ఎమ్బీయస్‌: నేతాజీ చిక్కుముడి – 2/2

ఈ ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పరు. 'నెహ్రూకు బోసుకు పడదు, బోసు వస్తే తన  మొహం చూసేవారుండరు అని నెహ్రూ భయం. అందుకని తన స్నేహితుడైన రష్యాకు చెప్పి ఖైదీగా వుంచాడు' అనే ప్రచారమే…

ఈ ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పరు. 'నెహ్రూకు బోసుకు పడదు, బోసు వస్తే తన  మొహం చూసేవారుండరు అని నెహ్రూ భయం. అందుకని తన స్నేహితుడైన రష్యాకు చెప్పి ఖైదీగా వుంచాడు' అనే ప్రచారమే సాగిస్తూ పోయారు. నిజానికి బోసుకు నెహ్రూ కంటె ఎక్కువ పాప్యులారిటీ వుందా అని తాపీగా ఆలోచించి చూడండి. 1939లో గాంధీ అభ్యర్థి ఐన పట్టాభిని ఓడించి బోస్‌ రెండోసారి కాంగ్రెసు ప్రెసిడెంటు అయ్యాడు గాంధీ ఆగ్రహానికి వెఱచి ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో 12 మంది సభ్యులు సభ్యత్వానికి రాజీనామా చేశారు. వాళ్లెవరెవరో తెలుసా? పటేల్‌, మౌలానా ఆజాద్‌, భూలాభాయ్‌ దేశాయ్‌, రాజేంద్ర ప్రసాద్‌, సరోజిని నాయుడు, ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌… ఇలా.. అందరూ ప్రముఖులే! వీళ్లందరూ అంత తెలివితక్కువగా బోస్‌మీద కత్తి కట్టారనుకోవాలా? చిన్నప్పుడు ఆవేశ పడేవాణ్ని కానీ కాస్త వివేకం వచ్చాక ఆలోచిస్తే నాకు ఒకటి తట్టింది. గాంధీగారి మెయిన్‌ స్ట్రెంగ్త్‌ ఎక్కడుందంటే, ఇండియన్‌ సైకీని ఆయన స్టడీ చేసినట్టు వేరెవరూ చేయలేదు. ఆయన చేపట్టిన సత్యాగ్రహమే అంతమంది జనాల్ని ఉద్యమంలోకి లాక్కొచ్చింది. మనం అందరూ ఊహల్లో డిక్టేటర్లమే కానీ నిత్యజీవితంలో హింసావాదులం కాదు. విప్లవ మార్గాన్ని చేపట్టినవారిని తర్వాత తర్వాత గ్లోరిఫై చేస్తాం కానీ అప్పటికప్పుడు మాత్రం దూరంగానే వుంటాం. మీరు లెక్కేయండి – భగత్‌సింగ్‌తో బాటు ఉరికంబం ఎక్కిన వీరులెందరు? వాళ్ల ఉద్యమంలో కడదాకా నిలబడ్డవారు ఎంతమంది? పంజాబ్‌ జనాభాలో పాయింట్‌ నాట్‌ వన్‌ పర్సంటైనా వుంటారా? అంతెందుకు అల్లూరి సీతారామరాజు కథ 70 ఎమ్మెమ్‌లో సూపర్‌స్టార్లతో తీసేసరికి సీతారామరాజు కాలంలో రాష్ట్రమంతా ఆయన వెంట నిలిచిందేమోనన్న భ్రమ కలుగుతుంది. అబ్బే, సీతారామరాజు ప్రభావం రెండు జిల్లాలకు మించి పోలేదు. అదీ ఒకటి, రెండేళ్లు. అంతే! ఆయన్ను టాకిల్‌ చేసింది కూడా ఓ కలెక్టరు ర్యాంక్‌ ఆఫీసర్‌. దాన్ని ఇంగ్లీషువాళ్లు విప్లవం అనలేదు, పితూరీ అన్నారు. 

