ఎమ్బీయస్‌: జానపద చిత్రాలు- 7

ఈ సందర్భంలో ఈ సినిమా గురించి కాస్త చెప్పుకోవాలి -'పాతాళభైరవి' కి దర్శకత్వం వహించిన కెవిరెడ్డిగారే దీనికీ దర్శకత్వం వహించారు. సూపర్‌ డూపర్‌ హిట్‌ చేశారు. కథ సగం దాకా కింగ్‌ లియర్‌ను పోలి…

ఈ సందర్భంలో ఈ సినిమా గురించి కాస్త చెప్పుకోవాలి -'పాతాళభైరవి' కి దర్శకత్వం వహించిన కెవిరెడ్డిగారే దీనికీ దర్శకత్వం వహించారు. సూపర్‌ డూపర్‌ హిట్‌ చేశారు. కథ సగం దాకా కింగ్‌ లియర్‌ను పోలి వుంటుంది. ఓ రాజుగారికి భార్య పోయింది. ముగ్గురు కూతుళ్లు.  వాళ్లంటే చాలా ప్రేమ. వాళ్లూ తనంటే చాలా యిష్టంగా వుండాలని, లోకంలో అందరి కంటె మిన్నగా తననే ప్రేమించాలనీ అతని ఆశ. ముగ్గురిలో ఎవరికి తనపై ఎక్కువ ప్రేమో తెలుసుకుందామని ఓ సారి రాజసభలో అందరి ఎదుటా తన కూతుళ్లను అడుగుతాడు. పెద్ద కూతుళ్లిద్దరూ 'నువ్వే మా దైవం' అన్న లెవెల్లో చెప్తారు కానీ మూడో కూతురు గుణసుందరి – మన హీరోయిన్‌ – 'పెళ్లయేవరకే నాకు నువ్వు ముఖ్యం. తర్వాత గౌరవ ఆదరాభిమానాలే యిస్తాను తప్ప పరిపూర్ణ ప్రేమ భర్తకే దక్కుతుందని' చెప్పింది. 

తండ్రికి  మండిపోయింది. 'ఆ భర్త కురూపి, కుంటివాడు, గుడ్డి, మూగ, చెవిటివాడయినా వాణ్నే ప్రేమిస్తావా?' అని అడిగాడు. 'నిక్షేపంలా' అంది కూతురు. రాజుగారికి మండిపోయింది. మర్నాడు రాజ్యంలో అవిటివాళ్లందరినీ పిలిచి అన్నిరకాల అవలక్షణాలూ వున్నవాణ్ని ఆ అమ్మాయికి కట్టబెట్టాడు. పెద్ద కూతుళ్లిద్దరికీ తన మేనల్లుళ్లను కట్టబెట్టి రాజ్యంలో భాగం యిచ్చాడు. గుణసుందరి భర్త పేరు దైవాధీనం. శివరావు వేశారా పాత్ర. ఆయన పెర్సనాలిటీ చూసి వుంటే ఎంత అందంగా వుంటాడో వేరే చెప్పనక్కరలేదు. పెళ్లయ్యాక తను అనాకారినే తప్ప అవిటివాణ్ని కాదని నిరూపించాడు. రాజుగారికి బుద్ధి చెప్పాలనే అతను అలా నటించాడు. అది తెలిసి రాజుగారు అల్లుడిమీద చేయి చేసుకోబోయి మెట్లమీద నుండి దొర్లిపడి కాలు విరక్కొట్టుకున్నాడు. కూతురినీ, అల్లుణ్నీ కోటనుంచి వెళ్లగొట్టాడు. 

రాజుగారి విరిగిన కాలు కోతిపుండు బ్రహ్మరాక్షసయినట్టు అయ్యింది. కాలు తీసేయాలన్నారు వైద్యులు. పెద్ద కూతుళ్లు పట్టించుకోవడం మానేశారు. రాజులో పశ్చాత్తాపం ప్రారంభమైంది. తన వైద్యం గురించి అంజనం వేయించాడు.  మహేంద్రమణి అనే సకలవ్యాధి నివారిణిని తెస్తే తప్ప నయం కాదని తెలిసింది. అది యక్షిణుల కాపలాలో వుంది. మణి తెచ్చినవారికి రాజ్యం యిస్తానని ప్రకటించాడు రాజు. పెద్ద కూతుళ్లు తమ భర్తలను బయలుదేరదీశారు. 

