మనం స్కూలులో చరిత్ర చదివేటప్పుడు ఒక్కో రాజు గురించి, ఒక్కో నాయకుడి గురించి ఒక్కో అభిప్రాయం ఏర్పరచుకుంటాం. పుస్తకంలో విషయం వలన కావచ్చు, టీచరు వలన కావచ్చు, బయట ఎవరైనా మాట్లాడగా విని కావచ్చు, అతి తెలివి ప్రదర్శించే సహాధ్యాయి కబుర్ల వలన కావచ్చు. ఆ అభిప్రాయం తప్పో, ఒప్పో అలాగే వుండిపోతుంది. హైస్కూలు చదువు దాటాక జీవనోపాధికై చదువులు, ఉద్యోగాల వేటలో పడ్డాక మళ్లీ చరిత్ర చదివే సందర్భం రాదు. తెలివితేటలు పెరిగాక, దృష్టి విశాలమయ్యాక, కొత్త సమాచారం అందుబాటులోకి వచ్చాక మళ్లీ చారిత్రక పురుషుల గురించి ఆలోచించి మన దృక్కోణాన్ని సవరించుకోవాలసిన అవసరం వుందా అని కూడా ఆలోచించం. ఎందుకంటే ఎకడమిక్ పర్పస్‌కు తప్ప మనకు వాళ్లతో పని పడదు. మొఘలు చక్రవర్తుల పాఠం గుర్తుకి వస్తే మనకు మనసులో బాగా నాటుకున్నదేమిటి? అక్బరు గొప్పవాడు, మతసామరస్యం చూపాడు. రాజపుత్రులను ఆదరించాడు, హిందువులను గౌరవించాడు. ఔరంగజేబు పరమ ధూర్తుడు, తండ్రిని చెఱపట్టి, సోదరులను చంపి రాజ్యానికి వచ్చాడు. నిరాడంబరంగా జీవించాడు కానీ నమ్మకాల దృష్ట్యా పరమ చాదస్తుడు. సంగీతసాహిత్యాలంటే అంటే పడదు. మత దురహంకారి. గుళ్లు పడగొట్టించాడు. జిజియా పన్ను వేశాడు. హిందువులను హింసించాడు. మతసఖ్యత నెరపకపోవడం చేతనే అతని తర్వాత మొఘల్ రాజ్యపతనం ప్రారంభమైంది. ఇవీ మనం నమ్ముతూ వచ్చిన విషయాలు.
ఇంతకంటె ఎక్కువగా మనం ఆలోచించలేదు. ఇప్పుడెవరైనా లోతుగా పరిశోధించి అక్బరు తర్వాత అక్బరు కాలంలో అతని ఆస్థానంలో 22% మంది రాజపుత్రులు వుంటే ఔరంగజేబు కాలంలో అంతకంటె ఎక్కువగా 31% మంది రాజపుత్రులు వున్నారని చెప్పారనుకోండి. అంతేకాదు, అక్బరు కాలంలో హిందూ దివాన్ వుండేవాడని, ఆ తర్వాత జహంగీరు, షాజహాన్‌లు దివాన్ పదవిని హిందువులకు యివ్వకపోయినా ఔరంగజేబు రాజా రఘు రాజ్ అనే హిందువును దివాన్ చేసుకున్నాడని చెప్పారనుకోండి. గద్దె కెక్కిన 21 ఏళ్ల తర్వాత యుద్ధాల వలన ఖర్చులు పెరిగిన తర్వాత మాత్రమే ఆదాయం పెంచుకోవడానికై జిజియా పన్ను వేశాడని, హోలీ సంబరాలే కాక మొహర్రం, ఈద్ ఊరేగింపులను కూడా నిషేధించాడని తెలిస్తే మనం గందరగోళానికి గురవుతాం. కానీ తప్పదు, వాస్తవాలు వాస్తవాలే.
