1966లో పంజాబ్ రాష్ట్రవిభజన జరిగిన దగ్గర్నుంచి నదీజలాల పంపిణీపై పంజాబ్, హరియాణాల మధ్య ఎడతెగని పేచీ నడుస్తోంది. ఇప్పుడది సట్లెజ్-యమునా లింకు కాలువ వివాదరూపంగా పరాకాష్టకు చేరుకుంది. తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం యిరు రాష్ట్రాల పాలకులు దుందుడుకుతనానికి తెగబడ్డారు. న్యాయం ఎవరి పక్షాన వుందో తేల్చి మధ్యస్తం చేయవలసిన కేంద్రం ఏమీ చేయకుండా మన ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదం విషయంలో చేస్తున్నట్లే రెండు రాష్ట్రాలూ కూర్చుని సమస్య పరిష్కరించుకోవాలి అని సుద్దులు చెపుతోంది. వాళ్లకు వాళ్లు పరిష్కారం చేసుకునేట్లయితే నా దాకా ఎందుకు వస్తారన్న యింగితం కూడా లేకపోతోంది వాళ్లకు. తప్పు చేసిన పంజాబ్‌ను మందలిద్దామంటే ఎన్నికలలో దెబ్బ తగులుతుందేమోనన్న ఆరాటం. అందుకే కోర్టుకి అప్పగించాం అంటుంది. కోర్టు పదేళ్ల కోసారి కేసు టేకప్ చేస్తుంది. కోర్టు తీర్పు ఏం వచ్చినా మేం ఖాతరు చేసేది లేదు అని హుంకరిస్తోంది పంజాబ్. ఎందుకిదంతా అంటే ఎన్నికలలో గెలవాలి. అవినీతి, అసమర్థత, మాదకద్రవ్యాల సరఫరా వంటి అనేక ఆరోపణల కారణంగా పంజాబ్‌లోని అకాళీదళ్-బిజెపి ప్రభుత్వం చాలా చెడ్డపేరు తెచ్చుకుంది. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చాలంటే పంజాబ్ పరిరక్షకులుగా పోజు కొట్టాలి. అందుకని ఏకపక్షంగా, దారుణంగా వ్యవహరించారు. ఇక హరియాణాకు వస్తే జాట్ రిజర్వేషన్ ఆందోళనలో చెలరేగిన హింసను అదుపు చేయలేకపోవడం చేత అక్కడి ప్రభుత్వం పరువు పోయింది. అందుకని పంజాబ్‌కు తీసిపోకుండా రాజకీయ చమక్కులు చేస్తున్నారు.
పాలకపార్టీలకు యీ వేషాలు తప్పవు. ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి అని అడిగితే అవి మరీ రెచ్చిపోతున్నాయి. ఇటు అకాలీ దళ్, అటు బిఎన్‌ఎల్‌డి ఎలాగూ ప్రాంతీయపార్టీలే. కానీ జాతీయపార్టీలైన కాంగ్రెసు, బిజెపిలు ఏం చేస్తున్నాయన్నది ముఖ్యం. ఏ రోటి దగ్గర ఆ పాట పాడడం కాంగ్రెసు నైజం. చండీగఢ్ పంజాబ్‌కు చెందాలని పంజాబ్ కాంగ్రెసు, హరియాణాకు చెందాలని హరియాణా కాంగ్రెసుకు తీర్మానాలు చేయడం చిన్నప్పణ్నుంచి చూస్తూ వచ్చాను. ఇప్పుడు బిజెపి కూడా అదే బాటలో నడుస్తోంది. పంజాబ్‌లో ఒక మాట, హరియాణాలో మరో మాట. కేంద్రం అధీనంలో వుండే గవర్నరు యిక్కడ నీళ్లు వదలడం కుదరదంటాడు, హరియాణాకు వెళ్లి వదలకపోతే కుదరదంటాడు. తెలుగు రాష్ట్రాలకు మల్లే అక్కడా యిక్కడా ఆయనే! కేంద్రంలో వున్న బిజెపి ఎటూ చెప్పకుండా, ఎటు మాట్లాడితే ఎక్కడి ఓట్లు పోతాయోనన్న భయంతో వ్యవహరిస్తోంది. ఈ అలుసు చూసుకుని పంజాబ్ ప్రభుత్వం అప్పటికప్పుడు తక్షణ నిర్ణయం తీసుకుని కాలువకై సేకరించిన 3928 ఎకరాలను వెనక్కి రైతులకు యిచ్చేసి, కాలువను పూడ్పించేసి, కోర్టు నిర్ణయం తమకు వ్యతిరేకంగా వచ్చినా దాన్ని అమలు చేయలేని పరిస్థితిని కల్పించింది. ఆంధ్రప్రదేశ్ విభజన కూడా నదీజలాల పంపిణీ పూర్తి కాకుండానే, జరిపేశారు. ఇరుపక్షాలూ యిప్పటిదాకా ఒప్పందాలకు రాలేదు. 2019 నాటికి ఆంధ్ర, తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వాలు ఏ కారణం చేతనైనా అన్‌పాప్యులరై, ఓటమి భయంతో స్థానికుల సెంటిమెంట్లు రెచ్చగొట్టడానికి యిలాటి పనులే చేస్తే ఎలా వుంటుందో వూహించడానికే భయంగా వుంది.
