పెద్ద నోట్ల రద్దు తలపెట్టినపుడు కేంద్ర ప్రభుత్వం వూహించని యిబ్బందులెన్నో అమలులోకి వచ్చేసరికి ఎదురై చికాకు పెట్టాయి. ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా సరే పెద్ద నోట్ల రద్దు దేనికి అంటే బ్లాక్ మనీ అరికట్టడానికే అంటారు.
ఇక్కడ బ్లాక్‌మనీ రద్దుతో బాటు దొంగ నోట్ల చలామణీ అరికట్టడం, టెర్రరిస్టులకు డబ్బు అందకుండా చేయడం అనే ఆశయాలు కూడా కలిపారు. పనిలో పనిగా అవినీతి అంతం అని కూడా అనేశారు. 2 వేల రూ||ల కొత్త నోటుకి కూడా దొంగ నోటు తయారవడంతో నకిలీ నోట్లను పట్టుకునే ఆశయం నీరుకారింది. ఈ డబ్బు అందక టెర్రరిజం ఆగిపోతుందనుకుంటే ఎక్కడా ఆగలేదు. ఎప్పటిలాగ కొనసాగుతూనే వుంది. ఆర్థికమంత్రి 2 లేదా 3 వారాల్లో అంతా సర్దుకుంటుందన్నారు. మోదీ గారు ఎందుకైనా మంచిదని 50 రోజులన్నారు. కానీ వారాలు గడుస్తున్న కొద్దీ సాధారణ పరిస్థితి యిప్పట్లో నెలకొనేట్లా లేదని ఏలికలకు అర్థమై పోయింది. అందుకని కొత్త పల్లవి అందుకున్నారు – నగదురహిత కార్యకలాపాలు ప్రోత్సహించడానికే యీ ప్రయత్నమంతా అంటూ.
నగదురహితం పూర్తిగా కాకపోతే, ఏ మేరకు సాధించగలిగినా అభిలషణీయమే. క్యాష్-జిడిపి నిష్పత్తి మన దేశంలో 12% వుంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. దీన్ని 6%కి తీసుకురావాలని లక్ష్యం. కానీ దాని కోసం నోట్ల రద్దు చేయనవసరం లేదు. క్యాష్‌తో కంటె వేరే సాధనాల ద్వారా కార్యకలాపాలు చేస్తే మనకూ, దేశానికీ ప్రయోజనకరం అని ప్రజలకు తోచేట్లా చేస్తే చాలు. వాళ్లకు ఎప్పుడు అలా తోస్తుంది? వాటిపై రాయితీలు యివ్వాలి. ప్రోత్సాహకాలు యివ్వాలి. కుటుంబ నియంత్రణ పెట్టిన కొత్తల్లో ఆపరేషన్ చేయించుకుంటే ట్రాన్సిస్టర్ యిచ్చేవారు.
విద్యాధికులైన ఉద్యోగులలో కూడా దీని అవసరాన్ని వ్యాప్తి చేయడానికి నెలనెలా యిన్సెన్టివ్ యిచ్చేవారు. ఆపరేషన్‌కై ఆసుపత్రికి తీసుకెళ్లిన వాలంటరీకి యింత అని కొంత మొత్తం యిచ్చేవారు. ప్రజలందరికీ ఫ్యామిలీ ప్లానింగ్‌లో సౌలభ్యం బోధపడ్డాక యిలాటివి యివ్వడం మానేశారు. ప్రజానీకానికి కొత్తదేదైనా అలవాటు చేయాలంటే యిలాటి ప్రయత్నాలు చాలాకాలం పాటు చేస్తూ పోవాలి. మీకెవరైనా చైనీస్ నూడిల్స్ ప్లేట్లో పెట్టి తింటే స్టిక్స్‌తోనే తినాలి, లేకపోతే తినడానికి వీల్లేదు అంటే ఎంత ఘొల్లుమంటారు? ఇప్పటి పరిస్థితి అలాగే తయారైంది. పాత నోట్లు చెల్లవు, కొత్త నోట్లు బ్యాంకుల్లోంచి వూడిపడవు, ఊడిపడిన వాటికి చిల్లర దొరకదు, కార్డుతో చెల్లిస్తేనే తిను, లేకపోతే చెక్కెయ్ అని హోటల్ వాడంటే ఎంత కష్టం? మూడువారాల క్రితం తిరుమలలో ఓ పెద్ద హోటల్‌కి వెళితే పాత నోట్లు చెల్లవు (సరే), సాంకేతిక కారణాల వలన కార్డులు ఆమోదించం అని బోర్డు పెట్టారు. జేబులో వున్న తలా కాస్త చిల్లరా పోగేసి, బిల్లు కట్టి బయటపడ్డాం.
