ఎమ్బీయస్‌: యూరోప్‌ గాథలు- 6

ఇలాటి పరిస్థితుల్లో తనంతట తనే కొత్త పన్నులు విధిస్తే గొడవ వస్తుందని భయపడిన చక్రవర్తి ఎస్టేట్స్‌ జనరల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ల చేత ఆమోదముద్ర వేయించుకుందామనుకున్నాడు. 1789 మేలో మూడు ఎస్టేట్స్‌ను విడివిడిగా…

ఇలాటి పరిస్థితుల్లో తనంతట తనే కొత్త పన్నులు విధిస్తే గొడవ వస్తుందని భయపడిన చక్రవర్తి ఎస్టేట్స్‌ జనరల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ల చేత ఆమోదముద్ర వేయించుకుందామనుకున్నాడు. 1789 మేలో మూడు ఎస్టేట్స్‌ను విడివిడిగా సమావేశపరుస్తామని, ఒక్కో దానికి ఒక్క ఓటు వుంటుందని చెప్పాడు.  భారం మోయవలసిన థర్డ్‌ ఎస్టేటు వాళ్లు ఎలాగూ వ్యతిరేకిస్తారు కానీ పై రెండు ఎస్టేట్స్‌ దోచుకునే వర్గాలే కాబట్టి, పన్నులు కట్టనక్కరలేదని సరేనంటాయి కాబట్టి 2-1 మెజారిటీతో తన ప్రతిపాదన నెగ్గుతుందని లెక్క వేశాడు. కానీ  థర్డ్‌ ఎస్టేటు వాళ్లు దీనికి ఒప్పుకోలేదు. అన్ని ఎస్టేట్ల ప్రతినిథులు ఒకేచోట సమావేశం కావాలని, ప్రతి సభ్యుడికి ఒక ఓటు వుండాలని వాళ్లు పట్టుబట్టారు. సంఖ్యాపరంగా అన్ని ఎస్టేట్లలో సభ్యులు సమానంగా వున్నా పై రెండు ఎస్టేట్లలో ఉదారంగా వుండే కొందరు సభ్యులు పన్నులకు వ్యతిరేకంగా వున్నారు. కానీ తమతమ ఎస్టేటులో వాళ్లు మైనారిటీలో వున్నారు. అందుకని థర్డ్‌ ఎస్టేటు వాళ్లు యీ ప్రతిపాదన తెచ్చారు. చక్రవర్తి దీనికి ఒప్పుకోలేదు. అప్పుడు  థర్డ్‌ ఎస్టేటు తన సభ్యులతోనే జూన్‌ 17న సమావేశమై తనను 'జాతీయ సభ' (నేషనల్‌ ఎసెంబ్లీ)గా ప్రకటించుకుంది. దాంతో చక్రవర్తి దాన్ని గుర్తించడానికి నిరాకరించాడు. వాళ్లు తన మాట వినాల్సిందే అన్నాడు. సమావేశ స్థలాన్ని ఖాళీ చేయాలని అధికారులను పంపాడు. థర్డ్‌ ఎస్టేటు నాయకుడు మిరాబూ 'మేం వెళ్లం, రాజ్యపాలన ఎలా చేయాలో రాజ్యాంగం రాస్తున్నాం, అది పూర్తయ్యేవరకు వుంటాం, యీ లోగా మమ్మల్ని పంపించాలంటే తుపాకులు రప్పించాల్సిందే' అన్నాడు. 'వాళ్ల మీద చర్య తీసుకోండి' అని ఫస్ట్‌, సెకండ్‌ ఎస్టేటు సభ్యులు, బంధువులు చక్రవర్తిపై ఒత్తిడి తెచ్చారు. కానీ అతనికి ధైర్యం చాలలేదు. ఇది గమనించిన ఫస్ట్‌, సెకంట్‌ ఎస్టేటు సభ్యుల్లో కొంతమంది థర్డ్‌  ఎస్టేటు సమావేశాల్లో పాల్గొన్నారు. 

