ఎమ్బీయస్‌: ఇలాటి తవ్వాయి మన దగ్గరా వస్తే…? – 2/2

తమ తీర్పు వచ్చేవరకు యథాతథ స్థితి పాటించాలని సుప్రీం కోర్టు యిప్పుడంది. పంజాబ్‌లో ప్రతిపక్షంలో వున్న కాంగ్రెసు దీన్ని ఎన్నికల అంశంగా మారుద్దామనుకుంది. గతంలో తను రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ పాత ఒప్పందాన్ని రద్దు…

తమ తీర్పు వచ్చేవరకు యథాతథ స్థితి పాటించాలని సుప్రీం కోర్టు యిప్పుడంది. పంజాబ్‌లో ప్రతిపక్షంలో వున్న కాంగ్రెసు దీన్ని ఎన్నికల అంశంగా మారుద్దామనుకుంది. గతంలో తను రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ పాత ఒప్పందాన్ని రద్దు చేయగా ప్రస్తుతం రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం పంచుకుంటున్న అకాలీ, బిజెపిలు హరియాణాకు నీళ్లు పంపించాలని చూస్తున్నారని అమరీందర్‌ సింగ్‌ ధ్వజమెత్తాడు. వెంటనే దానికి విరుగుడుగా పంజాబ్‌ నీళ్లపై తమ చిత్తశుద్ధిని చూపించుకుంటున్నాం అంటూ మార్చి 14 న అసెంబ్లీలో ఎస్‌వైఎల్‌సి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు. దాని ప్రకారం కాలువ కోసం సేకరించిన 5376 ఎకరాల భూములను డీ నోటిఫై చేసి రైతులకు వెనక్కి యిచ్చేసి, కాలువ మూసేయాలని చట్టం చేసేశారు. బిల్లును ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి బాదల్‌ ''ఇతర రాష్ట్రాలకు యిచ్చేటన్ని అదనపు జలాలేమీ పంజాబ్‌ వద్ద లేవు. ఒక చుక్క నీరు పోయినా రాష్ట్రానికి ప్రమాదం. ఈ కాలువ ఎప్పటికీ కట్టడానికి వీల్లేకుండా చర్యలు తీసుకోవాలి. అందుకే భూమి రైతులకు తిరిగి యిచ్చేస్తున్నాం. కొన్నేళ్ల క్రితం వారి వద్ద తీసుకునేటప్పుడు యిచ్చిన పరిహారాన్ని వాళ్లు తిరిగి యివ్వనక్కరలేదు. ఇన్నేళ్లలో దాని మార్కెట్‌ ధర పెరిగినా సరే, ఉచితంగా వాళ్లకు తిరిగి యిచ్చేస్తాం. హరియాణా యీ కాలువ నిర్మాణానికి రూ.191.75 కోట్లు ఖర్చు పెట్టింది కాబట్టి దానికి ఆ డబ్బు మేం చెల్లిస్తాం. ఇదిగో చెక్కు. వడ్డీ కూడా యిచ్చేస్తాం కానీ యిప్పుడు కాదు, తర్వాత..' అన్నాడు. సుప్రీం కోర్టు ఆదేశాలను, అంతర్రాష్ట ఒప్పందాలను కాలరాసిన యీ బిల్లును వ్యతిరేకించిన పార్టీ లేదు. అన్ని పార్టీలు జై కొట్టాయి. 15 ని||లలో పాస్‌ అయిపోయింది. న్యాయం, ధర్మం అంటూ మాట్లాడితే ఓట్లు పడవన్న భయం. 

పంజాబ్‌ అసెంబ్లీ సమావేశం జరుగుతున్న కాంపౌండులోనే హరియాణా అసెంబ్లీ జరుగుతోంది. ఈ బిల్లు పాసయిన కొన్ని గంటల్లో యీ బిల్లును రాజ్యాంగ విరుద్ధమని నిరసిస్తూ హరియాణా అసెంబ్లీ తీర్మానం చేసింది. పంజాబ్‌ చేసిన చట్టాన్ని రద్దు చేయమని కేంద్రాన్ని కోరారు. హరియాణాకు యిప్పటికే అవసరమైన నీటి కంటె 61% తక్కువ లభిస్తోందని ఫిర్యాదు చేసింది.  రాష్ట్రంలో 126 బ్లాకులుంటే వాటిలో 71 బ్లాకుల్లో భూగర్భజలాలను తోడేశారని, నీటి కొరత ఎంత తీవ్రంగా వుందంటే 32 రోజుల విరామం తర్వాత కేవలం 8 రోజుల పాటు నీటిని సరఫరా చేయగలిగామని, యమునా నదిలో నీటిలభ్యత గత కొన్ని ఏళ్లగా తగ్గుతూ వస్తోందని, దానిలోనే రాజధాని ఢిల్లీకి తాగునీరు సరఫరా చేయాల్సి వస్తోందని వాపోయింది. పంజాబ్‌లో చట్టానికి చప్పట్లు కొట్టిన పార్టీలే యీ తీర్మానానికి చప్పట్లు కొట్టారు. హరియాణా ఎమ్మెల్యేలు పంజాబ్‌ ఎసెంబ్లీ ముందు ప్రదర్శన చేశారు. హరియాణాకు గవర్నరుగా వుంటూ ప్రస్తుతం పంజాబ్‌గా వున్న గవర్నరు కూడా యిక్కడో మాట అక్కడో మాట అన్నారు. ఆప్‌ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ హరియాణాలో పుట్టినా, పంజాబ్‌ వద్ద నీళ్లు లేవు కాబట్టి కాలువకు తాను వ్యతిరేకం అని ప్రకటించాడు – పంజాబ్‌లో అతని పార్టీ నిలబడుతోందని గుర్తుంచుకోవాలి. అరవింద్‌ యీ మాట అనగానే హరియాణా 'అయితే ఢిల్లీకి నీళ్లివ్వం జాగ్రత్త' అంది. అతను ఢిల్లీ చేరగానే నదీ జలాల్లో అన్ని రాష్ట్రాలకు న్యాయబద్ధమైన వాటా వుండాలి అని జనరల్‌ స్టేటుమెంటు యిచ్చి నోరు మూసుకున్నాడు. 

