌కు అనేకసార్లు వెళ్లి, అతని సత్కారాలు పొంది చివరకు రెండు నెలల్లో పడగొట్టింది. తన వర్గానికి కావలసినంత బలం లేకపోవడం వలన మద్దతిచ్చి చరణ్ సింగ్‌ను ముఖ్యమంత్రిని చేసింది. అతని పార్టీ భారతీయ క్రాంతి దళ్‌ను కాంగ్రెసులో విలీనం చేయమని అడిగితే అతను ఒప్పుకోలేదు. దాంతో మద్దతు ఉపసంహరించి అతన్నీ కూల్చేసింది. గవర్నరుగా వున్న బెజవాడ గోపాలరెడ్డి ఇందిర ఆదేశాల మేరకు ఏ పార్టీని పిలవకుండానే 'ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా లేదు' అని ప్రకటించి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశాడు. తన పార్టీకి ఆమె జగ్జీవన్‌రామ్‌ను అధ్యక్షుడిగా చేసింది. అతను గుజరాత్ వెళ్లి హితేంద్ర దేశాయి ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే మా మద్దతు వుంటుంది అని ప్రతిపక్షంలో వున్న రైటిస్టు స్వతంత్ర పార్టీకి హామీ యిచ్చి వచ్చాడు. కానీ స్వతంత్ర పార్టీ స్వతంత్రించలేదు. ఇక పాత కాంగ్రెసు నుండి ఫిరాయింపులను ప్రోత్సహించసాగారు. చాలామంది యిటు ఫిరాయించి, మళ్లీ అటు వెళ్లిపోయి, మళ్లీ యిటు వచ్చారు. ఇలాటి కప్పల తక్కెడతో ప్రభుత్వం ఏర్పరిస్తే మర్యాదగా వుండదని తోచి, ఇందిర రాష్ట్రపతి పాలన విధించేసింది. మైసూరు రాష్ట్రంలో కూడా యిలాటి కథే జరిగింది. ఒడిశాలో స్వతంత్ర-జనసంఘ్ సంకీర్ణ ప్రభుత్వం నుండి 8 మంది విడిపోయి ప్రగతి దళ్ పేర కొత్త పార్టీ పెట్టారు. అప్పుడు పాత కాంగ్రెసు ప్రభుత్వానికి తన మద్దతు ప్రకటించింది. ఇందిర ''తమిళనాడుకు యీ సారి వరద సహాయనిధి పేరుతో రూ. 17 కోట్లు యిస్తున్నాను. మీరూ నన్ను సమర్థిస్తే మీకూ సాయం చేస్తాను.'' అని ఆఫర్ యిచ్చింది. పాత కాంగ్రెసు చేసిన ఉపకారాన్ని మరవని ఒడిశా ప్రభుత్వం అక్కరలేదంది.
ఈ పరిణామాలన్నిటిపై ''సండే స్టాండర్డ్''లో వ్యాసం రాస్తూ ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు నయనతారా సెహగల్ ''ప్రభుత్వం గూండాలా (గ్యాంగ్‌స్టర్) ప్రవర్తిస్తోంది. రాజకీయాల్లో విలువలెరుగని శకం ప్రారంభమైంది. నాయకుడు లేదా నాయకురాలు అంటే అర్థమే మార్చేశారు. ఇతరులను బానిసగా చూసేవాడే నాయకుడనుకుంటున్నారు..'' అని దుయ్యబట్టింది. ఈవిడే యీ మధ్య సాహిత్య ఎకాడమీ ఎవార్డు తిరిగి యిచ్చింది. ఇవ్వగానే కొందరు యీమె ఇందిరకు బంధువు కాబట్టే దండగ్గా ఎవార్డు యిచ్చారని, సోనియాకు మేలు చేయడానికే ఆమె యిప్పుడు తిరిగి యిచ్చిందని వాదనలు మొదలుపెట్టారు. బహుశా వాళ్లకు తెలియని విషయమేమిటంటే ఇందిరకు తన మేనత్త విజయలక్ష్మీ పండిట్ అన్నా, ఆమె కూతురు నయనతార అన్నా చిన్నప్పటినుంచీ పడదు. నయనతార తన అభిప్రాయం వెలిబుచ్చిన కొన్ని రోజులకే విజయలక్ష్మి కూడా మేనకోడల్ని విమర్శించింది. ఇందిరకు ఒళ్లు మండింది. ఆ ఏడాది చివర్లో అలహాబాద్‌లోని తమ పూర్వీకుల యిల్లయిన ఆనంద్ భవన్‌ను జాతికి అంకితమిచ్చేసింది. నెహ్రూ తన విల్లులో ఆ యింటిని నెహ్రూ కుటుంబానికై అలాగే వుంచాలని, ఆ యింటికి వచ్చేపోయే హక్కు తన చెల్లెళ్లకు శాశ్వతంగా వుండాలని రాశాడు. వాళ్లకు ఆ హక్కు లేకుండా చేద్దామని ఇందిర యింటినే త్యాగం చేసేసింది. ప్రభుత్వానికి అప్పగించేముందు రోజు ఒక రాత్రి ఆ యింట్లో గడుపుతామని మేనత్తలు ఇందిరను కోరినా కుదరదని చెప్పేసింది.