కాంగ్రెసులో ప్రతికూల పరిస్థితులు ఏర్పడడంతో అధ్యక్షుడిగా ఎన్నికయిన బోస్‌ నెల తిరక్కుండానే కాంగ్రెస్‌ విడిచి 1939 మేలో 'ఫార్వర్డ్‌ బ్లాక్‌' పార్టీని ఏర్పరచారు. అయితే ఇందులో చేరిన హేమాహేమీలు ఎవరూ అంటే – ఎవ్వరూ లేరు. ఎట్‌లీస్టు వాళ్ల పేర్లు ఇప్పుడు చెప్తే ఎవ్వరికీ తెలియదు. ఆంధ్రానుండి మద్దూరి అన్నపూర్ణయ్యగారి పేరు కొంతమందికి తెలుస్తుంది, అంతే! కాకాని వెంకటరత్నం కూడా కొంతకాలం ఆ పార్టీలో వుండేవారు. తమిళనాడు నుంచి ముత్తురామలింగ దేవర్‌, బొంబాయి నుంచి ఎచ్‌.వి.కామత్‌ ఓ పాటి ప్రముఖులు. నిజానికి 1941 జనవరిలో బోసు ఇండియా నుంచి రహస్యంగా జర్మనీకి పారిపోయిన తర్వాత, అక్కణ్నుంచి 1943 మేలో జపాన్‌కు సబ్‌మెరైన్‌లో పారిపోయిన తర్వాతనే హీరోగా తోచాడు. ఇండియాలో వుండగా బోసుకు అనుచరులు తక్కువ. గాంధీ, నెహ్రూలతో పోటీ పడే ప్రశ్నే లేదు. ఐఎన్‌ఏకు సుప్రీం కమాండర్‌ అయ్యాక గ్లామర్‌ పెరిగింది. కానీ నేతాజీకి యుద్ధ కౌశలం కాని, పూర్వానుభవం కానీ లేదు. ఆరోగ్యమూ అంతంత మాత్రమే. 1943 సంవత్సరాంతానికి భారతదేశంలో ఐఎన్‌ఎ అడుగుపెడుతుందని ప్రకటన చేయడం శత్రువుకు తమ ప్లాన్‌ ముందుగా చెప్పేసినట్టయింది. జపాన్‌ సైన్యం యుద్ధంలో ఓడుతూ వారికే ఆయుధాలు, మందు సామగ్రి చాలని పరిస్థితిలో వుండగా నేతాజీ ఐఎన్‌ఎ కోసం ఇంకా ఇంకా ఆయుధాలు కావాలని అడిగేవారు. జపాన్‌ జర్నలిస్టులకు 'నేతాజీ' అన్న పదమే రుచించలేదు. జపాన్‌ చక్రవర్తి బిరుదుకు పోటీ వస్తుందని భావించారు. 