ఇది విన్నాక చక్రవర్తి గత్యంతరం లేక మూడు ఎస్టేట్లు కలిసి సమావేశం కావడానికి, ప్రతి సభ్యుడికి ఓటు హక్కు యివ్వడానికి ఒప్పుకున్నాడు. పైకి అలా చెప్తూనే దాన్ని భగ్నం చేయడానికి ఏర్పాట్లు చేశాడు. తన ఆస్థానప్రముఖుల ద్వారా కుట్రలు చేయించాడు.  థర్డ్‌ ఎస్టేటుకు అనుకూలంగా వున్న మంత్రులను తొలగించాడు. ఇతర ప్రాంతాల నుండి సైన్యం తెప్పించాడు. సైన్యం సందర్భంగా జులై 13న చక్రవర్తి బంధువులు, అనుచరులు పెద్ద విందు చేసుకున్నారు. ఈ వార్త విన్న పారిస్‌ సామాన్య ప్రజలు మర్నాడు తిరగబడ్డారు. పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిపి పారిస్‌లోని బాస్టిల్‌ దుర్గంపై దాడి చేసి దాన్ని స్వాధీనపరచుకుని, దానిలో వున్న ఖైదీలను విడుదల చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనం చేసుకుని వాటిపై విప్లవ జండాలను ఎగరవేశారు. విప్లవనాయకుణ్ని ఒకణ్ని నగర మేయర్‌గా ప్రకటించారు. వేలాది మంది యువకులతో నేషనల్‌ గార్డ్‌ అనే సైన్యాన్ని ఏర్పాటు చేసి దానికి అమెరికా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని తిరిగి వచ్చిన లఫయత్‌ను నాయకుడిగా నియమించారు. లఫయత్‌ విగ్రహాలు అమెరికాలో వున్నాయి. పారిస్‌లో ఆర్క్‌ ద ట్రయంఫ్‌ (విజయతోరణం) నుండి 1.2 కి.మీల దూరంలో ప్లేస్‌ ద ఎస్టేట్స్‌ (యునైటెడ్‌ స్టేట్స్‌ స్క్వేర్‌) లో థామస్‌ జఫర్సన్‌ స్క్వేర్‌లో లఫయత్‌ది, జార్జి వాషింగ్టన్‌ది కలిసి వున్న విగ్రహం వుంది. 

