గొర్లోయిస్ కోటను ముట్టడించి వున్న సైన్యం తమ మధ్య రాజు కనబడకపోవడంతో తెగించి కోటపైకి దాడి చేశారు. గొర్లోయిస్ కూడా తన బలమెంతో చూసుకోకుండానే దూకుడుగా యుద్ధంలో పాల్గొన్నాడు. యుద్ధంలో మరణించాడు. సైన్యం కోటలోని ఐశ్వర్యాన్నంతా దోచుకుంది. గొర్లోయిస్ మరణవార్తను అతని భార్యకు అందించడానికి పరుగునపరుగున డిమిలియో కోటకు వచ్చిన వార్తాహరులు అక్కడ గొర్లోయిస్ వేషంలో వున్న ఊథర్‌ను చూసి తెల్లబోయారు. అప్పుడు ఊథర్ తెలివిగా 'నేను యిక్కడకు వచ్చిన సంగతి ఎవరికీ తెలియదు కాబట్టి యుద్ధంలో నేను మరణించి వుంటానని పొరబడి వుంటారు. నేను ఊథర్ రాజు వద్దకు వెళ్లి శాంతిచర్చలు జరుపుతాను' అంటూ కోటలోంచి భద్రంగా బయటపడ్డాడు. తన సేన వద్దకు వెళ్లి జరిగినది తెలుసుకున్నాడు. గొర్లోయిస్ ఎలాగూ చచ్చిపోయాడు కాబట్టి అతని భార్యను చేపట్టాడు. ఆమె ద్వారా ఆ రాత్రి సంగమం ద్వారా కలిగిన ఆర్థర్ అనే పిల్లవాడు పుట్టాడు. అతన్ని తన సంరక్షణకు అప్పగించమని మెర్లిన్ పట్టుబట్టాడు. తనకు మారువేషం వేసి తన కోరిక తీర్చిన మెర్లిన్ మాటను ఊథర్ కాదనలేకపోయాడు. తల్లి ఒప్పుకోలేదు కానీ అదంతా పిల్లవాడి మంచి కోసమే అని మెర్లిన్ నచ్చచెప్పాడు.
ఆర్థర్‌ను తీసుకెళ్లి రాజభక్తి కలిగిన సర్ ఎక్టార్ కోటలో పెంచాడు. అయితే అతనెవరో ఎక్టార్‌తో సహా ఎవరికీ చెప్పలేదు. ఎవరో ఉంపుడుగత్తె వలన ఎక్టార్‌కు పుట్టిన కొడుకు అనుకునేవారు. ఆ విషయమై ఆర్థర్‌ను ఎక్టార్ కొడుకు సర్ కే, అతని స్నేహితులు కూడా అతన్ని ఆటపట్టించేవాడు. ఇలా అవమానాలతో ఆర్థర్ బాల్యం గడిచింది. అనేక రాజ్యాలను జయించిన ఊథర్‌ను ఎలా ఓడించాలో తెలియక శాగ్జన్లు అతను తాగే ఊటబావి నీరులో విషం కలిపారు. అది తాగి అతను మరణించాడు. వెంటనే సామంతరాజులు సింహాసనం కోసం పోటీ పడ్డారు. సింహాసనం ఎక్కడానికి ఎవరు సమర్థులో తేల్చడానికి నేను పరీక్ష పెడతాను అంటూ మెర్లిన్ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌లో చర్చి ప్రాంగణంలో తన మాయతో ఒక బండరాయిని సృష్టించాడు. దానిలో ఒక కత్తి గుచ్చబడి వుంది. కత్తి అంచుపై 'ఈ రాయి నుంచి కత్తిని ఎవరైతే బయటకు లాగుతారో వారే ఇంగ్లండుకి రాజవుతారు' అని రాసి వుంది. సామంతరాజులందరూ దాన్ని బయటకు లాగడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దాంతో ఎవరూ సింహాసనం ఎక్కలేదు. ఎక్కుదామని ఎవరైనా అనుకున్నా యితరులు ఒప్పుకోలేదు. ఫలితంగా ఇంగ్లండు అరాచకం పాలయ్యింది.