జపాన్‌వారు నేతాజీ పేరుమీద వారే యుద్ధం చేద్ధామని అనుకున్నారు. 1943 అక్టోబర్‌ 21న సింగపూర్‌లో స్వేచ్ఛా భారత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడ్డాక 'మీ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సింగపూర్‌లోనే ఉండడం మంచిది. మేమే ముందుకు సాగి యుద్ధం చేసేస్తాం' అని జపాన్‌ ఆర్మీ చీఫ్‌ ప్రతిపాదించినపుడు నేతాజీ సగర్వంగా 'మీ త్యాగాలతో సంపాదించే స్వాతంత్య్రం బానిసత్వం కంటే హీనమైనది' అని బదులిచ్చారు. ఇది వినడానికి బాగున్నా, యుద్ధం నడిపే విధానం ఇది కాదు. తమని తాము సరిగ్గా అంచనా వేసుకోవాలి. తన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ గురించి నేతాజీకి చాలా అవాస్తవికమైన అంచనా వుండేది. నిజానికి ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ (ఐఎన్‌ఎ)లో చేరిన దెవరు? దానిలో చేరితే జపాన్‌ ప్రభుత్వం తమకు ఏదో ఒనగూరుస్తుందన్న ఆశతో చాలామంది యువకులు చేరారు. 1942లో సింగపూర్‌లో జపాన్‌ బ్రిటిష్‌ సైన్యాన్ని ఓడించి యుద్ధ ఖైదీలుగా పట్టుకున్న వారిలో బ్రిటన్‌ తరఫున పోట్లాడుతున్న ఇరవైవేలమంది భారతీయులున్నారు. వారిని ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో కలిపివేశారు. 1944 మార్చిలో భారత గడ్డమీద కాలుమోపి ఇంఫాల్‌లో యుద్ధం చేసేటప్పుడు బ్రిటిష్‌ సైన్యంలో వున్న భారతీయులందరూ తమ పక్షం చేరతారని నేతాజీ జపాన్‌ వారికి హామీ ఇచ్చేరు. కానీ జరిగింది – దానికి పూర్తిగా వ్యతిరేకం, ఆజాద్‌ హింద్‌ఫౌజ్‌లో చేరిన మాజీ సైనికులందరికీ జీతాలు, బకాయిలతో సహా ఇస్తామని ఇంగ్లీషువారు ప్రకటించగానే వారందరూ అటు తిరిగిపోయారు. ఇంఫాల్‌ లోయ ప్రాంతం, కోహిమా ప్రాంతంలో ఎనిమిది రంగాలలో సమరం సాగుతుండగా ఇంఫాల్‌లో మూడు మైళ్ల దూరంలో లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ అడ్డుకుని వారిని ఓడించాడు. ఓడిపోయిన వారిలో కొందరు నానా కష్టాలు పడి బాంకాక్‌ చేరుకున్నారు. కొందరు బ్రిటిష్‌ జైళ్లలో మగ్గారు.

ఐ.ఐ.ఎల్‌.లో ముఖ్యులుగా వుండి ఐఎన్‌ఎకు, జపాన్‌కు లయజన్‌ ఆఫీసర్‌గా పనిచేసిన ఎ.ఎం.నాయర్‌ 1985లో భారతదేశం వచ్చినప్పుడు 'సండే అబ్జర్వర్‌' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అన్నారు –  ''.. ఇంఫాల్‌ ఓటమి తర్వాత నేతాజీ ఆడవాళ్లతో ఏర్పరచిన రాణీ ఝాన్సీ రెజిమెంట్‌ని యుద్ధరంగానికి పంపిస్తానన్నప్పుడు మేం తెల్లబోయేం. ఈయనకి మతిపోలేదు కదానిపించింది. ఆయన ఆవేశంలో అటువంటి నిర్ణయాలు చేసేవారు. ఆయన అద్వితీయ దేశభక్తుడే కానీ పొరపాట్లు చేశారు. ఇండియా వదిలిరావడం ఆయన మొదటి తప్పు. జపాన్‌ సహకారంతో స్వాతంత్య్రం సంపాదిద్దామనుకుని అవాస్తవికమైన అంచనాలు వేయడం మరొక తప్పు.. నేతాజీ ప్రయాణం చేస్తున్న విమానం 1945 ఆగస్టు 18న నేలకూలిందని,  నేతాజీ మరణించారని ఆగస్టు 22న టోకియో రేడియో ప్రకటించింది. సుభాష్‌ బోస్‌ ప్రభుత్వ ప్రచారమంత్రి ఎస్‌.ఎ. అయ్యర్‌ ఆ విమాన ప్రమాదం తర్వాత ఒక హోటల్‌ రూమ్‌లో జపాన్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ కదామస్తుతో రహస్య సమావేశం జరిపేకనే ఈ విమాన ప్రమాదం గురించి, ఆ దుర్ఘటనలో ఆజాద్‌ హింద్‌ఫౌజ్‌ సేకరించిన నిధులు పోయాయనీ వార్త వెలువడింది… ఇది జరిగిన కొన్ని రోజులకే ఒక బ్రిటిష్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌కు అయ్యర్‌ లొంగిపోయారు. నేతాజీకి అత్యంత సన్నిహితుడైన కల్నల్‌ హబీబుర్‌ రహమాన్‌ కూడా. ఇద్దరినీ ఇండియాకు తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత రాయిటర్‌ సంస్థ నుంచి బకాయిలతో సహా జీతం ముట్టిందని విన్నాను. రెహమాన్‌ బ్రిటన్‌ ప్రభుత్వం నుంచి 'రావలసినవన్నీ' పుచ్చుకున్నాక పాకిస్తాన్‌లో స్థిరపడ్డారు. నిధుల గురించి చెప్పాలంటే – మూడుకోట్ల పౌండ్ల నిధిని సేకరించడానికి నేతాజీ పూనుకున్నారు. ఎంతోమంది భారతీయులు ఇచ్చిన బంగారం కిలోల లెక్కన వుండాలి. జపాన్‌వాళ్లు ఏదో కొద్దిపాటి బంగారం మాత్రం భారత ప్రభుత్వానికి అప్పగించారు…'' 