1980ల వరకు బాబర్ గురించి మనం పెద్దగా పట్టించుకున్నది లేదు. కానీ అయోధ్యలో రామాలయం అంశాన్ని రాజకీయం చేయడం మొదలుపెట్టిన దగ్గర్నుంచి బాబర్ పెద్ద విలన్ అయిపోయాడు. అయోధ్యలో వున్న బాబ్రీ మసీదును బాబరే కట్టించాడని ఏ చరిత్ర పుస్తకంలోనూ ఆధారం దొరకలేదు. అక్కడ ఆలయం వుంటే దాన్ని అతనే ధ్వంసం చేశాడనీ ఎవరూ రూఢిగా చెప్పలేకపోయారు. కానీ అతన్ని ఆలయవిధ్వంసకుడిగా చిత్రీకరించారు. ఒక వర్గం వారిని 'బాబర్ కే ఔలాద్ (సంతానం)' అని తిట్టడం ప్రారంభమైంది. దానితో బాటు అప్పుడప్పుడు శివసేన నాయకుల నోట 'ఔరంగజేబ్ కే ఔలాద్' కూడా వినబడసాగింది, ఎందుకంటే ఔరంగజేబు ఆలయనాశనం విషయంలో ఏ అనుమానమూ లేదు. ఔరంగజేబు అప్పుడు చేసిన అకృత్యాలకు యిప్పుడు శిక్ష వేయడానికి పాలకులు పూనుకున్నారు. ఢిల్లీలో ఔరంగజేబు రోడ్డు అని వుంది. 2015 ఆగస్టులో దానికి ఔరంగజేబు పేరు తీసేసి దారా షికో(హ్) పేరు పెడదామనుకున్నారు న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ వారు. ఈ దారా షికో ఔరంగజేబుకి అన్నగారు. సింహాసనం కోసం జరిగిన పోరాటంలో అతను ఓడిపోయాడు. ఔరంగజేబు అతన్ని చంపించివేశాడు.
అదే క్వాలిఫికేషన్ అయితే ఔరంగజేబు చేతిలో ఖతమైన యితర సోదరులు షూజా, మురాద్ పేర్లు కూడా పెట్టవచ్చు. కానీ దారా పేరు పెట్టడానికి కారణమేమిటంటే అతను ముస్లిమే కానీ మతఛాందసుడు కాడు. భారతదేశపు జీవనవిధానంలో వున్న బహుళత్వాన్ని (ప్లూరాలిటీ) ఆమోదించి అన్ని సంస్కృతులను మేళవించాలని చూశాడు. నమ్మకాల రీత్యా ఇస్లాంలో పర్షియన్ గురువైన సమ్రాద్ కర్షానీ వర్గానికి చెందినవాడు. హిందూమత మౌలిక సూత్రాలు, ఇస్లాం మౌలిక సూత్రాలు ఒకటే అని నమ్మి వేదాంతానికి, సూఫీ తత్త్వానికి గల పోలికల గురించి పరిశోధనలు చేశాడు. గొప్ప చదువరి. అతని వద్ద పెద్ద గ్రంథాలయం వుండేది. దాదాపు 50 ఉపనిషత్తులను సంస్కృతం నుండి పర్షియన్‌లోకి అనువదించాడు. మజ్మా ఉల్ బెహరైన్ అనే పుస్తకంతో పాటు యితర పుస్తకాలను కూడా రాశాడు. శిఖ్కు గురువులలో ఒకరైన గురు హర్ రాయ్‌తో స్నేహం నెరపి, మత విషయాలు చర్చించేవాడు.
ఈ కారణాల చేత అతన్ని సత్కరించాలనుకున్నారు యీనాటి పాలకులు. ఏదైనా కొత్త రహదారి వేసి దానికి అతని పేరు పెడితే పోయివుండేది. కానీ ఔరంగజేబుకి శిక్ష, దారాకు సత్కారం ఒకేసారి జరపదలచి ఔరంగజేబు రోడ్డుకి దారా పేరు పెట్టబోయారు. ఇంతలో అబ్దుల్ కలాం పోయారు. అందువలన ఆ రోడ్డుకి ఆయన పేరు పెట్టేశారు. పాపం దారాకు గౌరవం దక్కకుండా పోయింది. న్యూ ఢిల్లీ కౌన్సిల్ వారు అతనికి ఎలాగైనా న్యాయం చేయాలనుకున్నారు కాబట్టి ఏ రోడ్డు దొరుకుతుందా అని చూశారు. డల్‌హౌసీ రోడ్డు కనబడింది. 19 వ శతాబ్దంలో బ్రిటిషు ఇండియాకు గవర్నరు జనరల్‌గా పనిచేసిన డల్‌హౌసీ చాలా చాకచక్యంగా, కుటిలపద్ధతుల్లో దేశంలోని అనేక ప్రాంతాలు ఇంగ్లీషు వారి అధీనంలోకి వచ్చేట్లు చేయగలిగాడు. అందువలన అతనూ శిక్షార్హుడే అనుకున్నారు. ఫిబ్రవరిలో అతని పేరు తీసేసి, ఆ రోడ్డుకి దారా షికో పేరు పెట్టి తృప్తి పడ్డారు.