ఈలోగా ఆర్థర్ పెరిగి పెద్దవాడయ్యాడు. అప్పుడు మెర్లిన్ ప్రత్యక్షమయ్యాడు. తనెవరో చెప్పుకుని, అతనెవరో తెలిపి, ఆర్థర్ గురించి ఎక్టార్‌కు కూడా చెప్పాడు. ఆ తర్వాత అతనికి విద్యాబుద్ధులు గరపి, అన్ని రకాల ఆయుధాలలో శిక్షణ యిచ్చాడు. పశుబలం కంటె యుక్తి శక్తివంతమైనదని, రాజు న్యాయబద్ధంగా, ప్రజల పట్ల వాత్సల్యంతో పరిపాలించాలని బోధించాడు. అతనిలో ఆత్మవిశ్వాసం నింపాడు. అతనికి 15 సం||ల వయసు వచ్చాక మెర్లిన్ అతన్ని బండరాయి వద్దకు తీసుకుని వచ్చి జనసందోహం ముందు కత్తిని తీయమన్నాడు. మొదట సర్ కే ప్రయత్నించి విఫలమయ్యాక, ఆర్థర్ సునాయాసంగా కత్తిని తీయగలిగాడు. ఇక అందరూ అతన్ని కామెలాట్ రాజ్యానికి రాజుగా అంగీకరించారు. మెర్లిన్ బోధనలతో ఆర్థర్ గొప్ప వీరుడిగా, శూరుడిగా ఎదిగాడు. శాగ్జన్ల చేత దాసోహమనిపించాడు. శాంతి, సౌభాగ్యం వెలసిల్లడంతో ప్రజలందరూ సంతోషించారు.
ఆర్థర్‌కు వివాహం కాలేదు. ఒక రాత్రి ఒక అందమైన అమ్మాయి అతని కోటలోకి ప్రవేశించి ఆశ్రయం కోరింది. ఆశ్రయం యిచ్చాక ఆర్థర్‌తో శయనించ గోరింది. ఆమె అందానికి అబ్బురపడిన ఆర్థర్ ఆమె కోరిక తీర్చాడు. తెల్లవారుఝామునే ఆమె లేచి ఎక్కడికో వెళ్లిపోయింది. ఆమె ఎవరో, ఎందుకు వచ్చిందో, ఎందుకిలా చేసిందో ఆర్థర్‌కు ఏమీ తెలియలేదు. కొన్నాళ్లకు ఓ చోట తీవ్రయుద్ధం చేశాక ఆర్థర్‌కు అలసట వచ్చింది. రాజధానికి తిరిగి వెళ్లే ఓపిక లేక దారిలో వున్న కోటలో విశ్రమిద్దామన్నాడు. మెర్లిన్ వద్దన్నా వినలేదు. రాత్రి నిద్రలో వుండగా ఒక సంగీత వాయిద్యం వినవచ్చింది. ఆ శబ్దాన్ని అనుసరించి వెళ్లి చూస్తే సౌందర్యరాశి ఒకామె తన పడకగదిలో కూర్చుని వాయించుకుంటోంది. పేరేమిటంటే గ్యునెవెరె అంది. ఆమెను చూడగానే ఆర్థర్ మోహించాడు. పెళ్లాడదామనుకున్నాడు. వచ్చి మెర్లిన్‌కు చెపితే 'వద్దు, ఆమె వలన నీకు యిబ్బందులు కలుగుతాయి' అని వారించాడు. ఆర్థర్ వినలేదు. మర్నాడు ఆమె తండ్రిని అనుమతి కోరడం, అతను సరేననడం జరిగాయి.