దైవాధీనం అసలు ఓ రాకుమారుడు. కామరూప విద్య నేర్చుకోవాలనే తాపత్రయంలో గురువుగారి శాపానికి గురయి యిలా అనాకారి అయ్యాడు. ఆ విషయం భార్యకు చెప్పి ఊరడించాడు. ఆమె తండ్రికై మహేంద్రమణి తీసుకురమ్మనమని భర్తను కోరింది. అతను బయలుదేరాడు. దారిలో తోడల్లుళ్లు కలిశారు. వాళ్లు రేలంగి, జోగారావు. యక్షిణుల వద్ద వాళ్లు ఫెయిలయిపోతారు. ఎందుకంటే వాళ్లు చిత్రమైన షరతులు పెట్టారు. ఒకామె తన మోకాలు కదల్చగలవాడికి దారి చూపిస్తానంది. రెండవ ఆమె ముందుకు దారి చూపాలంటే తనను నవ్వించాలంది. ఇక మూడో ఆమె తనను ప్రేమలో పడవేయగలవాడికే మహేంద్రమణిని చూపించగలనని రూలు పెట్టింది. ఈ షరతులు గెలవడానికి పాతాళభైరవిలో లాగ రాతి గదలు, మంటల్లో ఉరకడాలూ లేవు. ఈ యువతులను యుక్తితో గెలవాలి. అది దైవాధీనం చేశాడు. మణిని సంపాదించాడు. మణి సంపాదించాక కూడా కథ వుందనుకోండి. అది ప్రస్తుతానికి అప్రస్తుతం. విషయం ఏమిటంటే హీరో శారీరకంగా అర్భకుడైనపుడు శక్తి కంటె యుక్తి పనికి వస్తుందని చెప్పడానికి ఈ కథ చెప్పాను. 

ఒక్కోప్పుడు హీరో కంటె విలన్‌ బలవంతుడు కావచ్చు. అప్పుడు కూడా యుక్తే ఉపయోగించాలి. 'గురువును మించిన శిష్యుడు' సినిమాలో విలన్‌ గురువుగారే! ఆయన వద్దనే హీరో అన్ని అస్త్రాలు, శస్త్రాలు, టక్కుటమార విద్యలు నేర్చాడు. మరి ఆయన్ని ఎదిరించ వలసి వస్తే ఎలాగ? 'గురువును మించిన శిష్యుడు' సినిమాలో ఏమవుతుందంటో ఓ రాజుగారు యుద్ధంలో ఓడిపోయి పారిపోతూ తన ఇద్దరు కుమారులను ఓ గురువుగారి సంరక్షణలో వదిలిపెట్టి సాకమని కోరాడు. యుక్తవయసు వచ్చాక పిల్లలని తీసుకుపోతానన్నాడు. గురువుగారు ఓ షరతు పెట్టాడు. యుక్తవయసు వచ్చాక ఇద్దరిలో ఒకరిని తనకు యిచ్చేయాలన్నాడు. సరేనన్నాడు రాజు. గురువుగారు ఇద్దరు పిల్లల్లో ఒకడికి మాత్రమే – అతను కాంతారావు – అన్ని విద్యలూ నేర్పాడు. ఇంకోడిని మొద్దు రాచ్చిప్పలా చేసి పనులు చేయడానికి ఉపయోగించుకున్నాడు. అతను బాలకృష్ణ. పిల్లలను అప్పగించే రోజు వచ్చేసరికి రాచ్చిప్ప బాలకృష్ణను పండితుడిగా, పండితుడు కాంతారావుని రాచ్చిప్పగా రాజు ముందు ప్రదర్శించి రాజును మభ్యపెడదామని ప్లాను వేశాడు. 

అయితే కాంతారావు ముందు రాత్రే చిలక రూపంలో వచ్చి తలిదండ్రులను హెచ్చరించాడు – ఎవరు పండితుడిలా కనబడితే వాణ్నే మీరు ఎంచుకుంటారని గురువుగారు ఈ యెత్తు యెత్తారు. మీరు జాగ్రత్త పడండి అని. మర్నాడు గురువుగారు అలాగే చేశారు. వీళ్లు తెలివిగా 'పండితుడు ఎలాగైనా బతకగలడు. రాచ్చిప్పలాటివాడే బతకడం కష్టం కనుక మేం వాణ్నే తీసుకుంటాం' అని కాంతారావును తీసుకు వచ్చేశారు. గురువు తెల్లబోయాడు. దివ్యదృష్టితో జరిగిన మోసం గమనించాడు. ఇక అక్కణ్నుంచి శిష్యుణ్ని వెంటాడాడు. ఆ తర్వాత కాంతారావు చిలక రూపంలో రాకుమారి అంత:పురంలో ఆశ్రయం పొందడం గట్రా ఏదో కథ వుందనుకోండి. చివరకు గురువుగారు నేర్పిన పరకాయ ప్రవేశ విద్యతోనే ఆయన్ను బోల్తా కొట్టించి మట్టుపెడతాడు. అలాటి సందర్భాల్లో కూడా యుక్తి పనికి వస్తుంది. 'అగ్గిదొర' సినిమాలో హీరో అష్టకష్టాలూ పడతాడు. అనుకోకుండా అతనికి అతీంద్రియ శక్తులు లభిస్తాయి. అప్పుడు యుక్తితో తన శత్రువులను మట్టుపెడతాడు.

