ఎమ్బీయస్‌: మృచ్ఛకటికమ్‌- 15

చారుదత్తుడి శిక్ష వేయించిన ఆనందంతో శకారుడు యింటికి వెళ్లి విందు కుడిచి, చారుదత్తుడి చావు కళ్లారా చూద్దామని స్మశానానికి బయలుదేరాడు. అతని చావు వూరేగింపుకి యింతమంది జనం రావడంతో ఆశ్చర్యపడి వీడికే యింతమంది వస్తే…

చారుదత్తుడి శిక్ష వేయించిన ఆనందంతో శకారుడు యింటికి వెళ్లి విందు కుడిచి, చారుదత్తుడి చావు కళ్లారా చూద్దామని స్మశానానికి బయలుదేరాడు. అతని చావు వూరేగింపుకి యింతమంది జనం రావడంతో ఆశ్చర్యపడి వీడికే యింతమంది వస్తే నన్ను కొరత వేసినప్పుడు యింకెంతమంది వస్తారో అని ఆశ్చర్యపడ్డాడు. ఇంతలో చాటింపు ఆగిపోవడంతో సందేహం వచ్చి తలారుల దగ్గరకు వచ్చి చేరాడు. అక్కడ స్థావరకుణ్ని చూసి కళవెళపడ్డాడు. అతని దగ్గరకు వచ్చి 'నాయనా, రా పోదాం' అని అనునయంగా పక్కకు లాక్కు పోదామని చూశాడు. 'వసంతసేనను చంపడంతో తృప్తి పడలేదా? నన్ను కూడా చంపుతావా?' అంటూ స్థావరకుడు ఎదురు సమాధానం చెప్పడంతో యిక అతనిమీదే నింద వేయడానికి పూనుకున్నాడు. తలారుల వద్దకు వచ్చి 'ఇతను చెప్పేది అబద్ధం. నేను యితన్ని నా యినప్పెట్టెకు రక్షకుడిగా నియమిస్తే ఒక బంగారు కంకణాన్ని దొంగిలించాడు. పట్టుకుని మేడలో బంధించాను. ఆ కసితో యిలా చెప్తున్నాడు.' అన్నాడు. 

వాళ్లు ఆశ్చర్యపడుతూ వుండగా స్థావరకుణ్ని బలవంతంగా పక్కకు లాక్కెళ్లి చేతిలో బంగారు కంకణం పెట్టి 'ఇది తీసుకుని నోరు మూసుకోరా' అన్నాడు. అతను 'చూశారా, నా నోరు నొక్కడానికి లంచం యిస్తున్నాడు' అంటూండగానే శకారుడు పెద్ద గొంతుకతో 'చూశారా, వీడు కొట్టేసిన బంగారు మురుగు యిదే' అంటూ అల్లరి చేసేశాడు. 'దొంగతనం చేస్తూ పట్టుబడినందుకు వీపుమీద వాతలు తేలేట్లా కొట్టాను. కావాలంటే చూడండి' అన్నాడు. తలారులు స్థావరకుడి వీపు పరీక్షించి వాతలు చూసి శకారుడి మాట నమ్మారు. స్థావరకుడి నిరాశతో 'అయ్యా, నేను సేవకుణ్ని కాబట్టి నా మాట ఎవరూ నమ్మరు, మిమ్మల్ని కాపాడడానికి ప్రయత్నించి భంగపడ్డాను, క్షమించండి' అంటూ చారుదత్తుడి కాళ్లపై పడ్డాడు. 'దైవం అనుకూలించనప్పుడు నీ వంటి నిష్కారణ బంధువులెంత  ప్రయత్నం చేసినా ఏం లాభం?' అంటూ చారుదత్తుడు వాపోయాడు.

