ఎమ్బీయస్‌ : మహారాష్ట్రలో ఎవరికి వారే

మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా చాలా చిత్రాలు జరిగాయి. పాతికేళ్లగా నడుస్తున్న బిజెపి-శివసేన స్నేహబంధం తెగిపోయింది. థాబ్దాలుగా వున్న కాంగ్రెసు- ఎన్‌సిపి బంధమూ పుటుక్కుమంది. పైకి నిరాకరిస్తున్నా బిజెపి, ఎన్‌సిపి రహస్యంగా ఒప్పందాలు కుదుర్చుకుంటాయనే వదంతి…

మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా చాలా చిత్రాలు జరిగాయి. పాతికేళ్లగా నడుస్తున్న బిజెపి-శివసేన స్నేహబంధం తెగిపోయింది. థాబ్దాలుగా వున్న కాంగ్రెసు- ఎన్‌సిపి బంధమూ పుటుక్కుమంది. పైకి నిరాకరిస్తున్నా బిజెపి, ఎన్‌సిపి రహస్యంగా ఒప్పందాలు కుదుర్చుకుంటాయనే వదంతి వినిపిస్తోంది. ఎన్‌సిపికి గ్రామాలలో పట్టు వుందని, బిజెపికి పట్టణఓటర్లలో బలం వుందని, యిద్దరూ కలిసినా ఒకరి ఓట్లను మరొకరు కొల్లగొట్టరని అంచనా. బిజెపి, శివసేన విషయంలో యిద్దరి ఓటు బ్యాంక్‌ దాదాపు ఒకటే. అందువలన ఒక స్థాయికి మించి వారు ముందుకు సాగలేకపోతున్నారు. కాంగ్రెసు-ఎన్‌సిపి కూటమిని గెలవలేకపోతున్నారు. ఇటీవలి పార్లమెంటు ఎన్నికలలో మోదీ హవాతో వారి కూటమి ఘనవిజయం సాధించడంతో, బిజెపికి ఆత్మవిశ్వాసం పెరిగింది. కూటమి నాయకత్వాన్ని శివసేననుంచి లాక్కోవాలని చూసింది. 2009 ఎన్నికలలో శివసేన 169 సీట్లలో పోటీ చేయగా బిజెపి 119లో మాత్రమే చేసింది. ఈ సారి అన్నే సీట్లు యిస్తానని శివసేన అంది. బాల ఠాకరే తను ముఖ్యమంత్రి అవుదామని ఎన్నడూ అనుకోలేదు. తన అనుచరుణ్ని ముఖ్యమంత్రిని చేసి అతన్ని తన కనుసన్నల్లో వుండేట్లు చూసుకున్నాడు. ఉద్ధవ్‌కు యిలాటి శషభిషలు లేవు. తను స్వయంగా ముఖ్యమంత్రి అవుదామనుకుంటున్నాడు. బిజెపికి ఎక్కువ సీట్లు యిచ్చి, వాళ్లు తమకంటె ఎక్కువ సీట్లు గెలిస్తే ముఖ్యమంత్రి పదవి బిజెపి తన్నుకుపోతుంది. అందుకే 119 అంకె దాటనని మొండికేశాడు. అయితే మోదీ, అమిత్‌ కలిసి ఉద్ధవ్‌కు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుని కూటమి విచ్ఛిన్నం చేసేశారు.

చాలాకాలంగా బిజెపి నాయకులు శివసేనకు అమితమర్యాదలు సలిపారు. మహారాష్ట్రలో బిజెపిని ఒక స్థాయికి తెచ్చిన ప్రమోద్‌ మహాజన్‌ బాల ఠాక్రే నివాసమైన మాతోశ్రీకి వెళ్లి తరచుగా మంతనాలు జరిపేవాడు. అతను పోయాక గోపీనాథ్‌ ముండే కూడా. ఆడ్వాణీ, సుష్మా స్వరాజ్‌.. యిలా ఏ జాతీయ నాయకుడు ముంబయి వచ్చినా తొలుత మాతోశ్రీకి వెళ్లి ఠాకరే ను దర్శించుకుని ఆ తర్వాత తమ పార్టీ ఆఫీసుకి వెళ్లేవారు. మోదీ అలాటి మర్యాదలు పాటించలేదు. బాల ఠాక్రే పోయినపుడు అంత్యక్రియలకు గైరుహాజరైన  మోదీపై శివసేనవారికి సదభిప్రాయం లేదు. ప్రధాని అభ్యర్థి గురించి బిజెపిలో చర్చ జరుగుతున్నపుడు శివసేన సుష్మా స్వరాజ్‌ అయితే బాగుండును అని సూచించింది. మోదీ యిలాటివి మర్చిపోయే రకం కాదు. అమిత్‌ షా బిజెపి అధ్యకక్షుడయ్యాక ముంబయి వెళ్లినపుడు తన పార్టీ ఆఫీసుకే డైరక్టుగా వెళ్లాడు. తర్వాతైనా మాతోశ్రీవైపు తొంగి చూడలేదు. తర్వాతి పర్యటనల్లో వెళ్లినా శివసేనతో స్నేహంగా వుండే రాష్ట్రస్థాయి నాయకుడు ఎవరూ లేకుండా పోయారు. నితిన్‌ గడ్కరీకి ఉద్ధవ్‌ కంటె రాజ్‌ ఠాకరే తో స్నేహం ఎక్కువ. ఆ మాటకొస్తే మోదీ, అమిత్‌ కూడా ఒకప్పుడు రాజ్‌నే సమర్థించారు. ఇవన్నీ ఉద్ధవ్‌ మర్చిపోలేదు.

