ఎమ్బీయస్‌: లలిత్‌ మోదీ గాథ- 4

బ్రిటన్‌లో పెద్దవాళ్లందరితో స్నేహం నెరపిన లలిత్‌, తను అక్కడ వుండడానికి 2014 మార్చిలో అనుమతులు తెచ్చుకున్నాడు. లలిత్‌ తన భార్య కాన్సర్‌ చికిత్స కోసం పోర్చుగల్‌కు వెళతాననడం మనకు వింతగా తోస్తుంది.  అత్యాధునికమైన వైద్యం…

బ్రిటన్‌లో పెద్దవాళ్లందరితో స్నేహం నెరపిన లలిత్‌, తను అక్కడ వుండడానికి 2014 మార్చిలో అనుమతులు తెచ్చుకున్నాడు. లలిత్‌ తన భార్య కాన్సర్‌ చికిత్స కోసం పోర్చుగల్‌కు వెళతాననడం మనకు వింతగా తోస్తుంది.  అత్యాధునికమైన వైద్యం అంటే అమెరికాయో, బ్రిటనో అనాలి కానీ పోర్చుగల్‌ ఏమిటి? ఇందులో ఏమైనా మతలబు వుందానిపిస్తుంది. కానీ ప్రపంచం మొత్తంలో కాన్సర్‌ చికిత్సలో కటింగ్‌-ఎడ్జ్‌ టెక్నాలజీగా చెప్పబడే ట్రాన్సలేషనల్‌ మెడిసిన్‌ లభ్యమయ్యే ఐదు సెంటర్లలో పోర్చుగల్‌లోని చంపాలిమాడ్‌ కాన్సర్‌ సెంటర్‌ ఒకటి. కాన్సర్‌ చికిత్సలో స్పెషలైజ్‌ చేసిన వేరియన్‌ మెడికల్‌ సిస్టమ్స్‌ అభివృద్ధి పరచిన ఎడ్జ్‌ రేడియో సర్జరీ ఉపయోగించి శరీరం బయట నుంచే ట్యూమర్లను తీసివేయగలుగుతున్నారు. మామూలు రేడియో సర్జరీకి 30-40 సెషన్స్‌ కావాలంటే దీనికి కేవలం 10-15 ని||లు చాలు. ఊపిరితిత్తులు, కాలేజయం, ప్రొస్టేట్‌, మెదడు కాన్సర్‌లకు అది అద్భుతంగా పనిచేస్తోంది. చికిత్స తర్వాత 15 ని||ల తర్వాత పేషంటు తన పనులు మామూలుగా చేసుకోవచ్చు. మినాల్‌ కాన్సర్‌తో 17 ఏళ్లగా బాధపడుతోంది. ఛాతీకి సోకిన కాన్సర్‌ యిప్పుడు కాలేయానికి కూడా పాకింది. ఇప్పుడీ చికిత్స జరిగిన మూడు రోజుల తర్వాత ఆమె హాయిగా ఎప్పటిలాగా పార్టీలో పాల్గొనగలుగుతోంది. 