శకారుడి స్థావరుణ్ని అక్కణ్నుంచి తరిమివేసి 'త్వరగా వధించండి' అంటూ తలారులను తొందరపెట్టాడు. రోహసేనుడు 'మా నాన్నను విడిచి పెట్టండి' అంటూ ఏడవసాగాడు. శకారుడు 'ఈ పిల్లవాణ్ని కూడా చారుదత్తుడితో బాటు కలిపి వధించండి.' అంటూ ఆదేశించాడు. 'మాకు ఆ మేరకు ఆజ్ఞ లేదు' అంటూ 'కుమారా, యింటికి వెళ్లిపో' అన్నారు. చారుదత్తుడు కూడా 'మైత్రేయా, నువ్వు వాణ్ని తీసుకుని వెళ్లిపో' అని చెప్పి పంపించివేశాడు. తన అత్యుత్సాహం చేత ప్రజలలో తన పట్ల శంక కలుగుతోందని గ్రహించిన శకారుడు వసంతసేనను హత్య చేశానని చారుదత్తుడు తన నోటితో చెప్పాలని పట్టుబట్టాడు. చెప్పకపోతే కఱ్ఱతో నాలుగు బాది చెప్పించమని తలారులకు చెప్పాడు. చెప్పమని తలారి ఒత్తిడి చేయడంతో చారుదత్తుడు 'ఈ కష్టాలకు నేను వెఱవటం లేదు కానీ వసంతసేనను నేనే చంపానని చెప్పవలసి రావడం నన్ను దహించివేస్తోంది.' అన్నాడు. శకారుడు కసి కొద్దీ మళ్లీ మళ్లీ చెప్పించాడు.

ఇంతలో వధ్యస్థలికి వచ్చారు. కత్తి ఎత్తి చారుదత్తుడి తల నరకాలి. ఇలాటి సత్పురుషుడి తల నరకడానికి యిద్దరికీ చేతులు రాలేదు. ఉరి తీయడం నీ వంతు అంటే, కాదు నీ వంతు అనుకున్నారు. చివరకు గీతలు గీసి, సరిబేసి చూసుకుని తేల్చుకుందామనుకున్నారు. అప్పుడు ఒక తలారి నా వంతు అయితే మాత్రం నేను కొంతసేపు ఆగుతాను అన్నాడు. అదేం? అంటే 'ఇదే వృత్తిలో పని చేసిన మా నాన్న చచ్చిపోయేముందు చెప్పాడు – ఉరి తీయవలసిన వ్యక్తిని సాధ్యమైనంత సేపు బతకనీయి. ఎందుకంటే ఎవరో ఒకరు అతని పేర అపరాధ శుల్కాన్ని చెల్లించి విడిపించవచ్చు, లేదా రాజుకి కొడుకు పుట్టిన సందర్భంగా అందర్నీ విడుదల చేయవచ్చును, ఒక్కోసారి పట్టపుటేనుగు బంధనాలు తెంపుకుని ఊరి మీద పడుతుంది. ఆ సంభ్రమంలో వధ్యుడు తప్పించుకోవచ్చు. ఒక్కోప్పుడు రాజే మారిపోవచ్చు, అప్పుడు దండన పడ్డవాళ్లందరికీ క్షమాభిక్ష దక్కవచ్చు.' అని చెప్పాడు.

చివరకు వంతులు వేసుకుంటే ఒకడికి చంపే పని పడింది. 'మేం రాజాజ్ఞ పాలిస్తున్నాం తప్ప వేరొకటి కాదు, అందువలన మాపై అలగవద్దు. జననమరణాలు జెండాగుడ్డల రెపరెపల్లాటివి. ఇది ప్రకృతి సహజమని గుర్తు పెట్టుకో. చివరి ఘడియల్లో ఏం కోరుకుంటావో అది కోరుకో' అన్నాడతను చారుదత్తుడితో. 'నేను చేసిన పుణ్యం గట్టిదైతే స్వర్గంలో వున్న వసంతసేన దిగి వచ్చి నేను తనను చంపలేదని నిరూపించాలని కోరుకుంటున్నాను.' అంటూ చావుకి సిద్ధపడ్డాడు. 

