తెలుగులోకి వచ్చేసరికి ''గుండెలు తీసిన మొనగాడు'' సినిమాలో ఈ దీవి, ఈ చంపడాలు పార్టు కొద్దిగానే తీసుకున్నారు. దానికి ముందు బోల్డు కథ పెట్టారు. స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చక్రవర్తి అనే ఆయన చేశారు. హీరో కాంతారావేే యీ సినిమా నిర్మాత కూడా! ఆయన డిటెక్టివ్ రాజేష్ పాత్ర వేశారు. దేశం కోసం పరిశోధనలు చేస్తున్న సైంటిస్టులను ఎత్తుకుపోయిన ఓ టీమును పట్టుకునే పని ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. వారిలో కనబడే విలన్ సత్యనారాయణ. కనబడని విలన్ అతనికి బాస్. బయటకు కనబడకుండా వెనకనుండి కథ నడిపిస్తూంటాడు. ఆ మెయిన్ విలన్ ఎవరన్నది సస్పెన్స్. హీరోయిన్ జ్యోతిలక్ష్మి. ఆమె ఓ సైంటిస్టు కూతురు. ఈ డిటెక్టివ్‌ని ప్రేమిస్తుంది. దీవికి వచ్చేవరకు వున్న కథను టూకీగా చెప్పుకుందాం.
సత్యనారాయణ సైంటిస్టులను ఎత్తుకుపోయి ఎక్కడో దాచేశాడు. కాంతారావు ఎంత అడిగినా చెప్పటం లేదు. నాగభూషణం ఓ సినిమా నిర్మాత. తన ఆర్ట్ డైరక్టర్‌కి పోలీసు స్టేషన్ లాకప్ ఎలా వుంటుందో చూసే అవకాశం యిమ్మనమని ఇన్‌స్పెక్టర్‌ని కోరి, లోపలకి వచ్చి సత్యనారాయణతో ఏదో మాట్లాడాడు. తర్వాత సత్యనారాయణ లేని రోగం నటించి, హాస్పటల్‌లో చేరి డాక్టర్‌ను కట్టి పడేసి అక్కణ్నుంచి పారిపోయాడు. సైంటిస్టు ఆనందరావు దగ్గరకు వెళ్లి ఫార్ములా ఏమిటో చెప్పమని అడిగాడు. అతను చెప్పలేదు. చెప్పటం లేదు అని సత్యనారాయణ తన బాస్‌కు చెప్పగానే ''ఆనందరావు కూతుర్ని తీసుకురా, రాజేష్ అడ్డు తొలగించు'' అని అతనికి బాస్ నుంచి ఇనస్ట్రక్షన్స్ వచ్చాయి.
విలన్‌లకు ఆటపట్టయిన హోటల్లో నాగభూషణం వుండగా పద్మనాభం వచ్చి తాను హాలీవుడ్‌లో డైరక్టర్‌నని చెప్పుకున్నాడు. నాగభూషణం అతనికి డైరక్షన్ ఛాన్సు యిస్తానన్నాడు. సైంటిస్టు కూతురు జ్యోతిలక్ష్మిని సత్యనారాయణ ఎంత బెదిరించినా ఆమె ఏమీ చెప్పలేదు సరికదా హీరోకి వీళ్ల స్థావరం ఎక్కడుందో ఉప్పందించింది. హీరోకి తన స్థావరం తెలిసిపోయిందని బెదిరి సత్యనారాయణ హీరోయిన్‌ను తీసుకుని పారిపోయాడు. ఓడ ఎక్కేశాడు. వాళ్లని వెంటాడుతూ హీరో కూడా ఓడ ఎక్కాడు. అదే ఓడలో నాగభూషణం, పద్మనాభం యింకా మరి కొందరున్నారు. వారిలో రావి కొండలరావు ఓ సినీ రచయిత, రాజసులోచన ఓ సినిమా హీరోయిన్, ప్రభాకరరెడ్డి ఓ డాక్టర్, చంద్రమోహన్, హలం ఓ హనీమూన్ జంట, త్యాగరాజు, ప్రభాకరరెడ్డి…యిలా..