లలిత్‌ జూన్‌ నుంచి భారతీయ సంతతికి చెందిన లేబర్‌ పార్టీ ఎంపీ కీత్‌ వాజ్‌ ద్వారా ట్రావెల్‌ పేపర్ల కోసం ప్రయత్నాలు చేశాడు. జులై 21 న ప్రిన్స్‌ ఆండ్రూస్‌ను తన యింటికి పిలిచాడు. ఆగస్టు 4 న లలిత్‌ భార్యకు కాన్సర్‌ ఆపరేషన్‌ కాబట్టి జులై 31 న కీత్‌ మళ్లీ గట్టి ప్రయత్నం చేసి బ్రిటిష్‌ హోం ఆఫీసుకి రాసి, ఆగస్టు 1 కల్లా లలిత్‌కు పేపర్లు వచ్చేట్లు చేశాడు. తన ట్రావెల్‌ డాక్యుమెంట్లు రాగానే ఆగస్టు 3 న పోర్చుగల్‌ వెళ్లాడు. మూడు తర్వాత నుంచి ప్రపంచ పర్యటన మొదలుపెట్టాడు. 10 నెలల్లో 32 దేశాలు చుట్టబెట్టాడు. అంటే ప్రతీ పది రోజులకు ఒక దేశం అన్నమాట. అక్కడకు వెళ్లి చేసినది టాప్‌ మోడల్స్‌తో షికారులు, భారతీయ పారిశ్రామికవేత్తల యిళ్లల్లో పెళ్లిళ్లకు వెళ్లడాలు. లలిత్‌మోదీ డాట్‌కామ్‌ ద్వారా ఆ ఫోటోలు అవి ప్రచారంలో పెట్టి తన ఘనతను చాటుకుంటున్నాడు. ఇంగ్లండులో వుండగానే ఇంకో కేసులో యిరుక్కున్నాడు. ప్రపంచంలోని 28 చోట్ల లగ్జరీ హోటళ్లు నడిపే అమన్‌ రిసార్ట్స్‌ యాజమాన్యం విషయంలో రష్యన్‌ బిలియనీరుకు, అమెరికన్‌ బిజినెస్‌మన్‌కు, స్వీడిష్‌ పారిశ్రామికవేత్తకు గొడవ జరిగి యుకె హై కోర్టులో కేసు నడుస్తోంది. నిందితుల్లో లలిత్‌ కూడా వున్నాడు. ఇప్పుడు అతను ఐపియల్‌ తరహాలో చైనాలో, థాయ్‌లాండ్‌లో, క్యూబాలో ఫుట్‌బాల్‌ లీగ్‌ పెడదామని ప్రయత్నిస్తున్నాడు. ఆ యా దేశాల్లో పెద్ద తలకాయలతోనే వ్యూహాలు రచిస్తున్నాడు. 

లలిత్‌ విషయంలో సుష్మా, వసుంధరలు యిబ్బందుల్లో ఎలా పడ్డారో చూస్తున్నాం. భార్య ఆపరేషన్‌ సమయంలో పక్కన వుండడానికి మానవతా దృక్పథంతో యిప్పించాను అని సుష్మ అన్నారు. అతను భార్య ఆపరేషన్‌ జరిగిన తర్వాత 31 దేశాలు చుట్టబెట్టాడు. వెళ్లిన చోటల్లా ఫోటోలు తీసుకుని ట్విట్టర్‌లో పెట్టాడు – భారత ప్రభుత్వం నన్ను ఏమీ చేయలేకపోయింది చూడండి అని వెక్కిరించినట్లు! దాన్ని ఏ దృక్పథంతో చూడాలి? అతనలా చేస్తాడని సుష్మ వూహించలేదు కదా అనవచ్చు. అప్పుడు తన అభ్యర్థనను క్వాలిఫై చేయాలి. లలిత్‌ ధోరణి తెలిసిన మనిషిగా అతన్ని ఒక వారం మాత్రమే ప్రయాణం చేయాలనో, పోర్చుగల్‌కు మాత్రమే వెళ్ల నివ్వాలనో అడిగి వుండాల్సింది. ఏం చేసినా ప్రభుత్వశాఖలా ద్వారా చేసి వుండాల్సింది కానీ వ్యక్తిగత హోదాలో చేసి వుండకూడదు. ఆమె శాఖలో కార్యదర్శిగా చేసిన సుజాతా సింగ్‌ సుష్మ యీ విషయమై తన కేమీ చెప్పలేదని స్పష్టం చేసింది. 

వసుంధరకు ఆర్థిక బంధాలు వేరే సంగతి, దానిలో తప్పులుంటే కేసులు పెట్టవచ్చు కానీ లలిత్‌కు సాయం చేసినది ప్రతిపక్ష నాయకురాలి హోదాలో మాత్రమే, సుష్మ అధికార హోదాలో వుండి చేశారు. అందుచేత ఆమెది పెద్ద తప్పిదం. సుష్మ పైరవీ చేసేనాటికి అతని పాస్‌పోర్టు యింకా పునరుద్ధరింప బడలేదు. 2014కు ఆగస్టు 1కి ట్రావెల్‌ డాక్యుమెంట్లు వస్తే ఆగస్టు 27న పాస్‌పోర్టు పునరుద్ధరించారు. దాన్ని పై కోర్టులో ఛాలెంజ్‌ చేయవలసిన బాధ్యత విదేశాంగ శాఖదే అని అరుణ్‌ జైట్లే అంటున్నారు. దానిపై చిదంబరం ఆర్‌టిఐ కింద ప్రశ్నలడిగితే విదేశాంగ శాఖ సమాధానం యివ్వడానికి నిరాకరించిందట. లలిత్‌ మోదీని వెనక్కి పంపేయమని బ్రిటిషు ప్రభుత్వానికి ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌) విదేశాంగ శాఖ ద్వారా కోరాలి. అలాటి అభ్యర్థన ఇడి నుండి తమకు రాలేదంటోంది విదేశాంగ శాఖ! అందుకే ఏమీ చేయటం లేదట.