ఇలాటి పరిస్థితుల్లో వాళ్లిద్దరి మధ్య సఖ్యత కొనసాగితేనే ఆశ్చర్యం. మొన్ననే ఉత్తర ప్రదేశ్‌ ఉపఎన్నికలలో కంగు తిన్నాం కదా, మహారాష్ట్రలో ఒంటరిగా వెళ్లడం మితిమీరిన ఆత్మవిశ్వాసంగా పరిణమిస్తుందేమోనని అనుమానాలు వ్యక్తం చేసిన బిజెపి నాయకులకు అమిత్‌ షా తను జరిపించిన సర్వే ఫలితాలను చూపించారట. బిజెపి ఒంటరిగా పోటీ చేసినా అధిక స్థానాలు గెలవగలదని ఆ సర్వే చెప్పిందట. బిజెపి ప్రస్తుతం వున్న దూకుడులో హరియాణాలో లోక్‌హిత్‌ కాంగ్రెస్‌ అనే మిత్రపక్షాన్ని పోగొట్టుకుంది. పంజాబ్‌లో మిత్రపక్షమైన అకాలీదళ్‌ హరియాణాకు వచ్చేసరికి బిజెపిని సమర్థించటం లేదు. అయినా బిజెపి తన పంథాలో వెళుతూ సొంతంగా బలపడదలచుకుంది. అయితే మహారాష్ట్రలో దీన్ని గుజరాతీ-మరాఠీ వివాదంగా మలుస్తున్నారు. ముంబయిలో అన్ని రంగాలలో గుజరాతీలదే ఆధిక్యత. మహారాష్ట్రులకు వాళ్లను చూస్తే అసూయ, కన్నెఱ్ఱ. ఇప్పుడు మోదీ-అమిత్‌ యిద్దరూ గుజరాతీలు కావడంతో మరాఠీ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలచిన శివసేనను అణచడానికి గుజరాతీ లాబీ చూసిందని, కానీ మరాఠా వీరుడు ఉద్ధవ్‌ దాన్ని తిప్పి కొట్టాడని మరాఠీ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 'మరాఠీలను లొంగదీసుకోవాలని ఔరంగ్‌జేబ్‌ నుండి అనేకమండి ఢిల్లీ రాజులు ప్రయత్నాలు చేశారు, విఫలులయ్యారు. మేం ఛత్రపతి శివాజీ వారసులం' అని శివసేన అధికార పత్రిక ''సామ్నా'' గర్జిస్తోంది. రేపు బిజెపి రాజ్‌ ఠాకరే పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే అప్పుడేం చెప్తారో తెలియదు.