హరియాణాలో బన్సీలాల్ పై ప్రతిపక్షాలు అవిశ్వాసతీర్మానం పెట్టాయి. అది చర్చకు వచ్చేముందే బన్సీలాల్ సభను వాయిదా వేయించేశాడు. గవర్నరు అసెంబ్లీని ప్రొరోగ్ చేశాడు. జమ్మూ, కశ్మీర్‌లో కూడా మెజారిటీ కోల్పోయిన ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నరు అసెంబ్లీని ప్రొరోగ్ చేశాడు. ఇలా గవర్నరు వ్యవస్థను ఇందిరా గాంధీ చిత్తం వచ్చినట్లు వాడుకుంది. 356 ఆర్టికల్‌ను దుర్వినియోగం చేసింది. బెంగాల్‌లో బంగ్లా కాంగ్రెస్-సిపిఎం సంకీర్ణ ప్రభుత్వం అంతర్గత కలహాలతో తనంతట తనే పడిపోయింది. అలాటి చోట్ల యిక చెప్పనే అక్కరలేదు. ఈ చర్యలను తప్పుపట్టిన వారందరినీ రియాక్షనరీ (విప్లవవిరోధులు)లని, పేదలకు శత్రువులని, మార్పు సహించనివారని ముద్ర వేసేది. తనను విమర్శించే పత్రికలను, జర్నలిస్టులకు యిలాటి లేబుల్స్ అతికించేది. బ్యాంకుల జాతీయకరణను సుప్రీం కోర్టు కొట్టి వేస్తే, యింకో ఆర్డినెన్సు జారీ చేయవలసి వచ్చింది. రాజభరణాల రద్దు లోనూ అదే జరిగింది. న్యాయమూర్తులకు ప్రజాహితం పట్టకపోవడం చేతనే యిలాటి తీర్పులు యిస్తున్నారని ఇందిర మండిపడింది. 'కమిటెడ్ జ్యుడిషియరీ' అనే కొత్త మాట పుట్టింది. చట్టాలతో, న్యాయాలతో సంబంధం లేకుండా ప్రజలకు మేలు కలుగుతుందనుకుంటే ప్రభుత్వం చేపట్టే ఎలాటి చర్యనైనా సమర్థించి తీరాలనే కొత్త వాదన బయలుదేరింది. సంప్రదాయపద్ధతిలో చట్టం, రాజ్యాంగం అని సూత్రాలు వల్లించే న్యాయమూర్తులను దోషులుగా చిత్రీకరించి యింటికి పంపనారంభించారు.