ఆ ఓడలో హీరోయిన్ ఎక్కడుందాని హీరో వెతుకుతూనే వున్నాడు. ఇంతలో విలన్ అనుచరుడు ఓడలో నిప్పంటుకుందని హడావుడి చేశాడు. దాంతో అందరూ దిగి బోట్లలో పారిపోయారు. తక్కినవారి మాట ఎలా వున్నా మన జనాభా మాత్రం ఓ చిన్న బోటు ఎక్కి ఓ దీవిలో దిగారు. ఇక్కణ్నుంచి 'గుమ్‌నామ్'లా వుంటుంది కథ. ఏదైనా ఆవాసం దొరుకుతుందాని వెతుక్కుంటూ వస్తే ఓ భవంతి కనబడుతుంది. హాల్లో అందరూ చేరారు. ఇంగ్లీషు నవలలో ఒక్కొక్కరు చనిపోయినప్పుడు ఒక్కో నిగ్గర్ బొమ్మ పగిలిపోతూ వుంటుంది. హిందీ సినిమాలో బట్లర్ ఒక్కొక్కరి పేరు కొట్టేస్తూ వుంటాడు. ఇక్కడ ఒక్కో పావురం చనిపోతూ వుంటుంది. హిందీ సినిమాలో అయితే విలన్‌కి మోటివ్ వుంది. అక్కడకు రప్పించాడు. ఇక్కడేముంది? ఇక్కడ వీళ్లలో వీళ్లకే ఓ మోటివ్ కల్పించారు. ఆ యింట్లో భూగృహంలో బోల్డంత డబ్బు, బంగారం వుంది. హాల్లో సరస్వతి విగ్రహం కదిపితే దానికి దారి కనబడుతుంది. అది ఒకళ్ల తర్వాత ఒకళ్లకు తెలిసింది. ఒకరు వెళుతుంటే మరొకరు చూశారు. దాంతో తక్కిన వాళ్లను చంపేసి అది తామే తీసుకోవాలని అనుకున్నారు. అందువలన హత్యలు జరుగుతూ వుంటే ఆ బంగారం కోసమే ఒకరినొకరు చంపుకుంటున్నారని అనుకుంటాం.
ఈ దశలో నాగభూషణంకు జయకుమారితో డ్రీమ్ సీక్వెన్సు పెట్టారు. దీనికి మూలం హిందీలో మెహమూద్ హెలెన్‌ను వూహించుకుంటూ పాడిన 'హమ్ కాలే హైతో క్యా హువా' పాట. ఇలా ఒక్కోళ్లు చనిపోతూ వచ్చారు. రాజసులోచన తన భర్త చంద్రమోహన్‌తో రొమాన్సు సాగిస్తోందన్న అనుమానంతో ఆమెతో హలం పేచీ పడింది. నీ భర్త చస్తాడంది రాజసులోచన. దానికి తగ్గట్టుగా చంద్రమోహన్ చనిపోయాడు. అందరూ రాజసులోచనను అనుమానించారు. అంతలో ఆమె కూడా చనిపోయింది. డాక్టరే (ప్రభాకరరెడ్డి) అందర్నీ విషం పెట్టి చంపుతున్నాడనుకున్నారు. తీరా రూముకి వెళ్లి చూస్తే అతనూ వురి వేసుకున్నాడు.
కథ యిలా నడుస్తూండగా హీరో ఆ భవంతిలో పాతాళగృహం వెతికాడు. అక్కడ పావురాలను చంపే అమ్మాయి కనబడింది. గుమ్‌నామ్ హై కోయీ స్టయిల్లో 'ఓ ప్రియా..' అనే పాట పాడేది ఆమెయే. ఆమె నాగభూషణం కూతురు. అతను ఎంతో డబ్బు అక్రమంగా సంపాదించి కూతురికి, అల్లుడికి యివ్వబోయాడు. అల్లుడు వద్దన్నాడు. నాగభూషణం కోపంతో అతన్ని చంపేశాడు. భర్త చావు చూసి ఆమె పిచ్చిదైపోయింది. రోజూ రక్తం కళ్ల చూస్తేనే గానీ నిద్రపోదు. అందుకే పావురాలను చంపుతుంది. ఈ విషయం ఆమె సంరక్షకుడు చెపుతూ వుండగానే నాగభూషణం అతన్ని కాల్చేశాడు. నాగభూషణమే అసలు విలన్ అని తెలిసి హీరో ఆశ్చర్యపడ్డాడు. కానీ విలన్ కూడా ఆశ్చర్యపడే సందర్భం వుంది. పద్మనాభం వచ్చి తను గూఢచారిని అన్నాడు.
నాగభూషణమే అందర్నీ యిక్కడకు రప్పించి అందర్నీ మట్టుపెడుతున్నాడు. శవాలను సత్యనారాయణ చేత మాయం చేయిస్తున్నాడు. అతను సైంటిస్టులందర్నీ యిక్కడే దాచి వుంచాడు. హీరోకి, విలన్లకి పోరాటం జరిగింది. నాగభూషణం హీరోని తుపాకీతో కాల్చబోతే మధ్యలో గుండు అతని కూతురికే తగిలి ఆమె చనిపోయింది. నాగభూషణం పశ్చాత్తాపపడ్డాడు. సత్యనారాయణతో సహా పోలీసులకు పట్టుబడ్డాడు. హీరో హీరోయిన్లు ఏకమయ్యారు. ఈ విధంగా గుమ్‌నామ్‌ను అక్కడక్కడ వుపయోగించుకుంటూ తెలుగు సినిమా నడిచింది. అసలు ఇంగ్లీషు నవలను సినిమాగా మలుస్తూ మార్చినప్పుడే కాస్త బిగి తగ్గింది. పోనుపోను హిందీలోకి, ఆ తర్వాత తెలుగులోకి మారుతూ వచ్చినప్పుడు మరింత తగ్గుతూ వచ్చిందని ఒప్పుకోవాలి. ఇంగ్లీషు నవల హిట్, ''గుమ్‌నామ్'' కూడా హిట్. కానీ ''గుండెలు తీసిన మొనగాడు'' సినిమా జనాలను మెప్పించలేక పోయింది. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2016)