ఎదుటివాడి కంటె తాను గొప్ప అని చూపుకోవాలని ఉద్ధవ్‌, రాజ్‌ ఎప్పుడూ పోటీ పడుతూ వచ్చారు. ఇప్పటిదాకా రాజ్‌ పార్టీ ఎన్నో కొన్ని సీట్లు గెలుస్తూ వచ్చింది. కానీ మొన్న పార్లమెంటు ఎన్నికలలో నిలబడిన 10 సీట్లలో ఓడిపోవడంతో ప్రత్యర్థి ఉద్ధవ్‌కి ధైర్యం పెరిగింది. తన పార్టీ తరఫున మ్యానిఫెస్టో విడుదల చేశాడు. బాల్‌ ఠాకరేకు మ్యానిఫెస్టోలపై నమ్మకం వుండేది కాదు. అవన్నీ బోగస్‌ అనేవాడు. కానీ ఉద్ధవ్‌ మాత్రం 'విజన్‌ డాక్యుమెంట్‌' అంటూ – మన తెలుగు రాష్ట్రాల నుండి స్ఫూర్తి పొందాడో ఏమో – ఎనిమిది జిల్లాల్లో ఎనిమిది సెక్టార్లలో ఎనిమిది హబ్స్‌ పెడతానని వాగ్దానం చేశాడు. పుణెలో ఐటీ, ఆటోమొబైల్‌, కొల్హాపూర్‌లో ఫౌండ్రీ, యింజనీరింగ్‌, నాశిక్‌లో డిఫెన్సు సామగ్రి.. యిలా. వీటి లైసెన్సులకై సింగిల్‌ విండో పెడతానని కూడా చెప్పాడు. రాజ్‌ ఠాకరే పార్టీ దీన్ని అపహాస్యం చేసింది. డిఫెన్సు అనేది కేంద్రం అజమాయిషీలోకి వస్తుంది. వాటి గురించి యితనేం నిర్ణయించగలడు? పైగా పుణెలో, కొల్హాపూర్‌లో అతను చెప్పిన పరిశ్రమలు యిప్పటికే వున్నాయి అంటూ. రైతులు మార్కెట్‌యార్డ్‌కు వెళ్లి డైరక్టుగా అమ్మే ఏర్పాటు చేస్తామని చేసిన వాగ్దానం కూడా విమర్శకు గురైంది. ''చిన్న రైతు ప్రతీ మూణ్నెళ్లకు 5-6 వేల కిలోల ఉల్లిపాయలు వేసుకుని మార్కెట్‌ యార్డుకి వెళ్లి కొనేవాడు దొరికేదాకా ఎన్నాళ్లు అక్కడ కూర్చుంటాడు? వ్యవస్థను మార్చడం అంత సులభం కాదు. శివసేన నాయకులందరూ పట్టణప్రాంతాల వాళ్లు. గ్రామీణుల సమస్యలు వారికి తెలియవు.'' అన్నారు విమర్శకులు.

రాజ్‌ ఠాకరే పార్టీ కూడా యింతకంటె ధాటీగా మ్యానిఫెస్టో తయారుచేసింది. ''ఇది పూర్తయ్యేసరికి ప్రపంచం అసూయపడే స్థాయికి  మహారాష్ట్ర చేరుతుంది.'' అని వాళ్లు చెప్పుకుంటున్నారు. రోడ్లు, విద్యుత్‌, తాగునీరు, సాగునీరు, గ్రీన్‌ పవర్‌ జనరేషన్‌.. మామూలే! మన రెండు రాష్ట్రాలలో మనం రోజూ వినేదే! చివరకు బిజెపి రాజ్‌తో బంధం కుదుర్చుకుంటుందో లేదో గట్టిగా చెప్పలేం. ఎందుకంటే ఉత్తరాది వాళ్లపై ఒంటికాలిపై లేచే నాయకుడిగా రాజ్‌ కున్న యిమేజి తను బలపడదామనుకుంటున్న యుపి, బిహార్‌లలో బిజెపికి ప్రతిబంధకంగా పరిణమిస్తుంది. అందువలన ఎవరితో కుదుర్చుకున్నా లోపాయికారీ ఒప్పందాలే కుదుర్చుకోవాలి.

రాజ్‌ ఠాకరే మాత్రం గుజరాతీల పెత్తనం అంటూ బిజెపిపై మండిపడ్డాడు. వాళ్లు ఛీ పొమ్మన్నా ఇంకా కేంద్ర కాబినెట్‌లో శివసేన మంత్రి అనంత్‌ గీతే కొనసాగడం పరువుతక్కువ అన్నాడు. ఇటీవలే కూటమిలో చేరిన టిడిపికి సివిల్‌ ఏవియేషన్‌ వంటి ముఖ్య శాఖ యిచ్చి, పాతికేళ్ల మిత్రపక్షంగా వుండి 18 మంది ఎంపీలున్న తమకు ఒకే ఒక్క మంత్రి పదవి (భారీ పరిశ్రమలు) యిచ్చి సరిపెట్టడమేమిటని శివసేన యిప్పటికే బిజెపిపై అలిగి వుంది. రాజ్‌ యిలా అనగానే 'నువ్వు రిజైన్‌ చేసేయ్‌' అని అనంత్‌ను ఆదేశించింది. అయితే అతను నిరాకరించాడు. మోదీ అమెరికా నుండి తిరిగి వచ్చాక చూద్దాం అన్నాడు. మరాఠీ గౌరవాన్ని కాపాడం యిలాటి బలహీనమైన శివసేన వలన కాదు, రాజ్‌ వలననే జరుగుతుంది అనే ప్రచారం మహారాష్ట్రలో జరిగితే శివసేన, బిజెపి రెండూ నష్టపోతాయన్న భయం పట్టుకున్నట్టుంది. ఎన్నికల అనంతరం మా మధ్య పొత్తు కుదరవచ్చు అంటూ నితిన్‌ గడ్కరీ ప్రకటన చేశాడు. శివసేన కూడా మెత్తబడి అనంత్‌ను కాబినెట్‌లోనే కొనసాగు అంది. ఇదీ యిప్పటిదాకా జరిగిన డ్రామా.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2014)