జవాబులు – 1.నా పాస్‌పోర్టు గురించి అబద్ధాలు చెప్తున్నానని ఒక పాఠకుడికి సందేహం పుట్టి, నా విశ్వసనీయతను, పనిలో పనిగా వెబ్‌సైట్‌ విశ్వసనీయతను ప్రశ్నించారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం గురించి రాస్తూ ప్రభుత్వం సవ్యంగా పనిచేస్తే తప్ప అవినీతి పోదని వాదిస్తూ ఉదాహరణ యిచ్చాను. నేను పాస్‌పోర్టు గురించి అప్లయి చేసినా ఏడాదిన్నరగా చలనం లేదు, నాకేమీ తొందర లేదు కాబట్టి వూరుకున్నాను అదే ఉద్యోగానికో, చదువుకో విదేశాలు వెళదామనుకున్న వ్యక్తి అయితే లంచం యిచ్చయినా పని చేయించుకుందామని చూస్తాడు అని రాశా. తానా వాళ్ల పిలుపు వచ్చాక నా పాత పాస్‌పోర్టు అప్లికేషన్‌ గురించి కదిలించి చూస్తే అది మురిగిపోయిందన్నారు. చచ్చినట్లు మళ్లీ అప్లయి చేసి తెచ్చుకున్నాను. అందువలన అప్పుడు రాసినదీ నిజమే, యిప్పుడు రాసినదీ నిజమే. అలా కుదరదు, ఎప్పుడూ ఒకే మాట చెప్పాలీ అంటే ఓ జోక్‌ గుర్తొస్తోంది – 'కోర్టులో సాక్షిని జడ్జిగారు ప్రశ్నించారట – 'అమ్మాయ్‌, నువ్వు ఐదేళ్ల కితం ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చినపుడు నీ వయసు పాతిక అని చెప్పావ్‌, యిప్పుడూ అదే చెప్తున్నావ్‌. అదెలా?' అని. ఆ అమ్మాయి జవాబిచ్చిందట – 'నేను అప్పుడో మాట, యిప్పుడో మాట చెప్పేదాన్ని కాదండీ' అని. 2. అంపశయ్య నవీన్‌, లోకేశ్వర్‌ కూడా మంచి ట్రావెలాగ్‌లు రాశారు. కానీ మల్లాది రచనల్లో అతి చిన్న వివరాలు కూడా వుంటాయి. అందుకే వాటిని ఎన్నదగినవి అన్నాను. 3. థింకర్‌ విగ్రహానికి, చంద్రగుప్తుడికి లింకు పెట్టినవారికి ఓ దణ్ణం. 4. సినీమూలంలో రాసిన ''వేట'' సినిమాకు మూలమైన 'కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌క్రిస్టో' నవల రచయిత అలెగ్జాండర్‌ డ్యూమా, యీ సీరీస్‌లో ప్రస్తావించిన డ్యూమా ఒకరే.  ఆ కథ ఫ్రాన్సుకు దక్షిణతీరంలో వున్న ప్రధాననగరం మార్సెల్స్‌లో జరుగుతుంది. కథానాయకుడు ఖైదుపాలయిన 'షాటో ఇఫ్‌' (ఇఫ్‌ కోట) దానికి పక్కనే వున్న దీవిలో యిప్పటికీ వుంది. 