ఈ రోజు పంజాబ్ తన రాష్ట్రం గుండా పారే నీళ్లన్నీ తమవే అని భావిస్తోంది. కానీ వాళ్లకు ఆ నీళ్లు దక్కినది అంతర్జాతీయ ఒప్పందం కారణంగా. 1960లో కుదిరిన ఇండియా-పాకిస్తాన్ వాటర్ ట్రీటీ కారణంగా పంజాబ్‌కు ఆ నీళ్లు వచ్చాయి. ఆనాటి పంజాబ్, హరియాణాతో కూడిన అవిభక్త పంజాబ్. అక్కణ్నుంచి రాజస్థాన్‌కు వెళ్లాలి. హరియాణలోని మెట్టప్రాంతాలను, రాజస్థాన్‌లో కాలువల ద్వారా జరిగే వ్యవసాయాన్ని చూపించి సట్లెజ్, రావి, బియాస్ (వ్యాస్) నదులపై పూర్తి హక్కులు సంపాదించింది భారతదేశం. ఈ రోజు పంజాబ్ విడిపోయినంత హరియాణా, రాజస్థాన్ హక్కులు మాయమై పోవు. వాళ్లను చూపించి పొందిన నీళ్లను వాళ్లక్కూడా పంచాలి. ఆ ప్రాథమిక సూత్రం పంజాబ్ మర్చిపోతే ఎలా? 1966లో రాష్ట్రాన్ని ముక్కలు చేసినపుడు మన తెలుగు రాష్ట్రాలలాగానే నదీజలాల పంపిణీ ఒప్పందం కుదుర్చుకోలేదు. 1976లో కేంద్రం చొఱవ తీసుకుని మిగులు జలాలను పంజాబ్, హరియాణాలకు పంచి, వాటి మళ్లింపుకు సట్లెజ్-యమున నదులను కలిపే 214 కి.మీ. లింకు కాలువ కట్టాలంది. రెండేళ్ల తర్వాత కాలువ పని మొదలైంది. అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కాలువకై భూములు సేకరించి, తవ్వకాలు మొదలుపెట్టాడు. 1977-80 మధ్య జనతా హయాంలో పని మెల్లగా సాగిందని హరియాణా, రాజస్థాన్ గొడవ చేయడంతో 1981లో ఇందిరా గాంధీ పట్టుదలతో మూడు రాష్ట్రాల మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేయించింది. దాని ద్వారా పంజాబ్ వాటా 22% నుండి 25% కి పెరిగింది. ఇకనైనా పని జోరుగా సాగుతుందనుకుంటూండగా పంజాబ్‌లో ఖలిస్తాన్ ఉద్యమం ప్రారంభమైంది. పంజాబ్ ప్రయోజనాలు కాపాడుకోవాలంటే ఏకంగా దేశం నుంచే విడిపోవాలని వేర్పాటువాదులనసాగారు. ఉగ్రవాదుల కంటె తాము ఎక్కువగా పంజాబ్ రక్షకులమని చూపించుకోవడానికి అకాలీదళ్‌కు చెందిన లోంగోవాల్ యీ కాలువ నిర్మాణాన్ని అడ్డుకుంటూ ఉద్యమంలోకి దిగాడు. కాలువ పూర్తయితే నీళ్లన్నీ హరియాణా పట్టుకుని పోయి పంజాబ్ రైతులు నష్టపోతారని వాదించసాగాడు.