దారా ఢిల్లీ గద్దె నెక్కలేదు కాబట్టి మనలో చాలామందికి అతను పరిచితుడు కాకపోవచ్చు. ఇప్పటికైనా అతని గురించి కాస్త తెలుసుకోవడం, వారసత్వ పోరులో ఔరంగజేబు ఎందుకు గెలిచాడు, అతను ఎందుకు ఓడాడు అన్నది ఆలోచించడం భావ్యం. అతను షాజహాన్‌కు పెద్ద కొడుకు. జహానారా అనే అక్క, రోషనారా అనే చెల్లి, షూజా, మురాద్, ముహియుద్దీన్ (ఔరంగజేబు అసలు పేరు) అనే తమ్ముళ్లు వున్నారు. షాజహాన్‌కు దారా అంటే యిష్టం. తన తర్వాత వారసుడు అతనే అని సూచించేట్లు 'షాజాదా' (యువరాజు) అని బిరుదిచ్చాడు. అతనికి 30 ఏళ్లుండగా 1645లో అలహాబాద్ ప్రాంతానికి గవర్నరు (సుభాదార్)గా నియమించాడు. ఇంకో మూడేళ్లకు అంతకంటె పెద్దదైన గుజరాత్‌కు గవర్నరుగా వేశాడు. ఇంకో నాలుగేళ్లకు ముల్తాన్, కాబూల్‌లకు గవర్నర్‌ని చేశాడు. 1657 వచ్చేసరికి షాజహాన్ అనారోగ్యానికి గురయ్యాడు. చచ్చిపోయాడనే పుకారు చెలరేగింది. బెంగాల్ గవర్నరుగా వున్న షూజా, దక్కన్ గవర్నరుగా వున్న ఔరంగజేబు, గుజరాత్ గవర్నరుగా వున్న మురాద్ ఎవరికి వారు తామే చక్రవర్తినని ప్రకటించుకున్నారు.
అంతలోనే షాజహాన్ కోలుకుని దారాను బిహార్ గవర్నరుగా వేసి ఇంకా సైన్యం యిచ్చి 1658 ఫిబ్రవరిలో షూజాపై యుద్ధానికి పంపాడు. కొంత సైన్యాన్ని మురాద్‌పైకి పంపాడు. అయితే నెగ్గాక రాజ్యాన్ని సగంసగం పంచుకునే షరతుపై మురాద్ ఔరంగజేబుతో చేతులు కలిపాడు. ఇద్దరూ కలిసి షాజహాన్ సైన్యాన్ని ఓడించి ఆగ్రావైపు నడిచారు. షూజాను ఓడించిన దారా ఆ సంగతి తెలిసి ఆగ్రాకు వచ్చేసరికి ఆలస్యమైంది. బిహారు నుంచి అతని సైన్యం సమయానికి రాకపోవడంతో మురాద్, ఔరంగజేబుల సంయుక్త సైన్యం చేతిలో ఓడిపోయాడు. ఆ పై నెలలోనే ఔరంగజేబు ఆగ్రా కోట పట్టుకుని తండ్రిని గృహనిర్బంధంలో వుంచాడు. అధికారం చేజిక్కాక ఔరంగజేబు మురాద్‌ను అరెస్టు చేయించి గ్వాలియర్ కోటలో ఖైదులో పెట్టాడు. దారా, షూజాలు మరణించిన రెండేళ్లకు అతని పని పట్టాడు. గతంలో గుజరాత్ గవర్నరుగా వుండగా దివాన్‌ను చంపించాడని ఆరోపించి, దివాన్ కొడుకు చేత ఫిర్యాదు చేయించి, 1661లో చంపించి వేశాడు.