ఇదంతా చూసి పంజాబ్‌ ముఖ్యమంత్రి బెంగపడ్డాడు. కోర్టుకి వెళ్లి తాము చేసిన చట్టాన్ని ఆపించేస్తారేమోనని భయపడి, మీ భూములు మీరు వెంటనే స్వాధీనం చేసుకోండి, లేకపోతే దక్కవు అని రైతులను ప్రేరేపించాడు. భూమి మీ స్వాధీనం కావాలంటే అక్కడ తవ్విన కాలువను పూడ్చేసే బాధ్యత మీదే, కాలువగట్ల మీద పాతిన చెట్లను కూడా కొట్టి ఆనవాలు లేకుండా చేసేయండి అన్నాడు. అకాలీదళ్‌, కాంగ్రెసు, బిజెపి పార్టీల కార్యకర్తలు రైతులను వెంటబెట్టుకుని కాలువ వద్దకు బుల్‌డోజర్లు, జెసిబిలతో వచ్చి చెట్లు కొట్టేసి, కాలువను పూడ్చేయసాగారు. వేలాది చెట్లు కొట్టేయడం వలన భూగర్భ జలాల సమస్య వస్తుందని వాళ్లకు నచ్చచెప్పినవారు లేరు. ఇదంతా చూసి హరియాణా ప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళ్లింది. వాళ్లు యథాతథ స్థితి కొనసాగించమని, కాలువ పూడ్చివేతను ఆపేయమని పంజాబ్‌ను ఆదేశించారు. దాన్ని ధిక్కరిస్తూ పంజాబ్‌ ఎసెంబ్లీ మరో తీర్మానం చేసి సరిపెట్టింది. అకాలీ నాయకులు స్వయంగా కాలువలు పూడ్చేస్తున్నారు.

న్యాయంగా ఆలోచిస్తే కాలువ ద్వారా నీరు వెళ్లిపోతే పంజాబ్‌లోని మాళవా ప్రాంతంలో కాలువల ద్వారా వ్యవసాయం చేస్తున్న రైతులకు యిబ్బందే. అదే సమయంలో ఉత్తర రాజస్థాన్‌లో రావి-బియాస్‌ నదీజలాల మీదే అధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. దక్షిణ హరియాణాలో వర్షాధారం సాగు సాగుతోంది. ఈ ప్రాంతంలో కొన్ని వూళ్లల్లో తాగునీరు కూడా లేదు. రాష్ట్రాలు తమకు కావలసిన జలం అంటూ వేస్తున్న అంచనాల్లో పొరపాటుందని సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్‌ అంటారు. ఇటీవలి కాలంలో యీ ప్రాంతానికి అలవాటు లేని పంటలు వేస్తున్నారని, వాటికి చాలా నీళ్లు అవసరం పడుతున్నాయని, ఎకాలజిస్టులు దీనిపై హెచ్చరిస్తున్నారని అంటారాయన. కానీ రాష్ట్రాలు ఆ హెచ్చరికలు పట్టించుకోకుండా, రైతులకు సరైన సలహాలు యివ్వకుండా మరింత నీరు కావాలని నిరంతరం ఆందోళన చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాయి. నీళ్లు బిగబట్టి విజయం సాధించానని పంజాబ్‌ యీరోజు భుజాలు ఎగరేస్తోంది. ఎప్పుడో శాంక్షనైన ప్రాజెక్టు పూర్తి చేయకుండా, కాలువను కాగితాలపైనే చూపిస్తూ త్రైపాక్షిక ఒప్పందాన్ని తుంగలో తొక్కిన పంజాబ్‌ను కేంద్రం ఎందుకు అదుపు చేయటం లేదని హరియాణా భగ్గుమంటోంది. పంజాబ్‌ యింత అక్రమంగా వ్యవహరిస్తున్నా న్యాయాన్యాయాలు చెప్పవలసిన, తప్పు చేయవలసినవారిని దండించవలసిన కేంద్ర ప్రభుత్వం మార్చి 30 నాడు సుప్రీం కోర్టులో 'తాము యీ వివాదంలో తటస్థంగా వున్నామ'ని చెప్పుకుంది. అంటే రాజకీయాలే ముఖ్యమై పోయాయి. ప్రస్తుతానికి హరియాణాను, కేంద్రాన్ని పాలిస్తున్నది బిజెపియే. ఈ తటస్థ వైఖరి మాని కేంద్రం ఏదో ఒకటి చేయకపోతే హరియాణాలోని బిజెపి ప్రభుత్వం ప్రజాగ్రహం చవిచూడక తప్పదు. దాన్ని హరియాణా ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఐఎన్‌ఎల్‌డి సొమ్ము చేసుకోక మానవు. – (సమాప్తం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2016) 

[email protected]

Click Here For Part-1