నిజానికి దేశంలో రైతు సమస్యలు ఎన్నో వున్నాయి. దేశంలోని రైతులందరూ సంఘటితంగా పోరాడి వ్యవసాయరంగానికై కేటాయింపులు పెంచుకోవాలి, యిరిగేషన్ ప్రాజెక్టులు సత్వరమే కట్టమని పాలకులపై ఒత్తిడి తేవాలి. కానీ రైతులు సంఘటితం కాకుండా వారిని ప్రాంతాల వారీగా విడగొట్టే ప్రయత్నాలు రాష్ట్రప్రభుత్వాలు చేస్తాయి. ఉన్న నీళ్లను వృథా చేయకుండా ఎలా వాడుకోవాలి, నీటి లభ్యత ప్రకారం ఎలాటి పంటలు వేసుకోవాలో రైతులకు ఎలా బోధపరచాలి అనే విషయంపై ధ్యాస పెట్టకుండా 'మనకే నీళ్లు కావాలి, కిందకెలా వదులుతాం?' అని పై రాష్ట్రమూ, 'మన కష్టాలన్నిటికీ కారణం నీరు వదలని పై రాష్ట్రమే' అని దిగువ రాష్ట్రమూ రైతులను రెచ్చగొడతాయి. అందువలన ప్రాజెక్టు గేట్లు పగలగొడతామని, పగలగొడితే మీ తల పగలగొడతామని రెండు పక్కలా రైతులు కర్రలు పట్టుకొని కొట్టుకుంటారు. మన దగ్గరైతే పోలీసులు కూడా ఓ చెయ్యేస్తారు. ఇందిర హత్య తర్వాత అధికారంలోకి వచ్చిన రాజీవ్ గాంధీ లోంగోవాల్‌తో కలిసి 1985లో ఒప్పందం చేసుకుని, పంజాబ్‌లో శాంతి నెలకొల్పాడు. దాని ద్వారా 1985లో అధికారానికి వచ్చిన అకాలీ ప్రభుత్వం పంజాబ్ రైతులను కాలువకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి, త్రైపాక్షిక ఒప్పందం చెల్లదని ఏకపక్షంగా చట్టం చేసింది. అలాఎలా చేస్తావంటూ దాన్ని అదలించడానికి కేంద్రానికి ధైర్యం చాలలేదు. ఖలిస్తాన్ ఉద్యమం చల్లారేవరకూ పంజాబ్ పక్షపాతిగా కనబడడమే మంచిదనుకుంది. చల్లారాక, 1987లో బాలకృష్ణ ఎరాడి అనే సుప్రీం కోర్టు జజ్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ వేసి నీటిని పంచమన్నారు. అప్పుడు పంజాబ్ ఏవో కాకిలెక్కలు చూపిస్తే కమిషన్ ఒప్పుకోలేదు. పంజాబ్‌కు కేటాయింపును సగానికి తగ్గించి, హరియాణా కేటాయింపును రెట్టింపు చేసి, రాజస్థాన్‌కు మాత్రం అలాగే వుంచింది. వెంటనే పంజాబ్‌లో దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. కాలువ పనులు మళ్లీ మొదలైనా లోంగోవాల్ హత్యకు గురయ్యాడు. 1990లో ఎస్‌వైఎల్ ప్రాజక్టు చీఫ్ యింజనియరును, 35 మంది కార్మికులను ఉగ్రవాదులు హత్య చేశారు. దానితో పనులు ఆగిపోయాయి. హరియాణాలో మాత్రం పనులు వేగంగా పూర్తి చేసి నీళ్లు వస్తే తీసుకుందామని రెడీగా కూర్చున్నారు. పంజాబ్‌లో కొన్ని కిలోమీటర్ల మేర పనులు ఆగిపోయాయి. రూ. 700 కోట్లు యిచ్చాం కదా, పని పూర్తి కాలేదేం అని కేంద్రం గట్టిగా ఆడగలేదు. సుప్రీం కోర్టుకి సమస్య నివేదించి తనకు పట్టనట్టుగా కూర్చుంది. 2004లో సుప్రీం కోర్టు కాలువ పనులు చేపట్టాలని ఆదేశించింది. అయితే అప్పుడు పంజాబ్‌లో వున్న కాంగ్రెసు ప్రభుత్వపు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పాత ఒప్పందాల రద్దు చట్టాన్ని తీసుకుని వచ్చి కాలువ పనులు ఆపేసింది. దానిపై హరియాణా ఫిర్యాదు చేసింది. అప్పుడు రాష్ట్రపతికి నివేదించామన్నారు. ఆయన సుప్రీం కోర్టుకు అప్పగించాడు. వాళ్లు పుష్కరం పాటు వూరుకుని యిప్పుడు మొదలుపెట్టారు – సరిగ్గా పంజాబ్‌లో ఎన్నికలు ముంగిట్లో వుండగా! దాంతో సమస్య కు పీటముడి పడింది. – (సశేషం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2016)