ఎమ్బీయస్‌: కన్నయ్యను హీరో చేసేస్తున్నారు – 3/5

జెఎన్‌యుకు వస్తే – లెఫ్ట్‌ యూనియన్లలో అన్నిటికంటె పాతదైన ఏఐఎస్‌ఎఫ్‌, సిపిఐకు అనుబంధంగా పనిచేస్తుంది. దానికి బలం తగ్గుతూ వచ్చింది. దానికి సంబంధించిన కన్నయ్య గత ఏడాది సెప్టెంబరులో అనుకోకుండా గెలిచాడు. ఏఐఎస్‌ఎఫ్‌లాగే సిపిఎంకు…

జెఎన్‌యుకు వస్తే – లెఫ్ట్‌ యూనియన్లలో అన్నిటికంటె పాతదైన ఏఐఎస్‌ఎఫ్‌, సిపిఐకు అనుబంధంగా పనిచేస్తుంది. దానికి బలం తగ్గుతూ వచ్చింది. దానికి సంబంధించిన కన్నయ్య గత ఏడాది సెప్టెంబరులో అనుకోకుండా గెలిచాడు. ఏఐఎస్‌ఎఫ్‌లాగే సిపిఎంకు సంబంధించిన ఎస్‌ఎఫ్‌ఐ యిటీవలి కాలంలో క్షీణించి, సిపిఐ(ఎమ్‌ఎల్‌)కు అనుబంధంగా వుండే ఏఐఎస్‌ఏ బలపడింది. అందరికంటె తీవ్రవాద సంస్థ అయిన డిఎస్‌యు అన్నిటికంటె చిన్నది. ఎన్నికల ప్రక్రియలో నమ్మకం లేదంటూ అది ఎన్నికలలో పాల్గొనదు కాబట్టి దాని బలం యింత అని యితమిత్థంగా చెప్పలేం. దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కుంటున్న ఉమర్‌ ఖాలిద్‌ వగైరాలు యీ యూనియన్‌కు చెందినవారే. యూనియన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన కన్నయ్య మొదటినుంచి ఆరెస్సెస్‌ భావజాలానికి, ఎన్‌డిఏ ప్రభుత్వవిధానాలకు వ్యతిరేకే. వామపక్షాల ఐక్యత లేకపోవడం చేతనే రైటిస్టు శక్తులు దేశంలో చొచ్చుకుపోతున్నాయని తన ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పాడు. ఇవన్నీ ఎబివిపికి రుచించే వ్యవహారం కాదు. జెఎన్‌యును తన అదుపులోకి తెచ్చుకుందామని బిజెపి ప్రయత్నిస్తోంది. జెఎన్‌యు రాజకీయంగా ఎప్పుడూ చురుగ్గానే వుంది. దాని విద్యార్థులు ఎమర్జన్సీకి వ్యతిరేకంగా జైళ్లకు వెళ్లారు, 1984 శిఖ్కులపై దాడుల్లో శిఖ్కులను దాచారు, యివన్నీ బాగానే వున్నాయి కానీ గోధ్రా అల్లర్ల తర్వాత ప్రదర్శనలు జరపడంతో మోదీకి ఒళ్లుమంట వుంది. నాలుగు నెలల క్రితం ఆరెస్సెస్‌ వారి ''పాంచజన్య'' పత్రిక జెఎన్‌యును తన కవరుపేజీపై వేసి కథనం వేయడంతో సుబ్రహ్మణ్యం స్వామిని వైస్‌ ఛాన్సెలర్‌గా వేస్తున్నారని పుకార్లు వచ్చాయి. స్వామి యిప్పుడు యీ గొడవల తర్వాత 'ఆపరేషన్‌ సానిటైజ్‌ జెఎన్‌యు' యిప్పుడే ప్రారంభమైంది అంటూ ట్వీట్‌ చేశాడు. చివరకు స్వామికి బదులు జనవరి ఆఖరి వారంలో మామిడాల జగదీశ్‌ కుమార్‌ అనే తెలుగాయన్ని, ఐఐటి ప్రొఫెసర్ని విసిగా వేశారు. ఆయనను వేసినప్పుడే గతంలో ఆరెస్సెస్‌ నిర్వహించిన సైన్సు సదస్సుకి హాజరయ్యాడని విమర్శలు వినబడ్డాయి. నిర్వాహకులు ఎవరైనా, సైన్సుకి సంబంధించినది కాబట్టి హాజరయ్యానని ఆయన చెప్పుకున్నాడు. పాత కథ ఎలా వున్నా పదవి చేపట్టిన కొన్ని రోజులకే ఆయన చర్యలు వివాదాస్పదమయ్యాయి. 