ఇప్పుడు బయటపడుతున్న ఫైళ్లు యీ విషయాలనే ధ్రువీకరిస్తున్నాయి, గమనించండి. తమకు పట్టుబడిన ఐఎన్‌ఏ సైనికులను బ్రిటన్‌ సైన్యం రెండుగా విభజించింది. బోసు లక్ష్యం కోసం పూర్తిగా అంకితమైనవారిని బ్లాక్స్‌ అనేది, వాళ్లను తీవ్రంగా శిక్షించింది. ఐఎన్‌ఏలో నామ్‌కే వాస్తే చేరినవాళ్లను వైట్స్‌ అనేది. వీళ్లు 'మేం బ్రిటన్‌ సైన్యంలో పనిచేస్తూ విధేయులుగా వున్నాం. 1942 సింగపూరులో ఓడిపోయాక మమ్మల్ని ఖైదీలుగా పట్టుకున్న జపాన్‌ మా కిష్టం లేకపోయినా దీనిలో కలిపేసింది' అని చెప్పుకునేవారు. ఐఎన్‌ఏలో ఎంతమంది పనిచేశారన్నదానిపై యిప్పటికీ నిర్ధారణకు రాలేదు. 45 వేల నుండి 60 వేల దాకా రకరకాల అంకెలు చెప్తున్నారు. 26 వేలమంది చనిపోయారని అంటారు. విమానప్రమాదం నిజంగా జరిగిందా లేదా, లేక నేతాజీయే కల్పించారా అని బ్రిటన్‌కు కూడా అనుమానం వుండి వాకబులు చేశారు. యుద్ధసమయంలో మొదట చచ్చిపోయేది సత్యమే అని నానుడి. దేన్నీ ఓ పట్టాన నమ్మలేం. 1942 మార్చి 24న బోసు టోక్యోకు వెళుతూ విమానప్రమాదంలో చనిపోయాడని బ్రిటిష్‌ యింటెలిజెన్సు వారు ఒక వార్త పుట్టించారు. గాంధీజీ దాన్ని నమ్మి బోసు తల్లికి సంతాపం తెలియబరచాడు కూడా. తర్వాత బతికివున్న వార్త తెలిసి క్షమాపణలు చెప్పాడు. 1945 ఆగస్టు 18న ఫార్మోజా (ఇప్పటి తైవాన్‌) లో తైపీ వద్ద విమానప్రమాదమే జరగలేదని అమెరికా అన్నదని, నేతాజీ కుటుంబసభ్యులు వాదిస్తారు. అలా నిర్ధారించడానికి అమెరికాకు గల సాధనసంపత్తి ఏమిటన్నది ప్రశ్న. అప్పట్లో శాటిలైట్లు లేవు. అప్పుడక్కడ రష్యన్‌ సైన్యం తచ్చాడుతోంది. వారిలో అమెరికన్‌ గూఢచారులున్నారా? ఏమో!