1658 మే యుద్ధంలో ఓటమి తర్వాత దారా ఆగ్రా నుంచి ఢిల్లీకి, అక్కణ్నుంచి లాహోర్‌కు వెళ్లాడు. బిహార్‌లో వుంచిన అతని సైన్యం ఔరంగజేబుకి లొంగిపోయింది. ఔరంగజేబు షూజాను బెంగాల్‌కు గవర్నరును చేస్తానని ఆశ పెట్టి అతన్ని తన వైపు తిప్పుకున్నాడు. దారా ఒంటరి వాడయ్యాడు. లాహోర్ నుంచి ముల్తాన్, కఠియవాడ్ వెళ్లాడు. ఇటు బెంగాల్‌లో షూజాకు ధైర్యం పెరిగి సార్వభౌమత్వం ప్రకటించుకుని, పక్కనున్న ప్రాంతాలను ఆక్రమించసాగాడు. దాంతో దారాను పట్టుకోవడానికి పంజాబ్ వెళ్లిన ఔరంగజేబు బిహార్ వెళ్లి యుద్ధంలో షూజాను ఓడించాడు. అతను బర్మా పారిపోయాడు కానీ స్థానిక పాలకులు అతన్ని పట్టుకుని చంపివేశారు. ఇప్పుడు ఔరంగజేబుకు ప్రత్యర్థిగా దారా ఒక్కడే మిగిలాడు. గుజరాత్ గవర్నరు దారాను ఆదరించి సైన్యం సమకూర్చుకోవడానికి ధనసహాయం చేశాడు. దానితో అతను సూరత్ గెలిచి, అజ్మీరు వైపుకి సాగాడు. అతన్ని ఔరంగజేబు సేనలు వెంటాడాయి. వాళ్ల చేతిలో అజ్మీర్‌లో 1659 మార్చిలో ఓటమి చవి చూసి, సింధు పారిపోయాడు. అక్కడ మాలిక్ జివాన్ అనే ఆఫ్గన్ నాయకుడు ఆశ్రయం యిచ్చినట్లే యిచ్చి దారాను, అతని రెండవ కొడుకును ఔరంగజేబు సేనలకు అప్పగించేశాడు. ఔరంగజేబు దారాపై కసి తీర్చుకున్నాడు. ఢిల్లీ తెచ్చి సంకెళ్లతో బంధించి, మట్టిపూసిన ఏనుగుపై పురవీధుల్లో ఊరేగించి రాజద్రోహిగా, మతద్రోహిగా ప్రకటించాడు. అతని ఆదేశాలతో నలుగురు సైన్యాధికారులు 1659 ఆగస్టులో దారాను అతని కుమారుని కళ్లెదురుగానే నరికివేశారు. ఆ తర్వాత ఔరంగజేబు చక్రవర్తిగా పట్టం కట్టుకున్నాడు. ఇదీ దారా కథ.
అశోకుడి కాలం నుంచి కూడా రాజ్యం కోసం తండ్రిని, సోదరులను, బంధువులను, ఆదరించిన యజమానులను చంపినవారు కనబడుతూనే వుంటారు. ఔరంగజేబు కూడా అలాటివారిలో ఒకడు. రాజకీయ ప్రయోజనాల కోసం మతంతో సహా దేన్నయినా, ఎవరినైనా వాడుకున్నాడు. గొప్ప సైన్యాధ్యక్షుడు. అతను గెలిచిన యుద్ధాలతో పోలిస్తే ఓడిన యుద్ధాలు అతి తక్కువ. యుద్ధాలతో అనేక ప్రాంతాలు గెలుస్తూ పోయి, వాటిని నిలబెట్టుకున్నాడు కూడా. మొత్తం 49 ఏళ్లు అప్రతిహతంగా పాలించాడు. మొఘల్ చక్రవర్తులందరిలో అతి విశాలమైన రాజ్యాన్ని పాలించినవాడు అతనే. అతని తర్వాత వచ్చినవారు అంతటి రాజ్యాన్ని పాలించలేక పోవడం చేత రాజ్యవిచ్ఛిత్తికి దారితీసింది. సైన్యబలానికి తోడు అతనికి కుటిలత్వం కూడా తోడయింది. అనేక రకాల ఉపాయాలతో రాజ్యాన్ని విస్తరిస్తూ పోయాడు. దారా ఎంత పండితుడు, మేధావి అయినా ఔరంగజేబు భుజబలానికి, బుద్ధిబలానికి సాటి రాలేక ఓడిపోయాడని ఒప్పుకోవాలి.
