ఎమ్బీయస్‌: జానపద చిత్రాలు- 2

మాళవదేశ మహారాజును తమ్ముడే హత్య చేశాడు. తమ్ముడు ఎస్వీరంగారావు. అతని కొడుకు కాంతారావు. అతన్ని గద్దె నెక్కించాలని రంగారావు తన అన్నగారి కొడుకు అంటే యువరాజు ఎన్టీరామారావును చంపుదామని ప్లాను వేశాడు. రెండు సార్లు…

మాళవదేశ మహారాజును తమ్ముడే హత్య చేశాడు. తమ్ముడు ఎస్వీరంగారావు. అతని కొడుకు కాంతారావు. అతన్ని గద్దె నెక్కించాలని రంగారావు తన అన్నగారి కొడుకు అంటే యువరాజు ఎన్టీరామారావును చంపుదామని ప్లాను వేశాడు. రెండు సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాక రామారావు దేశం విడిచి పొరుగుదేశం వెళ్లిపోయాడు. అన్నగారిమీద ఎంతో భక్తి వున్న కాంతారావు చాలా ఫీలయ్యాడు.

పొరుగుదేశంలో రాజుగారిని శత్రువులు బంధించారు. రాకుమార్తెను ఎత్తుకుపోయారు. ఈ జయసింహుడు .. అంటే రామారావు..భవానీ అని పేరు మార్చుకుని ఆమెను రక్షించాడు. ఆమెను ప్రేమించాడు. తర్వాత రాజుని రక్షించాడు. తర్వాత ఓ మాజీ సైనికుడు యింట ఆశ్రయం పొందాడు. ఆ సైనికుడి కూతురు అంజలి. కొడుకు రేలంగి. 

ఇక్కడో మాట చెప్పాలి. జానపద సినిమాలన్నిటిలోనూ ఓ హాస్యగాడు తప్పనిసరి. హీరోచేసే పని సామాన్యులకు ఎంత అసాధ్యమైనదో చెప్పాలంటే హాస్యగాడు ముందు వెళ్లి బోల్తా పడి రావాలి. సర్కస్‌లో చూడండి. వెయిట్‌ లిఫ్టర్‌ బరువులు ఎత్తేముందు బఫూన్‌ ఎత్తబోయి బోర్లాపడి చూపుతాడు. అప్పుడే మనకు వెయిట్‌ లిఫ్టర్‌ మీద గౌరవం పెరుగుతుంది. అలాగే జానపదగాథల్లో అపురూపమైన ఓ పుష్పమో, ఫలమో వుంటుంది. అది సాధిద్దామని ఓ విలనో, విదూషకుడో వెళ్లి విఫలమవ్వాల్సిందే! అప్పుడే హీరోగారి గారు వన్నెకెక్కుతారు. అందువల్ల జానపద సినిమాల్లో ఓ రేలంగో, ఓ బాలకృష్ణో, ఓ పద్మనాభమో ఉండి తీరతారు.

ఈ దేశంలో విలన్‌ సేనాపతి. ఈ సేనాపతులెప్పుడూ చెడ్డవాళ్లు గానే వుంటారు అదేమిటో! రాజుగార్ని పదవీచ్యుతుణ్ని చేసి, రాకుమారిని చేపడదామని చూసే సేనాపతులు జానపద సినిమాల్లో కోకొల్లలుగా కనబడతారు. ఈ సేనాపతి వేషాలను రాజనాల గుత్తకు తీసుకున్నారు. నిజానికి ఆయనకూడా జానపద సినిమాల్లో ఆస్థాన విలన్‌గా వేసేద్దామని ఊహూ ఉబలాట పడలేదు. 'ప్రతిజ్ఞ' అనే సినిమాలో విలన్‌గా తెరకు పరిచయమైనా ఆ తర్వాత 'వద్దంటే డబ్బు' లాటి సినిమాల్లో హాస్యపాత్రలు, ముసలిపాత్రలు వేశాడు. కానీ విలన్‌గానే ఆయన రాణించాడు. దానికి ఈ 'జయసింహ' సక్సెస్‌ ఒక కారణం. రామారావుకు ఈడైన విగ్రహం, ఫోర్సు వున్నవాడు కాబట్టి వారిద్దరి జోడీ బాగా హిట్‌ అయింది.

