ఎమ్బీయస్‌ : గోడ్సేని ఎలా చూడాలి? – 21

ఇక్కడే గోడ్సే మానసిక స్థితి మనకు అర్థమవుతుంది. దేశవిభజన చాలామందికి యిష్టం లేకపోయినా బ్రిటిషువారి మద్దతుతో ముస్లిం లీగు చేపట్టిన హింసాకాండ తర్వాత విభజన అనివార్యం అనే చేదునిజాన్ని వారు ఆమోదించారు. గోడ్సే ఆమోదించ…

ఇక్కడే గోడ్సే మానసిక స్థితి మనకు అర్థమవుతుంది. దేశవిభజన చాలామందికి యిష్టం లేకపోయినా బ్రిటిషువారి మద్దతుతో ముస్లిం లీగు చేపట్టిన హింసాకాండ తర్వాత విభజన అనివార్యం అనే చేదునిజాన్ని వారు ఆమోదించారు. గోడ్సే ఆమోదించ లేకపోయాడు. అతని మాతృసంస్థ యైన హిందూ మహాసభ కూడా స్వాతంత్య్రం తర్వాత చేయవలసిన వాటిపై దృష్టి సారించి, జాతీయ ప్రభుత్వంలో చేరడానికి, మద్దతు యివ్వడానికి సిద్ధపడింది. అది గోడ్సేకు జీర్ణం కాలేదు.అతని దృష్టిలో – ప్రాక్టికల్‌గా ఆలోచించిన సావర్కార్‌  వృద్ధనాయకుడై పోయాడు, శ్యామా ప్రసాద్‌ పార్టీని కాంగ్రెసుకు తాకట్టు పెట్టేశాడు! భవిష్యత్తులోకి తొంగి చూడగలిగితే అతనికి తెలిసేది – శ్యామా ప్రసాద్‌ నెహ్రూతో విభేదించి, వచ్చి హిందూత్వ భావాలతో పార్టీ పెట్టాడని. కానీ ఆవేశంలో, ఉన్మాదంలో వున్న గోడ్సే సంయమనం పాటించమని హితవు చెప్పిన గురువులను కూడా శత్రువులుగా భావించాడు. 

ఇక గోడ్సే రాసిన విషయం – '1946 నవ్‌ఖాళీ ఘటనల తర్వాత గాంధీ ఢిల్లీ వచ్చి భంగీ కాలనీలో హిందూ దేవాలయంలో ప్రార్థనా సమావేశాలు జరిపి, హిందూ భక్తుల ఆక్షేపణలను లెక్క చేయకుండా అక్కడ ఖురాన్‌లో భాగాలు కూడా చదవాలని పట్టుబట్టాడు. కానీ అదే గాంధీ, ఒక మశీదులో, ముస్లింల ఆక్షేపణ వచ్చినపుడు భగవద్గీతను చదవడానికి సాహసించ లేకపోయాడు.' గురించి నా వద్ద సమాచారం లేదు. అలా జరిగివున్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మశీదులో భగవద్గీత చదవడాన్ని ముస్లిములు అనుమతిస్తారని వూహించనైనా వూహించలేం. రాజకీయ నాయకులు యితర మతాలపై నమ్మకం వున్నా లేకపోయినా ఎన్నికల సమయంలో వారి ప్రార్థనా స్థలాలకు వెళ్లి, చర్చి బెంచీల మీద తలవంచుకుని కూర్చుంటారు, టోపీలు పెట్టి ఉత్తుత్తి నమాజ్‌లు చేస్తూ వుంటారు. హిందూ నాయకులు గురుద్వారాలకు, చర్చిలకు, మసీదులకు వెళ్లగా చూశాను కానీ ఒక్క ముస్లిం నాయకుడు ఓట్ల కోసమైనా గుడికి వెళ్లగా, చర్చికి వెళ్లగా నేను చూడలేదు. మసీదులో భగవద్గీత చదివేందుకు వారిని ఒప్పించడం మోహన్‌దాస్‌ గాంధీకాదు కదా, కరంచంద్‌ గాంధీకైనా సాధ్యమై వుండదని నా నమ్మకం. దీనికి వ్యతిరేకంగా జరిగినట్లు ఎవరైనా నిరూపిస్తే నన్ను నేను సవరించుకోవడానికి సిద్ధం. 