వివాదానికి దారి తీసిన ఫిబ్రవరి 9 నాటి సంఘటనల పూర్వాపరాలు చూడబోతే – మార్క్సిస్ట్‌-లెనినిస్ట్‌-మావోయిస్ట్‌ భావజాలానికి చెందిన డిఎస్‌యు (డెమోక్రాటిక్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌) గతంలో జెఎన్‌యులో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది. కశ్మీర్‌ దుస్థితిని చూపించే 'ద కంట్రీ విదవుట్‌ ఎ పోస్టాఫీస్‌', ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ను విమర్శించే కార్యక్రమం, సైన్యానికి విశేషాధికారాలు యివ్వడాన్ని నిరసించే కార్యక్రమం యిలాటివి ప్రదర్శించింది. కశ్మీర్‌ ప్రజలకు, ఈశాన్యప్రాంతాల ప్రజలకు యీ దేశంలో భాగంగా వుండాలో లేదో తేల్చుకునే హక్కు యివ్వాలని వాదించే యీ సంస్థకు సిపిఐ (ఎమ్‌ఎల్‌)తో కాని, కశ్మీర్‌, ఈశాన్యప్రాంతాల్లో పనిచేసే మిలిటెంట్‌ గ్రూపులతో కానీ ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు యిప్పటిదాకా ఎవరూ నిరూపించలేదు. అయితే డిఎస్‌యులో విప్లవాత్మకత, లింగవివక్షతపై స్పృహ తగినంతగా లేదని వాదిస్తూ 10 మంది విద్యార్థుల బృందం బయటకు వచ్చేసింది. వీళ్లు కొత్త సంస్థ పెడదామనుకుని దానికి భూమిక ఏర్పరచడానికి కర్టెన్‌రైజర్‌గా ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేద్దామని తలపెట్టారు. అఫ్జల్‌ గురు ఉరికి నిరసన, కశ్మీరులో వున్న సైన్యం చేస్తున్న అత్యాచారాలు, కశ్మీర్‌ పౌరులకు స్వయం నిర్ణయాధికారం యిత్యాది విషయాలపై అవగాహన కల్గించేందుకు బాడ్మింటన్‌ కోర్టులో సాయంత్రం నిర్వహించే యీ కార్యక్రమానికి కవులను, గాయకులను, రచయితలను, విద్యార్థులను, మేధావులను ఆహ్వానించాలని నిశ్చయించారు. గతంలో డిఎస్‌యు విధానాలతో ఏకీభవించనివారు కూడా వారి కార్యక్రమాలకు హాజరవుతూండేవారు. 

జెఎన్‌యు ఆనవాయితీ ప్రకారం ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు అతికించారు. కరపత్రాలు పంచారు. అఫ్జల్‌ గురు ఉరితీతకు వ్యతిరేకంగా 2014లో, 2015లో కూడా యిలాటి ప్రదర్శనలు జరిగాయి. అయితే యీ సారి మాత్రం ఎబివిపి యీ కార్యక్రమానికి అభ్యంతరం తెలిపింది. కార్యక్రమం ప్రారంభం కావడానికి అరగంట ముందు వారు  జెఎన్‌యు అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగు ముందు గుంపుగా చేరి అనుమతిని వెనక్కి తీసుకోమని డిమాండ్‌ చేయసాగారు. వారి అభ్యంతరాన్ని పరిగణించి, కార్యక్రమం కొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోందనగా విసి అనుమతి నిరాకరించారు. విద్యార్థులు అనుమతి కోరినప్పుడు అఫ్జల్‌ గురు విషయం ప్రస్తావించలేదంటారు హోం శాఖ సహాయ మంత్రి. అలాటప్పుడు అఫ్జల్‌ మాట ఎత్తకూడదనే షరతులతో కూడిన అనుమతి యివ్వవచ్చు. విసి అది చేయలేదు. పైగా నిరాకరిస్తున్న విషయాన్ని నిర్వాహకులకు చెప్పలేదు. వారి సెల్‌ ఫోన్లు అప్లికేషన్‌లో వున్నా మెసేజ్‌ పంపలేదు.  సెక్యూరిటీ వాళ్లకు మాత్రం ఎస్సెమ్మెస్‌ పంపి బాడ్మింటన్‌ కోర్టు దగ్గరకు ఎవర్నీ రానివ్వద్దన్నారు. ఇదో తమాషా! అప్పటికే కొందరు అక్కడ గుమిగూడారు. వారిలో బయటవాళ్లు కూడా వున్నారు. దాంతో ఆ విద్యార్థులు స్థలం మార్చి, క్యాంపస్‌లోనే ఒక ధాబా దగ్గర చేరి తమకు అనుమతి నిరాకరించిన యూనివర్శిటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన తెలిపసాగారు. అఫ్జల్‌ గురు ఉరికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. 