సాంకేతిక సమస్య కారణంగా అనేది మన దేశంలో తరచుగా వినబడే మాట. మాల్స్‌లోనే కాదు, బ్యాంకు కెళ్లినా కనెక్టివిటీ లేదంటారు, సర్వరు డౌనంటారు. కరంటు లేదంటారు, జనరేటరు ఫెయిలందంటారు. అన్నీ వున్నా మన కార్డు పనిచేయదు. దాన్ని వంచి, అటూయిటూ రుద్ది ఏదేదో చేసేస్తూ వుంటే ఇంకెక్కడా పనికి రాకుండా పోతుందేమోనని మనకు బెదురుగా వుంటుంది. కాస్సేపు తిరగేసి, బోర్లేసి పెట్టి చూసి 'ఇంకో కార్డు వుంటే చూడండి' అంటాడు షాపువాడు. వీళ్ల గురించి ఎన్ని కార్డులు పెట్టుకుంటాం? ఆ మాట చెపితే 'కొన్న సరుకులు పక్కన పెట్టి వెళ్లండి. పక్కనే ఎటిఎం వుంది, కాష్ విత్‌డ్రా చేసి పట్టుకురండి' అంటాడు. ఇది నోట్ల రద్దుకి ముందు మాట. రద్దయ్యాక ఎటిఎంలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. జనవరి తర్వాత ఎటిఎంలు తెరిచివుంచాం, పనిచేస్తున్నాయి అని నాయకులు చెపితే ఆ మాటలు నమ్మి నాలుగో తారీకున సుమారు 70 కి.మీ.లు తిరిగాను. ఒక్క ఎటిఎంలోనూ క్యాష్ లేదు. షట్టర్లు తెరిచివున్నాయి. బాలన్సు అడిగితే చెప్తున్నాయి. అందువలన అవి పనిచేసినట్లు లెక్కలోకి వచ్చాయన్నమాట. కానీ జనాలు అలా అనుకోవటం లేదు. అక్కరకు రాని చుట్టం లాటిదే లెక్క విదల్చని ఎటిఎం అనుకుని దాని ముందు క్యూలు కట్టడం లేదు.
బ్యాంకుల్లో పేరుకు మాత్రమే 24 వేల పరిమితి కానీ, చాలా వాటిల్లో 10 వేలకు మించి యివ్వటం లేదు. జనాలెవరూ క్యాష్ కట్టకపోతే రొటేషన్ జరగదు కదా, మేం మాత్రం ఎక్కణ్నుంచి యిస్తాం అంటున్నారు వారు. నిజమే, ఎక్కడి కక్కడ జనాలు క్యాష్ దాచేసుకుంటున్నారు. కిరోసిన్ కానీ, పంచదార కానీ సరఫరా లేదట అనగానే జనాలంతా ఎలాగోలా సంపాదించి యిళ్లల్లో దాచేసుకుంటారు. పైగా ఈ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం పోయింది. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చనే భయంతో లాకర్ల నుంచి బంగారం తెచ్చి యింట్లో పెట్టుకున్నట్లే, చేతికి దొరికినన్ని వంద నోట్లు యింట్లో పెట్టేసుకుంటున్నారు. 2 వేల మీద నమ్మకం ఆట్టే లేదు – అది కూడా కాన్సిల్ చేస్తారట, అనే పుకారు ప్రబలంగా వుంది. ఈ కారణాల చేత బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు నుంచి వచ్చిన నోట్ల మీదే ప్రధానంగా ఆధారపడుతున్నారు. స్టేటుబ్యాంక్ చైర్మన్ చెప్తున్న ప్రకారం 10 లక్షల కోట్ల నగదు అవసరమైతే 8 లక్షల నోట్లు యిప్పటిదాకా వచ్చాయట. అందువలన జనవరి నెలాఖరుకో, ఫిబ్రవరి నెలాఖరుకో పరిస్థితులు కుదుటపడతాయి అంటున్నారు. నోట్లు వుంటే యిస్తాం, తప్ప విత్‌డ్రాయల్ పరిమితులు ఎప్పుడు సడలిస్తామో చెప్పలేం అంటున్నారావిడ. వాస్తవాలు యిలా వుండగా టీవీ చర్చల్లో బిజెపి ప్రతినిథులు నార్మల్ పరిస్థితులు ఏర్పడ్డాయి అని వాదిస్తున్నారు, వారి భక్తులు విశ్వసించి ప్రచారం చేస్తున్నారు. 15 లక్షల కోట్ల నోట్ల చలామణీ నిలిపివేస్తే దాని స్థానంలో 10 లక్షల కోట్లు ఎలా సరిపోతాయి? తెలియదు. డిజిటలైజేషన్ వలన ఆ 5 లక్షల కోట్ల నోట్ల అవసరం పడదనుకుంటున్నారా?