ఆ రోజు మధ్యాహ్నం మెర్లిన్ ఆర్థర్‌ను ఒక సరస్సు వద్దకు తీసుకెళ్లాడు. అంతా పొగమంచు కమ్మేసి వుంది. అవతలివైపు ఎవెలాన్ అనే దీవి వుందని, ఆ ద్వీపవాసులకు అతీంద్రియ శక్తులున్నాయని వాటితో వారు కావాలనుకుంటే మంచి, లేదా చెడు చేయగలరని చెప్పాడు. ఇలా మాట్లాడుతూండగానే కొలనులోంచి ఒక స్త్రీ చేతిలో వజ్రాలు పొదిగిన కత్తితో పైకి వచ్చింది. ''ఆమె కొలనుకు అధిపతైన నిమ్యూ. ఆ కత్తిపేరు ఎక్సాలిబర్. ఇనుమునైనా ఖండించగల శక్తి గలది. కత్తి కంటె ఒర ముఖ్యం. ఆ ఒర నడుముకు వున్న వ్యక్తి గాయాలతో మరణించడు. ఆ కత్తి తీసుకో.'' అని మెర్లిన్ చెప్పాడు. ఆర్థర్ కత్తి తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అతని పెళ్లి జరిగింది. వివాహసమయంలో ఆర్థర్ మావగారు అతనికి ఒక గుండ్రటి బల్ల బహుమతిగా యిచ్చాడు. ఆర్థర్ సహచరులైన పన్నెండుగురు ధర్మవీరులు (నైట్స్) తరతమ భేదం లేకుండా సమానస్థాయిలో కూర్చోనేట్లు రూపొందించిన బల్ల అది. ప్రతీ కుర్చీ పైన అక్కడ కూర్చోవలసిన ధర్మవీరుని పేరు రాసి వుంది. కానీ ఒక్కదానికి మాత్రం ఏ పేరూ లేదు. అందరికంటె గొప్పవాడైన ధర్మవీరుడు అక్కడ కూర్చోవాలి. వేరే ఎవరైనా కూర్చుంటే వెంటనే మరణిస్తారు.
చాలా సంవత్సరాలు గడిచాయి. మెర్లిన్ సహాయంతో ఆర్థర్ నానాటికి బలపడుతున్నాడు. అలాటి పరిస్థితుల్లో విధివశాన మెర్లిన్ సరస్సులోంచి వచ్చిన నిమ్యూతో ప్రేమలో పడ్డాడు. ఆమె గొప్ప అందగత్తె కావడమే కాకుండా మాయమంత్రాలు నేర్చినది. ఆమె కటాక్షంకోసం అతను తపించసాగాడు. నిమ్యూకి అతనంటె పెద్దగా ప్రేమ లేదు, కానీ తిరస్కరిస్తే అతను ఏదైనా మాజిక్ చేసి తనను నాశనం చేస్తాడేమోనని భయపడింది. అందువలన ముందు అతని శిష్యురాలిగా చేరి మంత్రాలన్నీ నేర్చుకుంది. ఒకరోజు అడవిలో వెళుతూండగా యింకా కొన్ని మంత్రాలు నేర్పమని కోరింది. అది తనకు విపత్కరమని తెలిసినా ప్రేమలో పడిన మెర్లిన్ విచక్షణ మరచి ఆమెకు అన్నీ నేర్పేశాడు. కొద్ది సేపటికి ఒక గుహ కనబడింది. 'ఇది చాలా శక్తివంతమైనది. లోపలికి వెళ్లి ఉపాసన చేస్తే మంత్రాలకు మరింత మహిమ కలుగుతుంది' అన్నాడు మెర్లిన్. 'అయితే నువ్వు ముందు పద, తర్వాత నేను వస్తాను' అంది నిమ్యూ. అతను గుహలోకి వెళ్లగానే బండరాయి మూసేసి, మెర్లిన్ తనకు నేర్పిన మహామంత్రాన్ని పఠించింది. అంతే మెర్లిన్ గుహలో బందీ అయిపోయాడు.