ఇంతలో కొందరు ఎబివిపి విద్యార్థులు జీ న్యూస్‌ జర్నలిస్టులు, కెమెరాలతో సహా అక్కడకు చేరుకున్నారు. టీవీ వాళ్లను వెంటేసుకుని రావడం వల్లన ముందే పథకం వేసుకున్నారన్న అనుమానం కలుగుతోంది. వచ్చి 'జాతివిద్రోహుల'కు వ్యతిరేకంగా నినాదాలివ్వసాగారు. దానికి ప్రతిగా కార్యక్రమ నిర్వాహకులు 'మతతత్వవాదుల'కు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. వామపక్షవాదులందరూ జాతివ్యతిరేకులే అంటూ ఎబివిపి స్లోగన్స్‌ యివ్వసాగింది. దీనితో తక్కిన వామపక్ష విద్యార్థి నాయకులు కూడా  అక్కడకు వచ్చి చేరారు. వాళ్లల్లో కన్నయ్య కుమార్‌ ఒకడు. అతను సర్దిచెప్పడానికి, గొడవలు లేకుండా ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోతే మంచిదని చెప్పడానికీ ప్రయత్నించాడు. కానీ అటుయిటు నినాదాలు హోరెత్తాయి. లెఫ్టిస్టులు సంఘ్‌ పరివార్‌ ఫ్యూడలిస్టులని, మతవాదులని, కులతత్వవాదులని కేకలు వేయగా ఎబివిపి ''వందేమాతరం'', ''భారత్‌మాతా కీ జై'' ''భారత్‌ కే గద్దారోంకో ఏక్‌ ధక్కా ఔర్‌ దో'' వంటి నినాదాలు చేస్తూ అక్కడున్న కశ్మీరీ విద్యార్థులను 'మీరు దేశద్రోహులు, పాకిస్తాన్‌ ఏజంట్లు' అని కూడా నిందించారు. దీనికి ప్రతిగా కశ్మీరు లోయలో వేర్పాటువాదులు యిచ్చే ''భారత్‌ తేరే టుక్‌డే హోంగే'', ''ఇన్షా అల్లా, ఇన్షా అల్లా జంగ్‌ చలేగీ, భారత్‌కీ బర్‌బాదీ హోగీ'' నినాదాలు చెలరేగాయి. 

ఈ అంశాన్నే జెఎన్‌యుకు వ్యతిరేకంగా అందరూ వుపయోగిస్తున్నారు. మొదటగా గుర్తించుకోదగినది జెఎన్‌యు 47 ఏళ్ల చరిత్రలో దేశద్రోహులకు, టెర్రరిస్టులకు ఆశ్రయం యిచ్చిన రికార్డు లేదు. రెండోది అక్కడ 7300 మంది విద్యార్థులుంటే యీ నినాదాలు చేసినది ఏ పదిమందో అయితే వారి కారణంగా మొత్తం యూనివర్శిటీని మూసేయాలనడం దుర్మార్గం, ఒక విస్తృత పథకంలో భాగం. నినాదాలిచ్చినది ఎవరు? ''ఫ్రంట్‌లైన్‌'' రాసిన ప్రకారం – 'విద్యార్థుల మధ్య నినాదప్రతినినాదాలు జరుగుతూండగా కొందరు బయటి వ్యక్తులు వామపక్షవాదులతో కలిసిపోయి భారత వ్యతిరేక నినాదాలిచ్చారు. వాళ్లు ముఖాలు కప్పుకుని వున్నారు. 'వాళ్లలా అంటూ వుంటే మీరు అలాటి నినాదాలు ఆపేయండి అని అడిగాం. వాళ్లు వెంటనే ఆపేశారు' అని కార్యక్రమనిర్వాహకులు చెప్పేరు. ఆర్గనైజర్లు ముఖాలు కప్పుకున్నవారిని ఆపుతూండడం జీ న్యూస్‌ వీడియోలో కూడా వచ్చింది.' వీడియోలో లైటింగ్‌ చాలినంతగా లేకపోవడం వలన ఎవరెవరో సరిగ్గా తెలియటం లేదుట. కాస్సేపు ఫ్రంట్‌లైన్‌ కథనాన్ని పక్కన పెట్టి కార్యక్రమ నిర్వాహకులే ఆ నినాదాలిచ్చారని అనుకుందాం. ఎటువంటి మూడ్‌లో అలాటివి వస్తాయో కాస్త ఆలోచించి చూడండి.