నిజంగా ఆ మేరకు, పోనీ కొంత మేరకు డిజిటల్ మనీ మన దగ్గర సాధ్యపడే విషయమా? అనేది గణాంకాలతో చూదాం. ''క్యాష్ లావాదేవీలు జర్మనీలో 80%, అమెరికాలో 32%, ఇండియాలో 95%. జపాన్, స్విస్‌లలో నెగటివ్ వడ్డీ రేట్ల భయంతో ప్రజలు నగదు యిళ్లల్లో దాచిపెట్టుకుంటారు. భారత్‌ను క్యాష్‌లెస్‌గా మార్చడమంటే ఎఫ్1 రేసులో ఎడ్లబండిని పరిగెట్టించినట్లే!'' అంది వాషింగ్టన్ పోస్టు! ఏ మాట కా మాట చెప్పాలంటే ఎడ్లబండి ఏదోలా పరిగెడుతోంది. నోట్ల రద్దు తర్వాత పిఓఎస్‌ల వాడకం పెరిగింది. స్టేటుబ్యాంక్‌లో నవంబరు 9కి ముందు రోజుకి రూ. 94 కోట్ల విలువ చేసే 3.75 లక్షల లావాదేవీలు జరిగితే తర్వాతి రోజుల్లో రోజుకి రూ.324 కోట్ల విలువైన 16.43 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయని బ్యాంక్ ఎండీ చెప్పారు. గత ఏడాది మేం రోజుకి 300 టెర్మినల్స్ పెట్టాం. నోట్ల రద్దు తర్వాత రోజుకి వెయ్యి పెడుతున్నాం అన్నారాయన. రోజుకి 3 వేలు పెట్టాలనే టార్గెట్ పెట్టాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టింది. పిఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) మిషన్లు దేశంలో 15 లక్షలు వున్నాయి. ఇంకా 20 లక్షలు కావాలని బ్యాంకర్లు తయారీదారులను అడుగుతున్నారు. వీటిని దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుత అవసరాల బట్టి వీటికి బిఐఎస్ (భారతీయ ప్రమాణాల సంస్థ) లేబులింగ్ నుంచి మినహాయింపు యిచ్చి దిగుమతి అనుమతిస్తున్నారు. మరి వీటి నాణ్యత ఎలా వుంటుందో తెలియదు. ఆర్బీఐ డిసెంబరు 20 న విడుదల చేసిన అంకెల ప్రకారం – డిసెంబరు 07 న మొత్తం లావాదేవీల విలువ 4022 బిలియన్లయితే కార్డు ద్వారా జరిగినవి 17 బిలియన్లు. పిపిఐ ద్వారా 7 బిలియన్లు, మొబైల్ ద్వారా జరిగినవి 44 బిలియన్లు. వారం పోయాక డిసెంబరు 14 న చూస్తే మొత్తం 4682 బిలియన్లు, కార్డుతో 15, పిపిఐతో 7, మొబైల్‌తో 45. డిసెంబరు 20 న మొత్తం 4231 బి. కాగా కార్డుతో 11, పిపిఐతో 6, మొబైల్‌తో 62. అంటే మొబైల్ వాడకం పెరిగింది కానీ తక్కినవి పెరగటం లేదు.