ఇన్ని చేస్తున్నా ఇందిర ప్రభుత్వం దినదినగండంగానే నడుస్తోంది. ఎందుకంటే ఆమెకు పార్లమెంటులో మెజారిటీ లేదు. ఇతరుల మద్దతుపై ఆధారపడి వుంది. వాళ్లు గొంతెమ్మ కోర్కెలు తీర్చడం అవస్థగా వుంది. అందువలన ఏడాది ముందుగా 1971లో మధ్యంతర ఎన్నికలకు వెళదామని ఇందిర నిశ్చయించుకుంది. ఆలస్యం చేసిన కొద్దీ పరిస్థితి మరింత దిగజారవచ్చు. ఇప్పటికే ద్రవ్యోల్బణం 12% వుంది. ఎగుమతులు తగ్గాయి. 1970-71 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే మిగులు బజెట్‌లో వుండగా తక్కినవన్నీ లోటు బజెట్‌లో వున్నాయి. నక్సలైట్లు పలు రాష్ట్రాలకు విస్తరిస్తున్నారు. రాజకీయంగా ఏ పార్టీ బలంగా వుందో తెలియక అనేక రాష్ట్రాలలో నాయకులు అటూ, యిటూ గెంతుతున్నారు. బిహార్‌లో ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి ప్రతిపక్షాలు సంయుక్త విధాయకదళ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఒడిశాలో ఆర్ ఎన్ సింగ్‌దేవ్ ప్రభుత్వం పడిపోయి, రాష్ట్రపతి పాలన, తర్వాత ఎన్నికలు జరిగాయి. యుపిలో వరసపెట్టి ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి. దేశం మొత్తం మీద నాయకురాలు తనే, తన పార్టీకే బలం వుంది అని నాయకులందరూ గ్రహించాలంటే వెంటనే ఎన్నికలు జరగాలి.
ఇందిర పార్టీ చీల్చడంలో చాలా ముందుచూపు ప్రదర్శించింది. చాలాకాలంగా కాంగ్రెసు అధికారంలో వుండడం చేత ప్రజలు దానిపై విసుగు చెందారు. వ్యతిరేకత పెంచుకుని, కొత్త ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు. పార్టీని రెండుగా చీల్చి, సిండికేటు కాంగ్రెసును అవలక్షణాల పాతకాంగ్రెసుగా, తన కాంగ్రెసును మార్పు తెచ్చే కొత్త ప్రత్యామ్నాయంగా ప్రజలకు చూపించింది. (ఎన్నికలయ్యాక తనదే అసలు కాంగ్రెసు అని ప్రకటించుకుని పాత కాంగ్రెసులో కొద్దిమంది నాయకులు తప్ప తక్కినవారందరినీ తన పార్టీలో చేర్చేసుకుంది. అందువలన అవే పాత మొహాలు కొత్త పార్టీ పేరుతో పదవులు చేపట్టారు) 1970 చివరికి ఆర్థిక గణాంకాలు ఎలా వున్నా ఏదో మంచి జరుగుతోందని, ముందుకు సాగుతున్నామని భావించే ఆశావహవాతావరణం ప్రజల్లో వుంది. 1969లో అమల్లోకి వచ్చిన ఎంఆర్‌టిపి (మోనోపలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ప్రాక్టీస్) చట్టాల వంటి వలన బడా పారిశ్రామికవేత్తలకు ముకుతాడు వేసి, జాతీయ బ్యాంకుల ద్వారా తమకు ఋణాలిప్పించి తోడ్పడుతోందని చిన్న పారిశ్రామికవేత్తలు సంతోషంగా వున్నారు. ఇందిర పరిమితంగానే అయినా విదేశీ పెట్టుబడులను అనుమతిస్తోంది. పెద్ద పారిశ్రామికవేత్తలకు అనుకూలంగానే వుంది. గ్రీన్ రివల్యూషన్ మంచి ఫలితాలనే యిస్తోంది. నక్సలైటు సమస్యను ఎదుర్కోవడానికి భూమి పంపిణీలు మొదలుపెట్టారు. నగరాల్లో వున్న పేదలకోసం రూపొందించిన కొత్త పథకాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఈ వాతావరణాన్ని ఇందిర సరిగ్గానే పసిగట్టింది. ఎన్నికలు అని అనుకోగానే నాయకుల చేత నిధుల సేకరణ మొదలు పెట్టించింది. పార్టీకి ఫండ్స్ యిచ్చినవారికి పరిశ్రమలకు లైసెన్సులు విచ్చలవిడిగా యిచ్చారు, ముడిసరుకులకు కోటాలు కేటాయించారు, పన్ను ఎగవేతలను జరిమానాలతో సరిపెట్టారు. 1970 డిసెంబరు 27 న లోకసభ రద్దు చేసి, 1971 ఫిబ్రవరిలో ఎన్నికలు పెడతామని ప్రకటించింది. (సశేషం) ఫోటో – నయనతారా సెహగల్
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2015)