బిహార్‌లోనో, యుపిలోనో గుర్తు లేదు – ఓ సారి ఒక ప్రతిపక్ష సభ్యుడు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని యిరుకున పెడుతూ గంభీరమైన విషయంపై ప్రసంగిస్తున్నాడు. అతని తర్కాన్ని ఎదుర్కోలేని కాంగ్రెసు ఎమ్మెల్యేలు ''మహాత్మా గాంధీకీ జై'' అంటూ నినాదాలు అందుకున్నారు. ఆ హోరులో ఆ సభ్యుడి మాటలేవీ వినబడడం మానేసింది. అతనికి విసుగు వచ్చేసింది. వాళ్ల నినాదానికి ప్రతిగా ''గోడ్సే జిందాబాద్‌'' అని అరిచాడు. అది అతను ఫ్రస్ట్రేషన్‌తో అరిచిన అరుపే కానీ అతనేమీ గోడ్సే భక్తుడు కాడు. కానీ కాంగ్రెసువాళ్లు 'ఒక ప్రజాప్రతినిథి గోడ్సే జిందాబాద్‌ అని అరుస్తాడా' అంటూ పెద్ద యాగీ చేశారు. ఎంజె అక్బర్‌ అతని గురించి ఎప్పుడు రాయాల్సి వచ్చినా 'ద వన్‌ హూ షౌటెడ్‌ గోడ్సే జిందాబాద్‌' అంటూ వెక్కిరిస్తూ వుండేవాడు. ఇప్పుడు అక్బర్‌ బిజెపిలో చేరాడు కాబట్టి అలా రాయడనుకోండి. ఆడ్వానీ రథయాత్ర వచ్చిన వెల్లువలో బిజెపి నుంచి చాలామంది సాధువులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. పార్లమెంటు చర్చల్లో ఏం మాట్లాడాలో వారికి తెలిసేది కాదు. అవతలిపక్షం వాళ్లు ఏదైనా గంభీరమైన పాయింట్లతో ప్రసంగిస్తూ వుంటే వీళ్లు 'జై శ్రీరామ్‌, జై శ్రీరామ్‌' అంటూ అరుస్తూ వుండేవారు. ఈ డిస్టర్బెన్స్‌తో ప్రాణం విసిగి 'రాముడూ లేడూ, గాడిదగుడ్డూ లేదు, చెప్పినది వినండెహె' అని ఎవరైనా అని వుంటే 'అదిగో రాముడి గురించి నీచంగా మాట్లాడాడు' అని యాగీ చేసి వుండేవారు. 

జెఎన్‌యులో కశ్మీరు సమస్య గురించి ఆ విద్యార్థులు వాదిస్తూ వుంటే వాళ్లతో వాదనకు దిగాలి తప్ప భారతమాతాకీ జై వంటి నినాదాలేమిటి, అసందర్భంగా! పైన చెప్పిన ఉదాహరణలలో లాగ రెచ్చగొట్టడానికి తప్ప, వేరే ప్రయోజనం కనబడదు. దాంతో అవతలివాళ్లు రెచ్చిపోయారు, జాతి వ్యతిరేక నినాదాలు చేశారు. అది తప్పే. దానికి జెఎన్‌యు యాజమాన్యం క్రమశిక్షణ చర్య తీసుకోవచ్చు, సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టి దండిస్తే సరిపోయేది. పోలీసులను రప్పించి అరెస్టు చేయించడం దేనికి? పైగా రాజద్రోహం కేసెందుకు? దానికి విస్తృతప్రచారం కల్పించడం దేనికి? తప్పుని సవరించడం పోయి, దాన్ని తమ ప్రయోజనాలకు అనుగుణంగా మలచుకునే పథకమే కనబడుతోంది యిక్కడ. ఈ నినాదకాండ తర్వాత ఎబివిపి మీటింగును అడ్డుకోవడాన్ని నిరసిస్తూ అన్ని లెఫ్ట్‌ గ్రూపుల వాళ్లూ కలిసి మార్చ్‌ చేయసాగారు. ఆ సమయంలోనే ఎబివిపి వాళ్లు జెఎన్‌యు స్టూడెంట్స్‌ యూనియన్‌ లీడర్లతో వాదనకు దిగారు. ఈ ఘర్షణ నిమిషాల్లో రాత్రి 8.30కు ముగిసిపోయింది. ఈ మార్చ్‌ నార్త్‌ గేట్‌ వైపు సాగిపోయింది. – (సశేషం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2016)

[email protected]

Click Here For Archives