మెర్లిన్ అంతర్థానం కావడంతో ఆర్థర్‌కు సలహాదారు లేకుండా పోయాడు. ఆ స్థానాన్ని నిమ్యూ ఆక్రమించింది. కానీ ఆమెకు మెర్లిన్ కున్నంత తెలివితేటలు లేవు. అందుకే ఆర్థర్ తన మేనల్లుడు మోర్‌డ్రెడ్‌ను తన ఆస్థానంలోకి తీసుకున్నప్పుడు ఆమె అడ్డు చెప్పలేదు. మోర్‌డ్రెడ్ తల్లి మోర్గోస్ ఆర్థర్‌కు తల్లి ద్వారా సవతి సోదరి అవుతుంది. ఆమె, ఆమె అక్క మోర్గాన్ యిద్దరూ ఈగ్రైన్ కు, గోర్లొయిన్‌కు పుట్టినవారు. వాళ్లిద్దరి భర్తలు సామంతరాజులు. వాళ్ల తండ్రిని చంపిన ఊథర్‌పై వారికి ద్వేషముంది. ముఖ్యంగా మోర్గాన్‌కు. ఆమె మంత్రతంత్రాలు నేర్చినది. తన చెల్లెలు మోర్గోస్‌కు గవాయిన్ అనే కొడుకు పుట్టాక నచ్చచెప్పి ఒక రాత్రి అజ్ఞాతంగా ఆర్థర్ వద్దకు పంపి అతనికి తెలియకుండా తప్పు చేయించింది. ఆ నాటి కలయిక వలన మోర్‌డ్రెడ్ పుట్టాడు. ఆ రహస్యాన్ని అక్కచెల్లెళ్లు దాచారు. కొంతకాలానికి అతన్ని ఆర్థర్ వద్దకు పంపి ఆశ్రయం కోరారు. మేనల్లుడు కదాని అతను తన అంగరక్షకుడిగా చేర్చుకున్నాడు. కానీ అతను తన కొడుకే అనీ, అనుకోని అక్రమసంబంధం వలన పుట్టాడని ఆర్థర్‌కు తెలియదు.
ఆర్థర్ జీవితంలో మరో యోధుడు ప్రవేశించాడు. అతను లాన్సెలాట్. నిమ్యూ ఓ రోజు ఆర్థర్ వద్దకు తీసుకుని ఓ యువకుణ్ని తీసుకుని వచ్చి ''అతన్ని నీ రక్షణలో తీసుకుని, ధర్మవీరుడిగా శిక్షణ యియ్యి. అతను ఎప్పుడు కోరితే అప్పుడు ధర్మవీరుడిగా ఆమోదించు.'' అని కోరింది. ఆర్థర్ సరేనన్నాడు. అయితే ఆ యువకుడు ఆ రోజు సాయంత్రమే 'నాకు ధర్మవీరత్వం (నైట్‌హుడ్) ప్రసాదించు' అని అడిగాడు. ఆర్థర్ ఆశ్చర్యపడినా సరేనన్నాడు. మర్నాడు ధర్మవీరుడి పదవి రాగానే లాన్సెలాట్ 'నన్ను రాణికి అంగరక్షకుడిగా నియమించు' అని కోరాడు. రాణి గ్యునెవారా ఆమోదించింది. లాన్సెలాట్ అత్యంత ప్రతిభావంతుడైన ధర్మవీరుడిగా పేరు తెచ్చుకున్నాడు. అతని ఖడ్గనైపుణ్యంతో పోటీపడగలిగేవారు ఆ రాజ్యంలో ఎవరూ వుండేవారు కారు. ఆర్థర్‌కు, అతని రాణికి మంచి స్నేహితుడుగా మసలుతూ వుండేవాడు. (సశేషం) (చిత్రం – ఆర్థర్, గ్యునెవెరె వివాహం, ఆశీర్వదిస్తున్న మెర్లిన్ – చిత్రకారుడు జాన్ ఫ్రెడరిక్ బేకన్)
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2015)