గోడ్సే వాదనలోని ముఖ్యాంశాలు – ఒక్కటి మినహా – యింతటితో అయిపోయాయి. అప్రధానమైన విషయాలు, చర్వితచర్వణంగా చెప్పిన విషయాలు చాలా వున్నాయి. పూర్తి పాఠం చదవాలంటే గోడ్సే పుస్తకం చదవడం మేలు. గోడ్సే గాంధీని చంపితీరాలని నిశ్చయించుకోవడానికి ప్రబలమైన కారణం – పాకిస్తాన్‌కు యివ్వవలసిన రూ.55 కోట్లు యిచ్చి తీరాలని 1948 జనవరి 13న గాంధీ ఆమరణ నిరాహారదీక్షకు కూర్చోవడం! గోడ్సే ఆగ్రహం పరాకాష్టకు చేరి అదే నెలలో గాంధీని చంపివేశాడు. ఆ 55 కోట్ల సంగతి చర్చించేందుకు ముందు అప్పటికి గోడ్సే భావావేశం, మానసిక స్థితి ఎలా వుంది అన్నది తెలుసుకోవడం అవసరం. అతని గురించి 2 వ భాగంలో క్లుప్తంగా చెప్పడం జరిగింది. అతని మాటల్లోనే అతని భావజాలం గురించి, యింత తీవ్రమైన హింసకు పాల్పడడానికి దారి తీసిన సంఘటనల గురించి వింటే సంపూర్ణమైన అవగాహన కలుగుతుంది. ఇవి అతని వాఙ్మూలంలోంచి ఎత్తి రాస్తున్న వాక్యాలు –
గోడ్సే – ''నేను సంప్రదాయబద్ధమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినా కులవ్యతిరేక ఉద్యమంలో బహిరంగంగా చేరాను. అన్ని కులాలవారితో ఒకే పంక్తిలో భోజనం చేసేవాణ్ని. భారత్, ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికా, రష్యా దేశాల చరిత్రలతో బాటు దాదాభాయ్ నౌరోజీ, వివేకానంద, గోఖలే, టిళక్‌ల రచనలు చదివాను. అవే కాదు, సోషలిజం, కమ్యూనిజం కూడా నేను చెప్పుకోదగిన మేరకు అధ్యయనం చేశాను. సావర్కారు, గాంధీ రచనలు, ఉపన్యాసాలు కక్షుణ్ణంగా చదివాను. వీటివలన నేను తత్త్వచింతన గల దేశభక్తుడిగా, మానవతావాదిగా హిందూజాతిని, హిందూ ప్రజలను సేవించడమే అన్నిటికి మించిన నా ప్రథమ కర్తవ్యమనే దృఢవిశ్వాసం నాకు కలిగింది. 30 కోట్ల హిందువుల న్యాయమైన హక్కులు పరిరక్షిస్తే ప్రపంచంలోని 20% జనాభా స్వాతంత్య్రసంక్షేమాలను కాపాడినట్లే కదా!
గాంధీ బోధించిన 'అహింస' హిందువులను నిర్వీర్యులుగా చేసి, తమమీద యితరవర్గాలవారు, ముఖ్యంగా ముస్లిములు చేసే దాడులను నిరోధించడానికి కూడా చేతకాని అసమర్థులుగా చేసిందని నేను దృఢంగా నమ్మాను. ఈ కీడు పరిహరించడానికి నేను ప్రజాజీవితంలోకి అడుగుపెట్టాను. నేను చాలాకాలం ఆరెస్సెస్‌లో పని చేసి, వీర సావర్కారు నాయకత్వంలోని హిందూమహాసభలో సభ్యుడిగా చేరాను. సావర్కారు చేసిన ధనసహాయంతో ఆప్టేతో కలిసి 'అగ్రణి' అనే దినపత్రికను రెండేళ్లు నడిపాను. అనారోగ్యం చేత సావర్కార్ తన ఆకర్షణశక్తి పోగొట్టుకోవడంతో హిందూమహాసభ నాయకత్వం డా|| శ్యామా ప్రసాద్ ముఖర్జీ (నేటి బిజెపికి పూర్వరూపం జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకుడు) చేతికి వెళ్లిపోయింది. ఒక వైపు గాంధీ కూటమి, మరోవైపు ముస్లిం లీగు చేసే హిందూ వ్యతిరేక కార్యక్రమాలను ఎదుర్కొని ఎదురు దెబ్బ తీయలేని స్థితికి మహాసభ చేరి కాంగ్రెసు చెలికత్తె స్థాయికి దిగజారిపోవడంతో నాకు ఆశాభంగం కలిగి దానికి దూరంగా జరిగాను. నాకూ, నా వంటి యువతకు మార్గదర్శనం చేయవలసిన సావర్కారు, హిందూసభలోని యితర వృద్ధనాయకులు కనీసం మమ్మల్ని అర్థం చేసుకోవడానికి కూడా సిద్ధంగా లేరని మాకు బోధపడింది.