5. ఆహ్లాదకరంగా ఎవరు రాసినా ముళ్లపూడి శైలి అనడం పరిపాటి. అలా అనిపించుకోవడం గర్వకారణం కూడా. కానీ ముళ్లపూడి శైలి బాగా తెలిసిన నేను, నా శైలి బాగా తెలిసిన ముళ్లపూడిగారు యిద్దరూ అంగీకరించిన విషయం – మావి వేర్వేరు శైలులు అని! 6. పారిస్‌ను పారీ అని ఫ్రెంచివారు వాళ్లలో వాళ్లు అనుకుంటారు కానీ మనలాటి విదేశీ టూరిస్టులతో మాట్లాడినప్పుడు పారిస్‌ అనే ప్రస్తావిస్తున్నారు. అందుకని అలాగే రాస్తున్నాను. 7. వరల్డ్‌స్పేస్‌లో ప్రిన్స్‌ అండ్‌ పాపర్‌ వంటి కథలు ఆడియోలో గంటసేపు చెప్పేవాణ్ని. పాటలతో కలిసి మూడు గంటల కార్యక్రమం అది. అక్షరాల్లోకి పెడితే పెద్దదిగానే అనిపిస్తుంది. ఆ నవలలో ప్రస్తావించిన 8వ హెన్రీ, ట్యూడరు వంశ రాజుల గురించి లండన్‌ గురించి రాసినపుడు రాస్తాను. 8. దీనితో బాటు టూర్లు ప్లాన్లు చేసి పెట్టమని కొందరు అడుగుతున్నారు. అది నా వల్ల కాదు. టూరు ఆపరేటర్లు ఆఫర్‌ చేసే ప్యాకేజీల్లో మనకు నచ్చినది ఎంచుకుని వెళ్లడమే మేలు. వాళ్లు చాలా ముందుగానే బల్క్‌ బుకింగ్‌ చేస్తారు కాబట్టి విమానపు టిక్కెట్లలో, హోటల్‌ టారిఫ్‌లో వాళ్లకు డిస్కౌంట్‌ వస్తుంది. దాన్ని టూరిస్టులకు పాస్‌ఆన్‌ చేస్తారు కాబట్టి చాలా చవకలో తేలిపోతుంది. అదే మనం విడిగా వెళితే పేలిపోతుంది. నేను గత ఏడాది యూరోప్‌ ట్రిప్‌ బషీర్‌బాగ్‌లోని విశిష్టా ట్రావెల్స్‌ ద్వారా వెళ్లాను. స్టేటుబ్యాంకులో  అసిస్టెంటు జనరల్‌ మేనేజర్‌గా చేసి రిటైరైనాయన నడుపుతున్నారు కాబట్టి నాతో బాటు వచ్చినవాళ్లందరూ బ్యాంకు వాళ్లే. చాలా బాగా కండక్ట్‌ చేశారు.  హైదరాబాదు నుంచి దోహా మీదుగా రోమ్‌ చేరితే అక్కడ కంపెనీ ఎండీయే రిసీవ్‌ చేసుకుని ఒక బస్సులో మాతోనే తిరుగుతూ రోమ్‌, వాటికన్‌, పిసా, స్విజర్లండ్‌, జర్మనీలో ఒక వూరు, పారిస్‌ చూపించి పారిస్‌లో ఫ్లయిటు ఎక్కించారు. అన్నీ దగ్గరుండి చూసుకుంటూ మధ్యాహ్నం, రాత్రి భోజనాల వేళకు ఇండియన్‌ రెస్టారెంటుకు తీసుకెళ్లారు. ముందే చెప్పి వుంచుతారు కాబట్టి భోజనం రెడీగా వుంటుంది. కండక్టెడ్‌ టూరులో వాళ్లు చూపించినదే అదీ యిచ్చిన గడువులో చూడాలి తప్ప మన యిష్టప్రకారం చూద్దామంటే కుదరదు. కానీ అలాగని మనం ఒక్కరమే టూరుకెెళితే రెస్టారెంటు వెతుక్కోవడానికై టైము పోతుంది. ఊళ్లో టాక్సీలకు చాలా అవుతుంది. ఈ సీరీస్‌ ప్లానింగుకి పనికిరాకపోయినా వాళ్లు చూపిస్తున్న ప్రదేశాల కథ మనకు ముందే కాస్త కాస్త పరిచయం చేయడానికి ఉపయోగపడుతుంది.