అయితే అతను హిందూపక్షపాతి కదా, మరి రాజపుత్రులు అతనికి మద్దతుగా లేరా? అన్న సందేహం వస్తుంది. మన కిప్పుడు ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే దారా – ఔరంగజేబు పోరాటంలో దారాను పక్కకు పెట్టి ఔరంగజేబు సింహాసనం దక్కించుకోవడానికి సహకరించినవారిలో అత్యధికులు రాజపుత్రులే. ఆ విషయం అతని కొడుకు రాసిన ఒక ఉత్తరం ద్వారా రుజువవుతుంది. రాజపుత్రుల్లో ఒక వంశం రాఠోడ్‌లు 1679లో ఔరంగజేబుపై తిరుగుబాటు చేశారు. ఆ తర్వాతి ఏడాది ఔరంగజేబు కొడుకు అక్బర్ అనే అతను తిరగబడ్డాడు. రాఠోడ్‌లతో చేతులు కలిపాడు. ఔరంగజేబు యిద్దర్నీ కలిపి ఓడించాడు. అక్బర్ ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ శరణు జొచ్చాడు. అక్కణ్నుంచి తండ్రికి ఉత్తరం రాశాడు – 'రాజపుత్రులు దారాను విడిచి నిన్ను సమర్థించడం చేతనే సింహాసనం ఎక్కగలిగావని మర్చిపోయావా?' అంటూ.
నిజానికి షాజహాన్ అనారోగ్యం కబురు వింటూనే దక్కన్ నుంచి ఆగ్రాకు బయలు దేరడానికి ముందు ఔరంగజేబు అనేకమంది సామంత రాజులకు ఔరంగజేబు లేఖలు రాశాడు. మేవాడ్ రాజు రాణా రాజ్ సింగ్‌కు రాసిన లేఖ కవిరాజ్ శ్యామల్‌దాస్ రాసిన ''వీర్ వినోద్''లో దొరుకుతోంది. ఆ లేఖలో ఔరంగజేబు 'ప్రజలు దేవుని చేత సృజించబడినవారు. రాజు దేవుని ఛాయ. అందువలన అతను ప్రజలందరినీ సమానంగా చూడాలి, తప్ప మతాన్ని బట్టో, తెగను బట్టో విడగొట్టి చూడకూడదు. దేవుని ఆస్థానంలో రాజులు స్తంభాల వంటి వారు. వారు పక్షపాతంతో ఒకవైపు ఒరిగితే, దేవుని సమన్యాయానికి విఘాతం కలుగుతుంది.' అని తన ఫిలాసఫీని తెలియపరచి వారి మద్దతు కోరాడు. అతని మాటలను నమ్మారు కాబట్టే రాజా జై సింగ్, జశ్వంత్ సింగ్, రఘు రామ్, రాణా రాజ్ సింగ్, రావ్ దళపత్ బుందేలా వంటి రాజపుత్రులు, తక్కిన హిందూ రాజులు ఔరంగజేబుకు అప్పుడు సాయపడడమే కాక, తర్వాత కూడా వెన్నుదన్నుగా నిలబడ్డారు.