ఇంతకీ ఈ సేనాపతిగారు కూడా రాకుమారిని వలచాడు. హీరోగారి బాబాయి పొరుగుదేశం నుండి పంపిన ఇంకో పెద్దమనిషితో చేతులు కలిపి మహారాజును బంధించారు. వారిని రక్షించడానికి వెళ్లిన హీరోకూడా బందీ అవుతాడు. అంజలీదేవి కాస్సేపు హీరో తనను ప్రేమిస్తున్నాడని భ్రమపడి, తర్వాత అతను యువరాణిని మాత్రమే ప్రేమించి తనను సోదరిగా భావిస్తున్నాడని గ్రహించి, అతన్ని విడిపించే యత్నంలో ప్రాణత్యాగం చేసింది. పైగా కాంతారావు అన్నగారిని వెతుక్కుంటూ వచ్చి సహాయపడ్డాడు. ఈ రాజ్యంలో విజయం సంపాదించాక తన రాజ్యంలో కూడా హీరోకి విజయం సిద్ధిస్తుంది. చెడ్డవాడైన రంగారావు కొడుకు చేతిలోనే హతం అయ్యాడు. ఇదీ కథ. 

1955 నాటి ఈ 'జయసింహ' సినిమాలో హీరో కత్తి మీదనే కథంతా నడిచింది. అతనికి సహాయంగా కొన్ని మంచిపాత్రలూ, అడ్డు తగిలేందుకు కొన్ని దుష్టపాత్రలూ వున్నాయి. హీరో కదన కౌశలం మీదనే కథ నడవాలి కాబట్టి సినిమా మొదట్లో గండ్రగడ్డలి పోరాటం వుంటుంది. తర్వాత కాగడాల యుద్ధం వుంటుంది.  వీటన్నిటికీ తోడు పాటలు చాలా బాగుంటాయి. అన్నట్టు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే – అదేమిటోకానీ మన తెలుగు జానపదాలన్నిటిలోనూ పాటలు చాలా బాగుంటాయి. మంచి హుషారుగా వుంటాయి. 

శక్తి ప్రధానమైన సినిమాల్లో హీరోకి మాత్రమే సాహసం వుంటుందని, హీరోయిన్‌ ఆర్తనాదాలు చేస్తూంటుందని, మాంత్రికుడి చెరలో చిక్కి హీరో ఎప్పుడొస్తాడాని పాటలు పాడుతూంటుందని అనుకుంటే పొరబాటు. 'జయసింహ'లో అంజలీదేవిది సాహసాలు చేసే పాత్రే! యుద్ధం చేసి చచ్చిపోతుంది. 'చండీరాణి' సినిమాలో నైతే భానుమతి చెలరేగిపోతుంది. రామారావు హీరో అయినా యుద్ధాలు గట్టిగా చేసేది భానుమతే! ఆ సినిమా కథ చెపుతాను వినండి –

అమర్‌నాథ్‌ ఓ రాజుగారు. ఓ నర్తకిని చూసి యిష్టపడి ఆమెను చేపడతాడు. ఆమెకు కవల ఆడపిల్లలు పుడతారు – చంపారాణి, చండీ రాణి అని. రాజుగారికి సేనాని వుంటాడు. ఇది జయసింహకు రెండేళ్ల ముందు – అంటే 1953లో వచ్చిన సినిమా కాబట్టి ఆ సేనాని రాజనాల కాదు, యస్వీ రంగారావు. అతను ఈ నర్తకికి విషప్రయోగం చేసి చంపేశాడు. రాజుగారిని చెరసాలలో పెట్టాడు. రాజుగారి విధేయుడైన మంత్రి ఈ కవలపిల్లల్లో ఓ పిల్లను కోట దాటించి అడవులకు పంపేశాడు. ఈ విషయం తెలిసి సేనాని మంత్రిని చంపేశాడు. తనే రాజయి పాలన సాగించాడు. పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. 

ఈ చంపారాణి, చండీరాణి – ఒకరు కోటలో, మరొకరు తోటలో – యిద్దరూ భానుమతులే!  కోటలో అమ్మాయి సాత్త్వికురాలు, తోటలో అమ్మాయి చండప్రచండురాలు. కోటలో అమ్మాయి మంత్రి కుమారుడు – రామారావును –  ప్రేమించింది. సేనాని కొడుకు రేలంగి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకుని తాపత్రయపడుతున్నాడు. రామారావు అనుకోకుండా అడవికి వచ్చి చండీరాణిని చూశాడు. చండీరాణి కూడా అతన్ని ప్రేమించింది. అతను మాత్రం చంపారాణిని మాత్రమే యిష్టపడ్డాడు. 