అసలు బ్యాంకుల ఫిలాసఫీ ఏమిటో అర్థం కాకుండా వుంది. ఆర్‌బిఐ అధ్యయనం ప్రకారం కస్టమరు బ్యాంకు బ్రాంచ్‌కు వస్తే ఒక ట్రాన్సాక్షన్‌కు అయ్యే ఖర్చు రూ.30-32, ఎటిఎమ్‌లో అదే ట్రాన్సాక్షన్ చేస్తే అయ్యే ఖర్చు రూ.14-15. అంటే కస్టమర్లు తన వద్దకు రాకుండా ఎటిఎం వద్దకు వెళితే బ్యాంకుకు లాభం. ఎటిఎంల వాడకం పెంచడంలోనే విజ్ఞత వుంది. కానీ జరుగుతున్నదేమిటి? ఎటిఎమ్‌లను వాడినప్పుడల్లా చార్జి చేస్తున్నారు. పైగా కావలసినన్ని ఎటిఎంలు పెట్టనే లేదు. చైనాలో లక్ష జనాభాకు 254 ఎటిఎంలు వుంటే, అమెరికా, రష్యాలలో 173 వుంటే ఇండియాలో వున్నది 20. లెక్కకు 2.20 లక్షల ఎటిఎంలు వున్నాయి. వాటిల్లో విగ్రహపుష్టి, నైవేద్య నష్టిగా వుండేవి కనీసం 25-30% వుంటాయి. అందువలన లక్ష మందికి 15 వున్నాయనుకోవచ్చు. ఇవి కూడా నగరాల్లోనే ఎక్కువగా వున్నాయి తప్ప పట్టణాల్లో, గ్రామాల్లో తక్కువ. ఎటిఎంలలో 20% మాత్రమే గ్రామాల్లో వున్నాయి. దేశంలో సుమారు 74 కోట్ల ఎటిఎం కార్డులున్నాయి కానీ ప్రజల్లో చాలామంది వాటిని ఎటిఎంలోంచి డబ్బులు తీసుకోవడానికి వాడతారు తప్ప డెబిట్ కార్డుగా వాడరు. ఎందుకంటే డెబిట్ కార్డు వాడకందారుకి చార్జి వేస్తున్నారు. క్రెడిట్ కార్డు విషయంలో అయితే కస్టమరు ఆ మేరకు అప్పు తీసుకుంటున్నాడు కాబట్టి ఆ చార్జిలేవో అతను కట్టడం ధర్మం. కానీ మర్చంట్ నెత్తిన చార్జిలు పడుతున్నాయి. డెబిట్ కార్డు విషయంలో కూడా కస్టమరు తన దాకా రాకుండా తప్పించుకుంటున్న బ్యాంకు మర్చంట్ నెత్తిన చార్జీలు ఎందుకు రుద్దాలి?
డెబిట్ కార్డుల వినియోగంపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్) పేర వేసే 1% చార్జీలను డిసెంబరు 31 వరకు తీసేశారు. జనవరి 1నుంచి మార్చి 31 వరకు వెయ్యి రూ.ల వరకు 0.25%, వెయ్యి నుంచి 2500 వరకు 0.5% క్యాప్ పెట్టారు. డెబిట్ కార్డుని ఖాతాదారుకి యిస్తారు. అతనికి సేవింగ్స్ డిపాజిట్‌పై 4% వడ్డీ యిస్తారు. ఆ డబ్బును 6.5% రేటుకి యింకోరికి అప్పిస్తారు. నిర్వహణ ఖర్చులకు పోగా మధ్యలో మిగిలినది లాభమేగా. మరి అలాటప్పుడు డెబిట్ కార్డు లావాదేవీలపై చార్జీలు ఎందుకు వేయాలి? పైగా యిప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న ఒకటుంది. ఒక 100 రూ.ల నోటు ఎన్నిసార్లు చేతులు మారినా ఖర్చు లేదు. దాని విలువ తరగదు. అదే డిజిటల్ ద్వారా చేస్తే ప్రతీసారీ దానిపై 1-2 రూ.ల వరకు పోతూ వుంటుంది. ఆ మేరకు దాని విలువ తగ్గిపోతూంటుంది. లేదా వేరే చోట నుంచి డబ్బు తెచ్చి దాని విలువను నిలబెట్టాలి.