శివాజీ వంటి కొందరు తిరగబడ్డారు కానీ అవి మతపరమైన యుద్ధాలుగా చూడవలసిన అవసరం లేదు. అధికారం కోసం ఇద్దరు ప్రత్యర్థుల మధ్య యుద్ధంగా చూడాలి. ఎందుకంటే రాజు హిందూ, ముస్లిము ఎవరైనా సరే వారి సైన్యంలో హిందువులు, ముస్లిములు వుండేవారు. శివాజీ సైన్యంలో మూడో వంతు మంది ముస్లిములే. అలాగే ఔరంగజేబు సైన్యంలోనూ హిందువులుండేవారు. అదీ ఉన్నత పదవుల్లో కూడా వుండేవారు. దారా విషయానికి వస్తే అతనికి పరిపాలనలో కానీ, రణనీతిలో కానీ పెద్దగా అనుభవం లేదు. పైగా రాజా జై సింగ్‌ను అతను 'దక్కనీ బందర్' (కోతి) అని అవమానించి దూరం చేసుకున్నాడు. ఏది ఏమైనా రాజపుత్రులు అతన్ని పట్టించుకోలేదు.
సింహాసనం చేజిక్కాక కూడా ఔరంగజేబు రాజపుత్రులను దూరం చేసుకోలేదు. మరి గుళ్లను పడగొట్టించినపుడు రాజపుత్రులు ఎందుకు వూరుకున్నారు అనే ప్రశ్న వస్తుంది. ఔరంగజేబు సువిశాల సామ్రాజ్యంలో వేలాది హిందూ, జైన దేవాలయాలు వున్నాయి. అయితే వాటిలో కొన్నిటిని మాత్రమే ఎందుకు కొట్టించివేశాడు? అనే ప్రశ్నకు సమాధానం వెతకాలి. అనేక గుళ్లను రక్షించాలంటూ అతను యిచ్చిన ఆదేశాలున్నాయి. అంతేకాదు, గుళ్లకు ధనసహాయాలు, దాన్ని ఆశ్రయించుకుని వున్న బ్రాహ్మణులకు మాన్యాలు యిచ్చిన ఆదేశాలూ వున్నాయి. 1659లో బెనారస్‌లోని అధికారులకు యిచ్చిన ఫర్మానాలో 'స్థానికంగా వున్న దేవాలయాల నిర్వహణలో మీరెవ్వరూ కలగజేసుకోరాదు. గుడి నిర్వహించే పూజారులకు యిబ్బంది కలిగించరాదు. ఎవరి పద్ధతుల్లో వారు పూజ చేసుకుంటూ యీ సామ్రాజ్యం వర్ధిల్లాలని దేవుణ్ని ప్రార్థించేట్లు చూడాలి.' అని వుంది. ఔరంగజేబు కాలంలో పెద్ద యెత్తున మతమార్పిడులు జరిగాయని అనుకుంటే అది పొరబాటుట.
ఔరంగజేబు మధ్యయుగాలకు చెందిన చక్రవర్తి. తాను దేవునికి ప్రతినిథినని నమ్మాడు. తన చిత్తం వచ్చినట్లు వర్తించాడు. రాజరికమంటేనే అంత. తమ చర్యలకు ఎవరికీ సంజాయిషీ చెప్పే పనే లేదు. 'ఈ కారణంగా గుడి పడగొడుతున్నాను, ఈ కారణంగా ఫలానా పన్ను విధిస్తున్నాను' అని ఆదేశాల్లో చెప్పుకునే అలవాటే లేదు. ప్రజలను పాలించే హక్కు దేవుడిచ్చాడు. దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతటి అఘాయిత్యానికి తలపడినా తప్పు లేదు. తనకు ఎదురు తిరిగితే సొంత కొడుకుని కూడా తల తెగవేయడానికి జంకనక్కరలేదు. ఇదీ ఫిలాసఫీ. ఇప్పుడు నడుస్తున్నది ప్రజాస్వామ్యం కాబట్టి, అలా ఎందుకు చేసి వుంటాడు, ఇలా ఎందుకు చేసి వుంటాడు అని కారణాలు మనంతట మనమే వెతుక్కోవలసి వస్తోంది. వారణాశిలో విశ్వనాథ దేవాలయాన్ని ఎందుకు పడగొట్టించాడన్న దానికి పూజారులు ఒక రాణితో అనుచితంగా ప్రవర్తించారు కాబట్టి… అంటూ ఒక కథ చెప్తారు, కానీ అది నమ్మబుద్ధి కాదు. తిరుగుబాటు చేసిన సంస్థానాధీశుల రాజ్యాలలో గుళ్లు కొట్టించివేశాడన్న వాదన ఒకటుంది. ఏది చేసినా రాజకీయ కారణాలతో చేశాడనే అనుకోవాలి. దక్కన్‌లో వున్న బిజాపూర్, గోల్కొండలను ఓడించడానికి సమకట్టినప్పుడు అవి షియా రాజ్యాలు కాబట్టి అతను షియా వ్యతిరేకిగా ప్రవర్తించాడు. అవి చేజిక్కించిన తర్వాత షియా ద్వేషం ఎక్కడా చూపలేదు. అతని హయాంలో అనేక షియా సంస్థలు వెలిశాయి. అతనికి అధికారమే ముఖ్యం. మతం కాదు. జహానారా కూడా దారా షికో మతవిశ్వాసాలకు చెందినదే. దారాను మతద్రోహి అన్న ఔరంగజేబు జహానారా జోలికి వెళ్లలేదు. ఎందుకంటే ఆమె గద్దె కోసం అతనితో పోటీ పడలేదు.