అదే సమయంలో బౌద్ధ భిక్షువు వసంతసేనను వెంటపెట్టుకుని ఆమె కోరికమేరకు చారుదత్తుడి యింటికి బయలుదేరాడు. కానీ ఉజ్జయినీ వాసులందరూ శ్మశానం వైపుకి వెళుతూండడంతో ఆశ్చర్యపడి ఏమిటి సంగతి అని అడిగితే వసంతసేనను చంపిన నేరానికి చారుదత్తుణ్ని ఉరి తీయడానికి తీసుకెళుతున్నారని సమాధానం వచ్చింది. దాంతో వాళ్లు పరుగుపరుగున స్మశానానికై బయలుదేరారు. అక్కడ స్మశానంలో తలారి చారుదత్తుణ్ని చంపడానికి కత్తి ఎత్తితే అది చేతిలోంచి జారిపడింది. అలాటి సందర్భంలో మళ్లీ కత్తి ఎత్తకూడదు. కొఱత వేయాల్సిందే. అందుకని అతన్ని స్తంభం ఎక్కించడానికి వీలుగా ముందు చేతులు కట్టేసి నేల మీద బోర్లా పడుక్కోబెట్టారు. ఆ సమయంలో వసంతసేన అక్కడకు చేరింది. 'నేను బతికే వున్నాను, శకారుడు నన్ను చంపబోయాడు' అని కేకలు పెట్టింది. అయ్యో చారుదత్తా, నా వలన నీకింత దురవస్థా? అంటూ అతని కాళ్లపై పడింది. ఆమె మొహం చూడలేకపోయినా 'వసంతసేనా? నువ్వా' అని కేక పెట్టాడు చారుదత్తుడు. 

తలారులు మొహాలు చూసుకున్నారు. ఆమె వసంతసేన అని తెలియగానే అమ్మయ్య తొందరపడ్డాం కాదు అనుకుని సంతోషిస్తూ, యీ విషయం రాజుకి చెప్పి యిప్పుడేం చేయాలో తెలుసుకోవాలి అంటూ వెళ్లబోయారు. వసంతసేనను చూస్తూనే శకారుడు చచ్చాంరా బాబూ అనుకుని అక్కణ్నుంచి పారిపోయాడు. అంతలో తలారులకు గుర్తు వచ్చింది – 'వసంతసేనను చంపినవాణ్ని శిక్షించమని కదా' అని. వెంటనే శకారుడి వెంట పరుగు పెట్టారు. 

చారుదత్తుడి కట్లు విప్పారు. అతను విభ్రాంతితో వసంతసేన స్వర్గం నుంచి దిగి వచ్చిందా అనుకుంటూన్నాడు. అప్పుడు వసంతసేన నేను బతికే వున్నాను, యితనే నన్ను రక్షించాడు అని చూపింది. 'ఎవరితను?' అంటే అప్పుడు భిక్షువు 'నన్ను గుర్తు పట్టలేదా, స్వామీ, సంవాహకుణ్ని. మీ వద్ద పని చేసి మీ ఔదార్యం రుచి చూసినవాణ్ని, వసంతసేన నన్ను ఋణవిముక్తుణ్ని చేసింది.' అని చెప్పుకున్నాడు. 

ఇంతలో శర్విలకుడు అక్కడకు చేరాడు. అతను రాజుని సంహరించి ఆర్యకుణ్ని సింహాసనంపై కూర్చోబెట్టి, చారుదత్తుడి శిక్ష గురించి విని గబగబా శ్మశానానికి బయలుదేరి వచ్చాడు. వచ్చి చారుదత్తుడికి నమస్కరించి 'నేనే మీ యింట్లో నగలపాత్రను దొంగిలించినవాణ్ని. క్షమించండి' అని చెప్పుకుని 'ఆర్యకుడు రాజయ్యాడు. మీరు తనకు చేసిన ఉపకారాన్ని స్మరించుకుని కుశావతీ మండలానికి మిమ్మల్ని పాలకుడిగా నియమించాడు. దయచేసి స్వీకరించండి.' అని చెప్పాడు. తన వెంట వచ్చిన సైనికులతో 'ఆ దుష్ట శకారుణ్ని పట్టి తీసుకురండి' అని కూడా చెప్పాడు. 

