ఫ్రెంచ్ విప్లవం 1789లో జరిగింది. (7,8,9 వరస అంకెలు కాబట్టి తారీకు గుర్తు పెట్టుకోవడం యీజీ) పదేళ్లపాటు నడిచింది. పాలకుల అత్యాచారాలకు వ్యతిరేకంగా తిరగబడిన పాటకజనులు లేవదీసిన విప్లవం అతిపోకడలు పోయింది. చివరకు నెపోలియన్ నియంతృత్వానికి దారి తీసింది. ఆ విప్లవానికి గుర్తులైన వర్సాయి రాజప్రాసాదాలు, బాస్టిల్ దుర్గం, రాజకుటుంబీకుల, జమీందార్ల తలలు పుచ్చకాయల్లా నరికిపారేసిన గిల్లెటిన్ పెట్టిన స్థలం (ఇప్పుడు దాని స్థానంలో ఫౌంటెన్ పెట్టి, ఆ స్థలాన్ని ప్లేస్ ద లా కన్‌కార్డ్ అంటున్నారు) యిప్పటికి కూడా వున్నాయి కాబట్టి యీ చరిత్ర తెలుసుకోవడం వేస్టవదు.
అప్పట్లో అనేక యూరోపియన్ దేశాలలో ఫ్రాన్స్‌లో కన్న ఎక్కువ దుర్భర పరిస్థితులున్నాయి. కానీ వాటిలో విప్లవాలు రాలేదు. ఫ్రెంచ్ ప్రజల్లో వచ్చిన రాజకీయ చైతన్యం ఒక ముఖ్యకారణమైతే, వాళ్లని తిరగబడేట్లా చేసిన రాచరికపు పాలన ముఖ్యాతిముఖ్య కారణం. ఈనాడు పారిస్‌లో రాజభవనాలు చూడగానే మన మనసులో మెదిలే మొదటి ఆలోచన – 'రాజులిలా బతికితే విప్లవాలు రాకేం చేస్తాయి' అని. నేను హంపీ మొదటిసారి వెళ్లినపుడు కృష్ణదేవరాయల రాణులు నివసించిన భవనాలు చూసి ఇంతేనా అని తెల్లబోయాను. రాజుగారి మేడ తవ్వకాల్లో యింకా బయటపడలేదు. పడినా అది జూబిలీహిల్స్‌లో కనబడే సాధారణ బిల్డింగంత కూడా వుండదని గ్యారంటీ. రాజస్థాన్‌లో రాజభవనాలు చాలానే చూశాను, ఇండియా వంటి పెద్దదేశాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులు నివసించిన రాజప్రాసాదాలూ చూశాను. రవి అస్తమించని సామ్రాజ్యం నడిపిన ఇంగ్లండు రాజుల హర్మ్యాలూ చూశాను. కానీ అవేవీ ఫ్రెంచ్ చక్రవర్తుల వైభోగం ముందు ఎందుకూ పనికి రావు. అదంతా ప్రజల నుంచి దోచుకున్నదే కదా, ఆ దోపిడీకి కడుపుమండినవాడు తిరగబడడంలో ఆశ్చర్యం ఏముంది?
జమీందార్లు ఏం చేసినా చెల్లిపోయే పరిస్థితి ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే అప్పటి ఫ్రాన్సు సమాజం ఎలా వుండేదో తెలుసుకోవాలి. సమాజంలో ఆనాడు ఎస్టేట్లనే పేరుతో మూడు వర్గాలు వుండేవి – ఫస్ట్ ఎస్టేట్‌లో 1,30,000 మంది కేథలిక్ మతాధికారులుండేవారు. దేశంలో సాగుయోగ్యమైన భూమిలో 20% వీళ్ల చేతిలో వుండేది. దాని మీద పన్ను లేదు. పైగా దేవుడికి సేవ చేస్తున్నదానికి ప్రతిఫలంగా ప్రతీ రైతు నుండి పంటలో 10% పన్ను తీసుకునేవారు. వీళ్లు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. తమకుండే సదుపాయాలు తగ్గించడానికి ఎన్నడూ ఒప్పుకునేవారు కారు. ఇక సెకండ్ ఎస్టేట్‌లో 1,50,000 మంది భూస్వామ్య ప్రభువులుండేవారు. దేశంలో చాలా భూమి వీళ్ల చేతిలో వుండేది. నామమాత్రంగా పన్ను చెల్లించేవారు. 8 వేల మంది ధనిక భూస్వాములు ప్రభుత్వంలో కీలకపాత్ర వహించేవారు. దాంతో యీ రెండు వర్గాల భారాన్ని మోయవలసిన భారం థర్డ్ ఎస్టేట్‌లో వున్న మధ్యతరగతికి చెందిన వర్తకులు, లాయర్లు, డాక్టర్లు, మేధావులు, చేతిపనివారు, రైతులు, పట్టణప్రాంతాల కూలీలపై పడేది. వాళ్లు భూమిశిస్తే కాక, 5% ఆదాయపు పన్ను, ఉప్పు పన్ను చెల్లించాలి. ఉప్పు ఉత్పత్తి, వ్యాపారం మీద ప్రభుత్వానికి గుత్తాధిపత్యం వుండేది. ఉత్పత్తికయ్యే ఖర్చుకు పది రెట్లు ఎక్కువగా ధరను పెట్టి, దేశంలో 7 సం||లు దాటిన ప్రతీ వ్యక్తి సంవత్సరానికి కనీసం ఏడు పౌండ్ల ఉప్పు కొనాలని శాసనం చేశారు. గ్రామాల్లో రహదారులు వేసే బాధ్యత కూడా ప్రభుత్వానికి లేదు. ప్రజలే శ్రమదానంతో వేసుకోవాలి. ఇక వర్తకులపై చాలా పన్నులుండేవి. ఈ ఎస్టేట్సు, పన్నుల విధానం ఏర్పరచినపుడు ఒక రూలు పెట్టారు. మూడు ఎస్టేట్ల ప్రతినిథులతో కూడిన 'ఎస్టేట్స్ జనరల్' ఆమోదం లేకుండా ఏ కొత్త పన్నూ వేయకూడదని. అయితే ఫ్రెంచ్ చక్రవర్తులు దాదాపు 175 సం||రాల పాటు దీన్ని సమావేశపరచకుండా పరోక్ష పన్నులు వేస్తూ కాలక్షేపం చేశారు.