ఒక్కోప్పుడు ప్రత్యర్థులుగా యిద్దరు హీరోలుంటే యిద్దరికీ సమానమైన ఇంపార్టెన్స్‌ వుంటుంది. 'చిక్కడు-దొరకడు' సినిమాలో రామారావు, కాంతారావు యిద్దరూ హీరోలే! ఇద్దరూ ఓ హారం సంపాదించడానికి ఒకరితో ఒకరు పోటీ పడతారు. ఓ పక్క కత్తులతో పోట్లాడుకుంటున్నా, యెత్తుకు పై యెత్తులు వేసుకుంటూ కథ నడుపుతారు. వీటిలో కూడా యుక్తికే ప్రాధాన్యం. ఒక్కోప్పుడు ప్రత్యర్థులుగా హీరో, హీరోయిన్లు తారసపడతారు. అటువంటి వాటిలో చెప్పుకోదగ్గది 'రేచుక్క.' అందులో రామారావు, అంజలి ఒకే రత్నాలహారం గురించి పోటీపడ్డట్టు చూపించారు. ఆ హారం రాకుమారి దేవికది. ఆ రాకుమారి తండ్రి ఒకప్పుడు రామారావు తండ్రి వద్ద మంత్రి. రాజుగారి వద్దకు వెళ్లి మీ అబ్బాయికి మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి అన్నాడు. ఆయన నీ అంతస్తేమిటి? నా అంతస్తేమిటి? అన్నాడు. నీ పని యిలా వుందాని రాజుగారిని చెరసాలలో పడేసి రాకుమారుణ్ని పరలోకం పంపేయబోతూంటే వీరన్న అనే అతన్ని కాపాడి తను జైలుపాలయ్యాడు.

ఆ రాకుమారుడు ఆటవికుల మధ్య పెరిగి ఎన్టీ రామారావు అయ్యాడు. ఆ వీరన్న కూతురు అంజలి అయ్యి దొంగ అయింది. ఇక రామారావు, అంజలి మధ్య ఎత్తుపైయెత్తులు. ఈ లోగా అప్పటి మహామంత్రి, ఇప్పటి మహారాజు అయిన దేవిక తండ్రి వద్ద పనిచేసే వాడికి ఆశ పుట్టి మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకోండి అన్నాడు. ఇతనూ నీ అంతస్తేమిటి? నా అంతస్తేమిటి? అని అడిగి ముప్పు తెచ్చుకున్నాడు. కుట్రలూ, కూహకాలూ, ఎత్తులు – పై యెత్తులతో కథ నడుస్తుంది. 

ఏది ఎంతైనా హీరో శక్తితో సాధించినది, హీరోయిన్‌ యుక్తితో సాధిస్తే చూడ్డానికి అందంగా వుంటుంది. జేమ్స్‌బాండ్‌ టైపు సినిమాల కాలంలో విజయలలిత రౌడీరాణి, రివాల్వర్‌ రాణి అంటూ చాలా సినిమాల్లో వేశారు. ఎదురుగా చెట్టంత విలన్‌ ఏ ఆనంద్‌మోహన్‌ లాటి వాడో వుంటాడు. ఈమె అతనిలో సగం ఎత్తుంటుంది. ఎగిరెగిరి అతని గుండెలమీద తన్ని కింద పడేసి మట్టికరిపించినట్టు చూపించేవారు. బొత్తిగా అసహజంగా తోచేది. ఏదో భానుమతి లాటి పెర్శనాలిటీ వున్న మనిషి 'చండీరాణి' లాటి సినిమాలో కత్తి తిప్పినా నమ్మబుల్‌గానే వుండేది. కానీ మొత్తం మీద చూస్తే ఆడవాళ్లు మగవాళ్ల కంటె శక్తి ప్రదర్శన చేస్తే చూడముచ్చటగా వుండదు. అందువల్ల యుక్తి ప్రదర్శనే మేలు. అలాటి సినిమాల్లో ఒకటి 'స్త్రీ సాహసం' (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2015)

[email protected]

Click Here For Archives