ఇతని సహాయంతో కోటలోకి వచ్చి తన తండ్రి రంగారావుని చూసిన చండీరాణి తను ప్రేమించిన రామారావు, అక్క చంపారాణి పాడుకుంటున్న ప్రేమగీతం విని విషయం గ్రహించింది. దు:ఖంతో అడవిలోకి వెళ్లిపోయింది. ఈలోగా రంగారావు రామారావును బంధించాడు. చండీరాణి ప్రజల మద్దతు కూడగట్టి వారి సహాయంతో రంగారావుపై తిరుగుబాటు చేసింది. ఆ పోరాటంలో రంగారావు, చండీరాణి యిద్దరూ ఒకరి నొకరు పొడుచుకుని చచ్చిపోయారు. చచ్చిపోయేముందు చంపారాణిని, రామారావును కలిపి మరీ చచ్చిపోయింది చండీరాణి. 

ఈ సినిమాను మూడుభాషల్లో తీశారు భానుమతి. ద్విపాత్రాభినయంతో బాటు డైరక్షన్‌ కూడా. సంగీతంలో కూడా పాలు పంచుకున్నారు. సినిమా హిట్‌ అయింది. అందువల్ల తెరమీదనే కాదు, తెర వెనుక కూడా ఓ మహిళ యొక్క శక్తియుక్తులు నిరూపితమయ్యాయన్నమాట! ఈ కథలో కోట-తోట అనే మాటలు వినగానే మీకో పాట గుర్తుకు వచ్చి వుండాలి. 'కోటలో పెరిగినొకడు భూపాలుడై, తోటలో పెరిగె నొకడు గోపాలుడై' అని టియం సౌందర్‌రాజన్‌ గొంతెత్తి చాటిన పాట ఒక్కసారి వింటే పదిసార్లు విన్నట్టే! ఆ సినిమాలో మగవాళ్లు యిలా విడిపోతారు. వీళ్లిద్దరూ రాజుగారి కొడుకులే! రాజుగారు, ఆయన తమ్ముడు రాజ్యం గురించి కొట్లాడుకుని ప్రాణాలు తీసుకోవడం చూసిన రాణిగారు తన కవల పిల్లలు కూడా యిలాగే కొట్టుకు ఛస్తారేమోనని చిన్నతనంలోనే వారిని వేరు చేస్తుంది. ఒకడు కోటలో వుండి భూపాలుడు అవుతాడు. రెండోవాడు ఓ గొర్రెల కాపరికి దొరికి గోపాలుడవుతాడు. 

రాజసింహాసనం అంటే అనుక్షణం ప్రమాదమే కదా, రాజుగారి దాయాది ఒకడు భూపాలుడిని చంపుదామని చూస్తుంటాడు. అతని బారినుండి యితన్ని గోపాలుడు అనుకోకుండా కాపాడతాడు. అప్పుడు తన పోలికల్లో వున్నాడు కదాని, అతన్ని తన స్థానంలో కోటలో పెట్టి, గోపాలుడి సామాన్యుడిలా తన ప్రేయసి దగ్గరకు వెళ్లాడు. అక్కడ అతన్ని శత్రువులు బంధించారు. చివరకు గోపాలుడు అన్నగార్ని, రాజ్యాన్ని రక్షించాడు. నీతి ఏమిటంటే – రాజుగా వుండి కత్తి తిప్పినవాడి కంటె సామాన్యుడిగా వుండి కత్తితిప్పిన వాడికి ప్రేక్షకాదరణ ఎక్కువుంటుంది. అండర్‌డాగ్‌ అంటే అందరికీ అభిమానమే కదా! 

చిరంజీవి సినిమా ఒకటి యిలాగే వుంటుంది. 'దొంగమొగుడు' లో పెద్ద ఇండస్ట్రియలిస్టు చిరంజీవి తన శత్రువులు కల్పించిన సాలిగూడులో పడి కొట్టుకుంటాడు. అతనిలాగానే వుండి లుంగీ ఎగ్గట్టే రోడ్‌సైడ్‌ ఫెలో అతని స్థానంలోకి వెళ్లి అసలువాడు చూపలేని చొరవ చూపించి, శత్రువుల ఆట కట్టిస్తాడు. ఇండస్ట్రియలిస్టు మేధావిగారు పాపం దీనంగా మిగిలిపోతారు. ఇలాటి వాటిల్లో రెండు పాత్రలూ ఒకే హీరోకి యిస్తారు కాబట్టి వాళ్లు అభ్యంతరం పెట్టుకోకుండా వేషం కడతారు. లేకపోతే రెండోవాడే మార్కులన్నీ కొట్టేస్తాడు. సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2015)

[email protected]

Click Here For Archives