రాజులు, చక్రవర్తులు నిరంకుశాధికారాలు చలాయించిన దేశాలు అనేకం వున్నాయి. ఇంగ్లండు పాలించిన ట్యూడరు వంశీయులు, ప్రష్యాను పాలించిన హోహెన్ జలరన్‌లు, రష్యాను పాలించిన రోమనోవ్‌లు అతి నిరంకుశులైనా వారు తమ అధికారాలను తమ రాజ్యాల ప్రయోజనాల కోసం ఉపయోగించారు. కానీ ఇంగ్లండు పాలించిన స్టువార్ట్ వంశీయులు, ఫ్రాన్సు పాలించిన బూర్బన్లు తమ అధికారాలను దేశప్రయోజనాలకు వ్యతిరేకంగా వుపయోగించి ప్రజాకంటకులయ్యారు. బూర్బన్ల విషయానికొస్తే ఆ వంశ పాలన స్థాపించిన నాల్గవ హెన్రీ ప్రధానమంత్రి సలహాకు విలువ యిచ్చేవాడు. అతని తర్వాత పాలనకు వచ్చిన 13వ లూయీ తన యిద్దరు ప్రధానుల చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. తదుపరి అధికారంలోకి వచ్చిన 14వ లూయీ (1643-1715) అతి నిరంకుశుడు. తన కీర్తి ప్రతిష్ఠలకోసం అనేక యుద్ధాలు చేసి, తన రెండో రాజధాని అయిన వర్సాయిలో అనేక అద్భుతహర్మ్యాలు, విశాలమైన తోటలు కట్టి కళాఖండాలతో నింపివేశాడు. ఫస్ట్, సెకండ్ ఎస్టేట్ల ప్రయోజనాలు కాపాడాడు కానీ రాజ్యప్రయోజనాలు, ప్రజా సంక్షేమం పట్టించుకోలేదు. దీనితో దేశం సంక్షోభంలో పడింది. ఆ విషయం చనిపోయేముందు గ్రహించిన లూయీ తన వారసుడైన 15వ లూయీతో 'నాలా యుద్ధాలపై, భవనాలపై ఖర్చు చేయకు, పొరుగువారితో శాంతియుతంగా మెలగుతూ ప్రజల బాధలు తీర్చు' అని హితవు చెప్పాడు. కానీ 15 వ లూయీ (1715-1774) కూడా అదే బాటలో నడిచాడు. అతను 1740-48 మధ్య, 1756-63 మధ్య చేసిన యుద్ధాలు, వర్సాయిలో కట్టించిన కొత్త భవనాల కారణంగా ఖజానా ఖాళీ అయింది. పన్నుల భారం పెరిగింది. ఇండియాలో, అమెరికాలో వున్న వలసలు కోల్పోయి, ఆదాయం తగ్గింది. విదేశీ వ్యాపారం తగ్గింది. ఆ తర్వాత వచ్చిన 16వ లూయీ (1774-1789) ది కూడా అదే మార్గం. బ్రిటిషువారిపై పగతో అమెరికా స్వాతంత్య్ర పోరాటానికి (1775-1783) అన్నివిధాలా సాయం చేశాడు. ఇవన్నీ చాలనట్లు దేశంలో కరువుకాటకాలు వచ్చాయి. ప్రజలు రాజరికమన్నా, జమీందార్లన్నా మండిపడుతున్నారు. (సశేషం)
ఫోటో – బాస్టిల్ దుర్గం, విప్లవకాలంలో గిల్లెటిన్ పెట్టిన చోటు, వర్సాయ్ రాజభవనం
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2015)