ఇంతకు ముందు వినని యిలాటి అనేక విషయాలతో యిటీవల ''ఔరంగజేబ్, ద మాన్ అండ్ ద మిత్'' అనే పుస్తకం వెలువడింది. దాని రచయిత్రి ఆడ్రీ ట్రూష్‌క్. ఈవిడ గత ఏడాది ''కల్చర్ ఆఫ్ ఎన్‌కౌంటర్స్, సంస్కృత్ ఎట్ మొఘల్ కోర్ట్'' అనే పుస్తకం వెలువరించింది. ఇక సంగీత సాహిత్యాల విషయానికి వస్తే – ఔరంగజేబు వీణ వాయించేవాడని యీ పుస్తకం చెపుతోంది. అంతేకాదు ''రాగ్ దర్పణ్'' అనే పుస్తకాన్ని రాసిన ఫకీరుల్లాకు అతను మన్‌సబ్ అనే ఉన్నత పదవి యిచ్చాడట. సాహిత్యం మాటకు వస్తే వ్యంగ్యకవితలు చదివేవారిని కూడా అతను సహించేవాడట. కామ్‌గార్ ఖాన్ అనే రాజోద్యోగి వయసు మీరాక రెండో పెళ్లి చేసుకుంటే అతనిపై ఒక కవి వ్యంగ్య కవిత రాశాడట. అతన్ని శిక్షించమని కోరుతూ కామ్‌గార్ ఖాన్ ఔరంగజేబుకు మొర పెట్టుకుంటే ''అతను నన్ను కూడా వదిలిపెట్టలేదు, నా మీద అలాటి కవిత్వం చెప్పాడు. అతనికి బహుమతులిచ్చి నోరు మూయించాలని చూశాను. కానీ దాని వలన అతని వెటకారం పెరిగిందే కానీ తగ్గలేదు. అందుచేత దీని గురించి రచ్చ చేసుకోవడం కంటె పట్టించుకోకుండడం మేలు'' అని సలహా యిచ్చాడట. అతను రామాయణ, భారతాలు పర్షియన్ అనువాదాల్లో చదివాడుట. బ్రజ్ భాషలో పాటలు కట్టాడట! ఈ పుస్తకంపై చరిత్రకారులు మరింత లోతుగా పరిశోధించి ఔరంగజేబు వాస్తవచిత్రాన్ని అందించాలని కోరుకుందాం. లేకపోతే త్వరలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణం కూడా పేరు కూడా మారిపోవచ్చు. మన యిష్టాయిష్టాలు ఎలా వున్నా చరిత్రను మనం తుడిచివేయలేము. వీధుల పేర్లు, వూళ్ల పేర్లు మార్చివేసినంత మాత్రాన గతం మాయమవదు. కొత్త రోడ్లకు, కొత్త వూళ్లకు కొత్త పేర్లు పెట్టడం అభిలషణీయం. ఏ కారణం చేతనైనా దారా షికో మళ్లీ వెలుగులోకి వచ్చాడు. అతని పేరు పెట్టడంతో బాటు అతను ఆమోదించిన భారతదేశపు బహుళత్వం, సర్వమత సమభావం మనమూ ఆమోదిస్తే అతని స్మృతికి న్యాయం చేసినట్లవుతుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]