ఎటిఎమ్‌లు వాడితే బ్యాంకులకు సగానికి సగం ఖర్చు తగ్గుతోంది. అదే యింటర్నెట్ అయితే యింకా చాలా చాలా తక్కువ అవుతుంది. (ఎంతో నాకు తెలియదు). ఎందుకంటే ఎటిఎం యంత్రం, ఎసి, సెక్యూరిటీ, పేపరు, క్యాష్ పెట్టేవాళ్ల కమిషన్లు.. యిలా ఎన్నో ఖర్చులుండవు. అందువలన యింటర్నెట్ వాడకం ఎంత పెంచితే బ్యాంకులకు అంత లాభం. దానిపై చార్జీలు ఎత్తివేయడమే కాదు, అది వాడిన వారికి ఐదో, పదో ఖాతాలో వేయాలి కూడా. కానీ పాలకుల ఆలోచన వేరేలా వుందని వార్తలు వస్తున్నాయి. బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు పెంచి ఒక్కో ట్రాన్సాక్షన్‌పై బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ టాక్స్ (బిటిటి) వేద్దామని అనుకుంటున్నారట. ఇలాటి పన్ను వేస్తే బ్యాంకు జోలికి వెళ్లకుండా అంతా నగదులోనే వ్యవహారం కానిద్దామనే వారి సంఖ్య యింతకంటె పెరుగుతుంది. రైలు టిక్కెట్టు ఆన్‌లైన్ కొంటే రైల్వేకి ఎంతో లాభం. సిబ్బందిపై, బుకింగు వసతిపై పెట్టే ఖర్చంతా మిగులుతుంది. అలాటప్పుడు ఆన్‌లైన్‌లో కొనేవారికి కన్సెషన్ యివ్వాలి. ఇవ్వకపోగా పైన చార్జీలు వేస్తారు. ఎయిర్ టిక్కెట్టూ అంతే.
డిజిటల్ ట్రాన్సాక్షన్‌పై మర్చంట్ వీసా, మాస్టర్ కార్డ్, పేటిఎమ్ వంటి కంపెనీలకు కట్టేది 2-2.5%. పే టిఎమ్‌పై డిసెంబరు 31 వరకు చార్జీలు లేవన్నారు. మర్చంట్ వద్ద బ్యాంకు తీసుకున్న యీ చార్జిలో సింహభాగం ఇస్యూయర్ బ్యాంక్ (కార్డు జారీ చేసిన బ్యాంకు)కు పోతుంది. తక్కినదాన్ని ఎక్వయిరర్ బ్యాంకు (పిఓఎస్ మిషన్ అమర్చిన బ్యాంకు), వీసా, రూపే, మాస్టర్‌కార్డ్ వంటి పేమెంట్ గేట్‌వేలు పంచుకుంటాయి. తన నెత్తిమీద పడుతున్న చార్జీలను వ్యాపారస్తుడు ఏం చేస్తున్నాడు? అశీస్ దాస్ అనే ఐఐటి, ముంబయి ప్రొఫెసరు, ఆర్‌బిఐలో మానిటరీ పాలసీ విభాగంలో డైరక్టరుగా పని చేస్తున్న ప్రజ్ఞా దాస్ కలిసి ''శానిటైజింగ్ డిస్టార్షన్స్ ఇన్ డిజిటల్ పేమెంట్స్'' పేర రాసిన పుస్తకంలో ''వ్యాపారస్తుడు యీ చార్జీలను తన వద్దకు వచ్చిన కస్టమర్లందరికీ వడ్డిస్తున్నాడు. ఆ మేరకు వస్తువు ధర పెంచుతున్నాడు.'' అని స్పష్టంగా రాశారు. అలాటి అవకాశం పెట్రోలు విషయంలో లేదు. అందుకే కార్డుపై పెట్రోలు అమ్మకాలపై 1% ట్రాన్సాక్షన్ చార్జీ భరించమంటూ పెట్రోలు బంకుల వాళ్లు సమ్మె చేస్తామంటున్నారు. 2.6% కమిషన్‌లో 1% పోగా మాకు మిగిలేది ఏమీ వుండదంటున్నారు. ఇకపై క్యాష్‌పైనే అమ్ముతామని పట్టుబడితే ప్రజలు గోల పెడతారు. ఈ ట్రాన్సాక్షన్ చార్జీలు పూర్తిగా తీసేయడానికి ఆర్థిక శాఖ యిచ్చగించటం లేదు. చార్జీలు తీసుకోకపోతే ఆ యా పేమెంట్ కంపెనీలకు ఎవరు చెల్లిస్తారని అడుగుతున్నారు. ఆ మేరకు నగదు నోట్ల ముద్రణ, నిర్వహణ వ్యయం తగ్గుతుంది కాబట్టి ఆర్‌బిఐయే భరించవచ్చు. (సశేషం)
ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2017)