1946 నవ్‌ఖాళీ ఘటనల తర్వాత గాంధీ ఢిల్లీ వచ్చి భంగీ కాలనీలో హిందూ దేవాలయంలో ప్రార్థనా సమావేశాలు జరిపి, హిందూ భక్తుల ఆక్షేపణలను లెక్క చేయకుండా అక్కడ ఖురాన్‌లో భాగాలు కూడా చదవాలని పట్టుబట్టాడు. కానీ అదే గాంధీ, ఒక మశీదులో, ముస్లింల ఆక్షేపణ వచ్చినపుడు భగవద్గీతను చదవడానికి సాహసించ లేకపోయాడు. హిందువులకు కూడా ఆత్మగౌరవం వుందనీ, దానికి భంగం కలిగినపుడు సహనం కోల్పోతాడని గాంధీకి రుజువు చేయడానికి నిశ్చయించుకున్నాం. గాంధీ, సుహ్రవర్దీల చర్యలు ఖండిస్తూ నా మిత్రుడు ఆప్టే ఢిల్లీలో శరణార్థులతో కూడిన పెద్ద ఊరేగింపును లేవదీసి భంగీ కాలనీలో జరిగే ప్రార్థనా సమావేశంలోకి దూసుకుపోయాడు. ఆ వ్యతిరేకతను గమనించిన గాంధీ అతి తెలివిగా, ముందు కాపలాతో, తలుపు వెనక్కాల దాక్కున్నాడు. ఈ ప్రదర్శన గురించి పత్రికలలో చదివిన సావర్కారు మమ్మల్ని అభినందించేందుకు బదులు, నన్ను పిలిపించి అరాచక విధానాలు అవలంబించామని తప్పుపట్టారు.
ఇది జరిగిన కొన్నాళ్లకు విభజన తర్వాత ఏర్పడబోయే హిందూస్తాన్‌లో ఖాయంగా ఏర్పడబోయే కాంగ్రెసు పట్ల హిందూ మహాసభ వైఖరి ఎలా వుండాలి అనే విషయంపై సభ సమావేశంలో చర్చ జరిగింది. ''దాన్ని కాంగ్రెసు ప్రభుత్వంగా చూడకూడదు. హిందూస్తాన్ యొక్క జాతీయప్రభుత్వంగా గుర్తించి మన్నించాలి. వందలాది స్వతంత్ర రాజ్యాధీశుల ద్వారా యీ ప్రభుత్వాన్ని బలహీనపరిచి, అంతర్యుద్ధం జరిగేట్లా చేసి, దీన్ని కూడా పాకిస్తాన్‌గా మార్చేసే ఆలోచన ముస్లిం లీగు చేస్తోంది కాబట్టి మనం దీనికి విధేయులుగా వుండి సంపూర్ణ సహకారం యివ్వకపోతే కొత్తగా సంపాదించుకున్న స్వాతంత్య్రాన్ని పరిరక్షించుకోలేం.'' అని సావర్కారు, యితర ప్రముఖ నాయకులు నొక్కి వక్కాణించారు. ఈ ఆలోచన నాకు, నా మిత్రులకు నచ్చక తిరిగి వచ్చేశాం. సావర్కారును వదిలిపెట్టి మా మార్గం మేం చూసుకోవాలని నిశ్చయించుకున్నాం.