ఆర్యకుడి ఔదార్యానికి చారుదత్తుడు ఆశ్చర్యపడుతూండగా శర్విలకుడి మనుషులు శకారుణ్ని బంధించి తెచ్చారు. వాడు వస్తూనే చారుదత్తుడి కాళ్ల మీద పడి ''రక్షించు'' అని ప్రాధేయపడ్డాడు. చారుదత్తుడు అతనికి అభయమిచ్చాడు. 'వాణ్ని ఉరి తీయమంటారా? శూలానికి వేయమంటారా?' అని శర్విలకుడు అడిగితే ''నా మాటపై గౌరవం వుంటే అతన్ని విడిచిపెట్టేయండి. అపకారికి ఉపకారం చేయడమే నేర్పరితనం.'' అన్నాడు. ''ప్రాణాలతో వదిలేస్తాను కానీ కుక్కలచేత కరిపిస్తా'' అన్నాడు శర్విలకుడు. ''అదేమీ వద్దు, వదిలేయండి'' అని పట్టుబట్టాడు ఔదార్యానికి మారుపేరైన చారుదత్తుడు. బతుకు జీవుడా అని శకారుడు పారిపోయాడు. 

చారుదత్తుడు బతికాడని తెలిసి మైత్రేయుడు తిరిగి వచ్చాడు. వసంతసేనను చూసి సోదరీ కుశలమా? అని పలకరించాడు. శర్విలకుడు 'ఆర్య వసంతసేనా, మిమ్మల్ని చారుదత్తుని కులకాంతగా ఆర్యకుడు సత్కరిస్తున్నాడు' అని చెప్పాడు. 'నా జన్మ తరించింది' అంది వసంతసేన. 

'మీకు సాయపడినవారిని ఏ విధంగా సత్కరించమని సెలవు?' అని శర్విలకుడు అడగ్గా చారుదత్తుడు బౌద్ధభిక్షువును తన రాజ్యంలోని బౌద్ధారామాలన్నిటిపైన కులపతిగా నియమించాడు. స్థావరకుడికి దాస్యవిముక్తి ప్రసాదించాడు. తన తలారులను  తలారులందరిపై అధికారులుగా చేశాడు. చందనకుణ్ని సేనాపతిని చేశాడు. 'అన్నీ బాగానే వున్నాయి కానీ శకారుణ్ని విడిచి పెట్టడం బాగా లేదు' అన్నాడు శర్విలకుడు. 'నా శత్రువు శకారుడు నా కాళ్లపై పడ్డాడు. నా మిత్రుడు ఆర్యకుడు రాజయ్యాడు. నా ప్రేయసి వసంతసేన భార్య అయింది. ఆమెను నా పెద్ద భార్య ఆదరించింది. నా భోగభాగ్యాలు నాకు తిరిగి వచ్చాయి. ఈ ముహూర్తంలో నేను వేరొకరికి కష్టాన్ని ఎందుకు కలిగించాలి?' అన్నాడు చారుదత్తుడు. 

ఇంతటితో పదహారు, పద్ధెనిమిది రోజుల పాటు నడిచిన కథను పది అంకాలలో చెప్పిన నాటకం పూర్తయింది. దీనికి చారుదత్తీయమనో, వసంతసేన అనో మరోటో పేరు పెట్టకుండా మట్టిబండి అని పేరు పెట్టడం చమత్కారంగా అనిపిస్తుంది. మట్టిబండి వద్దని చారుదత్తుడి కొడుకు ఏడవడం, బంగారు బండి చేయించుకోమని వసంతసేన తన నగలు యివ్వడం, అవి కీలకమైన సమయంలో చారుదత్తుడికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యంగా మారడంతో నాటకీయత రక్తి కట్టింది. శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారి వ్యాఖ్యాన సహితంగా వెలువడిన 600 పేజీల మృచ్ఛకటికమ్‌ పుస్తకం ఆధారంగా కథాసారంశాన్ని చెపితే యిన్ని పేజీలు వచ్చింది. ఇది మీకు నచ్చితే విశాఖదత్తుడి ''ముద్రారాక్షసం'' గురించి యిలాటి రచన వుందేమో అన్వేషించి దాన్నీ పరిచయం చేస్తాను. ఇప్పటికి స్వస్తి. (సమాప్తం)

మృచ్ఛకటికమ్‌ పాత్రల పరిచయం

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2015) 

[email protected]

Click Here For Archives