9. 'ఇంటర్నెట్‌లో అన్నీ లభించే యీ రోజుల్లో ట్రావెలోగులు అనవసరం. మల్లాది రచనలు ఆ కాలానికి తప్ప యీ కాలానికి కావు' అని ఒకాయన రాశారు. లైబ్రరీలోని పుస్తకాల్లో అనేక విషయాలుంటాయి, సముద్రంలో ముత్యాలుంటాయి, నదుల్లో చేపలుంటాయి – అవి పట్టుకునే నేర్పు మనకుందా? తెలిసే దాకా ప్రతీ చిన్న విషయమూ వింతగానే తోస్తుంది. ఒక్కోప్పుడు బాత్‌రూమ్‌ డోర్‌ బోల్టు ఎలా వేయాలో తెలియదు, వాష్‌బేసిన్‌ కుళాయి ఎలా తిప్పాలో తెలియదు. ఫ్లయిట్‌లో టీవీ ఇయర్‌ ఫోన్స్‌ సాకెట్‌ ఒకప్పుడు చెయ్యి పెట్టుకునే హేండిల్‌కు గోడవైపు వుంటుంది, మరోసారి ముందుకి వుంటుంది. ఆ టీవీ రిమోట్‌ని సాకెట్‌లో ఎలా పెట్టాలో కూడా పక్కవాణ్ని గమనిస్తేగానీ, లేదా కాస్సేపు కుస్తీ పడితేగానీ తెలియదు. వెబ్‌ చెక్‌-యిన్‌ చేస్తే ఎయిర్‌పోర్టులో ఎంతో సమయం కలిసి వస్తుంది. అయినా ఎందరో యువతీయువకులు అలా చేయడం లేదు. కాబిన్‌ లగేజ్‌ సెక్యూరిటీ చెక్‌ చేసేటప్పుడు లాప్‌టాప్‌ తీసి పక్కన పెట్టరు. ముందువాడు ఏం చేస్తున్నాడో చూడరు. వాళ్లకూ, వెనకాల వున్నవాళ్లకూ ఎంత టైము వేస్టు! మనం ఫారిన్‌ ఎక్స్‌ఛేంజ్‌ తీసుకునేటప్పుడు పెద్ద నోట్లు తీసుకుంటాం, కాస్త చిల్లర కూడా తీసుకుని దగ్గర  పెట్టుకోకపోతే పబ్లిక్‌ టాయిలెట్స్‌ దగ్గర పే చేయడానికి యిబ్బంది. వెజిటేరియన్సే కాదు నాన్‌-వెజిటేరియన్సు కూడా ఫారిన్‌ వచ్చినపుడు దేనిలో ఏముందో అన్నీ అడిగి తెలుసుకోవాల్సి వస్తుంది. చీజ్‌ బర్గర్‌ అన్న పేరు చూసి ఓస్‌ అనుకుని తినబోతే దాంట్లో బీఫ్‌ వుంటుంది. వెజిటేరియనా? కాదా అని అడిగి తినాలి. నాన్‌-వెజిటేరియనా? అని అడిగితే అర్థం కాదు, వాళ్లు ఆ పదం వాడరు. చిన్న విషయాలే అయినా యివన్నీ ముందుగా తోచవు. ఎవరైనా చెపితే సౌకర్యం. పైగా మనం నిరంతరం నేర్చుకుంటూనే వుండాలి.  అంతెందుకు మొన్న లండన్‌ పర్యటనలో టవర్‌ ఆఫ్‌ లండన్‌ చూసిన తర్వాత నేను గైడ్‌ చెప్పిన స్థలానికి సమయానికి చేరలేకపోయాను. టవర్‌ స్టాఫ్‌ తప్పుగా సూచనలు యివ్వడంతో మరోవైపుకి వెళ్లిపోయాను. అనేక టూర్లు చేసిన నాకు యిలా ఎప్పుడూ జరగలేదు. బస్సు నెంబరు రాసి పెట్టుకునేవాణ్ని. కానీ అవేళ బస్సు లేదు. ఒక షాపు దగ్గరకి రావాలి. రాలేకపోయాను. ఇప్పణ్నుంచి అలాటి పరిస్థితుల్లో ఆ షాపును, పరిసరాలను ఫోటో తీసి పెట్టుకోవాలని నిశ్చయించుకున్నాను. ఎందుకంటే దిగినపుడు గైడ్‌ వెనక్కాల పరుగులు పెట్టుకుంటూ వెళ్లడంతో దారి గుర్తు పెట్టుకోము. తిరిగి వచ్చేటప్పుడు అవస్థ. ఇలా అనుభవం అనేక పాఠాలు నేర్పుతుంది. పాత రోగి సగం వైద్యుడు అన్నట్లు ట్రావెలోగ్‌ రచయిత యిలాటివి చెప్పి మనం ఆ పొరపాట్లు చేయకుండా చూస్తాడు. ఎనీవే, నేను యీ సీరీస్‌లో అవేమీ చెప్పటం లేదు. ఫ్రాన్సు, ఇంగ్లండు, స్కాట్లండ్‌, రోమ్‌ చరిత్రలు కాస్తకాస్త చెప్పి ఆయా యాత్రాస్థలాలపై ఆసక్తి పెంచుతానంతే!(సశేషం)  ఫోటో – పారిస్‌లోని లఫయత్‌, వాషింగ్టన్‌ల విగ్రహాలు    

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015)    

[email protected]

Click Here For Archives