'భారత ప్రభుత్వానికి, ముఖ్యంగా విదేశాంగ శాఖకు తెలియకుండా సుష్మ ఒక ఆర్థిక నేరగాడికి సహాయపడింది. గతంలో ఢిల్లీలో రాజకీయ నాయకుడిగా అడావుడి చేసిన రమేశ్‌ శర్మకు యిలాగే తోడ్పడింది. అతను నేరగాడని తెలిసింది. ప్రస్తుతం తీహార్‌ జైల్లో వున్నాడు. గాలి సోదరుల సంగతి ఎలాగూ తెలుసు. సుష్మ, ఆమె భర్త బ్యాక్‌గ్రౌండ్‌ పరికిస్తే సుష్మ తండ్రి ఆయుర్వేద వైద్యుడు. భర్త తండ్రి పంజాబ్‌ యూనివర్శిటీలో చిరుద్యోగి. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన సుష్మ, ఆమె భర్త విద్యార్థి దశలో సోషలిస్టులుగా పనిచేశారు. న్యాయవాద వృత్తిలో కపిల్‌ సిబ్బల్‌, అరుణ్‌ జైట్లేలలా రాణించలేదు. ఆర్థికంగా పైకి ఎదగాలని తహతహ లాడిన వారికి లలిత్‌ ఆశాకిరణంగా కనబడ్డాడు. అందుకే యిలా చేశారు.' అని కాలమిస్టులు తప్పు పడుతున్నారు. 

లలిత్‌పై బిజెపి అభిప్రాయం ఏమిటో అధికారికంగా తేలాలి. అధికార ప్రతినిథి జివిఎల్‌ నరసింహారావు అతన్ని బాధితుడుగా పేర్కొంటున్నారు. హోం సెక్రటరీగా పనిచేసి బిహార్‌ ఎంపిగా మారిన ఆర్‌కె సింగ్‌ అతన్ని ''భగోడా'' (పరారైనవాడు) అంటున్నారు. జూన్‌ 14 న సుష్మ చేసిన సహాయాన్ని బయట పెట్టిన పత్రిక ఆమె వెర్షన్‌ తెలుసుకుందామని వారం రోజుల ముందే ప్రశ్నావళి పంపిందట. తను చేసిన పని బయటకు వస్తోందని గ్రహించిన సుష్మ బిజెపిలో సీనియర్‌ లీడరును ఒకరిని కలిసి రిజైన్‌ చేయనా అని అడిగిందట. తొందరపడి ఏమీ చేయవద్దు అని ఆయన సలహా యిచ్చాడట. నల్ల డబ్బుపై అంత హంగామా చేస్తున్న మోదీ ప్రభుత్వం మనీ లాండరింగ్‌లో యిరుక్కున్న యితనిపై బ్లూ కార్నర్‌ నోటీసును రెడ్‌ కార్నర్‌ నోటీసుగా ఎందుకు మార్చలేదు? అసలు యుపిఏ ఏం చేసిందో తరచి చూడాలి. ఇంటర్‌పోల్‌ చీఫ్‌గా పని చేసినతను బ్లూ కార్నర్‌ నోటీసు కూడా యివ్వలేదంటున్నాడు. అరుణ్‌ జైట్లీ రెవెన్యూ యింటెలిజెన్సు డైరక్టరేట్‌ ''లైట్‌ బ్లూ కార్నర్‌ నోటీసు'' యిచ్చిందంటున్నాడు. నిజానిజాలు నిదానంగానైనా బయటపడతాయని ఆశిద్దాం. (సమాప్తం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2015)

[email protected]

Click Here For Archives