గోడ్సే ప్రవర్తనలో మనకు అర్థంకాని వైపరీత్యం ఒకటి వుంది. అతనికి హిందువుల పట్ల, హిందూమతం పట్ల అపారమైన ప్రేమ. హిందువులపై జరిగిన అత్యాచారాలకు విపరీతంగా చలించాడు. ఆ అత్యాచారాలకు కారణభూతుడైన జిన్నాను కడతేర్చాలని ఎందుకనుకోలేదు? జిన్నా కాకపోయినా ముస్లిం లీగు నాయకుల్లో ఏ ఒక్కరినైనా దండించి వుండాల్సింది కదా! బెంగాల్‌లో అల్లర్లకు కారణమైన సుహ్రవర్దీని 'షహీద్‌' అని మెచ్చుకున్నందుకే గాంధీపై అంత ఆగ్రహం ప్రకటించాడే! ఆ సుహ్రవర్దీపై హత్యాప్రయత్నం చేసి వుండవచ్చు కదా. కనీసం నవ్‌ఖాళీలో అనేక మంది హిందూ వనితలను చెరచిన, మతమార్పిళ్లు చేయించిన ఒక్క నాయకుడి జోలికైనా వెళ్లలేదేం? జలియానావాల్‌ బాగ్‌ అత్యాచారానికి కారకుడైన డయ్యర్‌ను చంపడానికి ఉద్ధమ్‌ సింగ్‌ ఇంగ్లండు వెళ్లి తన లక్ష్యాన్ని సాధించాడు. ఆ ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోయాడు నిజమే కానీ జలియన్‌వాలా బాగ్‌ మారణకాండకు పగ తీర్చుకున్నానన్న తృప్తితో కన్నుమూశాడు. గోడ్సే చేసినదేమిటి? గాంధీని చంపడం! అదేమంటే విభజన ఆపలేకపోయాడు కాబట్టి.. అంటూ సైద్ధాంతిక కారణాలు చెప్పడం! గోడ్సే వాదన ఎంత పరాకాష్టకు చేరిందంటే స్వాతంత్య్రం వస్తూనే పాకిస్తాన్‌ కశ్మీర్‌ ఆక్రమించుకోవడానికి కొన్ని మూకలకు ఆయుధాలిచ్చి కొన్ని ప్రాంతాలపై దాడి చేయించింది. అప్పటిదాకా ఎటూ చేరకుండా స్వతంత్రదేశంగా వుంటానని మొరాయిస్తున్న కశ్మీర్‌ రాజు భారతదేశాన్ని సైన్యం పంపమని కోరాడు. నెహ్రూ పంపాడు. దానిపై గోడ్సే వ్యాఖ్యానం ఏమిటంటే – 'ఆయుధాలతో చేసే యుద్ధానికి వ్యతిరేకిని అని గాంధీ పదేపదే చాటుకున్నాడు. కానీ కశ్మీర్‌లో సైన్యాన్ని పంపడానికి నెహ్రూకు సమ్మతి తెలిపాడు. తన అహింసా సిద్ధాంతంలో నమ్మకమే వుంటే సాయుధబలాలకు బదులు సత్యాగ్రహులను, రైఫిల్సుకు బదులు తఖ్లీలను, తుపాకులకు బదులు చరఖాలను పంపవలసినదిగా ఆజ్ఞాపించాల్సింది.' 

పాకిస్తాన్‌నుండి వచ్చి పడుతున్న శరణార్థుల గోడు గోడ్సేను కదిలించింది. నిజానికి ఆ నాటి పంజాబీ, సింధీ శరణార్థుల ఆగ్రహాన్ని గాంధీ సైతం ఎదుర్కోలేకపోయాడు.  బెంగాల్‌లో జరిగినది రాశాను కదా, పంజాబ్‌ సంగతి క్లుప్తంగా చెప్పాలంటే – పంజాబ్‌లో ముస్లిము యూనియనిస్టు-అకాలీ-కాంగ్రెసు సంయుక్త ప్రభుత్వాన్ని కూలదోయడానికి లీగ్‌ చేపట్టిన ఆందోళన వల్ల మార్చ్‌ 47లో పంజాబ్‌లో రక్తపాతం మొదలయింది. లాహోర్‌, అమృతసర్‌లు దాడికి, దోపిడీకి గురయ్యాయి. శాంతిభద్రతలు కాపాడవలసిన బ్రిటిషు అధికారులు సరైన చర్యలు తీసుకోలేదు. కొంతమంది న్యాయబుద్ధి గల అధికారులున్నా వారి కింద పనిచేసే ఇండియన్‌ అధికారులు తమ తమ మతాల వారి పట్ల పక్షపాతంగా వ్యవహరించారు. వీరికి వారిని అదుపు చేస్తే శక్తి పోయింది. ముస్లిం లీగ్‌, నేషనల్‌ గార్డ్స్‌, హిందూ మహాసభ వంటి సేనలు విజృంభించాయి. సామాన్య పౌరులకు ప్రభుత్వం తమను కాపాడగలుగుతుందన్న నమ్మకం పోయింది. గాంధీ మాటకు ముస్లిము, మధ్యతరగతి ప్రజలు విలువనివ్వడం మానేసారు. గాంధీ హిందూ మతతత్వవాది అని జిన్నా చేసిన ప్రచారం బాగానే పనిచేసింది. ఈ గొడవలు అన్నీ చూసాక ఎలాగోలా త్వరగా బయటపడితే చాలనిపించింది తెల్లవాళ్లకు. 'జూన్‌ 1948 వరకు ఎందుకు, 1947 ఆగస్టుకే స్వాతంత్య్రం ఇచ్చి వెళ్లిపోతే సరి. టైము తక్కువగా ఉందని భయం వద్దు, నేను పని గబగబా పూర్తిచేసి చూపిస్తాను' అని జూన్‌ 1947లో మౌంట్‌బాటెన్‌ హామీ యిస్తే అట్లీ ఓకే అనేశాడు. 'ఆలస్యం చేస్తే టోరీలు ఏం తిరకాసు పెడతారో, ముందు వీళ్లు వెళితే మహబాగు' అనుకుని నెహ్రూ, పటేల్‌, జిన్నా ఆ ప్లానుకు సమ్మతించారు. 6 వారాల్లో చాలా హడావుడిగా విభజన కార్యక్రమం పూర్తి చేసేసారు. సింహావలోకనం చేసుకుంటే ఆ తొందర చాలా అనర్థాలకు దారి తీసిందని అనిపిస్తుంది. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]

Click Here For Previous Articles