ప్రభుత్వం బోసు మృతిపై మూడు కమిషన్లు వేసింది. బోసుతో కలిసి పని చేసిన షా నవాజ్‌ నేతృత్వంలో 1956లో వేసిన కమిటీ బోసు విమానప్రమాదం తర్వాత పోయారని చెప్పింది.  నివేదికను ప్రభుత్వం ఆమోదించింది కానీ బోసు కుటుంబం తిరస్కరించింది. ఎంతో నిబద్ధత కలిగినవారిగా పేరు పొందిన జస్టిస్‌ జిడి ఖోస్లా నేతృత్వంలో 1970లో వేసిన కమిటీ కూడా అదే చెప్పింది. దాన్ని 1977లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం తిరస్కరించింది. 2000లో ఎన్‌డిఏ హయాంలో ఎంకె ముఖర్జీ నేతృత్వంలో వేసిన కమిటీ నేతాజీ ప్రమాదంలో చనిపోలేదని, రెంకోజీ గుడిలో వున్న చితాభస్మం జపాన్‌ సైనికుడిదని 2005లో నివేదిక యిచ్చింది. 2004లో అధికారంలోకి వచ్చిన యుపిఏ దీన్ని తిరస్కరిస్తూ కారణాలు చెప్పింది. ఛత్రపతి శివాజీ గురించి పరిశోధన చేయమని మహారాష్ట్రుణ్ని అడగడం ఎంత రిస్కో, బోసు గురించి పరిశోధించమని బెంగాలీని అడగడం అంత రిస్కు.  బోసు చచ్చిపోయాడని ముఖర్జీగారు నివేదిక యిచ్చి వుంటే బెంగాల్‌ అంతా ఆయన దిష్టిబొమ్మలు తగలబడేవి. చితాభస్మానికి డిఎన్‌ఏ టెస్టు చేయించే సులభమార్గం వుండగా యీ డొంకతిరుగుళ్లు అందుకే! అక్కడ వున్నది బోస్‌దే అని నమ్మిన నెహ్రూ, ఇందిర, వాజపేయి జపాన్‌ వెళ్లినపుడు దర్శించి వచ్చారు. ఇటీవల జపాన్‌ వెళ్లిన మోదీ అక్కడకు వెళ్లలేదు. వెళితే ఆమోదముద్ర వేసినట్లవుతుందని భయపడ్డారేమో. అవి మీ బోసువే పట్టుకుపోండి అని జపాన్‌ గుడివాళ్లు అంటున్నా, మనవాళ్లకు ధైర్యం చాలటం లేదు. తెచ్చుకుంటే బోసు మరణించినట్లు ఆమోదించాలి, దాని వలన బెంగాల్‌లో ఆవేశకావేషాలు రగులుతాయి అని పాలకుల భయం. 1976లో తెచ్చే ఆలోచన వచ్చినపుడు అప్పుడు ఇంటెలిజెన్సు చీఫ్‌ రాజేశ్వర్‌ అదే హెచ్చరిక చేశారు. 2007లో  మన్‌మోహన్‌ తెద్దామనుకుని ఆయనా దడిశారు. ముఖర్జీ కమిషన్‌ చెప్పినట్లుగా అవి జపాన్‌ సైనికుడి బూడిదే అయితే వాటి సంరక్షణకు విదేశాంగ శాఖ జపాన్‌కు డబ్బెందుకు చెల్లిస్తున్నట్లు?  'మా నాన్న చితాభస్మం అవునో కాదో డిఎన్‌ఏ టెస్టు ద్వారా తేల్చండి, అయితే పట్టుకుని వచ్చి గంగానదిలో కలపండి' అని బోసు కూతురు అనిత చేస్తున్న ప్రార్థన అరణ్యరోదనే అవుతోంది. 

బెంగాల్‌ ఎన్నికల తర్వాత ఫైళ్ల విడుదల మందగించకుండా మొత్తమంతా బయటపెట్టి, డిఎన్‌ఏ టెస్టు జరిపించి, దాగుడుమూతలు ఆపి, విషయం ఏమిటో చెప్పేస్తే 'సత్యమేవ జయతే' అనే మన నినాదానికి న్యాయం చేసినవారముతాము.  -(సమాప్తం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016) 

[email protected]

Click Here For Part-1