కొన్నాళ్ల తర్వాత పంజాబులో, దేశం యితర ప్రాంతాల్లో ముస్లిముల మతావేశ పూరిత దౌర్జన్యాలు చెలరేగాయి. కేంద్రం లోని కాంగ్రెసు ప్రభుత్వం మాత్రం బిహారు, కలకత్తా, పంజాబు మొ||లైన ప్రదేశాలలో ముస్లిం శక్తులను ఎదిరించి సాహసించిన హిందువులపై కేసులు పెట్టి, వేధించి, తుపాకీ గుండ్లు కురిపించి అణచివేయసాగింది. 1947 ఆగస్టు 9 న అఖిల భారత హిందూ మహాసభ కార్యవర్గ సభ ఢిల్లీలో జరిగింది. కాంగ్రెసు ప్రభుత్వాన్ని బహిష్కరించడానికి మేం చేసిన సూచనలను మహాసభ ఆమోదించలేదు. నా ఉద్దేశంలో విభజిత భారత దేశాన్ని గుర్తించి అంగీకరించడం, ఆ పాపిష్టి విభజనలో భాగస్వాములం కావడమే! మహాసభ మాత్రం 1947 ఆగస్టు 15 న ప్రజలందరూ తమ యిళ్లపై భగవాధ్వజాన్ని ప్రతిష్టాపించవలసినదిగా తీర్మానం చేసింది. సావర్కారు యింకా ముందుకు వెళ్లి మధ్యలో చక్రం వున్న త్రివర్ణపతాకాన్ని జాతీయపతాకంగా గుర్తించవలసినదిగా పట్టుబట్టారు. ఆయన అభిప్రాయంపై మేం బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశాం. అయినా సావర్కారు ఆ రోజు తన యింటిపై భగవా ధ్వజంతో బాటు త్రివర్ణపతాకం కూడా ఎగరేశారు. దీనికి తోడు, డా|| శ్యామా ప్రసాద్ ముఖర్జీ సావర్కారుకు ఫోన్ చేసి భారత కాబినెట్‌లో చేరమని నెహ్రూ తనకు యిచ్చిన ఆహ్వానాన్ని ప్రస్తావించి అనుమతి కోరగా 'ఇది జాతీయ ప్రభుత్వం కాబట్టి చేరవచ్చు' సావర్కారు చెప్పారు. హిందూ మహాసభ యితర నాయకులు కూడా డా|| ముఖర్జీని చేర్చుకోవడం గురించి నెహ్రూను మెచ్చుకోవడం మొదలుపెట్టారు.
హిందూ మహాసభ, దాని వృద్ధ నాయకుల పోకడలను నేను నేను నా పత్రికలలో విమర్శించడం మొదలుపెట్టాను. మేం వారితో చెప్పకుండా రెండు కార్యక్రమాలను చేపట్టదలచాము. ఒకటి – గాంధీ ప్రార్థనా సమావేశాల్లోనే అసమ్మతి ప్రదర్శనలు చేసి గందరగోళం సృష్టించి, సంఘటితమైన హిందూ అసంతృప్తి యొక్క శక్తిని ఆయనకు తెలిసేట్లు చేయడం, రెండోది – హైదరాబాదు సంస్థానంలో మన హిందూ సోదరీమణులపై మతోన్మాదులైన ముస్లింలు చేస్తున్న అత్యాచారాల నుంచి రక్షించడానికి ఆ సంస్థాన సరిహద్దుల్లో ఆందోళన లేవదీయడం. ఈ లక్ష్యాలతో మేం ముందుకు సాగాం. వాస్తవాలు యిలా వుండగా ప్రాసిక్యూషన్ వారు గాంధీ, నెహ్రూ, సుహ్రవర్దీలను అంతమొందించడానికి సావర్కారు మాకు ఆజ్ఞ యిచ్చారని, యశస్వులు అవుతారని ఆశీర్వాదం యిచ్చారని చెప్పడం అసత్యం. శుద్ధబద్ధం.'' (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)